Previous Page Next Page 
జీవనయానం పేజి 38


    బాల్యయవ్వనాల మధ్య గడచిన కాలం
    నేటికి యాదికి వచ్చును ఖమ్మం చూస్తే
    నా ఆశల సౌధానికి నాడూ నేడూ
    ఖమ్మం కళకళలాడే బంగరు గుమ్మం!                            - "దాశరథి."

 

    తల్లివెంట బిడ్డ:

 

    ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు - అమ్మ శోకమూర్తిగా కనిపించింది. అలాగే ఉదయం ఏటికి మంచినీళ్లకు బయలుదేరింది. తోవలో బిందెలో రామంచార్ల మామ కనిపించాడు. నేను వెంట వెళ్లాను.

 

    రామంచార్ల మామ సింగరమ్మత్తయ్య భర్తె - అత్తయ్య ఎంత సుకుమారంగా - అందంగా ఉంటుందో మామయ్య అంత మొరటగా - వికారంగా ఉంటాడు. ముఖం నిండా స్పోటకం మచ్చలు మేము మచ్చల మామ అనే వాళ్లం. అమ్మకు తమ్ముడు అంటే, సాక్షాత్తు కాదు. మా అమ్మకు, నాయనకు ముందు వెనకా ఎవ్వరూ లేరు. రామంచార్ల మామతల్లీ - అమ్మతల్లీ స్వయాన అక్కచెల్లెళ్లు.   

 

    రామంచార్ల మామవెంట సింగరమ్మత్తయ్యను పంపను అన్నది చూడమ్మ అమ్మమ్మ. అందుకని మామయ్య ఇక్కడే ఉంటాడు. ఈ విషయంలో మామయ్య మా నాయనను ఆశ్రయించాడు. మాయల మరాఠీ వెనుక కుక్కలా అత్తయ్య వచ్చేట్లు చేస్తానన్నాడు నాయన. ఏవో మందులు చేసేవారు నాయన. వాటికి అవసరం అయిన పాము కుబుసం - గద్ద గుడ్డు కోసం నేనూ మామయ్య వెంట తిరిగేవాణ్ణి. మందులయినాయి. మంత్రాలయినాయి. కాని మామయ్యను కుక్కను, అత్తయ్యను మరాఠీని చేశాయి.

 

    అత్తయ్య సోయగం అలాంటిది!

 

    ఎవడయినా జీవితకాలం గులామ్ కాగలడు!!

 

    రామంచార్ల మామ రోజూ నీళ్లకు వస్తాడు. రోజూ అక్కాతమ్ములు కలుసుకుంటారు. వారి ముచ్చట్లు తెగవు. ఏట్లో స్నానం చేసి, తూర్పు ముఖం పెట్టి, చెరి గుండి చెంబుడు నీళ్లు తాగుతారు. బిందెలు ఎత్తుకొని బయలుదేర్తారు. అదే అమ్మకు కొంత సాంత్వనం!

 

    ఆ రోజు అలాగే కలిశారు. ఏటి దగ్గర అమ్మ ఎంతో ఏడ్చింది. మామయ్య కూడా ఏడ్చాడు. నేను జలకాలాడలేదు. ఏట్లో మునిగి వచ్చాను. ఇసుకమీద కూర్చున్నాను. ఇద్దరూ బిందెలెత్తుకొని బయలుదేరారు. ఇద్దరూ ముభావంగా ఉన్నారు. మామయ్య వాళ్లఇంటికి విడిపోయా.

 

    అమ్మ రోడ్డుపక్క నుంచుంది. నేను ఆమె పక్కనే ఉన్నాను.

 

    "రంగడూ! నాతోని వస్తవా?" అనడిగింది. నేను 'ఎక్కడికి? ఎందుకు?' అనడగలేదు. "వస్త" నన్నాడు.

 

    ఆ రోజు భోజనాలయినాయి. నాయనా, నాయనమ్మా పడుకున్నారు. అమ్మ చెంబు తీసుకున్నది. నన్ను తీసుకున్నది. తలుపు దగ్గరికి వేసింది. బయలుదేరింది.  

 

    మేము కాలువ గట్టున సాగాం. బారాదరి దగ్గర కాలువ దిగాం. రైలు కట్ట ఎక్కాం. పాపిటపల్లివైపు సాగుతున్నాం.

 

    నేను ఆవు వెంట దూడవలె సాగిపోతున్నాను. పలుకు పలకలేదు.

 

    అమ్మ నెత్తిన దుఃఖపు కుండ ఉంది. ఆమె కూడా పెదవి కదపలేదు.

 

    గమ్యం తెలియక - మౌనంగా - ఎడారిలోంచి వలె సాగిపోతున్నాం.

 

    ఒక పొగబండి - కూత కూసుకుంటూ - మమ్ములను వదిలి - మేము వెళ్లే వైపే వెళ్లిపోయింది.

 

    అమ్మ వెంట నడవడం విసుగనిపించడంలేదు. ఒక మామిడి తోట వచ్చింది. మామిడి నీడన - బండమీద- కూలబడ్డాం.

 

    కాళ్లనొప్పులు తెలుస్తున్నాయి.

 

    "అమ్మా! మనం ఎక్కడికి పోతున్నాం?"

 

    "గూడూరు" అని కన్నీరు గుమ్మరించింది.

 

    అడిగినందుకు బాధ - తామరల గూడూరు వెళ్తున్నందుకు ఆనందం - నాలో ముసురుకున్నాయి.

 

    అమ్మ చెంబులో పిండి, బెల్లం తెచ్చింది. నాకు పెట్టింది. అమ్మ తినలేదు. దిగుడు బావిలో నీళ్లు త్రాగాం. మళ్లీ నడవసాగించాం. సాయంకాలానికి పాపిటపల్లి స్టేషను చేరుకున్నాం. చీకట్లు ముసురుతున్నాయి. పడుకున్నాం.

 

    చిమ్నీ వెలుగులో స్టేషను మాస్టరు మమ్ములను చూశాడు. ఏదో అడిగాడు అమ్మ ఏదో చెప్పింది. 'రాత్రిళ్లు పెద్దపులి తిరుగుతున్నది'అని వాళ్ల ఇంటికి తీసికెళ్లాడు. ఆ రాత్రి మంచినీళ్లు త్రాగి పడుకున్నాం.

 

    తెల్లవారి పాపిటపల్లి ఊళ్లోకి వెళ్లాం. అమ్మ తనచేతి బంగారు గాజు అమ్మ జూపింది. ఒక దుకాణం వాడు దయతలచాడు. ఎంతో కొంతడబ్బు - గాజు తన వద్ద ఉంచుకొని - ఇచ్చాడు. స్టేషనుకు వచ్చి రైలెక్కాం. మానుకోట - మహబూబాబాదులో దిగాం. దేవాలయం ముందటి భాగవతుల సీతమ్మగారింటికి వెళ్లాం. వాళ్లు మాకు బంధువులు. ఆమె అమ్మను ఓదార్చింది. స్నానాలు భోజనాలు అయినాయి. పడుకొని నిద్రపోయాం.

 

    సాయంత్రం ఒక కంసాలి వచ్చాడు. మా అమ్మ మరొక గాజు కొన్నాడు. రూపాయీలు బండమీద మోగించి ఇచ్చాడు. అప్పటికి కరెన్సీ నోట్ల వాడకం విరివిగా లేదు.

 

    తెల్లవారి డబ్బు మూట కట్టి నా రొంటికి కట్టారు.

 

    నేను రైలు ఎక్కాను. పాపిటపల్లిలో ఆగాను. స్టేషను మాస్టర్ను కలిశాను. జరిగిన వృత్తాంతం వివరించాను. పాపిటపల్లి ఊళ్లో ఆ దుకాణానికి వెళ్లాను. రొంటి డబ్బు విప్పి ఇచ్చాను. అతడు గోటితో ఎగరేసి చూసుకొని, రూపాయీలు లెక్కించుకున్నాడు. తీసుకున్నాడు. తన దగ్గరిగాజు నాచేతికి తొడిగాడు. అది దండకడియం అయింది. దాని మీదినుంచి బట్టకట్టాడు. షర్టు వేసుకుంటే ఎవరికీ కనిపించదు. నేను స్టేషనుకు వచ్చాను. స్టేషను మాస్టరు కత్తిరించిన సగం టిక్కెట్టు ఇచ్చి రైలెక్కించాడు. మానుకోటలో దిగి, సీతమ్మగారి ఇంటికి వెళ్లాను. గాజు తీసి ఇచ్చాను.  

 

    సీతమ్మగారు కంచంలో చద్దన్నం, గోంగూర, పేరిన్నెయ్యి కలిపి ముద్దలు చేశారు. కంచం చుట్టూ వాళ్ల పిల్లలతోపాటు నేనూ కూర్చున్నాను. తన కొడుకులతోపాటు నాకూ ముద్దలు పెట్టింది. అది అమృతం! నేను వద్దంటుంటే చివరి ముద్ద, నా తలపట్టుకొని నోట్లో కుక్కింది. ఆ అనుభూతికి అక్షరాల్లేవు - అలాంటి తల్లులూ లేరు.

 

    చిమ్మ చీకటిలో సైతం ఎక్కడో వెలుగురవ్వ మిణుకు మిణుకుమంటుంది.

 

    అక్కణ్ణుంచి కచ్చడం - సవారిబండిలో - అడవి బాట దాటి చిన్న గూడూరు అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాం. బండి దిగగానే, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఒకరి మీద ఒకరు పడి ఏడుపులు - అమ్మలక్కలు కూడడం - ముక్కున వేలేసుకోవడం జరుగుతున్నాయి.

 

    నేను ఛెంగున గంతేసి, చింతలకింది నర్సిగాణ్ణి తీసుకొని, కాలువ నీటిలో కాళ్లు లాక్కుంటూ, ముత్యాలమ్మ కుంట కట్ట ఎక్కాను. తామరలు చెరువు నిండా పూసి ఉన్నాయి! నీరు కనిపించడం లేదు. ఆకుల మీది నీటి బొట్లు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వికసించిన తామరలమీద నల్లని తుమ్మెదలు తిరుగుతున్నాయి.

 

    ప్రకృతిలోని అందాలన్నీ ఆ చెరువులోనే గూడు కట్టుకున్నట్లుంది.

 

    చెరువుకట్టకింద నాగజముళ్లు పడగెత్తాయి. వాటికి ఆవల పచ్చని పొలాలు. వాటి మధ్య మామిడితోట - దానిమీద ఎగిరే చిలకలూ, గొరవంకలు!

 

    ప్రకృతి పరవశించింది.

 

    వనమూ ప్రకృతిలోని అంతర్భాగమే!

 

    నా మనసు పరవశించింది.

 

    నేను ఒడలు ఎరుగను!

 

    ఇంటికి చేరుకుంటే ఎర్రమంటి అలుకునేల, గాలికి కదలాడే ఆముదపు దీపాలు, బావి పక్కన మల్లెపందిరి, పెరట్లో మొక్కజొన్న చేను - ఖమ్మం చెరనుంచి గూటికి చేరుకున్నట్లుంది!

 

    అమ్మ సహితం మంచి విడిన మొగ్గలా కాస్త తెప్పరిల్లింది.

 

    తాతయ్య, అమ్మమ్మ మాత్రం భయం - భయంగా ఉన్నారు. "నెత్తిమీదికి ఏం తెస్తడో మహానుభావుడు!" అని క్రుంగిపోతుండేవారు.

 

    బాల్యం లేడి పరుగులాంటిది. లేడికి భయం అవుతే క్షణం నిలుస్తుంది. అటూ ఇటూ చూస్తుంది. మళ్లీ ఛెంగు ఛెంగున ఎగురుతూ సాగిపోతుంది.

 

    అమ్మ దుఃఖభారంతో నా బాల్యం క్షణం నిలిచింది. అమ్మమ్మగారింట అది గంతులు వేసింది. మా అమ్మమ్మ సీతమ్మగారు అమ్మను కన్న తల్లికాదు. అమ్మ పురిట్లోనే అమ్మమ్మ గతించింది. తాతయ్యకు రెండో భార్య. కాని, మాకు మొదటి అమ్మమ్మె.           

 Previous Page Next Page