సీతమ్మగారిది పసిడి ఛాయ. ఆమె ముఖాన పసుపు కాపురం ఉండేది. సూర్యుడు పొడిచినంత కుంకుమ బొట్టు, పెద్దది రాళ్లముక్కెర, చెవులకు ఎర్రరాళ్ల దిద్దులు, మెడ నిండా నగలు, పాలపిట్టరంగు నేత చీర, నడుముకు వడ్డాణం, కాళ్లకు అరకిలో కడియాలు, పావుకిలో మట్టెలు - లక్ష్మీదేవి తామరపూవు దిగి వచ్చినట్లుంటుంది. ఆమె పెరట్లో నడుస్తే - మట్టెల చప్పుడు - వాకిట్లోకి వినవచ్చేది.
సీతమ్మగారికి సంతానం లేదు. అమ్మమ్మ మేమంటే ప్రాణాలు ఇచ్చేస్తుంది. నాయన వాళ్ల ఇంటికి పోనిచ్చేవాడు కాదు. ఇప్పుడా ఇబ్బంది లేదు. వాళ్లింట్లోనే వాలిపోయాన్నేను. ఇప్పుడు ఇక్కడ నేను మహారాజును. తాతయ్య, అమ్మమ్మ నాకు సేవకులు. ఏది కావాల్నంటే అది వచ్చేది. అయినా అడగడానికేముంది? బొంగరం అడిగాను. తాతయ్య వడ్లవాడి ఇంట్లో కూర్చొని చేయించి ఇచ్చాడు.
అమ్మమ్మ ఇంట్లో దొంతుల గది నిండా చిరుతిండ్లే. ఒక కుండలో అటుకులు, ఒకదానిలో సత్తుపిండి, ఒకదానిలో ఏపుడు బియ్యం. అరిశెలు, జంతికలు, చక్కిలాలు, చేగోడీలు - ఏది అడుగుతే అది తక్షణం హాజర్.
పెరట్లో మొక్కజొన్న కంకులు విరిచి, బొగ్గుల నిప్పులమీద కాల్చి, పచ్చిమిరపకారంలో వెన్న కలిపి, మొక్కజొన్న పొట్టలో పెట్టి ఇచ్చేవారు. ఒక్కొక్కసారి అమ్మ వలిచి చేతులో పోసేది. గింజలు నోట్లో పోసుకుని, వెన్న కలిపిన పచ్చిమిరప కారంతో నముల్తుంటే చందమామ మీద - పొన్న చెట్టుకింద ఆడుకున్నంత ఆనందం.
ఈ మొక్కజొన్న కంకులు తినడాన్ని నా నవల "చిల్లర దేవుళ్లు"లో చేర్చాను. ఆ నవలకు వ్రాసిన పీఠికలో దేవులపల్లి రామానుజరావుగారు మొక్కజొన్న కంకులను వదలలేకపోయారు. "తెలంగాణాలో మొక్కజొన్న కంకులను కాల్చి, వెన్న, మీగడ మరియాలతో కలిపి తినిన రుచి..... చక్కగా వర్ణించి పాఠకుని మనస్సునకు హాయిని కూర్చినారు" అని వ్రాసినారు.
నర్సిగాడు, నేను ఒక పథకం వేశాం. తాతయ్య ఖాతా ఉన్న కిరాణం దుకాణంలో నేను రెండు కుచ్చాల పైసలు తెచ్చాను. వాటిని చింతచెట్టు కింద పాతిపెట్టాం. కుచ్చం అంటే నాలుగు పైసలు. అవి చెట్లు మొలుస్తాయనుకున్నాం. వాటికి పైసలు కాస్తే మనకేం తక్కువ ఉండదు. దానికి రోజూ నీళ్లు పోస్తున్నాం.
కిరాణం దుకాణం అతను మా తాతయ్యతో చెప్పాడు, నేను పైసలు తెచ్చానని. తాతయ్య నన్ను అడిగారు. చెప్పాను. పాతిపెట్టానని - పైసలు కాస్తాయని తాతయ్య నన్నేమీ అనలేదు. నర్సిగాణ్ణి పిలిపించి కోప్పడ్డారు. వాడు తనకేమీ తెలియదన్నాడు. అందరూ చింతకింద తవ్వి చూశారు. ఏమీలేదు పోలీస్ పటేల్ నర్సిగాని తండ్రి రామదాసును బెదిరించాడు. రామదాసు రెండు కుచ్చాలు తెచ్చి తాతయ్యకు ఇచ్చాడు. కాళ్లు పట్టుకున్నాడు!
ఎనిమిది పైసలంటే ఆనాడు పెద్ద మొత్తమే! పైన కనిపించడం కష్టం! సుమారు వినిమయం పద్ధతే.
ఆనాటి మా తాతయ్య, అమ్మమ్మల నిశ్చింతమూ, నిరామయము, ఆరోగ్యకరము, ఆత్మీయము అయిన జీవితాన్ని తలచుకుంటే అది అందని ఆకాశంలా, దొరకని ఇంద్రధనుస్సులా, చేరరాని తారాపథకంలా అనిపిస్తుంది!
తాతయ్య , అమ్మమ్మా కోడి కూతతో మేల్కొనేవారు. అంటే, కోడి కూతను వినిలేస్తారని కాదు. వారు లేవడం, కోడి కూయడం ఒకేసారి జరుగుతాయి.
అమ్మమ్మ ఇంటిపనిలో మునిగిపోతుంది. వంటిల్లు అలకడం, అంట్లుతోమడం వగైరా పనులు ముగించేవరకు తెల్లవారుతుంది. అప్పుడు బిందె, చెంబు తీసుకొని చెరువుకు చేరుతుంది. పసుపు కొమ్ము రాతిమీద అరగదీసి ముఖానికి రాసుకుంటుంది. స్నానం చేస్తుంది. బిందె, బిందెమీద చెంబుతో నీళ్లు తలకు ఎత్తుకుంటుంది. సాధారణులం వట్టి బిందె మోయడం కష్టం. తలమీద బరువు, మట్టెల చప్పుడుతో చెరువునుంచి ఇంటికి బయలుదేరుతుంది.
తాతయ్య భుజాన కండువా - చేతులో కర్రతో మసక చీకట్లో, మందానిలంలో బయల్దేరుతారు. వేపచెట్టు దగ్గర ఎవరయినా కనిపిస్తే పుల్ల విరిచి ఇస్తారు. కాకుంటే అంతవయసులో వారే చెట్టు ఎక్కుతారు. పుల్లను నములుతూ, పళ్లు తోముతూ సాగుతారు. ఎక్కడో మోట బావి దగ్గర ఆగుతారు. తోటవాణ్ణి పిలుస్తారు. ప్రశాంత వాతావరణంలో పదాలు పాడుతూ మోటకడ్తున్న తోటవాడు మోట ఆపి వస్తాడు. అక్కడ కాసిన కూరగాయ ఎదో ఒకటి తాతయ్యకు ఇస్తాడు. తాతయ్య కండువాలో మూట కట్టుకుంటారు. సాగిపోతారు.
తాతయ్య ఏటికి - ఆకేటికి చేరుకుంటారు. బహిర్భూమి ముగించుకుంటారు. మోదుగు ఆకులు తెంపుతారు. ఆకులూ, కూరగాయలు ఇసుకమీద పెడ్తారు. వారు కండువా కట్టుకుంటారు. ధోవతి పిండి ఇసుకమీద ఆరవేస్తారు. నదిలో స్నానం చేసి బయటికి వస్తారు. ధోవతి ధరిస్తారు. కండువాలో ఒక కొనకు కూరలు, మరొక కొనకు ఆకులు కట్టుకుంటారు. భుజాన వేసుకుని ఇంటికి బయల్దేర్తారు.
విచిత్రం ఏమంటే తాతయ్య, అమ్మమ్మ కచ్చితంగా - నిర్దిష్టంగా - ఒకేసారి ఇంటిముందుకు చేరుకుంటారు. గడియారమే ఎరుగని వారు అంత సమయపాలన ఎలా చేస్తారో ఆశ్చర్యం!
ఇంటికి చేరుకుని తాతయ్య - అమ్మమ్మ తలమీద నుంచి బిందె దించడానికి సాయపడ్తారు. తెచ్చిన కూరగాయల పాక విధానాన్ని గురించి చర్చించుకుంటారు. తాతయ్య కూరగాయలు తరుగుతుండగా అమ్మమ్మ పొయ్యిలో నిప్పువేస్తుంది. వంట ప్రారంభం అవుతుంది.
తాతయ్య తిరుమన్కాపు తిరువారాధన ముగించుకొని, అనుసంధానం కొనసాగిస్తూ మోదుగు ఆకుల పచ్చని విస్తళ్లు - జనసంఖ్యను బట్టి కుడ్తారు. అంతలో వంట సిద్ధం అవుతుంది. ఆరగింపు జరుగుతుంది. ఉన్న బంధువులతో భోజనం.
పీటల ముందు ఆకుపచ్చని విస్తరి. అందులో తెల్లని అన్నం. పసుపుపచ్చని పప్పు, ఎర్రని ఊరగాయ - వర్ణ చిత్రంలా ఉంటుంది. ఘుమ ఘుమలాడే నూకల నేయి, ఎర్రని మీగడ పెరుగు సుష్ఠుగా భుజిస్తారు.
భోజనం తరువాత తాంబూలం - పగటినిద్ర. నిద్రలేచి చేయవలసిన ఫలహారపు చర్చ. ఫలహారం - ఉపాహారం ముగింపు, సూర్యాస్తమయం ఒకేసారి.
తరువాత తాతయ్య ఇంటి ముందరి అరుగుమీద చేర్తారు. ఊళ్లో పెద్దలు ఒక్కొక్కరూ కూడ్తారు.
తాతయ్య ముచ్చటగా ప్రారంభించే రామాయణ - భారత భాగవతాల్లోంచి ఉపన్యాసం ప్రారంభిస్తారు. చీకటి పడుతుంది. దీపాలు పెడ్తారు. వారు అనర్గళంగా సాగిపోతారు. చీమ చిటుక్కుమనదు. దొరవారు వచ్చినా చెప్పులు విప్పి, తలపాగా తీసి కూర్చుంటారే కాని, ఆటంకం కలిగించరు. గంటలు గడిచిపోతాయి. చివరకు నిత్యకృత్యపు ముచ్చట్లలోకి వచ్చి ముగిస్తారు.
ముగించి ఇంట్లోకి వచ్చి స్నానం చేసి, తిరువారాధన చేసి, సాపాట్లు చేస్తారు. పడుకుంటారు. పడుకొని మాట్లాడే విషయాలేమంటే, పచ్చడికి ఏ చెట్టు చింతకాయ మంచిది? నిమ్మకాయలు, మిరపపండ్లు వగైరా ఎక్కణ్ణుంచి తెప్పించాలి?
అలా వారి జీవితాలు గడిచిపోయాయి. ఆ జీవన విధానంలో అవసరం అయినంత పరిశ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, మనసును వికసింపచేసే వాతావరణం - అన్నిటినీ మించి తృప్తి, ఆత్మోసజీవనానికి పుణ్య కథాశ్రవణం - అన్నింటినీ తలతన్నిన శాంతి సమకూరి ఉన్నాయి.
మనం ఈనాడు భౌతికంగా ఎంతో, ఎంతో ముందడుగు వేశాం. చంద్ర, గ్రహ నక్షత్రాలను జయించాం. ఈ యంత్ర నాగరకత మనిషిని మనసులేని యంత్రాన్ని చేసింది. మనసు పోగొట్టుకున్న మనిషి వంటరి వాడయి కొట్టుమిట్టాడుతున్నాడు. దురాశ మనిషిని మింగుతున్నది. ఈ దురాశ పంచ భూతాలను కలుషితం చేస్తున్నది. మానవ జాతి సాయం వినాశం వైపు పరుగులు తీస్తున్నది.
ఇది భస్మాసుర హస్తం.
ఎన్నడో భస్మం చేయకమానదు!
ఈ విషయం పాశ్చాత్యులు గ్రహించ నారంభించారు. "పల్లెలుకు మళ్లుదాం" అనే నినాదం అక్కడ ప్రారంభం అయింది. మనం, మన రానున్న తరాలు - బతికి బట్ట కట్టాలంటే పల్లెలకు తరలక తప్పదు. ఇది హెచ్చరిక మాత్రం కాదు. ఒక సజీవ సత్యం.
ఒకనాడు - ఖమ్మంనుంచి గోవర్ధనం నరసింహాచార్యులవారు దిగారు. మా తాతయ్య, అమ్మమ్మతో ఏదేదో మాట్లాడారు. అమ్మ కంటికి కడివెడుగా విలపించింది. ఆడదాని పరాధీనత అంతుపట్టదు! కన్నవారికే బరువవుతుంది! ఊరికే భారం అవుతుంది!
జనకుడు సీతను ఛాయేవానుగతా తన - నీ నీడవలె అనుసరిస్తుంది. అని అప్పగించాడు. సీతమ్మ ఎన్ని కష్టాలు పడ్డది! జనకుడు మళ్లీ కనిపించడు!!
ద్రుపదుడు ద్రౌపదిని పంచ పాండవులకు అప్పగించారు. ఆమెకు జరిగినన్ని అవమానాలు మరే మహిళకూ జరిగి ఉండవు. ఆమెను ఆదుకొనేందుకు ద్రుపదుడు కనిపించడు. కుంతీ అంతే!
అమ్మను ఖమ్మం పంపించడానికి ఏర్పాట్లు జరిగాయి. గూడూరు - ఆకేరు - తామరల కుంట - జోడు చింతలు - నర్సిగాడు వీరిని వదిలిపోవడం నాకు బాధగానూ - అయిష్టంగానూ ఉంది.