Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 37

 

    ఈ ఉజ్వల తనతో చేరడం చాలా లక్కి! నిజంగా!

 

    "శశి! నీ కేమిటి?" అంది ఉజ్వల, అతని చూపులు గమనించి నవ్వుతూ.

 

    "జిన్ అండ్ టానిక్" అన్నాడు శశికాంత్.

 

    వెంటనే పరాశర్ అన్నాడు.

 

    "అరె భయ్ శశికాంత్? నువ్వు ఎప్పుడూ ఇలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ లో జిన్ అండ్ టానిక్ తాగుతూ, కాలం గడిపెయ్యాలంటే మీ మందుల ఫ్యాక్తరిలో టానిక్కులు చెయ్యడం మొదలుపెట్టాలి నువ్వు. అదే అసలైన టెక్నిక్కు! నువ్వు కొన్న కంపెని ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న మందులు ఏమిటో చూశాను. లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్! ఎవడికి కావాలోయ్! ప్రాణాలు కాపాడే మందులు! ఎవర్నో బతికించడానికి కాదు మనం మందులు తయారు చేస్తోంది! మనం బతకటానికి చేస్తున్నాం. ఫార్మా న్యూటికల్స్ లో ఇది ఎప్పటికి పాతబడని పాఠం! గుర్తుంచుకో!"

 

    "నాకు తెలియదా ఏమిటి?" అన్నాడు శశికాంత్. తనకి ఎప్పుడో తెలుసు- పరమహంస ఎందుకు నష్టపోయాడో! అందరికి అవసరమైన మందులే చేస్తానంటూ చాదస్తంగా మడికట్టుకు కూర్చుని అంతా పోగొట్టుకున్నాడు చివరికి. ఆ పాలసి మార్చేస్తున్నాడు తను. మార్చకపోతే ఈ కొత్త పార్టనర్స్ ఊరుకోరు. తనకి సాయం చెయ్యరు.

 

    కానీ, వీళ్ళ దగ్గర సలహాలు తిసుకోవలసినంత తెలివి తక్కువ వాడెం కాదు తను.

 

    ఓ సంవత్సరం తిరిగే లోగా, తనే ఈ కొత్త పార్టనర్స్ కి కొత్త పాఠలు నేర్పిస్తాడు.

 

    తన సంగతి ఇంకా వీళ్ళకి పూర్తిగా తెలియలేదు!

 

    "కొత్త ప్రొడక్ట్స్ తో బాటు సేల్స్ ప్రమోషన్స్ కేంపయిన్ ఉదృతం చెయ్యాలి. పేపర్లలో అడ్వర్ తెయిజ్ మెంట్స్ తో బొంబార్డ్ చేసెయ్యాలి. అలాగే కాంప్లిమెంటరీస్........స్టికర్స్...." అంటున్నాడు ఒకతను.

 

    "అన్నిటి కన్నా ముఖ్యంగా మెరికల్లాంటి సేల్స్ మెన్ నీ, సేల్స్ రిప్రేజెంటేటివ్స్ ని అపాయింట్ చేసుకోవాలి" అన్నాడు పరాశర్ యధాలాపంగా.

 

    మెడికల్ రిప్రేజెంటేటివ్ అనగానే శశికాంత్ కి తేజస్వి గుర్తొచ్చాడు . కార్తిక్ మాటలు గుర్తొచ్చాయి. వంటికి కారం రాచుకున్నట్లయింది. ఒక్కసారిగా తిక్కరేగినట్లయింది.

 

    అందుకని అసహనంగా అన్నాడు. "ఈ ఫండమెంటల్స్ అన్ని నాకు తెలియవనుకుంటున్నారా? ఐనో మై బిజినెస్! అండ్ ఐ నో మై జాబ్! ఐనో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ! మనం ఇవాళ ఇక్కడ సమావేశం అయింది వ్యాపారంలో ఎవరు ఎంత డబ్బు వాటా పెడతారని చర్చించడానికి! అంతే గానీ ఈ కిండర్ గార్డెన్ పాఠాలు చెప్పుకోవడానికి, నర్సరీ రైమ్స్ పాడుకోవడానికి కాదు."

 

    అతను హటాత్తుగా అంత కరుగ్గా మాట్లాడతాడని ఉహించని ఆ బిజినెస్ మెన్ అందరూ తాత్కాలికంగా షాక్ తిని, మాట్లాడకుండా ఉండి పోయారు.

 

    ఉజ్వల చురుగ్గా చూసింది శశికాంత్ వైపు.

 

    తను కంట్రోల్ తప్పి మాట్లాడానని గ్రహించాడు శశికాంత్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం కూడా అతనికి కొత్త కాదు. అందుకు సంకోచం లేదు.

 

    అందుకని చిన్నగా నవ్వాడు శశికాంత్.

 

    "నా ఫ్రెండ్ పరాశర్ ఏమన్నడూ? మెరికల్లాంటి సేల్స్ మెన్ ని రిప్రజెంటేటివ్స్ ని అపాయింట్ చేసుకోవాలని అన్నారు. క్వయిట్ ఏ గుడ్ సజెషన్! తప్పకుండా అలాగే చేద్దాం! పనికిరాని వాళ్ళని పీకి పారేద్దాం. ఒకే?

 

    బై ది భై! సేల్స్ మెన్ అంటే గుర్తొచ్చింది. ఈ జోక్ విన్నారా మీరు?

 

    స్పష్టమైన మాటల్లో తన క్షమార్పణని చెప్పే బదులుగా, ఒక జోక్ చెబుతున్నాడు  శశికాంత్ అని అర్ధమయింది అందరికి. ఆసక్తిగా నటిస్తూ చూశారు.     చెప్పడం మొదలెట్టాడు శశికాంత్.


    "ఊరురూ తిరిగే ఒక సేల్స్ మాన్ ఒక చిన్న ఉరికి వెళ్ళాడు. ఆరాత్రికి ఒక కాల్ గర్ల్ దగ్గరకెళ్ళి మజా చేశాక వంద రూపాయలు ఇవ్వబోయాడు. కానీ డబ్బు తీసుకోలేదు ఆ అమ్మాయి. పైపెచ్చు తనే వెయ్యి రూపాయలు ఎదురు ఇచ్చి "థాంక్స్' అని చెప్పింది.

 

    "వాయబ్బ నేనెంత రసికుడినో!" అని ఉప్పొంగిపోయాడు ఆ సేల్స్ మాన్.

 

    మరుసటి నెల ఆ ఊరెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దగ్గరి కెళ్ళాడు మళ్ళీ!

 

    ఈ సారీ కూడా డబ్బులు తీసుకోలేదు ఆ అమ్మాయి. తనే ఇంకో వెయ్యి రూపాయలు అతనికి ఇచ్చి కృతజ్ఞత తెలిపింది.

 

    తనంతటి రసికాగ్రేసర చక్రవర్తి ఈ ముల్లోకాల్లోనూ ఉండడని రూడి అయిపొయింది సేల్స్ మాన్ కి.

 

    నెక్ట్స్ టైం కులాసాగా ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి తెల్లారేక "నా వెయ్యి రుపాయలేవి ? అన్నాడు దర్జాగా చెయ్యి జాపుతూ.

 

    ఆ చెయ్యి విరిగేలా కొట్టింది ఆ అమ్మాయి. "ఏం వెయ్యి? రాత్రంతా వున్నందుకు నువ్వే వంద రూపాయలు అక్కడ పెట్టు అంది"! గద్దిస్తూ.

 

    బిత్తరపోయాడు సేల్స్ మాన్. "ఇదేమిటి? ఎందుకలా?" అన్నాడు అయోమయంగా.

 

    "ఎందుకంటె , నిన్ను ఈసారి బ్లూ ఫిల్మ్ తియ్యలేదుగా!" అంది ఆ అమ్మాయి చల్లగా.

 

    ఆ జోక్ విని అక్కడ ఉన్న అందరూ విరగబడి నవ్వారు. అందరికన్నా ఎక్కువగా నవ్వింది ఉజ్వల. నవ్వుతున్నప్పుడు ఆమె వక్షం కెరటంలా పొంగుతుంటే , అక్కడున్న పురుషులెవరు చూపులు మరలించుకోలేకపోవడం గమనించాడు శశికాంత్.

 

     ఆ పొంకాలు ఉజ్వలకి పెద్ద అస్సేట్!

 

    ఈ ఉజ్వల తన బిజినెస్ కి మరింత పెద్ద అస్సెట్!

 

    లక్కి బగర్ తను! చాలా లక్కి.

 

    అదే సమయంలో - హొటల్ రూంలో మెత్తటి ఫోంబెడ్ మీద పడుకున్నా కూడా మేకుల పరుపుమీద పడుకున్నట్లు అశాంతిగా అటూ ఇటూ దొర్లుతున్న సౌమ్యకి మాగన్నుగా అపుడే కాస్త కలత నిద్రపట్టింది.

 

    "సాయంత్రం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడి కెళ్ళావ్? ఇంట్లో లేవేం?" అంటూ గదమాయిస్తున్నాడు శశికాంత్.

 

    "అనాధశరణాలాయానికి వెళ్ళాను" అంది సౌమ్య భయంగా.

 

    "అడుక్కుతిన్నట్లే ఉంది! అనాధశరణాలయానికి ఎందుకు!"

 

    "ఆహా! లోపలికి వెళ్ళలేదు! అక్కడిదాకా వెళ్ళి ధైర్యం చాలక తిరిగి వచ్చేశాను."

 

    "ఏమయింది? ఎవరున్నారు అనాధశరణాలయంలో ?" అన్నాడు శశికాంత్ తీవ్రంగా.

 

    ఒక్క గుటక వేసింది సౌమ్య. "చిన్నీ! చిన్నీ వున్నాడు!"

 

    "చిన్నీ ఎవరు?"

 

    "అదిగో! వాడే!" అని చూపించింది.

 

    చూశాడు శశికాంత్.

 

    అక్కడ చిన్నీ నిలబడి ఉన్నాడు.

 

    చిన్నీ పక్కనే ఈసారి ఒక స్త్రీ వుంది.

 

    దీనంగా సౌమ్య వైపు చూస్తూ ప్రాధేయ పూర్వకంగా చెబుతోంది ఏదో.

 

    ఆ ఇమేజెస్ సౌమ్య సబ్ కాన్ షస్ లో మరిన్ని పాత జ్ఞాపకాలను మేలుకొలిపాయి.

 Previous Page Next Page