ముందు తాము విన్నదేమిటో ఆ డీలర్స్ కి అర్ధం కాలేదు. అర్ధమైన మరుక్షణం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. కొత్త ప్రపంచ వింత గురించి విన్న భ్రాంతికి లోనయ్యారు. ఒక్కసారి నోటివెంట మాట లేదు. కళ్ళప్పగించి వికాస్ కేసి అంతా చూస్తుండిపోయారు.
ఆ నమ్మలేని నిజం వారికి జీర్ణం కావటానికి చాలాసేపే పట్టింది. వారి స్థితిని వికాస్ బాగానే అర్ధం చేసుకోగలిగాడు.
"అతి త్వరలో మిమ్మల్ని.... మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్... మీక్కావలసినంత సమాచారంతో కలుస్తారు..." వికాస్ నవ్వుతూ అన్నాడు.
గదిలో ఉన్నవాళ్ళందరికీ కాఫీలొచ్చాయి.
ఆ తర్వాత డీలర్స్ అందర్నీ తీసికెళ్ళి తమ ప్లాంట్ ప్రగతిని చూపించాడు.
వాళ్ళింకా ఆ దిగ్భ్రాంతి నుంచి పూర్తిగా తేరుకోలేకపోయారు.
వాళ్ళందర్నీ పంపించడానికి వికాస్ గేటువరకూ వచ్చాడు.
ఆ సమయంలో-
గేటు దగ్గర కొచ్చి ఓ మారుతీకారు ఆగింది. అందులోంచి మల్లిఖార్జున్ దిగాడు.
"మిమ్మల్నే కాంటాక్ట్ చేద్దామనుకుంటున్నాను...." నవ్వుతూ అన్నాడు వికాస్.
ఇద్దరూ లోనికొచ్చారు.
"ఎలా వుంది ప్రోగ్రెస్...." అడిగాడు మల్లిఖార్జున్.
"మెటీరియల్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం.....జైహింద్, టా... టా.... డన్ లప్....వాళ్ళ దగ్గర్నించి మెటీరియల్..... తీసుకుంటున్నాం...." ఉత్సాహంగా చెప్పాడు వికాస్.
"డీ.సీ.ఎమ్. వాళ్ళు, ఎక్స్ పోర్ట్ గిరాకీ ఎక్కువ వుండడంవల్ల, మేం అడిగిన సరుకును ఇప్పట్లో పంపించలేమన్నారు ... ఆ మెటీరియల్ వస్తే కట్టడానికి ఉంచిన డబ్బు.... మీకు సర్దుతున్నాను.... మీ ఫస్ట్ విడత బాచ్ మార్కెట్ లోకి రాగానా నా డబ్బు నాకిస్తారు కదూ..." అని సూట్ కేసుని ఓపెన్ చేసి అందులోంచి 'చెక్'ని తీసి అందించాడు వికాస్ కి.
ఆనందోద్వేగపు పెను అల వికాస్ ని కొద్ది క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేసింది. అది అతను ఊహించలేదు. ఒకింత సేపటికి ఆ ఆనందం నుంచి తేరుకున్నాడు.
"చాలా థాంక్సండి... మీ హెల్ప్ జన్మలో మరిచిపోలేను..." చెక్ అందుకుని చూశాడు వికాస్.
5,00,001-00లకు చెక్.
"ఈ ఒక రూపాయి ఏమిటి?"
"ఆదా... నా అలవాటు..." నవ్వేడు మల్లిఖార్జున్.
వికాస్ కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోయాయి.
"శివానీ కాదు.... ఇస్తున్నది.... వికాస్ కు.... మీరు విజయం సాధిస్తారన్న నమ్మకం నాకుంది. అందుకే ఇస్తున్నాను."
"మీలాంటి వ్యాపారస్తులు, నాలాంటి నిరుద్యోగులకు ఇలాంటి సహాయం చేస్తే ఈ దేశంలో నిరుద్యోగం ఉండనే ఉండదు."
ఆ పొగడ్తకు మల్లిఖార్జున్ ఆనందించాడు.
"నేను ఇచ్చింది... మళ్ళీ తీసుకోడానికి... దీన్ని సహాయం అనరు. అప్పు అంటారు... నా పరిస్థితి బాగుంటే.... ఇచ్చిన డబ్బుని మళ్ళీ అడిగే మనస్తత్వం కాదు...." అన్నాడాయన.
"మీ నాన్నగారి స్వభావమే మీకొచ్చింది. ఆయన దగ్గర ఐదూ.... పది....ఎన్నిసార్లు తీసుకున్నానో తెలీదు. ఏనాడూ నన్నడగలేదు... కానీ ఎవడైనా ధనవంతుడు ఆయనకు బాకీ వుంటే.... ఆ బాకీని నయాపైసల్తో సహా ఆయన వసూలు చేసేవాడు" చెప్పాడు వికాస్.
"నా చదువు పూర్తవుతున్న సమయంలోనే మానాన్న చనిపోయాడు. అప్పటికి ఆయన మాకు మిగిల్చిందేమీ లేదు.... కానీ ఆయనకున్న మంచితనం...ఆ మంచితనంవల్లే నేను ఇంత సంసారాన్నీ ఈదుకురాగలిగాను."
తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు మల్లిఖార్జున్.
"మిషనరీ ఎప్పుడొస్తుంది? స్టాఫ్ రిక్రూట్ మెంట్ అయిందా?"
"అన్నీ అవుతున్నాయి... మీలాంటి మంచివాళ్ళ ప్రోత్సాహంతో."
"స్టాఫ్ ని మంచివాళ్ళని, కష్టపడేవాళ్ళనీ, నమ్మకస్తుల్నీ తీసుకోండి. బైదిబై మా ఫ్రెండ్ కొడుకొకడు ఖాళీగా ఉన్నాడు.... పంపిస్తాను.....వీలైతే చూడండి...." వెళ్ళిపోయాడు మల్లిఖార్జున్. అదే సమయంలో లోనికొచ్చాడు యూనియన్ లీడర్ నర్సింహమూర్తి.
"రండి.... రండి..." ఆహ్వానించాడు వికాస్.
"చూశా..... ఫ్యాక్టరీ మొత్తం చూశా.... కళకళలాడుతోంది.... లక్ష్మీకళ వచ్చేసింది. ఏవిటో.... ఏమో అనుకున్నాను..... అసాధ్యుడే మీరు..." వచ్చి కూర్చుంటూ అన్నాడు నర్సింహమూర్తి అతన్తోపాటు అతని పక్కన ఓ కుర్రాడున్నాడు.
అతన్ని చూడగానే, ఎక్కడో చూసినట్టనిపించింది వికాస్ కి.
ఎక్కడో చూశాడు కానీ జ్ఞాపకం రావడం లేదు...
"మా మేనల్లుడు.... కిషన్.... బాబుగారికి దండం పెట్టు..."
నమస్కారం చేసి దూరంగా కూర్చున్నాడు కిషన్.
"మిషనరీ రాగానే పనివాళ్ళందరూ వస్తారు.... అందరితో మాట్లాడాను.. వాళ్ళని ఎప్పుడు పంపించమంటే అప్పుడు మీ దగ్గరకు పంపిస్తాను" అన్నాడు నర్సింహమూర్తి. ఇంతలో-
ఫోన్ మోగడంతో రిసీవర్ తీసుకున్నాడు.
"హలో... శివానీ మోటార్స్...."
"కెన్ ఐ స్పీక్ టూ మిస్టర్ వికాస్..."
"వికాస్ నే మాట్లాడుతున్నాను."
ఆ గొంతు గుర్తుపట్టాడు వికాస్.... లిఖిత....
"ఎక్కడ నుంచి...?"
"ఆకాశం నుంచి..."
"భూమీద నుంచి పైకెప్పుడెళ్ళారు?"
"మిమ్మల్ని చూసినప్పుడే.... టైముందా?"
"నౌ అయామే బిజీ..."
"ఇరవై నాలుగ్గంటలూ మీరూ బిజీ... మీ ఫోనూ బిజీయే.... ఇప్పుడే.... ఇంత బిజీ అయితే... ఎలాగండి..."
"తప్పదు కదా..."
"తప్పదంటే కుదరదు.... రెండు రోజుల్నించీ, అహోరాత్రులూ మీకు ఫోన్ చేస్తుంటే.... మీరిప్పుడు దొరికారు. మిమ్మల్ని అరగంట దాకా వదల్ను. అంతే..."
"ఓ అరగంట తర్వాత ఫోన్ చేస్తే, హాయిగా మాట్లాడుకోవచ్చు..." ఫోన్ పెట్టేశాడు వికాస్ తప్పక- ఇష్టం లేకున్నా.
"వికాస్ గారూ, మీతో చిన్న పనుండి వచ్చాను...." అన్నాడు నర్సింహ మూర్తి.
"చెప్పండి. మొహమాటం దేనికి?"
"మా కిషన్ మొన్నటివరకూ హైద్రాబాద్ లో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క వాళ్ళమ్మా చచ్చిపోయింది. ఇక్కడ కొచ్చేశాడు, మీరు వాడికి ఓ ఉద్యోగం ఇచ్చి నిలబెట్టాలి. జీతం ఎంత చిన్నదైనా పర్వాలేదు. మీలాంటి పట్టుదలున్న వ్యక్తి దగ్గర బెడితే వాడో దారిలో పడతాడని నమ్మకం..." చెప్పాడు నర్సింహమూర్తి.
అప్పుడు అకస్మాత్తుగా జ్ఞాపాకం వచ్చింది వికాస్ కి.
తను హైద్రాబాద్ అపోలో హాస్పిటల్ కి వెళ్ళింది ఇతని ఆటోలోనే.
"ఏం కిషన్... హైద్రాబాద్ లో అప్పెక్కడానికి ఐదు రూపాయలు తీసుకున్నావ్... జ్ఞాపకం వుందా."
కిషన్ కి కూడా జ్ఞాపకం వచ్చింది.
"అక్కడలాగే ఉండాలి సార్.... లేకపోతే బతకలేం... మేం పాసింజర్ల దగ్గర లాక్కుంటే... మా దగ్గర పోలీసులు లాక్కుంటారు... పోలీసుల దగ్గర ఆర్డీవో వాళ్ళు లాక్కుంటారు... ఇదో చైన్ సార్.... ప్రయాణీకుల్ని మోసం చెయ్యాలని ఎవరికీ ఉండదు సార్... కానీ.... తప్పదు..." అన్నాడు కిషన్.
"ఇక్కడేం పని చేస్తావ్?"
"ఏదైనా చేస్తాడు. మావాడికి నాలాగా కుస్తీలు పట్టడం వచ్చు. కరాటే, గిరాటే కూడా వచ్చు. వాచ్ మెన్ ఉద్యోగం ఇచ్చేయండి బాబూ... పడుంటాడు."
అదే సమయంలో మళ్ళీ టెలిఫోన్ మోగింది.
"హలో వికాస్..."
"నేనే..." మళ్ళీ లిఖిత.
"నేను హైద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను... మీరలా ఫోన్ పెట్టేస్తే ఎలా?" చిరుకోపంగా అంది లిఖిత.
"లోకలే.... అనుకున్నాను... చెప్పండి...." నెమ్మదిగా అన్నాడు వికాస్.
"లవ్ స్టాంప్ గురించి మీరెప్పుడూ అడగరేం..."
"ఇప్పుడా.... అవ్వన్నీ.... ఎప్పుడొస్తున్నారు.... వైజాగ్.... రాగానే ఫోన్ చేయండి.... మాట్లాడుకుందాం...." ఫోన్ కట్ చేశాడు.
రిసీవర్ని ప్రక్కన పెట్టేశాడు వికాస్.