గంగారత్నం తలకాయ వూపెస్తూ తొడమీద దరువేసుకుంటూ స్వరం పెంచి పెద్దగా పాడటం మొదలుపెట్టింది.
అమల ఆనందిస్తున్నట్లు ముఖం పెట్టింది. అంతేగాని చప్పట్లు కొట్టలేదు.
గంగారత్నం అదే పాటని తిరిగి తిరిగి పాడటం మొదలుపెట్టింది.
త్రయంబకరావు అంగుళం అంగుళం చప్పున అమల దగ్గరకు జరగటం మొదలుపెట్టాడు.
గంగారత్నం పాట విని పనిచేస్తున్న నాయరు నర్సమ్మ అవతలి గదిలో వున్న శంకరం, ఆఫీసు పని చూస్తున్న సుందరమూర్తి, రామచంద్రం బెడ్ రూమ్ లో వున్న భుజంగరావు, కారు జీపు యిద్దరు డ్రైవర్లు, తోటమాలి పెరట్లో వున్న పని మనిషి మొదలైనవారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడిపోయి వచ్చే నవ్వుని బలవంతాన ఆపుకుంటున్నారు.
అమల ఓరకంటితో వాళ్ళని చూసింది.
అమలమీదనే పూర్తి దృష్టి వుంచిన త్రయంబకరావు చుట్టూ వున్న మనుషులని చూడలేదు.
కళ్ళు మూసుకుంటూ తెరుస్తూ గొంతంతా ఎత్తి పాడుతున్న గంగారత్నం అసలు గమనించే స్థితిలో లేదు.
త్రయంబకరావు మరీ దగ్గరకు వచ్చేస్తున్నాడని యింక లాభం లేదని పెద్దగా చప్పట్లు కొట్టి "కొట్టరా చప్పట్లు కొట్టరా బావగా" అంది అమల.
త్రయంబకరావు చప్పట్లు కొట్టాడు.
దాంతో అక్కడ వున్న అందరూ చప్పట్లు కొడుతూ నవ్వారు.
గంగారత్నం ఉలిక్కిపడి పాట ఆపేసింది. అంతేకాదు చుట్టూ వున్న వారిని చూసి బిత్తరపోయి ఆ తర్వాత సిగ్గుపడింది.
"ఇదేమిటి?" నవ్వుదాచుకుంటూ అడిగాడు భుజంగరావు.
"పాట ఎంత బాగా పాడిందో, భలే భలే గిలే గిలే" అంది అమల.
"నా ఖర్మ అంతే" అని లేచిపోయింది గంగారత్నం.
"సరోజమ్మ తల్లి, ఆమెను ఓ ఆట ఆడించింది భలే" అనుకుంటూ అందరూ అవతలికి వెళ్ళిపోయారు.
21
ఉన్నవాళ్ళు చాలకన్నట్లు మరో కొత్త శాల్తీ దిగింది భుజంగరావు యింట్లో.
"రంగూన్ లో వున్న నా స్నేహితుడు రాజశేఖర్ కొడుకు, పేరు విజయ్ కుమార్ మల్ హోత్ర" అంటూ ఆ కొత్తవాడిని అందరికీ పరిచయం చేశాడు భుజంగరావు.
విజయ్ కుమార్ మల్ హోత్ర తన వయసు ముప్పై లోపల అంటున్నాడు. గాని నలభై దరిదాపుల్లో వున్నట్లు చక్కగా తెలిసిపోతున్నది, సూటుతోనే పుట్టాను సుమా అన్నట్లు ఎప్పుడూ నీటుగా ఖరీదైన సూటులో నిండా మునిగి వుంటాడు. హిట్లర్ మీసాలు, సైడ్ లాక్స్ ఇప్పుడిప్పుడే నెరుస్తున్నాయి. బంగారు పన్ను వొకటి నవ్వితే చాలు దర్శనమిస్తుంటుంది. అందుకే కాబోలు మాటకు ముందు నవ్వుతుంటాడు. అవసరం లేకపోయినా ఐసీ అంటూ అలవాటుగా భుజాలు ఎగరేస్తుంటాడు.