ఒక్కొక్కసారి అందరి ముందూ ఆమెని కూడా తిట్టేసేవాడు . కానీ పదవి వ్యామోహంలో అన్నీ భరించేది శీతల్. 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్టు.
ఏ గూడచారుల చలవనో శీతల్ సంగతి ఝాన్సీ లక్ష్మికి తెలిసింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక ఝాన్సీ లక్ష్మి, పానకాలు జేబులోంచి సిగరెట్టు పెట్టెని తీసి, అందులోంచి ఒక సిగరెట్టు తీసి వెలిగించింది. "ఎందుకది?" అడిగాడు పానకాలు అర్ధం కాక.
"ఎందుకా?" నాకు ఎక్కడెక్కడ వాతలు పెట్టారో అక్కడక్కడ శీతల్ పేరు చెప్పి వాతలు మీకు పెడతాను. మళ్ళీ దాని మొహం చూడకుండా" అంది ఝాన్సీ.
"వొద్దు! అలా చెయ్యకు! శీతల్ మొహం చూడను. అయినా ఆ ముం...తో నాకు ఏ సంబంధమూ లేదు ప్రామిస్" చేతులు జోడించాడు పానకాలు భయంతో.
"నిజం చెప్తున్నావా?" ముందు ఆడవాళ్ళని ఆ తిట్లు మాను!"
"సరే! ఒట్టు! కావాలంటే రేపట్నుంచి నువ్వు చూసుకో! అసలు దాన్ని ఆఫీసులో లేకుండా బయట పన్లు చేసుకోవడానికి పంపించేస్తాను. ప్రామిస్!" ఇంకెప్పుడు ఎవరినీ తిట్టను అన్నాడు ఇంచుమించు వొనికిపోతూ!
ఝాన్సీ లక్ష్మికి జాలేసింది. సిగరెట్టుని ఆర్పేసి అవతల పారేసింది. జేబులో ఉన్న సిగరెట్టు పెట్టె మొత్తం తుంపి ముక్కలు చేసి అవతల పడేసింది.
పానకాలు అదంతా చూస్తూ ఊరుకున్నాడు నోరు మెదపలేదు. మంచం మీద ముడుచుకుని పసిపిల్లాడిలా పడుకున్నాడు . దుప్పటి కప్పుకుని.
ఝాన్సీకి గుండె కరిగిపోయింది. తన ప్రవర్తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకిలా మారిపోయింది తను? పెళ్ళీ సంసారాన్ని గురించి ఎన్నో తియ్యని కలలు కంది కన్నేపిల్లగా! భర్త గుండెలో గూడు కట్టుకుని అతని ఊపిరితో తన ఊపిరిని జోడించి మురళీ నాదంలా తన్మయత్వాన్ని పొందుతూ అతనే తానుగా తనే అతనుగా మధుర ప్రేమలో మైమరచిపోయే ప్రణయిని రాధలా బతకాలనుకుంది!
చిలిపి కయ్యాలతో మాటామాటా విసురుకుంటూ , చలాకీగా తన చుట్టూ తిప్పుకుంటూ తన కోసం ఏమైనా చెయ్యగలిగేలా అతనిని మలచుకుంటూ గీసిన గీత దాటనివ్వని సత్యభామలా ఉండాలనుకుంది!
అనురాగమూ, ఆదర్శ పత్నీ రుక్మిణి దేవిలా అతనిని పూజిస్తూ అతని హృదయ మందిరంలో నివసించాలకుంది!
మన శాస్త్రాలు బోధిస్తున్నట్టుగా , తుచ తప్పకుండా కార్యేషుదాసిగా, కరణేషు మంత్రిగా, భేజ్యేషు మాతగా, రూపేషు లక్ష్మీ , శయనేషు రంభగా షట్కర్మలనూ పాటిస్తూ పిల్లాపాపలతో ఇల్లే వైకుంటంగా జీవించాలనుకుంది. అటువంటిది ఇప్పుడెం చేస్తోంది? భర్త అనే గౌరవం లేకుండా, నువ్వంటే నువ్వంటూ , భర్తగా కాక బానిసగా చూస్తోంది అతణ్ణి. తల్లి చెప్పిన మాటలన్నీ పెడచెవిని పెట్టింది. ఎందుకిలా జరుగుతోంది?
'ఆర్ధికంగా స్వతంత్రురాలయినందుకు తనలో అహం పెరిగిందా? అతనంటే చులకన భావం ఏర్పడిందా?" అనుకుంది.
ఒక్క క్షణం ఝాన్సీ గుండె కరిగిపోయింది!
ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోయింది.
తల బద్దలైపోతున్నట్టనిపించింది.
వెళ్ళి మంచం మీద వాలిపోయింది. దీపం ఆర్పేసి.
మనసు కుదుట బడలేదు. గుండెలో రాగులుతున్న అల్లకల్లోలం తగ్గలేదు. "నో! తను బాధపదక్కర్లేదు! తను చేసింది సరైన పనే! భార్యని మనిషిగా చూడలేని వ్యక్తిని, భార్యని హింసించే వ్యక్తిని తను ఎలా ప్రేమించగలుగుతుంది? ఎలా గౌరవించ గలుగుతుంది? తనలా తిరగబడకపొతే, ఈపాటికి తనూ కౌసల్య లాగే బలై పోయి ఉండేది ఇతని కూరత్వానికి! లేదా వంట ఇంట్లో ఏడ్చుకుంటూ పడుండేది హీనస్థితిలో!
ఇలా ఉద్యోగం చేయ్యగలిగేదా? తన చెల్లిలికి పెళ్ళి చెయ్య గలిగేదా? అతనికి ఉద్యోగం ఒచ్చేదా తనలా పౌరుషంగా మాట్లాడి ఉండకపోతే! కనుక అతని ప్రవర్తనకి తను అలా ప్రవర్తించి ఉండకపోతే పరిణామాలు వేరుగా ఉండేవి అనుకుని తనకి తనే సర్ది చెప్పుకుని తృప్తిగా నిట్టూర్చింది.
పక్కనే పడుకుని ఉన్న భర్త వైపు చూసింది . కాళ్ళూ చేతులూ ముడుచుకుని దుప్పటి కప్పుకుని పసిపిల్లాడిలా పడుకున్నాడు అతడు.
"పాపం! తనని చూసి భయపడి పోతున్నాడు. అందుకే తన దగ్గరికి కూడా రావడం లేదు" అనుకుంది.
మెల్లగా అతని వైపు తిరిగింది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని తన గుండెల పైన ఉంచుకుంది. కానీ పానకాలు ఆమెకు దూరంగా జరిగిపోయాడు. భయపడుతున్నట్టుగా!