Previous Page Next Page 
సృష్టి పేజి 37


    చెప్పింది లిపి.

 

    "ఎక్కువేమో?"

 

    "ఒక రెస్పాన్స్ బలిటీని డబ్బుతో కొనాలనుకున్నప్పుడు ఆ మాత్రం సాలరీ వుంటే తప్పులేదుగా? అయినా నేనడిగింది నాలుగు వేలేగా."

 

    ఒక్క క్షణం కావ్య ఏం మాట్లాడలేదు.

 

    లిపి అందిచ్చిన సర్టిఫికెట్స్ ను చూసి-

 

    "మీరు తెలుగమ్మాయా.' ఆశ్చర్యంగా అడిగింది కావ్య తెలుగులో.

 

    "అవును" అంది లిపి.

  

     "మరి చెప్పలేదేం. నేను మిమ్మల్ని సెలక్ట్ చేస్తున్నాను. కానీ ఫైనల్ జడ్జిమెంట్ తీసుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. మీ ఉద్యోగం వెల్లివాకం ప్రాంతంలో చెయ్యాల్సి వుంటుంది."

 

    "వెల్లివాకంలోనా?" ఆశ్చర్యంగా అడిగింది లిపి.

 

    "అవును. నా ఆఫీసు కారులో మిమ్మల్ని పంపుతాను. పేషెంట్ బ్రదర్ అభినవ్. గొప్ప ఆర్టిస్టు. ఫైనల్ గా  మిమ్మల్ని సెలక్ట్ చేయాల్సింది ఆయనే."

 

    "ఆయన వెల్లివాకంలోనే  వుంటారా? నేను కూడా వెల్లివాకంలోనే వుండేది" నోటి చివరవరకూ వచ్చింది ఆమాట. కానీ ఎందుకో చెప్పలేదు లిపి.

 

    మరో పడి నిమిషాల తరువాత లిపిని కిందకు తీసుకొచ్చి ఆఫీసు కారులో కూర్చోబెట్టి-

 

    "మిస్  లిపీ డోన్ట్ వర్రీ! మీరే సెలక్ట్ అవుతారు" అంది కావ్య.

 

    కావ్య అలా  సన్నిహితంగా మాట్లాడటం ఎంతో సంతోషంగా వుంది లిపికి.

 

    "థాంక్యూ కావ్యగారూ!' కార్లో కూర్చుంటూ అంది లిపి.

 

    "నో గారూ ప్లీజ్- సే కావ్య. ఈ క్షణం నుంచి మనిద్దరి మధ్యా 'మీరు' అనే వర్డ్  రాకూడదు. తెల్సిందా?"

 

    "అలాగే" ఆనందంగా నవ్వుతూ అంది లిపి.

 

    కారు ముందుకు కదిలింది.

 

    దాదాపు తనకు ఉద్యోగం వచ్చేసినట్టే. కానీ ఆ ఆర్టిస్టు అభినవే ఎలాంటి వాడో? ఎన్ని ప్రశ్నలు వేస్తాడో? అయినా కావ్య వుందిగా. అభినవ్ కి, కావ్యకి ఎలాంటి సంబంధం వుంది? ఏమవుతుంది?

 

    ఫ్రెండా? అతని తరపున ఇంటర్వ్యూ ఈమె ఎందుకు కండక్ట్  చేసింది? కారులో కూర్చున్న లిపి చాలా ఉత్సాహంగా వుంది.

 

    అదే సమయంలో తనని సృజ యాడ్ ఏజెన్సీ దగ్గర  డ్రాప్ చేసేసి అర్జంటు పని మీద వెళ్ళిపోయిన రమణ గుర్తుకొచ్చాడు.

 

    ఆర్టిస్టు అభినవ్ తి మాట్లాడిన వెంటనే రమణని కలిసి థాంక్స్ చెప్పాలి. ఉత్తి థాంక్స్ తో సరిపెట్టేస్తే అతనూరుకుంటాడా?

 

    రమణ మాటల్ని జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంది లిపి. పార్టీ యిస్తే పోతుంది అనుకుంది తన సంతృప్తి కోసం. ఆ పైన రమణ వాళ్ళావిడకు మంచి చీర కొని గిప్ట్ గా యివ్వాలని నిర్ణయించుకుంది లిపి.

 

    అప్పటికి కారు పరశువాకం మెయిన్ రోడ్ లో వుంది.

 

    
                                                         *    *    *

 

    అప్పటికి అరగంట క్రితమే హాస్పిటల్ నుంచి నందినిని ఇంటికి తీసికొచ్చేశాడు అభినవ్. డాక్టర్ కుమరన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులు లిస్టిచ్చారు.

 

    "నర్స్ ని ఏర్పటు చేయగానే ఆమెను నా దగ్గరికి ఒకసారి తీసుకురా. పేషెంట్  విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను" డాక్టర్ కుమరన్ నందినిని డిస్ ఛార్జ్ చేసే ముందు చెప్పిన విషయం జ్ఞాపకానికొచ్చింది.

 

    నందినిని ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ రోడ్డు మీదకెళ్ళి కావ్యకు ఫోను చేశాడు.

 

    "హలో బాసూ! ఇప్పటివరకు మన యాడ్  చూసి ముగ్గురు వ్యక్తులొచ్చారు. అందులో ఒకమ్మాయిని సెలక్ట్ చేశాను. గుడ్ కేండిడేట్. తెలుగమ్మాయే. ఇప్పుడే  మా ఆఫీసు కారులో పంపాను. ఐ థింక్  షీ ఈజ్ సూటబుల్. క్వాలిఫైడ్ అండ్ ఎక్స్ పీరియన్స్ డ్" చెప్పింది కావ్య.

 

    వచ్చిన ముగ్గురమ్మాయిల్లో మిగతా ఇద్దరు తెల్లగా వుండగా, లిపి మాత్రమే నల్లగా ఉంది. తనకు  భవిష్యత్తులో పోటీ కాకుండా వుండటం కోసమే  ఆమె లిపిని సెలెక్ట్ చేసినట్లు ఆమెకి తప్ప మరెవరికీ తెలీదు.

 

    "ఆ అమ్మాయి పేరు?" అడిగాడు అభినవ్.

 

    "లిపి, వెరీగుడ్ నేమ్ కదూ? బైదిబై మనం ఈవెనింగ్ కలుసుకొందాం షార్ప్ సిక్సో క్లాక్ కి మీ యింటికొస్తాను" అంది కావ్య వుత్సాహంగా.

 

    "యూ ఆర్ మోస్ట్ వెల్ కమ్" చెప్పి ఫోను పెట్టేశాడు అభినవ్.

 

    యూ ఆర్ మోస్ట్ వెల్ కమ్- ఆ వాక్యాన్నే రెండు మూడుసార్లు తనలో తను అనుకుంది ఫోనుకి ఆవలివైపునున్న కావ్య.

 

    ఆ తర్వాత అయిదు నిమిషాల తర్వాత ఇంటికొచ్చాడు అభినవ్.

 

    డ్రాయింగ్ రూంలో చిందర వందరగా పడున్న పెయింటింగ్స్ ని సర్దడం ప్రారంభించాడు.

 

    ఆ అమ్మాయి లిపితో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏదో బెరుకు..... ఏదో సంకోచం.

 

    సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు కారాగింది.

 

    లిపిని లోనకు వెళ్ళమని చెప్పి డ్రైవరు కారు తీసుకొని వెళ్ళి పోయాడు.

 

    మెట్లెక్కి లోనకొచ్చి తలుపు దగ్గర నిలబడి అటూ ఇటూ చూసింది లిపి.

 

    ఎక్కడా మనిషి అలికిడి లేదు.

 

    ఎక్కడో లోపల గదిలోంచి టేప్ రికార్డ్  లోంచి మెల్లగా విన్పిస్తున్న తెలుగు పాటలు-

 

    "సార్!" కాలింగ్ బెల్ కోసం చూస్తూ పిలిచింది లిపి. ఆ సమయంలో లోన డ్రాయింగ్ రూమ్ లో ఉన్న అభినవ్  నేల మీద చిందర వందరగా ఉన్న ఆర్ట్  బుక్స్ ని తీసి రేక్స్ లో సర్దుతున్నాడు.

 

    అతనికి బయటికి రావాలంటే ఏదో బెదురుగా వుంది.

 

    "ఎస్ కమిన్" ఆ పిలుపుకి లోన్నించే జవాబు చెప్పాడు.

 

    ఆ పిలుపు విన్పించిన వైపు అడుగులు వేసింది లిపి.

 

    రెండే రెండు క్షణాలు!

 

     మెత్తని అడుగుల చప్పుడికి మోకాళ్ళ మీద కూర్చుని పుస్తకాలు తీస్తున్న అభినవ్ తల తిప్పి ద్వారబంధం దగ్గర నుంచున్న ఆమెను చూసి ఆశ్చర్య పోయాడు.

 

    ఏదో మాట్లాడబోయిన అతని నోట్లోంచి మాటలు రాలేదు. అతని చూపులు ఆమెను అతుక్కుపోయాయి.

 

    చాలా కాలం తర్వాత చెప్పా చేయకుండా వచ్చేసిన  ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడామెను.

 

 Previous Page Next Page