ఆనాడు యువ సంవత్సర వైశాఖ అమావాస్య.
భద్రాచలంలో శ్రీరామచంద్రుని సాన్నిధ్యంలో అవతరించిన దాశరథి లక్ష్మణాచార్యులవారు నృసింహ సన్నిధిలో ఖమ్మంమెట్టులో తనువు చాలించారు. గోదావరీ తీరాన జన్మించిన తాతయ్య పాంచభౌతికం మునేటి ఒడ్డున అగ్నికి ఆహుతి అయింది.
మా నాయన కర్మకాండ చాల అట్టహాసంగా చేశారు.
చాలామంది వచ్చారు. వడ్లకుంట సాయెబు కనిపించలేదు!
దురాశలు:
ఆశ - దురాశ - నిరాశల మధ్యదే జీవితం. జీవిత వృక్షానికి ఆశ చివురు లాంటిది. చివురు వేయని చెట్టు, ఆశలేని జీవితం నిలవడం దుర్లభం. చివరి శ్వాసవరకూ ఆశ వదలడు నరుడు!
దురాశ, నిరాశ జీవిత వృక్షానికి చెదలు లాంటిది. అవి జీవితాన్ని క్రుంగదీయడానికి పనికివస్తాయి.
గూడూరులో దురాశలకు అవకాశం తక్కువ. ఖమ్మంలో ఎక్కువ. మా నాయనకు ఉన్న శిష్యుల్లో అధికభాగం వర్తకులు - సంపన్నులు. వారిని చూచి తానూ సంపన్నుడు కావాలనే దురాశ మా నాయనలో ప్రవేశించింది.
మా నాయన - అన్నయ్య కలిసి ఒక పథకం తయారుచేశారు.
నిజాం రాజ్యం సర్వతంత్ర స్వతంత్రం. కాబట్టి రాజ్యం బయటినుంచి వచ్చే సరుకులమీద సుంకం విధిస్తారు. దాన్ని ఆంగ్లంలో కస్టమ్స్ అంటారు. ఉర్దూలో కరోడ్గిరి అంటారు. నిజాం ప్రభుత్వంలో కరోడ్గిరి ఒక శాఖ. ప్రతి రైల్వే స్టేషను దగ్గర కరోడ్గిరి భవనం ఉండేది. ఆ భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిల్లో వేరే కార్యాలయాలున్నాయి.
రైలు దిగిన ప్రయాణీకు లందరినీ - కరోడ్గిరీ వారు - వారి సామానులు చూస్తారు. కొత్త వస్తువులకు కరోడ్గిరి సుంకం వసూలు చేస్తారు. ఈ విషయం నా నవల 'మోదుగుపూలు' లో ప్రస్తావించాను.
బెజవాడ నుంచి వెండి తెచ్చి, కరోడ్గిరి చెల్లించకుండా అమ్మడం చేస్తే లాభాలు ఆర్జించవచ్చునని మా నాయన పథకం. మా నాయన వెండి మూట బెజవాడనుంచి తెస్తాడు. వంటి రెక్క దగ్గర మా అన్నయ్య నుంచుంటాడు. మా నాయన పడేసిన మూటను మా అన్నయ్య అందుకుని ఇంటికి తెస్తాడు. ఆ విధంగా కరోడ్గిరి తప్పించి, వెండి తెచ్చారు. దాన్ని అమ్మడానికి వెళ్తే, కరోడ్గిరీ చీటీ కావాలన్నారు. అది లేకుంటే దొంగసొమ్ము అవుతుంది. పోలీసులకు పట్టించాల్సి వస్తుంది అన్నారు. వెండి బెజవాడ తీసికెళ్తే తక్కువధరకు అమ్ముడయింది. లాభానికి పోతే నష్టం ఎదురయింది.
"స్వధర్మే నిధనంశ్రేయః" అనే గీతావాక్యం మీద మా నాయన అనర్గళంగా ఉపన్యసించగలరు. వారే భయావహమైన పరధర్మం అవలంబించి భంగపడ్డారు.
అనుభవపూర్వకంగా తెలుసుకున్నదేమంటే, వృత్తిరీత్యా వేదాంతం - వైరాగ్యం - బోధించేవారికి ఉన్నంత దురాశ, తామసం సామాన్యులకు ఉండవు. 'ధనం సకల దుర్గుణాలకు తావరం. అది మీవద్ద ఉండరాదు. మాకు సమర్పించండి' అనేది వారి దివ్యబోధ!
కన్నీటి కత:
మా నాయన నిత్యం కాలక్షేపం సాయించేవారు. వారి శిష్యుల్లో స్త్రీలు - విధవలు బాల విధవలు కూడా ఉండేవారు. ఒక రిద్దరు విధవ యువతులు నిరంతరం గురువుగారికి సేవ చేయడానికి ఇంట్లో ఉండేవారు. వారు మా నాయనకు తలంట్లు స్నానాలు, బట్టలు ఉతకడం, కాళ్లు పిసకడంలాంటి సేవలు చేస్తుండేవారు.
మా అమ్మ ఏటిలో మునిగి, తడి చీరతో మంచినీళ్లు తెచ్చి వంటింట్లో దూరిందంటే ఏ మధ్యాహ్నమో బయటికి వచ్చేది. విధవ శిష్యురాండ్ల వ్యవహారం అమ్మ సహించేది కాదు. వాళ్లను అమ్మ వారించినా వినేవారుకారు. వెళ్లగొట్టినా పోయేవారు కాదు. "మా గురువు తండ్రితో సమానం" అనేవారు. ఆ మాట వినగానే అమ్మ మండిపోయేది. చెంబు, తప్పేల నేలక్కొట్టేది. మా నాయన మండి పడేవాడు. అమ్మమీద చేయి చేసుకునేవాడు. అమ్మ ఏడిచేది. ఏం చేయగలదు? శాపనార్థాలు పెట్టేది.
అమ్మ శాపాలకు భయపడి శిష్యురాండ్రు స్థిరనివాసం మానుకున్నారు. అమ్మ అనుమానం అంతటితో తీరలేదు. వాళ్లు గురువుగారికి అత్తరు, పన్నీరు, వాసన నూనెలు అందిస్తున్నారని ఆరోపణ. వాళ్లు వచ్చినపుడల్లా మన్నులు - దుమ్ములు పోసేది. నాయన అమ్మను చావబాదేవాడు. "నన్ను చంపి వాళ్లతో ఊరేగాలని చూస్తున్నారు" అని మరిన్ని తన్నులు తినేది.
మా నాయనమ్మ ఇదంతా నాటకంగా చూస్తుండేది. ఇప్పుడైనా మా అమ్మనే అనేదికాని, కొడుకు మీద ఈగ వాలనీయకపోయేది. మా అమ్మకు అదొక బాధ! కొడుక్కు చెప్పకూడదా అనేది - అత్తగారితో అమ్మ. నాయన లేనపుడు అత్తమీద కేకలు వేసేది. నాయనమ్మ అన్నీ వింటుంది. మాట్లాడదు.
"వాడు అన్నీ తెలిసినవాడు, నేనేం చెప్పుత?"
"అన్నీ తెలిసినవాడయితే ఇట్లనేనా చేసేది?'ట అమ్మ రెచ్చిపోతుంది. నాయనమ్మ నల్లమందు వేసుకుంటుంది. మళ్లీ మాట్లాడదు.
ఈ విధంగా ఇల్లు నిత్యం రణరంగం అయింది.
అలా ఉండగా ఒకనాడు నాయన - అమ్మ పుండు మీద కారం చల్లాడు.
ఇంట్లో సామానుల - సరుకుల గది తాళం వేశాడు. తాళం చెవి మొలత్రాటికి కట్టుకున్నాడు. ఆపూట వంటకు కావలసిన బియ్యం, ఉప్పు, పప్పుల్లాంటివి కొలిచి ఇచ్చాడు. అమ్మ ఓపిగ్గా తీసుకున్నది. కాని క్రుంగిపోసాగింది.
బంధువుల రాకపోకలు మామూలు. ఒకనాటి పగలు మేమిద్దరం స్కూలు నుంచి వచ్చాం. అన్నం అయిపోయింది. లేదు. అమ్మ సొమ్ములను పట్టుకొని ఏడ్చింది.
"పిల్లలకు కడుపునిండ పెట్టుకునే సొహంత్రం లేకుండయింది. నా ఇంట్లనే నేను వంటమనిషిని అయిన. నా ఇంట్లనే నేను దొంగనయిన" అని గోడు గోడున ఏడ్చింది.
నాయన ఇంట్లో లేడు. రణరంగం మొదలు కాలేదు. అన్నం లేకున్నా - అన్నయ్యా నేనూ అందుకు సంతోషించాం. వట్టి డొక్కలతోనే మదర్సకు వెళ్లాం - ఇత్తడి చెంబుతో నీళ్లు త్రాగి!
ఇలా ఎప్పుడూ రగులుతూనే ఉండేది. ఒకప్పుడు పొగ! ఒకప్పుడు నిప్పురవ్వలు! - ఒకప్పుడు సెగమంటలు! మంటలు! దవానలం! కుటుంబాన్ని కుంగదీస్తున్నది.
బాల్యం బాధల బరువులకు కృంగదీస్తున్నది. అయినా, ఊడల మర్రిమీద "కోతికొమ్మంచి" ఆడాం. కొత్తగా పెట్టిన పెట్రోమాక్సు వీధిలైటు కింద ఉప్పు చెరలాడాం. బలిగుడు ఆడాం.
ఖమ్మంలో చిమ్నీలైట్ల బదులు ప్రధాన వీధుల్లో పెట్రోమాక్సులు ఏర్పరచారు. ఒక గడకు లైట్లు తగిలించుకుని వస్తాడు. వెలుగు మనిషి. వెలుగులు తెస్తున్న మనిషిని చూస్తే విచిత్రం అనిపించేది. చిమ్నీలు అందంగా ఉండేవి. పెట్రోమాక్సులు విచిత్రంగా ఉండేవి! వెలుగుమనిషి తీగ కొక్కేనికి లైటు తగిలిస్తాడు. తీగను లాగుతుంటే పైకి వెళ్లిపోతుంది. లైటు పెట్టిన తొలిరోజు మా సంబరానికి అవధుల్లేవు. తెల్లవార్లూ ఆడాం.
గుడి వెనుక ఏటి కాలువలో మునగడం - నీళ్లతో కొట్టుకోవడం - నీళ్లలోంచి ఉరికి, తుడుచుకోకుండా కట్ట ఎక్కడం - ఎండకే నీరు ఎండిపోవడం. అదొక పండుగ!
కాలువ ప్రక్కనున్న మామిడి చెట్లు ఎక్కడం - పసి కాయలు తెంపడం - పారేయడం - ఎగిరే చిలకలతో ఆట - అదొక సంబరం!
గుంపుగా బయల్దేరడం - పొలాల్లోంచి సాగడం - పచ్చి పెసరకాయలు, పచ్చివేరు శెనగలు ఏరుకొని తినడం - మునేటి లింగం మడుగులో మునగడం - తేలడం - జలకాలాటలు - ఇసుక మీద బట్టలు ఆరేసుకోవడం - అది అక్షరానికి అందని అనుభూతి!
1991లో బాల్య మిత్రుడు కృష్ణారావు - కలకాలం తరువాత - నన్ను కలుసుకోవడానికి ప్రత్యేకంగా సికిందరాబాదు వచ్చాడు. కలిసి ఖమ్మం వెళ్లాం. లింగం మడుగు లేదు. నా మనువుల సహితంగా వంతెన కాలువ దగ్గరికి వెళ్లాం. బాల్యం నాటకం ఆడాలనుకున్నాం. కాని, ఆ సత్తువ లేదు. ఏట్లోకి దిగాం. మునిగాం. కాని ఉరుకులు పరుగులు చేత కాలేదు. బయటికి వచ్చాం.
చిలకలు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి.
కొమ్మ కొసలకు గిజిగాని గూళ్లు వ్రేలాడుతున్నాయి.
"రంగన్నా! మనకేమైంది? ఎంతలో ఓడిపోయాం!" ఖిన్నవదనుడై అడిగాడు కృష్ణారావు.
"కృష్ణా! వయసు బరువుకు వంగిపోయాం. ఓడిపోవడమే - ఇంక గెలవలేం!" అన్నాను.
నా మనుమరాలు సహజ - మనుమడు సమీర్ నదిలో మునిగి కేరింతలు కొడుతున్నారు.
చిలకలు పలుకుతున్నాయి!
మునేరు గలగలా పారిపోతున్నది.