Previous Page Next Page 
సృష్టి పేజి 38


    ఆమె పరిస్థితి కూడా అలాగే వుంది.

 

    చటుక్కున రైల్లోని సంఘటన గుర్తుకొచ్చింది.

 

    తన కిష్టమైన పెయింటింగ్ కి  పరోక్షంగా అద్భుతమైన ప్రేరణ  ఇచ్చిన ఈమె..... ఈమె.....

 

    గబుక్కున  లేచి  నిలబడ్డాడు అభినవ్.

 

    "ప్లీజ్ ప్లీజ్...... కమిన్...... ఇప్పుడే కావ్యకు ఫోన్ చేశాను. మిమ్మల్ని పంపుతున్నట్లుగా చెప్పింది. నా పేరు అభినవ్" కంగారును అణచుకుంటూ ఆహ్వానించాడతను.

 

    జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం వూహించలేం.

 

    చాలా విరుద్దమైన సంఘటనలు నల్ల బోర్డు మీద  చాక్ పీసుతో గీసిన  రెండు గీతల్లాంటి సంఘటనలు.

 

    "నా పేరు  లిపి. పేపర్లో యాడ్ ని చూసి కావ్యగారిని కలిశాను" లోనికి అడుగేస్తూ చెప్పింది లిపి.

 

    "అవును. అవునవును. తెలుసు. ప్లీజ్ బీ  సీటెడ్" తనో కుర్చీలో కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ అన్నాడు అభినవ్.

 

    లిపి కూర్చుని కన్పిస్తున్న గోడల వైపు చూసింది. వరసగా వేలాడదీసిన పెయింటింగ్స్.

 

    ఒక పక్క  ఈజిల్. ఆ పక్కన కలర్  బాటిల్స్....... కలర్  ట్యూబ్స్. ఒక  ప్లాస్టిక్ డబ్బాలో కుంచెలు.

 

    అభినవ్ కి మాటలు దొరకడం  లేదు. వెతుక్కుంటున్నాడు. అక్షరాలు మరిచిపోయిన వాడిలా వున్నాడు.

 

    మనసులో ఏదో సంతోషం. నిశ్శబ్దంగా ఉన్న కొండల మధ్య ఏటీ  పక్కన పచ్చికలో పడుకొని ఆకాశం వైపు చూస్తున్నప్పటి ఏకాంతపు సంతోషం.    

 

    నీటిలో తేలుతున్న గులకరాళ్ళని చూస్తున్నప్పటి సంతోషం గులకరాళ్ళని ముక్కుతో పొడిచి, పావురాలు రెక్కలు విదిల్చినప్పటి సంతోషం.

 

    రెండు రంగుల్ని కలిపి ఆ రంగుల్లోంచి మూడో  రంగు  పుట్టినప్పుడు మెరుపు కళ్ళు మందస్మితం చేసినప్పటి సంతోషం.

 

    "మీరు నాకు తెలుసు" అన్నాడు  అభినవ్ రైలు సంఘటనని దృష్టిలో వుంచుకుని.

 

    "మీరూ నాకు తెలుసు" మెల్లిగా నవ్వుతూ అంది లిపి.

 

    నందిని గురించి చెప్పాడు అభినవ్.

 

    తన చదువు, అనుభవం గురించి చెప్పింది లిపి.

 

    "నాకున్నది మా చెల్లెలు నందిని మాత్రమే. అమ్మా, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇలాంటి  వ్యాధి నందినికి వస్తుందని నేనెప్పుడు వూహించలేదు. నందిని భవిష్యత్తు కోసమే నా తాపత్రయం. మీరు  ఒక జాబ్  కోసం వచ్చినా, ఒక ఆత్మీయమైన స్నేహితురాలిగా కనిపిస్తున్నారు నాకు. మీ  సంరక్షణలో నందిని కోలుకుంటుందని నాకు నమ్మకం వుంది. మీరు నాకు జీవితాంతం చాలా గొప్ప సహాయం చేసిన వ్యక్తి ఆ విషయం మీకు తెలీదు."

 

    అంత ఫ్రాంక్ గా మాట్లాడగలిగే వ్యక్తిత్వం అభినవ్ దని తెలీని లిపికి అతని మీద ఉన్నతమైన అభిప్రాయం కలిగిందా క్షణానే.

 

    "మీకు  సహాయం చేసేటంతటి పరిస్థితిలో నేను లేను. నేను మీరు అప్పగించిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించదానికి కృషి చేస్తానని హామీ యిస్తున్నాను" అంది లిపి మృదువుగా.

 

    "మిమ్మల్ని చూడగానే నాకు ఆ నమ్మకం ఏర్పడింది. అమ్మానాన్నా చనిపోయిన దగ్గర్నుంచీ మేమిద్దరం వంటరితనంతోనే బ్రతికాం. నాకైతే ఈ  ఆర్ట్, ఈ రంగులు వున్నాయి. కానీ నిజంగా నందిని పూర్తి వంటరితనంలోనే బ్రతికింది. అందువల్ల ఈ సమయంలో ఆమెకు కావాల్సింది తన ఆనందాన్ని, తన బాధల్ని పంచుకునే స్నేహితురాలు. నందిని చాలా సెన్సిటివ్. నేనెక్కడ బాధపడతాననో ఏ విషయాన్ని నాతో చెప్పదు. అకస్మాత్తుగా వంటిని జబ్బు కమ్మేస్తున్నప్పుడైనా ఆ బాధను అణచుకోడానికి ప్రయత్నిస్తుంది తప్ప 'అన్నయ్యా నేను బాధతో విలవిల్లాడిపోతున్నానని ఒక్కమాట చెప్పదు. ఎందుకంటే నన్ను యిబ్బంది పెట్టడం ఆమెకు అసలు యిష్టం వుండదు" ఆ మాటలు చెప్తున్నప్పుడు  అభినవ్ గొంతు వణకడం  స్పష్టంగా గమనించిందామె.

 

    "బాధపడకండి. నేనొచ్చానుగా!" అప్రయత్నంగా ఆ మాటలు ఆమె నోట్లోంచి వచ్చాయి.

 

    "మిమ్మల్ని దేవుడే పంపించాడు లిపిగారూ! నేను చాలామందిలా దుఃఖాన్ని జీర్ణించుకుని బ్రతకలేను. అలాగని బాధలకు భయపడి పారిపోయే మనస్తత్వం కూడా కాదు.

 

    నాదైన ఒక ఊహా ప్రపంచంలో బ్రతకాలని నాకోరిక. అక్కడ  మనుషుల వ్యక్తిత్వాలకు, బ్రతుకులకు డబ్బు లక్ష్మణరేఖ కాదు. దేశమంతా స్వేచ్ఛగా, పక్షిగా తిరగాలని కోరిక. మీకు తెలీదు లిపిగారూ! చాలా మందికి ఆకాశం  కేవలం పొగలా మాత్రమే కన్పించొచ్చు కానీ నాకు ఆకాశం దేవుడిచ్చిన కేన్వాస్. ఖాళీ కేన్వాస్. మన హృదయంలాంటిదే ఆకాశం కూడా. సముద్రం ఒడ్డున పడుకుని వెన్నెల  రాత్రుల్లో ఆకాశాన్ని చూస్తూ హాయిగా గడపడం నాకిష్టం వర్షంలో తడుస్తూ చిన్నపిల్లాడిలా గెంతటం అంతకంటే యిష్టం.

 

    మనుషులు, మనుషుల్లోని కృత్రిమమైన విలువలు, వ్యాపార సంబంధాలు, ఈ గజిబిజీ జీవితాలు..... ఎందుకోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలియని మనస్తత్వాలు, సంకుచిత స్వభావాలు నాకర్థం కావు.

 

    స్వలాభాపేక్ష జీవితాన్ని అక్టోపస్ లా ఆక్రమించుకుంటున్నప్పుడు అందుకోసమే బ్రతుకుతున్న మనిషికి అసలు జీవిత వాస్తవం తెల్సేటప్పటికి తనకు కావల్సిన ప్రపంచం దూరమైపోతుంది.

 

    తన గుప్పిట్లో వున్నదాన్ని గురించి కాకుండా గుప్పిట్లో పట్టనిదాని గురించి ఆలోచిస్తాడు మనిషి. అక్కడే  మనిషి పరాజితుడవుతాడు. కాదంటారా?"

 

    అంత సడన్ గా అలాంటి ప్రశ్న వేస్తాడని వూహించని లిపి తొట్రుపడింది.

 

    ఎక్కడినుంచో వచ్చిన చల్లటి గాలితెర ఇద్దరిమధ్యా నిండిపోయింది.

 

    ఆ గాలికి సన్నగా కదిలిన లిపి జుత్తువైపు చూశాడు అభినవ్.

 

    "ఇంకో విషయం. మీకు అభ్యంతరం లేకపోతే  మీరిక్కడే వుండొచ్చు ఇది మీ స్వంత ఇల్లు అనుకోండి" అమనసులోని మాటను చెప్పేశాడు అభినవ్.

 

    మొదటిరోజునే అంత నిష్కల్మషంగా మాట్లాడుతున్న అతనివైపు అప్రతిభురాలై చూసింది లిపి. అయినా వెంటనే ఏం జవాబు చెప్పలేదామె.

 

    "నందినిని నేనొకసారి చూడొచ్చా?" మాట మారుస్తూ అందామె.

 

    "రండి" లేచి నిలబడ్డాడతను. ఇద్దరూ హాల్లోకొచ్చారు. హాల్లోంచి బయటకెళ్ళేందుకు చిన్న కారిడార్. ఆ కారిడార్ చివర ఒక ఏకాంతపు గది.

 

    "గాలీ వెలుతురు బాగుంటుందని ఈ రూమ్ ని సెలక్ట్ చేసుకుంది నందిని" చెప్పాడు అభినవ్.

 

 Previous Page Next Page