Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 37

"నిజంగానే! ఒట్టు!"
"మీకు గుర్తు లేదా?"
"లేదు"
"మీ భార్యా పిల్లలూ?"
"ఏమి గుర్తులేవు."
"మీకు గుర్తున్నదేదో చెప్పండి. మిగతా విషయాలు నేను కనుక్కుంటాను."
"వారం రోజుల క్రిందట......నాకు తెలివొచ్చేసరికి మౌంట్ రోడ్ లో ఉన్నాను........"
అంటూ ఆ రోజు దాకా జరిగిన విషయాలన్ని పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
శ్రద్దగా విని తల పంకించాడు రాజేష్.
"హైదరాబాద్ పేరు విన్నారా ఎప్పుడన్నా?"
"విన్నట్లే ఉంది."
"కాకినాడ?"
"ఆ"
"కందుకూరు?"
"ఉహూ"
"కోనసీమ?"
"ఆ"
"మీ పేరు నిరంజనం?"
"ఏమో!"
"రామారావు?"
"అయుండొచ్చు."
అరగంటసేపు ప్రశ్నలేశాడు రాజేష్. ఆ అరగంటలో ముకుందరావు సాధుజంతువు లాంటి మనిషిని, దుర్భల హృదయం గలవాడని, స్నేహశీలీ అని గ్రహించాడు.

                                                   * * *
రేవతి , స్బ్న్\స్నేహ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
"ఇక్కడ మల్లెపూలు ఇంత ఖరీదు కదా! మా ఉళ్ళో అయితే మల్లెతిగా ఉంది. విరగపూస్తుంది. రోజు జడనిండా బుట్టెడు పెట్టుకునే దాన్ని" అంది స్నేహ.
"నువ్వే అసలు మల్లెతీగలా ఉంటావ్. అందులో పూలు పెట్టుకుంటే నిజంగానే మల్లె పందిరి అనుకోవాలి" అంది రేవతి.
స్నేహ నవ్వింది.
"మనం ఇక్కడ కూడా మల్లెతీగ ఎందుకు వెయ్యకూడదు?"
"ఎందుకేయ్యకూడదు? ఇకనుంచి నువ్వూ తోడుంటావుగా? ఇద్దరం కలిసి ఎన్నో చెయ్యాలి."
"ముందర మల్లెచెట్టూ, రెండు కొబ్బరి చెట్లూ, క్రోటన్సు- అందంగా చేసెయ్యాలి" అంది స్నేహ.
"అప్పటిదాకా రేవతి ఇక్కడే ఉంటుందేమిటి? పెళ్ళి చేసేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది" అన్నాడు శ్రీహర్ష. అతను వచ్చి రెండు నిమిషాలయింది. వాళ్ళిద్దరూ అతని గమనించలేదు.
స్నేహ అతన్ని చూడగానే సిగ్గుగా లేచి నిలబడింది.
"మీ ఇద్దరికీ ఏం తెచ్చానో కనుక్కోండి" అన్నాడు శ్రీహర్ష తెచ్చిన పాకెట్ వెనక దాచేస్తూ.
"చాక్ లేట్లో, చిలగడదుంపలో తెచ్చి ఉంటావ్" అంది రేవతి సాధింపుగా. "చీరెలు కావాలన్నాను. గుర్తుందాఅసలు నీకు?"
"గుర్తుండబట్టే తెచ్చాను. మిమ్మల్నే తీసుకెళ్ళి కొనిచ్చి ఉండాల్సింది గానీ, డబ్బు చేతికొచ్చిన హుషారులో నేనే వెళ్ళి కొనేశాను."
"బాబోయ్! నీ సెలక్షనా?" అంది రేవతి.
"కొన్నది నేనే గానీ, సెలక్షన్ మాత్రం లావణ్యది."
"ఆయితే ఫర్వాలేదు" నిట్టూర్చింది రేవతి - "ఒక్కక్షణం హడలిపోయాను సుమా!"
"షటప్! మొద్దూ!" అంటూ పాకెట్ అందించాడు.
కోటా చీరెలు రెండు.
ఒకటి ఆకుపచ్చ డిజైన్, ఒకటి నీలం డిజైన్.
"ఈ ఆకుపచ్చ లతల డిజైన్ కట్టుకుంటే నువ్వు నిజంగా మల్లె పందిరిలాగే వుంటావు" అంది రేవతి, స్నేహతో.
స్నేహ అందంగా సిగ్గుపడింది.
"సాయంత్రం లావణ్య కూడా వస్తుంది. అందరం సినిమా వెళ్దాం" అన్నాడు శ్రీహర్ష.
"ఆమెకి జ్వరం పూర్తిగా తగ్గిందా?" అంది స్నేహ.
"ఓ! పూర్తిగా తగ్గిపోయింది. కాని మనిషి మాత్రం డల్ గా అయిపొయింది. అందుకే కాస్త కాలేక్షేపంగా ఉంటుందని సినిమా కెల్దాం అన్నాను." అన్నాడు శ్రీహర్ష.
సాయంత్రం అందరూ సినిమా దియేటర్ దగ్గరికి వెళ్ళారు. లావణ్య నేరుగా అక్కడికే వచ్చేసింది.
పది నిమిషాలుంది ఇంకా సినిమా మొదలవడానికి. ఫోయేర్ లో కూర్చుని చిప్పూ, సమోసాలు తిని కూల్ డ్రింక్స్ తాగారు.

 Previous Page Next Page