Previous Page Next Page 
శుభోదయం పేజి 37


    "ఆ రోజు ఆటోలో ఎక్కిన ఆ అమ్మాయిని స్పష్టంగా గుర్తుపట్టగలవా?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
    "ఫోటోలోనే గుర్తించాను సార్..." వినయంగా అన్నాడు.
    "అయితే, ఆమెతో ఎక్కిన అతన్ని గుర్తించగలవా? అతని గుర్తులు ఏమన్నా చెప్పగలవా?" యిన్ స్పెక్టర్ ఆరాటంగా అడిగాడు.
    "సార్, ఈ అమ్మాయిని చూసినంతగా అతన్ని చూడలేదు సార్.....కాలేజీ అమ్మాయి అందంగా వుంది కనుక కుతూహలంగా చూశాను. అతని ఆకారం పూర్తిగా గుర్తులేదు కాని మీరు ఎంతమందిలో చూపించినా గుర్తించగలనను కుంటాను..."
    "పోనీ గుర్తున్నంతవరకు చెప్పు..."
    డ్రైవర్ కాస్త ఆలోచించి "ఐదడుగుల ఆరంగుళాల కన్న పొడుగుండడు సార్, చామనఛాయ రంగు, జుత్తు మాత్రం వొత్తుగా పెంచాడు. నల్లపాంటు, ఏదో పువ్వులున్న టెర్లిన్ షర్టు వేసుకున్నట్టు గుర్తు... అతని మొహం మాత్రం అంతగా గమనించలేదు సార్... గడ్డం, నల్లకళ్ళద్దాలు వుండడంతో."
    "పోనీ, నేను కొంతమందిని చూపిస్తాను. వారిలో వున్నాడేమో గుర్తించగలవా?"
    "గుర్తించగలననుకుంటాను సార్..."
    "సరే, నీవు ఆ అమ్మాయిని ఏ యింటికి తీసికెళ్ళావో గుర్తించగలవా?"
    "ఆ ఏరియాకి వెడితే గుర్తు వస్తుందనుకుంటాను సార్..."
    "ఎక్కడ అతను ఆటో ఎక్కాడో గుర్తించగలవా?"
    "హిమాయత్ నగర్ సెకండ్ స్ట్రీట్ దగ్గిరనుకుంటాను సార్..."
    "సరే నాతో రా... ముందు కొంతమందిని చూపిస్తాను" అన్నాడు యినస్పెక్టర్. పోలీసు కస్టడీలోవున్న ఆ ముగ్గురి రౌడీల దగ్గిరకి ముందు తీసికెళ్ళాడు. వాళ్ళ ముగ్గురిని ఆఫీసు రూములోకి పిలిపించాడు.
    "చూడు.... వీళ్ళని బాగా చూడు. ఈ ముగ్గురిలో ఆటోలో ఎక్కినా వాడున్నాడా?" ఇనస్పెక్టర్ డ్రైవర్ మొఖం నిశితంగా గమనిస్తూ అడిగాడు.
    డ్రైవర్ ఒక నిమిషం చూసి "లేడు సార్.... ఆటోలో ఎక్కిన అతను వీళ్ళల్లో లేడు...." అన్నాడు నమ్మకంగా.
    ఇనస్పెక్టర్ నిరాశగా నిట్టూర్చాడు.
    అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టు ఒక్కక్షణం కలవరపడ్డాడు డ్రైవర్. "సార్...ఆగండి సార్... ఇందులో ఇతను... ఆటో ఎక్కినతనితో సందుచివర మాట్లాడుతుండాడు సార్...ఈలోగా ఆటోతో నేను అటు వెడ్తుంటే...పిలిచి ఎక్కాడు సార్... ఇదిగో ఇతను సార్" వేలిపెట్టి చూపుతూ  ఆవేశంగా అన్నాడు.
    ఇన్ స్పెక్టర్ మొహంలోకి వెలుగు వచ్చింది. ఒక్కసారిగా "నిజం...సరిగా చూడు. బాగా గుర్తు తెచ్చుకో."
    "అవును సార్, నాకు బాగా గుర్తువచ్చింది సార్.... నాల్గురోజుల క్రితం జరిగింది అప్పుడే మరిచిపోలేను...ఇతన్ని చూడగానే ఎక్కడ చూశానా అని గుర్తువచ్చింది సార్..."
    ఆ మాట వినగానే ఒక్కసారిగా ముగ్గురి మొహాలు మాడిపోయాయి.
    ఇన స్పెక్టర్ లాఠీ ఊపుతూ వాళ్ళ దగ్గిరికి నడిచాడు. "ఏరా... మీకు తెలియదుగదూ.... అసలు మీరేం చెయ్యలేదు కదా, పాపం ఆ రోజు అక్కడ పేకాడుతూ కూర్చున్నారు గదూ... వరేయ్... దొంగవెధవన్నవాడు ఏదో ఎక్కడో తెలియకుండా పొరపాటు చేసి దొరుకుతాడురా, మీ పాపం పండింది...చెప్పండి, నిజం ఇప్పటికన్నా చెప్పండి."
    "సార్, మాకేం తెలియదు సార్...ఎవరితోటో రోజూ ఎంతోమందితోనో మాట్లాడుతాం, ఇతను ఎవరి గురించి అంటున్నాడో మాకేం తెలియదు సార్" గాభరాగా అన్నారు.
    "తెలీదా... సరే... వచ్చి... మీకు తెలిసేటట్టు చేస్తా... వన్ నాట్ త్రీ...వీళ్ళని లాకప్పులో పడేయి... జాగ్రత్త... మళ్ళీ వస్తాను" అంటూ ఇన స్పెక్టర్ డ్రైవర్ ని తీసికెళ్ళిపోయాడు.
    జీపులో... హిమాయత్ నగర్ క్రాసింగ్ దగ్గిర ఎక్కడ ఆటో ఎక్కాడో చూపించాడు డ్రైవర్. తరువాత నల్లకుంట ఏరియాలో రెండుమూడు సందులు తిరిగాక దారి గుర్తుతెచ్చుకుని ఆఖరికి ఆ యిల్లు చూపించగలిగాడు ఆటోడ్రైవర్.
    ఆ యిల్లు కాస్త పాతబడిన పెద్దమేడ. ఆ మేడకి ఒకపక్క సర్వెంట్స్ క్వార్టర్ లా గ్యారేజీకి ఆనుకుని చిన్నయిల్లు వుంది. ఆ మేడ దగ్గిర ఆపానని ఆటోడ్రైవర్ చెప్పాడు. ఇన స్పెక్టర్ దిగి ఆ యిల్లు ఎవరిదో ఆ వివరాలు కనుక్కున్నాడు. ఆ యిల్లు ఒక ప్లీడరుగారిది. ఆయన అరవై పై దాటిన ముసలాయన. బాగా రాబడి వున్న రోజుల్లో పెద్దమేడ, నౌకర్లు చాకర్లతో దర్జాగా బతికిన మనిషి, యింటికి ఆనుకుని వున్న ఆ గదిలో నౌకరో, డ్రైవరో వుండేవారు. యిప్పుడు ఖాళీగా వుందని అద్దెకిస్తూన్నారుట. సాధారణంగా బ్యాచిలర్స్ వుంటారు. ఇన్నాళ్ళు ఒక పెళ్ళికాని గుమాస్తా వుండేవాడుట. అతను బదిలీ అయి వెళ్ళాక 'టూ లెట్' బోర్డు చూసి నాల్గురోజులక్రితం ఎవరో వచ్చి అడిగి అడ్వాన్సు యిచ్చి వెళ్ళాడుట. ఆ ఎవరో సెక్రటేరియట్ లో పని చేస్తున్నట్టు చెప్పాడట. మళ్ళీ చూస్తే గుర్తించగలనేమో అన్నారాయన. ఆ యింటి తలుపు మేడకి ఒక పక్కగా యింటితో సంబంధం లేకుండా వుంది. కనక ఎవరు వచ్చేది పోయేది తనకి తెలియదన్నాడాయన. అతను మర్నాడే యింకో మంచి రూము దొరికిందని చెప్పి వెళ్ళిపోయాడట. ఈ వివరాలన్నీ ఆయన గాభరాపడ్తూ చెప్పాడు పోలీసు ఇనస్పెక్టర్ ని చూసి, జరిగిన సంగతి విని నిర్విన్నుడయ్యాడు.
    "ఎంత ఘోరం.... మా యింట్లో... ఆ గదిలో అంత ఘోరం జరిగినా మాకేం తెలియలేదే..." అంటూ వాపోయాడు.
    "ఆ వెధవలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గదిలో బంధించి యిష్టం వచ్చినట్టు చేసి....ఆఖరికి రాత్రి... ఎవరూ చూడకుండా.... నిర్మానుష్యంగా వున్నచోట తీసికెళ్ళి పారేసి వుంటారు...." ఇన స్పెక్టర్ అన్నాడు.
    "సార్......మీరెలాగయినా ఆ వెధవలని పట్టుకోవాలి సార్" అంటూ ఆయనా ఆవేశపడ్డాడు.
    "కేసుకి క్లూ దొరికింది సార్.... యింక ఫరవాలేదు. వాళ్ళచేత నిజం ఎలా పలికించాలో మాకు తెలుసు" అన్నాడు ఉత్సాహంగా ఇన స్పెక్టర్.
    ఆ తరువాత కేసు సులభంగా తేలిపోయింది. ఆ ముగ్గురు రౌడీలు పోలీసులు ప్రయోగించిన హింసకి తట్టుకోలేక ఆఖరికి రెండురోజుల తరువాత నిజం బయటపెట్టి నేరం ఒప్పుకున్నారు. ఎంతో తెలివిగా ప్లాన్ వేసినా ఆటో ఎక్కినా వ్యక్తితో వీళ్ళలో ఒకడు మాట్లాడడం చూసిన ఆటోడ్రైవర్ కి క్లూ ఇచ్చేశారు. ఆటోడ్రైవర్ అంతగా ఆ విషయం గమనించడనుకోవడం వీళ్ళ పొరపాటు. వాళ్ళు ఆఖరికి రేఖమీద తమకి ఎప్పటినించో మనసుందని.... ఆ పిల్లని ఏడిపించి, చూసి సంతోషిస్తూ కొన్నాళ్ళు తృప్తిపడ్డారని - ఆమె రాకపోకలు, ఆమె వచ్చిపోయే సమయాలు, ఆమెయిల్లు అన్నీ గమనించారు. ఓరోజు పార్టీకి వెళ్ళి వస్తున్న రేఖని అల్లరిపెట్టారు. ఆరోజు శ్యామ్ వచ్చి అడ్డు తగలడంతో వాళ్ళకి రేఖపట్ల కోరిక మరింత పెరిగి ప్లాను వేశారు. వాళ్ళ గ్రూపులో స్నేహితుడిద్వారా ఒక రూము సంపాదించి, వాడ్ని రేఖ చూడలేదు కనక గుర్తించలేదని తెలివిగా కాలేజీకి పంపి రప్పించి రేఖని గదిలో బంధించారు. వాళ్ళమీద అనుమానం రాకుండా సాయంత్రం అంతా కిళ్ళీబడ్డీ దగ్గిరే కూర్చుని రాత్రి పదిగంటల తరువాత వాళ్ళు ఆ యింటికి వెళ్ళి అప్పటికే కళ్ళు, కాళ్ళు, చేతులు కట్టేసిపడివున్న ఆమెని రేప్ చేశారు అని ఒప్పుకున్నారు. వాళ్ళకి సాయపడిన వాడి ఉనికి తెలిపారు. రక్తాలు వచ్చేట్టు కొట్టాక, గోళ్ళతో గుండుసూదులు గుచ్చి, సిగరెట్టుతో వాతలు పెట్టాక, యింక లాఠీదెబ్బలు తినే శక్తిలేక వెళ్ళగక్కారు.

 Previous Page Next Page