వాళ్ళ మమ్మీ అతన్ని ఇంగ్లీషులో కోప్పడుతూంది.
"ఇలా అయిపోయారు ఈ కాలం కుర్రాళ్ళు" అంది సరస్వతి ప్రతిమతో.
శివుడి మూడోకన్ను అనగానే లేసర్ బీమ్ గుర్తొచ్చింది ప్రతిమకి.
"మీరు పేపర్స్ చదువుతూనే ఉంటారు కదూ, అత్తయ్యా! లేసర్ బీమ్ గురించి చదివారా?"
"లేసరా?"
"లేసర్ అంటే అదో కాంతికిరణం, అత్తయ్యా! ఒక్క కిరణం ఇనప దూలాలని కూడా వూచకోతగా కోసెయ్యగలదు."
ఆ సుకుమార్ అనే కుర్రాడూ వాళ్ళూ తెలుగువారే. స్పష్టంగా మృదువుగా ఉన్న గొంతుతో ప్రతిమ సైంటిఫిక్ పదం ఒకటి ఉచ్చరించగానే ఆ కుర్రాడు ఇటు తిరిగాడు. వాళ్ళ అమ్మ కూడా వినసాగింది.
"లేసర్ బీమ్ ఇనుప దూలాలని కోసెయ్యగలదు. ఖండాంతర ప్రయాణం చేసి, ఎక్కడో ఉన్న స్థావరాలని భస్మీపటలం చేసెయ్యగలదు. ఆ కిరణం సోకితే మనిషి భస్మం అయిపోవడమే కాదు, అసలు ఆచూకీ లేకుండా అదృశ్యమైపోతాడు. ఈ లేసర్ ఇంకా డెవలప్ చెయ్యడానికీ, మెడిసిన్ లో ఎక్స్-రేని మించిన సాధనంగా వాడుకోవడానికీ అమెరికాలో రీసెర్చి చేస్తున్నారు. ఆ రిసెర్చి ప్రాజెక్టు పేరేమిటో తెలుసునా అత్తయ్యా?"
"ఏమిటమ్మా?"
సుకుమార్ ఆసక్తిగా చూస్తున్నాడు.
"శివా!" అంది ప్రతిమ. "విన్నారా అత్తయ్యా! 'శివా' - అంటే శివుడి మూడో కన్ను లాంటిది - లేసర్ అని భావం!"
"విను!" అన్నట్లు కొడుకు భుజం మీద ఒక్క దెబ్బ వేసింది సుకుమార్ తల్లి. అతను భుజాలు చరిచాడు.
సరస్వతి అందుకుంది!
"అదే మనవాళ్ళు మొత్తుకునేది! ఈ ఇంగ్లీషువాళ్ళు ఇప్పుడు కనిపెడుతున్నవన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిట! దివ్యదృష్టి, దూరశ్రవణం, పుష్పక విమానం..."
"అలా అనేసి వాళ్ళని తక్కువ చెయ్యకూడదత్తయ్యా! ఒకవేళ ఇవన్నీ మన వేదాల్లోనే ఉన్నాయనీ, కనీసం ఇవన్నీ సంభవం అనీ మనవాళ్ళు అప్పట్లోనే వూహించారనీ అనుకున్నా, వూహలని నిజం చేసింది వెస్టర్న్ కంట్రీస్ వారే కదా - ఎక్కువ శాతం!"
"అవునవును!" అంది సరస్వతి.
తరవాత దీర్ఘమైన ఆలోచనలో పడిపోయినట్లు మౌనంగా ఉండిపోయింది. తరవాత నెమ్మదిగా అంది.
"కాశీలో చనిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుందంటారే, ప్రతిమా! నాకింక బతుకు మీద మోజు లేదు. నిశ్చింతగా ప్రాణాలు వదిలేద్దామని ఉంది, కానీ ఒక్క చింత మాత్రం మిగిలిపోయిందే!"
ఆ చింత ఏమిటో ప్రతిమకి తెలుసు!
"నీ కడుపున ఒక్క కాయ కాస్తే..." అని అత్తగారు అనకముందే, "అదిగో! ఆయన వస్తున్నారు" అంది, మాట మారుస్తూ.
దయ్యాన్ని చూసిన వాడిలాగా పాలిపోయిన మొహంతో వస్తున్నాడు శ్రీరాం. కాళ్ళలో శక్తిలేనట్లు వాళ్ళ పక్కన కూలబడిపోయాడు. "ఎలాగ? ఇంకెలాగ?" అంటున్నాడు కలవరిస్తున్నట్లు.
"ఏమైంది?" అంది ప్రతిమ భయపడుతూ.
శ్రీరాం ఏమీ మాట్లాడకుండా తల పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు చాలాసేపు.
"ఏమయిందిరా నాయనా, చెప్పు!" అంది సరస్వతి తల్లడిల్లిపోతూ.
అతను చటుక్కున తలెత్తి, "ఐయామ్ సారీ! నేను మీ ఇద్దరికీ ద్రోహం చేసేశాను!" అన్నాడు నిస్పృహగా.
విహ్వలంగా చూస్తున్నారు ఆడవాళ్ళిద్దరూ.
"మా మేనేజరు ఆ అనిల్ గాడు - బాస్టర్డ్! కొంప ముంచేశాడు."
ప్రతిమా, సరస్వతీ ఇద్దరూ భయోద్వేగంతో చూస్తున్నారు అతన్ని.
"తను సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే, దయతలచి పది లక్షల అప్పుకి సెక్యూరిటీ ఇచ్చానమ్మా! వాడు డబ్బంతా తీసుకెళ్ళి స్మగ్లింగ్ లో పెట్టాడుట! విషయం పోలీసులకి తెలియగానే అయిపు లేకుండా పారిపోయాడుట! మా ఫ్రెండ్స్ ట్రంక్ కాల్ చేసి చెప్పారు. ఎలాగ ఇప్పుడు? పది లక్షలు మనమే కట్టాలి! దానికి తోడు పోలీస్ కేసు!"
సౌందర్యా, అనిల్ కలిసి హఠాత్తుగా ఎందుకు మాయమైపోయారో అర్ధమైంది శ్రీరాంకి ఇప్పుడు! అందరినీ తన మనుషులే అనుకున్నాడు తను! తన వాళ్ళందరూ బాగుపడాలని కోరుకున్నాడు. అందుకే అనిల్ కి సెక్యూరిటీ ఇచ్చాడు. ఇలా అవుతుందని కలలో కూడా వూహించలేదు తను!
కొయ్యబారిపోయి వింటున్న ప్రతిమకి శివుడి మూడో కన్ను గుర్తొచ్చింది. లేసర్ బీమ్ గుర్తొచ్చింది.
అంతటి శక్తి గల దుష్టగ్రహం కూడా ఏదన్నా ఉందేమో! దాని పాడు దృష్టి పడగానే తమ సౌభాగ్యం అంతా భస్మీపటలమై పోయింది క్షణాల్లో!
శ్రీరాం ఆస్తి గంగలో కలిసిపోవడం కాశీలో మొదలైంది.
* * * * *
తన షాపుకి కొంచెం దూరంలో నిలబడి చూస్తున్నాడు శ్రీరాం. షాపు సీలు చేసి ఉంది. కేసు పూర్తయేదాకా తన ఆఫీసూ, షోరూము కూడా పోలీసుల స్వాధీనంలోనే ఉంటాయి.
సెక్యూరిటీ తాలూకు పదిలక్షలు కట్టేశాడు శ్రీరాం, దానికోసం బంగళా తాకట్టు పెట్టేశాడు. ప్రతిమవీ, సరస్వతివీ నగలు అమ్మేశాడు. కారూ, స్కూటరూ అమ్మేశాడు. మారేడ్ పల్లిలో తనకి ఉన్న స్థలం అమ్మేశాడు. కొంచెం ఓపిక పట్టి ఉంటే, మంచి బేరాలకోసం ఆగి ఉంటే, దాదాపు పదిహేను, పదహారు లక్షలు వచ్చి ఉండేవి వాటికి. కానీ టైమ్ లేదు. వారం తిరక్కుండా, పలికిన రేటుకి అన్నిటినీ అమ్మేశాడు అతను. అతి త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి, దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అతని దశ బాగున్నప్పుడు "శ్రీరాం క్షణంలో ఒక నిర్ణయానికొచ్చెయ్యగలడు!" అని మెచ్చుకున్నవారే, అతను బిజినెస్ లో పడిపోవడం మొదలవగానే, "శ్రీరాం తొందరపాటు మనిషి!" అనడం మొదలెట్టారు.
పది లక్షలు కట్టెయ్యడంతో సమస్య తీరిపోలేదు. షాపులో ఉన్న కొన్ని స్టీరియోలు స్మగుల్ డ్ విట! అవి తెచ్చి తన షాపులోనే పెట్టాడు అనిల్! తనకు తెలియకుండా, తన షాపులోనే ఈ స్మగుల్డు గూడ్స్ వ్యాపారం చేశాడన్న మాట ఆ రోగ్!
అందుకని ఇప్పుడూ ఆఫీసూ, షాపూ కూడా సీల్ చేశారు పోలీసులు.