Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 38


    గ్లాసులోని రాయల్ ఛాలెంజ్ విస్కీని సిప్ చేసి ఆ గ్లాసుని టేబిల్ మీద పెట్టి చిన్న ప్లాసిక్ డబ్బాని తీసి, అందులోని తెల్లని పొడిని ఎడమచేతిలో వేసుకుని, కుడిచేత్తో దాన్ని బాగా నలిపి, ముక్కుతో పీలుస్తున్నాడు రవి.

 

    "ఏమిటది?" ఆసక్తిగా అడిగిందామె.

 

    "కోక్...." చెప్పాడు.

 

    కోక్ 'బ్లో' ఐస్. సి. క్యాండీ అని పిలవబడే అత్యంత మత్తునిచ్చే కొకైన్ పౌడర్ అది. కొకైన్ ని కోకో ఆకుల నుంచే తీస్తారు. దీన్ని పీల్చడం ధనిక వర్గాల యువతరానికి ఫ్యాషనయింది. కొంతమంది ముక్కు ద్వారా పీలిస్తే, మరికొంతమంది ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారు. ఈ పొడిని కాల్చి పొగను ఇంకొంతమంది పీలిస్తే, కొందరు పొడిని తింటారు. ఈ పొడి ఒక గ్రాము మూడువేలనుంచి అయిదువేల వరకూ వుంటుంది.

 

    దేహమంతా గాల్లోకి తేలిపోవడం..... ఊహలన్నీ ఆనందమయమై పోవడం, నరాలు ఉద్రేకంతో పొంగిపోవడం.... కళ్ళ ముందు స్వర్గద్వారాలు తెరచుకోవడం ఈ మాదకద్రవ్యాలు చేసే పని.

 

    "అయ్ వాంట్ ఇట్...." అంది అన్విత.

 

    అది తీసుకుంటే నిజంగా ఏం జరుగుతుందో అనేఇతకు తెలియదు.

 

    'నీకోసమే తెచ్చాను' అని  మనసులో అనుకున్నాడు రవి.

 

    "అది చాలా ప్రమాదం! అది తీసుకున్నవాళ్ళు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు. అది తీసుకోకుందా అన్వితను కాపాడాలి" అన్నాడు మధు ఆందోళనగా.

 

    "ఇప్పుడు కష్టం! ఏదైనా జరిగితే మనం ఉన్నాంకదా. సెల్ ఫోన్ వుంది. పోలీసులకు ఫోన్ చేద్దాం..... పద" అన్నాడు డిటెక్టివ్ రవితేజ.

 

    "పోలీసులెందుకు? అవసరం లేదు. నేనున్నాను..... నేను అన్వితను రక్షించుకోగలను" అన్నాడు ధీమాగా మధు.

 

    అన్విత చేతిలో ఆ పౌడరును పోశాడు రవి.

 

    "డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చా?"

   

    "స్వర్గం కనిపిస్తుంది" అన్నాడు రవి.

 

    ఆ పౌడర్ అన్విత డ్రింక్ లో పోసింది. మిగతా వాళ్ళిద్దరూ అలాగే చేశారు.

 

    మళ్ళీ 'ఛీర్స్' కొట్టుకుని సిప్ చేస్తున్నారు.

 

    "తల తిరిగిపోతుంది....." మూడు నిమిషాల తర్వాత అంది అన్విత.

 

    "మొదట్లో అలాగే వుంటుంది" అంది కళ్యాణి.

 

    అందరూ పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడటం మొదలెట్టారు.

 

    "అభిమానించడం, ప్రేమించడం, ఆరాధించడం తప్పు కాదు కదా?" టైమ్ లీగా అన్నాడు రవి. అతనెక్కువ నిషాలో లేడు.

 

    "క....దా" దీర్ఘంతీస్తూ చిన్నపిల్లలా అంది అన్విత.

 

    "నువ్వు...... ఆ మధుగాడ్ని ప్రేమిస్తున్నావా.......?" డైరెక్ట్ గా, సీరియస్ గా అడిగాడతను.

 

    సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా నవ్వుతోంది ఆమె.

 

    "వాడి దగ్గరేముంది- డబ్బుందా? వున్నా నీకోసం ఖర్చు పెట్టగలడా- నిన్ను ఫారిన్ తీసుకెళ్లగలడా..... చెప్పు? నువ్వు ఓకే.... అను..... నా బ్యాంక్ బ్యాలన్స్ ని నీ పేరున మార్చేస్తా- కారు, బంగ్లా నీవే..... మీ పెద్దవాళ్ళ దగ్గరికి మా పెద్దవాళ్ళని పంపుతా" ఆవేశంగా అన్నాడతను.

 

    "పెద్దవాళ్ళ దగ్గరికి..... పెద్దవాళ్ళు.... ఎందుకు?" నవ్వుతూ అంది ఆమె.

 

    "చెప్పు! నేనంటే నీకిష్టమేనా?"

 

    "ఇష్టం- ఎందుకిష్టం.... ఎందుకిష్టం వుండదు.... అంతా భ్రమ. అంతా మాయ..... అంతా ఇంటాక్సికేషన్...."

 

    "అనూ! చెప్పాలి...."

 

    "చెప్తా.... టైముంది గదా-"

 

    "నాకు లేదు."

 

    అన్వితను అక్కడనుంచి పక్కకు తీసికెళ్ళాడు. ఆమెకు చాలా దగ్గరగా నిలబడ్డాడతను. ఒకరి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఇంకొకరికి తగులుతున్నాయి. గబుక్కున ఆమె ముఖంనీ తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు రవి.

 

    "ప్లీజ్.... నో...." విడిపించుకుంటోంది అన్విత.

 

    ఆ దృశ్యాన్ని చాటునుంచి చూస్తున్న మధు కోపంతో రగిలిపోయాడు.

 

    "వాడ్ని చంపేస్తాను....." కసిగా అంటూ ముందుకు కదిలాడు.

 

    "వద్దు!" అన్నాడు తేజ.

 

    "అన్విత మీద చెయ్యి వేసినవాడి చేతిని నరికేస్తాను" ఉగ్రంగా అన్నాడతను.

 

    "ఈ సంఘటన నీకు తెలీదు. నువ్వు చూడలేదు.... అన్నట్టుగానే వుండు. ఏమైనా జరిగితే నేను చేసుకుంటాను" అన్నాడు తేజ.

 

    రవి అన్వితను గట్టిగ కౌగింలించుకున్నాడు.

 

    ఆమె పెదాలు అందకపొతే బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు. అతడి చేతులు ఆమె గుండెమీద తారట్లాడుతున్నాయి.

 

    "ఫట్....." మని రవి చెంప పేలిపోయింది.

 

    "యూ ఇడియట్!" అంటూ ఆమె రవిని వెనక్కి తోసేసి వెనక్కి పరుగెత్తింది. ఆమెను పట్టుకోవడానికి రవి ఆమె వెనుక పరుగెత్తాడు.

 

    అందరూ ఆ దృశ్యాన్ని నవ్వుతూ చూస్తున్నారు.

 

    చీకట్లో పరుగెడుతోంది ఆమె.

 

    "పద!" అంటూ గబగబా వెనక్కి వచ్చారు తేజ, మధు.

 

    "నేను అన్వితను తీసుకొని సిటీపోతాను. నువ్వు వెనక వచ్చెయ్" అంటూ అంబాసిడర్ స్టార్ట్ చేసి రోడ్డుమీదకు తీసికొచ్చాడు.

 

    రోడ్డుమీద పరిగెడుతున్న అన్విత, ఆ కారు దగ్గరకి రాగానే లోన కన్పించిన తేజను చూడగానే ఆశ్చర్యపోయింది. సిటీలో డ్రాప్ చెయ్యమని కోరింది.

 

    తేజ కారు డోర్  ఓపెన్ చేసి-

 

    "ప్లీజ్!" అన్నాడు.

 

    అన్విత ఎక్కి కూర్చున్న మరుక్షణంలో కారు ముందుకు దూసుకు పోయింది.

 

    "అన్వితా.... అన్వితా..." అరుస్తున్నాడు రవి దూరంనుంచి.

 

    కాసేపయ్యాక వెనక్కి మరలాడు.

 

    చీకట్లో రోడ్డుమీద కొచ్చి పొదల్లో పెట్టిన హీరోహోండాని స్టార్టు చేశాడు మధు. అర్థరాత్రి సమయంలో హీరోహోండా రివ్వున దూసుకుపోసాగింది.

 

    
                                          *    *    *

 

    కొకైన్ తీసుకోవడం మూలంగా శరీరాని ఆక్రమించుకున్న నిషా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది ఆమెలో.

 

    "ఎవరతను? మీరిక్కడ?" ఏమీ తెలియనట్టు అడిగాడు డిటెక్టివ్ తేజ.

 

    "ఫ్రెండ్స్... పార్టీ చికాకువేసి వచ్చేశాను" క్లుప్తంగా చెప్పింది అన్విత. మత్తు నుంచి క్రమంగా బయట పడుతోంది

 

    అరగంట తర్వాత ఆమెను ఇంటిముందు డ్రాప్ చేశాడు తేజ.

 

    అంతవరకూ లాసన్స్ బే కాలనీ జంక్షన్లో ఎదురుచూస్తున్నాడు మధు. తిరిగొస్తున్న తేజను కలిశాడు.

 

    "ఏమైనా చెప్పిందా?" అడిగాడు మధు ఆతృతగా.

 

    "లేదు! ఆ పార్టీకెళ్ళి తప్పు చేశాననే బాధ, ఆమె ముఖంలో వ్యక్తమవుతోంది. పశ్చాత్తాపానికది చాలు.... కొంతలో కొంత ఆమె వ్యక్తిత్వం అర్థమవుతోంది కదా?"

 

    మాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు మధు.

 


                                           *    *    *

 

    అతనికి చికాగ్గా వుంది.

 

    నిద్ర పట్టడం లేదు.

 

    బెడ్ మీద  నిలువుగా పడుకుని గోడలమీదున్న ఫోటోలవైపు చూస్తున్నాడు.

 

    అన్విత ఫోటోళ మధ్య చిన్నారి ప్రేమఫోటో.

 

    దగ్గరిగా వెళ్ళి, ఆ ఫోటోను వేళ్ళతో తడిమి-

 

    ఆ స్పర్శలో ఎంతో ఆనందాన్ని పొందాడు.

 

    'నిన్ను కోల్పోయి నన్ను నేను కోల్పోయాను ప్రేమా! నన్ను క్షమించు. ఎక్కడైనా, ఎప్పుడైనా నువ్వు నాకు కనిపిస్తావన్న ఆశ నాకుంది. ఆ ఆశను నిజం చెయ్యాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అనుకున్నాడు మనసులో.

 

    ఆ సమయంలో అతని కళ్ళవెంబడి రెండు కన్నీటిబొట్లు వచ్చాయి.

 

    కొన్ని కన్నీళ్ళు ఇంకవు.

 


                                            *    *    *

 

    డోర్ తలుపు తీసి, ఎదురుగా నుంచున్న డాక్టర్ పరశురామ్ ని చూసి ఆశ్చర్యపోయింది అన్విత.

 

    "నాన్నమ్మగారికి, ఇంజక్షన్ ఇచ్చాను. మిమ్మల్ని విష్ చేసి, వెళ్ళిపోదామని డిస్ట్రబ్ చేశానా?" అన్నాడతను.

 

    తన రూమ్ కి ప్రత్యేకంగా రావడం ఆశ్చర్యంగా వుంది అన్వితకు. "రండి" లోనికి ఆహ్వానించింది.

 

    హేండ్ స్టిక్స్ సహాయంతో నడుస్తూ, లోనికొచ్చి, ఆ కర్రల్ని పక్కన పెట్టి, సోఫామీద కూర్చున్నాడు పరశురామ్.

 

    ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్ తీసిచ్చింది.

 

    "రేపు నా బర్త్ డే.. అతి ముఖ్యమయిన ఫ్రెండ్స్ కు పార్టీ యిస్తున్నాను. మీరొస్తే...."

 

    "ఎక్కడ?"

 

    "నా అపార్ట్ మెంట్లో."

 

    "ఎన్నిగంటలకు?"

 

    చెప్పాడతను.

 

    "అలాగే" అంది నవ్వుతూ.

 

    
                                               *    *    *

 

    "హలో..... నేనే.... తేజను."

 

    "చెప్పండి"

 

    "డాక్టర్ పరశురామ్ అన్వితను బర్త్ డే పార్టీకి ఇన్ వైట్ చేశాడు."

 

    "ఎక్కడ?"

 

    "అతని అపార్ట్ మెంట్లో..... రేపు..... ఓవర్" మెసేజ్ ని మధుని కన్వే చేసి ఆలోచనలో పడ్డాడు డిటెక్టివ్ రవితేజ.

 


                                                             *    *    *

 

    మనిషంటే కేవలం శరీరం ఒక్కటే కాదు. మనసు, శరీరం కలిపితేనే మనిషి. మనసు అవసరం తీరితే తృప్తిపడుతుంది. శరీరానికి కోరిక తీరితే తృప్తిపడుతుంది. శరీరం కోరుకునే ప్రధానమైనది సెక్స్. అక్కడ ఇష్టాయిష్టాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.

 

    ఆపోజిట్ సెక్స్ లో కొంతమంది అందాన్ని చూస్తే, మరికొంతమంది దేహాన్ని చూస్తారు.

 

    మనసు, దేహం రెండూ వేర్వేరు భిన్న కేంద్రాలు.

 

    మనసు, దేహం ఒక్కటయ్యేవి ఆధ్యాత్మిక చింతనలోనే.

 Previous Page Next Page