"ఇదిగోండి నా అడ్రస్సు అంటూ విజిటింగ్ కార్డొకటి నాగ్ కి ఇస్తూ కాపీ కలపటంలో నిమగ్నమయింది.
అప్పుడే లైట్లు వెలిగాయి.
మెర్క్యూరిక్ లైట్ల కాంతితో కాఫీ కలుపుతున్న సాహితి నాగ్ కి విచిత్రంగా కనిపించింది.
ఆమెలో ఓ ప్రత్యేకత కనిపిస్తోంది.
నాగ్ జీవితంలో ఓ స్త్రీని అంత పరిశీలనగా చూడటం అదే తొలిసారి.
కాఫీ పాట్ ని కప్ లోకి వంచుతుండగా తమాషాగా కదులుతున్న ఆమెచేతి కున్న మట్టిగాజులు నాగ్ ని చిత్రమైన అనుభూతికి గురిచేసాయి.
"మా అమ్మ చనిపోయిన తరువాత మరలా చాలా సంవత్సరాలకు ఓ గాజుళ చేతులతో కాఫీ అందుకోవటం ఇదే తొలిసారి.
చప్పున తలెత్తి చూసింది సాహితి.
మెరుస్తున్న నాగ్ కళ్ళలో అపురూపమైన అనుభూతి తిరిగిపొందగలిగానన్న ఫీలింగ్.
ఎప్పుడూ ఏ మగాడి ముందు అతను మగాడు అన్న ఫీలింగు కలగని ఆమె నాగ్ ముందు మాత్రం చిత్రమైన అనుభూతికి లోనవుతోంది.
చిత్రమైన పోలిక-తన తల్లి చేతికి తనిచ్చే గౌరవాభిమానాల్ని తనకిస్తున్నాడు.
కావాలనిమ్ తెచ్చిపెట్టుకున్న భావాలతో అతను మాట్లాడుతున్నట్లు లేదు.
దిగ్రేట్ భూపతిరావు కొడుకేనా? తమ్ముడు దినేష్ కి ఇఅతనికి ఎంత తేడా?!
"ఏం చేస్తున్నారు.....?" ఆసక్తిగా అడిగింది సాహితి కొద్దికొద్దిగా కాఫీ సిప్ చేస్తూ.
ప్రస్తుతానికి మీరిచ్చిన కాఫీ తాగుతున్నాను.
గతంలో ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద థీసిస్ సబ్ మిట్ చేశాను.
అర్ధంకాక చూసింది సాహితి.
కరోర్ పతి బిజినెస్ మేగ్నేట్ భూపతిరావు కొడుకు బిజినెస్ మేనేజ్ మెంటు చదవకుండా పారిశ్రామిక సంబంధాలపై పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేయటమా? పైగా రిసర్చి కూడానా? ఇతను నిజంగానే చెబుతున్నాడా? తమాషానా?
అసలితన్ని వాళ్ళ నాన్న, తమ్ముడు ఎలా సహిస్తున్నారు.....? కొడుకు-అతను హరేకృష్ణ మతంలో చేరిపోవటం నమ్మలేని నిజం. ఇది మరో నమ్మలేని నిజమా?!
ఓ పది నిమిషాలు గడిచాక నాగు లేచాడు ఇక వస్తానన్నట్లు.
"మరలా ఎప్పుడు కలుస్తారు? ఓసారి మా ఇంటికి రాకూడదూ?" సాహితికి అప్పుడే వెళ్ళిపోవటం ఇష్టంలేదు.
ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు.
"చెప్పానుగదా.....ఏ అనుభూతిలోనైనా నిజాయితీని కోరుకుంటాను. నేను మిమ్మల్ని రక్షించానని కృతజ్ఞతగా పిలిస్తే రాను. ఒక ఆత్మీయుడిగా భావించి ఇన్ వైట్ చేస్తే తప్పక వస్తాను....." స్ట్రెయిట్ గా అన్నాడు నాగ్.
సాహితి ఓ క్షణం ఆలోచించి "విత్ అఫెక్షన్.....నా చేతులతో నా మట్టిగాజుల చేతులతో నేనే స్వయంగా వంట చేస్తాను....." అంది సాహితి చిరునవ్వుతో.
దూరంగా ఉండి ఇదంతా కమనిస్తున్న సాహితి కారు డ్రయివరు ఒకింత ఆశ్చర్యపోయాడు. తన యజమానురాలు నవ్వగా తనెప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి?
"తప్పకుండా వస్తాను. అవసరం వస్తే నాలుగురోజులు నాకు షెల్దర్ ఇస్తారా......?" ఉన్నట్టుండి సీరియస్ గా అన్నాడు నాగ్.
ఓ క్షణం తృళ్ళిపడింది ఆమె.
అతనివైపు చూసింది. అతను ఆ మాట తమాషాగా అన్నట్టు అనిపించలేదు.
జరిగిన, జరగబోతున్నది ఇదీ స్పష్టంగా ఊహకు అందక పోయినా తండ్రీకొడుకుల మధ్య కమ్యూనికేషన్ గేప్ పెరుగుతున్నట్లుగా ఊహించగలిగింది.
ఓ క్షణం మౌనం తర్వాత అంది "తప్పకుండా, మనస్పూర్తిగా ఇస్తాను. అయితే నా అతిధ్యం మీ స్థాయిలో__ఐమీన్ మీకిష్టమైనరీతిలో ఉండకపోవచ్చు......"
"థాంక్యూ వెరీమచ్ . ఆ అవసరం వస్తే అడుగుతాను. ఆ తరువాత మీ బుణం తీర్చుకుంటాను వస్తాను...." అంటూ పాప బుగ్గల పై మృదువుగా చిటిక వేసి వడివడిగా వెళ్ళిపోయాడు.
నాగ్ వెళ్ళినవైపే ఓ నిమిషం పాటు చూస్తూ నిలబడిపోయింది.
* * *
అకారణంగా మొదలయిన స్ట్రయిక్ పట్ల భూపతిరావు ఉగ్రుడై పోయాడు.
సమ్మె ఎందుకు మొదలెట్టారన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.
ఓ పక్క బోర్డ్ లో తన పై కుట్ర-మరోపక్క తన దారిన నడవని పెద్ద కొడుకు__మరోపక్క సత్యరాజ్ బెదిరింపు- వీటన్నిటి వెనుక భాగ్యరాజ్ బేరం.
"మిష్టర్ ఎల్ అందించిన సమాచారం ప్రకారం సత్యరాజ్ ని నెమ్మదింపజేస్తే తప్ప ఈ సమ్మె ఆగదు" మిష్టర్ 'ఎమ్' వినయంగా చెప్పాడు.
భూపతిరావు నిశ్శబ్దంగా పచార్లు చేస్తున్నాడు.
"మీరు ఊ......అనండి డాడీ___ఆ సత్యరాజ్ ని రేపేస్తాను" దినేష్ నిప్పులు చెరుగుతున్నాడు.
"అదంత తేలికకాదు మైడియర్ సన్" దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు భూపతిరావు.
"ఇప్పుడు సమస్య మొదలయింది ఎక్కడో కాదు. సామంత్ అనే అతి మామూలు వర్కర్ దగ్గర. అతన్ని వారు తమవైపు తిప్పుకొనే లోపు మన వైపుకు లాగండి. ఈ సాయంత్రానికే మనస్టాఫ్ లో మనమంటే భయభక్తులున్న వార్ని మద్రాసు బీసెంట్ బీచ్ కొత్త ఫ్యాక్టరీకి డిప్యుటేషన్ మీద పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోను మరో నెలలో మన కొత్త ప్యాక్టరీ ప్రొడక్షన్ ప్రారంభించాలి. ఇక్కడ ఆఫీసుల్లో మాత్రం వారు లీవ్ మీద వెళ్ళినట్లు రాయండి.
దినేష్ నువ్వు ఈవెనింగ్ ప్లెయిట్ కి మద్రాసు వెళ్ళు, ఏ.ఐ.డి. ఎమ్.కె, కాంగ్రెసు(ఐ), డి ఎమ్.కె పార్టీ లీడర్స్ కి ఐదేసి లక్షల చొప్పున డొనేషన్ ఇచ్చేయ్, వైజయంతిమాల స్థాపిస్తున్న ఎషన్ షియల్ డ్రగ్ ట్రస్ట్ కి లక్ష, జయలలిత నడిపే పూర్ బాయిస్ స్కూల్స్ కి లక్ష ఇవ్వు. ఈ వార్తలు తమిళనాడు పేపర్సులో వచ్చేలాచూడు లైసెన్స్ లు ఇమీడియట్ గా వచ్చేలా చూడు. మిష్టర్ 'పి' ని ఢిల్లీ పంపించు, సెంట్రల్ లైసెన్సులు త్వరగా వచ్చేలా చూడమను. క్విక్___ఈ పనులు చాలా ఫస్ట్ గా జరిగిపోవాలి____
తండ్రి చెబుతున్న పాయింట్స్నోట్ బుక్ మీద రాసుకుంటూ వెళుతున్నాడు దినేష్ సీరియస్ గా.
రానున్న గడ్డు కాలాన్ని ఎదుర్కొనేందుకు భూపతిరావు అన్ని విధాలా సిద్ధపడుతున్న భావం మిష్టర్ 'ఎమ్' లో దినేష్ లో ఏర్పడింది.
* * *