ఆవేశంగా చెప్పుకొస్తున్న నారాయణరావు స్పీచ్ కు, అడ్డంగా వచ్చేసి కొంత మంది మహిళలు చప్పట్లు కొట్టారు.
"ఏమిటీ.... ఎందుకు చప్పట్లు కొట్టారు.....నా స్పీచ్ కా.....నా త్యాగానికా....." అలసిపోయిన వాడిలా ముఖం పెట్టి అడిగాడు నారాయణరావు.
రెండింటికీ....."
'ఇంతకీ ఆ ఆమ్మాయి ఏమైంది......" ఒకావిడ జాలిగా ముఖం పెట్టి ప్రశ్నించింది.
"రెడ్ సీ బీచ్ చూపిస్తానని ఒకడంటే, వాడితో అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్ళిపోయింది" బాధగా చెప్పాడు.
"అందుకే అబ్బాయ్__ఇలాంటి కథలు మాక్కూడా చాలా వందలుతెల్సు కాబట్టే.....మేం ప్రస్తుతం ఆ నారాయణరావు, సంధ్యల ప్రేమను వ్యతిరేకిస్తున్నాం....." అని మహిళామణులందరూ, ఏక కంఠముతో చెప్పేసరికి నారాయణరావు మనసు పురివిప్పిన నెమలిలా ఆనంద తాండవం చేసింది.
"ఓ కే ఆంటీస్.....మీరు ఆ ప్రేమను వ్యతిరేకించండి.....బాగా వ్యతిరేకించండి.....మీ మహిళామణులందరూ కల్సి ఐక్య ప్రేమనిరోధక కార్యాచరణ కమిటీలు వాడ, వాడలా ఏర్పాటు చేసుకుని ఆ యువతీ యువకుల ప్రేమను పత్రికల్లో ఖండించండి......వాల్ పోస్టర్లు ప్రకటించండి......గోడమీద రాతలు రాయించండి__సినిమాల్లో స్లయిడ్స్ వేయించండి" ఆవేశంగా చెపుతున్న నారాయణరావు వేపు జాలిగా మహిళా మణులందరూ చూశారు.
"పాపం.....ప్రేమలో బాగాదెబ్బతినడంవల్ల, ఎలా అయిపోయాడో చూడండి.....అలాగే బాబూ....నువ్వు చెప్పినట్టే చేస్తాం.....నువ్వెళ్ళిరా__"వాళ్ళందరూ లేచి నిలబడ్డారు.
పరోక్షంగా తమ ప్రేమకు విరోధకులుగా వాళ్ళని మలచినందుకు చాలా ఆనందిస్తూ, ఈ విషయాన్ని సంధ్యతో చెప్పడానికి హాస్టల్ కి బయలుదేరాడు నారాయణరావు__నెగెటివ్ పబ్లిసిటీ గురించి ఆలోచిస్తూ.....
* * * *
"అక్కడెందుకలా డ్రామా వేసావ్......అంత డ్రామా వేయడం అవసరం లేదేమో....." హాస్టల్ గార్డెన్లో సిమెంట్ బెంచీ మీద తీరుబడిగా కూర్చుంటూ అడిగింది సంధ్య.
"నీకో ఇంపార్టెంట్ పాయింట్ నా గురించి తెలీదు కాబట్టి మాట్లాడుతున్నావ్."
"ఏంటా పాయింట్?"
"నేను చాలా జీనియస్సుని__" నారాయణరావు చెప్పిన మాటకు పగలబడి నవ్వింది సంధ్య.
"తెలుస్తూనే ఉంది__" అని అంటూండగానే, గబుక్కున సంధ్య పైన బడ్డాడు తను.
"ఏంటీ అసహ్యంగా పట్టపగలు పైనబడతావ్....." దూరంగా జరుగుతూ అంది సంధ్య.
"రాత్రి పూట పైన పడొచ్చన్నమాట.....ఎంత బ్యూటీఫుల్ డ్రీమో__ఇప్పుడు నీ మీద నేను ఎందుకు పడ్డానో తెల్సా?"
"ఎందుకు?"
"అటు చూడు.....మీ హాస్టల్ టైపిస్టు.....మనవేపే చూసుకుంటూ వెళుతోంది__మనం తీవ్రాతి తీవ్రంగా ప్రేమించుకుంటున్న ప్రేమికులమని.....ఆవిడకు తెలియాలా అక్ఖరలేదా?" మళ్ళీ నవ్వాడు నారాయణ రావు.
"ఇందాకేదో పాయింట్ చెప్తానన్నావ్?"
"అదా....మన ప్రేమ ఫలించకూడదని పెద్దలందర్నీ ఇంజెక్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందాలేదా?"
"ఆటోమెటిగ్గా జరిగేది అదేకదా? నువ్వు నెగిటివ్ గా అయిపోమంటే, వాళ్ళవుతారా!"
"చచ్చినట్టు అవుతారు...... ఈ సిటీలో ఆడా, మగా ప్రేమకు వ్యతిరేకంగా నడుం కట్టాలి..... మన మీద ధ్వజమెత్తాలి.....అప్పుడే.....మనం ఆదర్శ ప్రేమికులుగా అందరి దృష్టిలో పడతాం అర్ధమైందా?"
"అది చాలా పెద్ద ప్రాసెస్__ఇదే కార్యక్రమం, బిట్లుబిట్లుగా జరిగితేనే మనం ప్రేమికులుగా ఎస్టాబ్లిష్ అవుతాం....ఆ విషయం గురించే నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను" అని అంటుండగానే, హాస్టల్ ముందు ఆగిన ఆటోలోంచి దిగుతున్న కమలాక్షిని చూసి బిత్తర పోయాడు నారాయణరావు.
"ఈ మేడమ్ ఏంటి.....ఇక్కడ....ఇప్పుడు?!"
"నీకు తెలీదా___ఆవిడ నీ గురించి గత శనివారం నుంచీ గాలిస్తోంది. పాపం.....వెళ్ళి ఆ భర్త్రు కామేష్టి వ్రతంలో పార్టిసిపేట్ చెయ్యకూడదూ...."
"నేనా? రేపు మనం పెద్దవాల్తేరు బస్టాప్ దగ్గర సరిగ్గా పదిగంటలకు కల్సుకుందాం.....మరిచిపోకు .....టాటా" అంటూ చెట్లచాటుకి వెళ్ళిపోయి, గోడెక్కి బయటకు దూకేసాడు నారాయణరావు......అమితవేగంతో.
మరో రెండు నిమిషాల తర్వాత, మెయిన్ గేట్ లోంచి లోనికి వచ్చింది కమలాక్షి.
"వాట్ సంధ్యా.....మన నారాయణరావ్..... ఇక్కడున్నాడని తెల్సి వచ్చాను. ఏడీ....." ఆత్రుతగా అడిగింది కమలాక్షి.
"నారాయణరావా.....ఇవాళ రాలేదు మేడమ్."
"ఎక్కడుంటాడో తెలుసా?"
"తెలీదు మేడమ్!"
"నారాయణరావ్ ఎక్కడున్నా......ఒక్కసారి మా యింటికి రమ్మను- అరగంటలో పనైపోతుందని చెప్పు.....ఆ తర్వాత అతని అవసరం ఉండదని చెప్పు"
"అరగంటలో పనా-ఏంటది?" అనుమానంగా అడిగింది సంధ్య.
"పెళ్ళికాని, నీలాంటి అమ్మాయిలకు.....అలాంటి వివరాలు చెప్పకూడదు.....అర్ధమయిందా? నారాయణరావు కనిపిస్తే మాత్రం చెప్పు" గబగబా బయటికి వెళ్ళిపోతున్న కమలాక్షి వేపు చూసి నవ్వుకుంది సంధ్య.
* * * *
మర్నాడు ఉదయం సరిగ్గా పదిగంటలకు పెద్దవాల్టేరు బస్టాపులో కల్సుకున్నారు నారాయణరావు, సంధ్య.
నారాయణరావు చేతిలో దస్తా తెల్లకాగితాలున్నాయి.
"ఈ వైట్ పేపర్స్ ఎందుకు?" సందేహంగా అడిగింది సంధ్య.
"చెప్తా....చెప్తా....కంగారెందుకూ? ఈ రెండు వేళ్ళలో ఒక వేలు పట్టుకో" నారాయణరావు కుడిచేతి చూపుడువేలుని పట్టుకుందామె.
"గుడ్....హురే....హురే......మన ఉద్యమం సక్సెస్.....ఆ నారదుని సాక్షిగా మన ఉద్యమం సక్సెస్...." అరిచాడతను.
"ఆదిమ మానవుడిలా అరవడం కాదు.....అసలు విషయం చెప్పు" చీకాకు పడింది సంధ్య.
"ఈ సిటీలో పెద్దలందరూ మన ప్రేమను వ్యతిరేకిస్తారు.....అంచేత ఎంతమంది మనల్ని వ్యతిరేకిస్తారో ప్రాక్టికల్ గా తెల్సుకోడానికి ఈ పద్దతి" చేతిలోని కాగితాల్ని గాల్లో ఊపుతూ అన్నాడు.
"ఏం చేస్తావ్.....ఈ కాగితాలలో తెల్లజెండాలు కడతావా?"
"నా విషయం నీకు తెలియటానికి ఇంకొంచెం టైమ్ పడుతుందంతే.....రా చెపుతాను" చెయ్యిపట్టుకుని ముందుకు లాగాడు.
"మర్యాదగా చెయ్యి వదులు" కోప్పడింది సంధ్య.
"మనం అందరి ముందూ వీర ప్రేమికులుగా నటించాలి.....అదీ మన యూనియన్ ముందు. అధి మనం చేసిన ఒప్పందం" గాఠిగా చికాకుపడ్డాడు నారాయణరావు.
"అందరిముందూ కదా! ఇక్కడ చుట్టుపక్కల ఒక్క మనిషీ లేడు కదా. కళ్ళు పెట్టుకుని చూడు" ఆ మాటతో నారాయణరావు నలువేపులా చూశాడు.
నిజంగా ఒక్క మనిషీ రోడ్డుమీద లేడు.