Previous Page Next Page 
సృష్టి పేజి 39


    "ప్రస్తుతం ఇంట్లో వంటపని ఎవరు చేస్తున్నారు?" అడిగింది లిపి.

 

    "పనిమనిషే రెండు బాధ్యతల్ని నిర్వహిస్తోంది."

 

    "ఆ బాధ్యతను రేపటినుంచి నేనే  నిర్వహిస్తాను" ఈ మాటల్ని చెప్పబోయి  తను తొందరపడుతున్నాననే భావం రావడంతో ఆగిపోయింది లిపి.

 

    రూమ్ లో అడుగుపెట్టిన అతని వైపు, పక్కనున్న అమ్మాయి వైపు ఈజీ ఛైర్లో కూర్చుని నవల చదువుకుంటున్న నందిని చూసి నవ్వింది.

 

    "అన్నయ్యా! ఈవిడెవరో చెప్పనా?" లిపి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది నందిని.

 

    "చెప్పుకో చూద్దాం."

 

    "నీ భాషలో చెప్పాలంటే నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నువ్వు ఏర్పాటుచేసిన నర్స్ అవునా? బైదిబై  నా పేరు నందిని. మీ పేషెంటుని. ప్రస్తుతానికి నేను పేషెంటునంటే ఎవరూ నమ్మరులెండి" గలగలా  నవ్వుతూ అంది నందిని.

 

    "నా పేరు లిపి" నందినికి తనని తాను పరిచయం చేసుకుంది లిపి.

 

    "మాట్లాడుతుండండి. ఇప్పుడే వస్తాను" రూమ్ లోంచి బయటికొచ్చాడు అభినవ్.

 

    
                                         *    *    *

 

    "మిమ్మల్ని ఏమని పిలవాలి." ఆ ప్రశ్నకు గబుక్కున తల తిప్పింది లిపి.

 

    "నీకెలా పిలవాలనిపిస్తే అలా" దాదాపు అభినవ్ లాగే వుండే నమ్దనిని చూస్తూ అంది లిపి.

 

    "నాకు ఆంటీ అనీ, సిస్టర్ అని పిలవడం నచ్చదు. లీ అని పిలుస్తాను పలుకుతారా?" నవ్వుతూ అంది నందిని.

 

    "నువ్వెలా పిలిచినా పలుకుతాను. అయామ్ యువర్ నర్స్" అంది లిపి.

 

    "నాట్ ఓన్లీ నర్స్. బట్ ఆల్సో ఫ్రెండ్" లేచిలిపి దగ్గరగా వచ్చి మిమ్మల్ని ఎక్కడో , ఎప్పుడో చూసినట్టుగా వుంది లీ గారూ" అంది  ఆమె  కళ్ళలోకి చూస్తూ నందిని.

 

    "ఎక్కడ కల్లోనా?" నవ్వుతూ అంది లిపి.

 

    "బాగా చెప్పారే! అప్పుడే పేషెంటు నాడి పట్టేశారు. ఖాళీ కదా, నేను కలలు కంటుంటాను. వంటరిగా బీచ్ లో కూర్చున్నట్టు, వంటరిగా సినిమా కెళ్ళినట్టు, వంటరిగా ఏ భయం లేకుండా తిరుగుతున్నట్టు" అమ్మే మాటల  ద్వారా నందిని  మనసులోని ఆవేదనను అర్ధం చేసుకుంది లిపి.

 

    "ఇకనుంచి నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళదాం. సరేనా?" సానునయంగా ఆమె తల నిమురుతూ అంది లిపి.

 

    "అకస్మాత్తుగా  నా నరాలు చచ్చుబడిపొతే?" భయంతో నందిని కనురెప్పలు టపటపలాడాయి.

 

    "డోంట్ వర్రీ నందినీ! నేను నీతోనే వుంటానుగా. నీకేం కావాలో అన్నీ చూసుకుంటాను" లిపి మనసంతా నందిని మీద సానుభూతితో నిండింది.

 

    "కంటికి రెప్పలాగానా?" వాళ్ళన్నయ్యను అనుకరిస్తూ అంది నందిని.

 

    "అలాగే అనుకో" అంది నవ్వుతూ లిపి.

 

    "లీ  మేడమ్! మీరు చాలా అందంగా వుంటారు. మీకు ఈ విషయం తెలుసా?" తనని పొగడుతున్న నందినివైపు విచిత్రంగా చూసింది లిపి.

 

    "అందుకేనా నా వైపు అలా చూస్తున్నావు. నేను నల్లగా వుంటాను. అది నాకు తెలుసు. నీకు  తెలుసు. నేను అందంగా వుంటానని అన్న  మొదటి  వ్యక్తివి నువ్వే."

 

    "కాదు తెల్లగా వున్నవారే అందంగా వుంటారా. అందం  తెలుపులోనే  వుంటుందా? నెవ్వర్...... కొన్నాళ్ళయ్యాక అన్నయ్య తను వేసే పెయింటింగ్స్ కి మిమ్మల్ని మోడల్ గా వుండమంటాడేమోనని భయంగా వుంది" నెమ్మదిగా అంది నందిని.

 

    "మోడలా? అప్పుడుగానీ మీ అన్నగారికున్న పేరు పోదు" నవ్వుతూ అంది లిపి.

 

    "నీ రొటీన్ ప్రోగ్రామ్ ఏంటి?" అడిగింది లిపి మాట మార్చటానికి.

 

    "లేవగానే డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వేసుకోవడం, టేప్ రికార్డర్ లో  పాటలు వినడం, పుస్తకాలు చదువుకోవడం, టీవీ చూడడం, ఎవరైనా వస్తే మాట్లాడడం, మళ్ళీ మందులు, ఇంజక్షన్లు అంతే!"

 

    "ఎవరైనా అంటే నీకు ఫ్రెండ్స్ వున్నారా?"

 

    "ఫ్రెండ్సు లేరు. తుషార్ వుంటాడు. అప్పుడప్పుడు కావ్య వస్తుంటుంది. కావ్య మా అన్నయ్యతోనే  గంటలు గంటలు మాట్లాడుతుంది. నాతో మాట్లాడదు పెద్దగా. తుషార్ జోకులవీ చెప్పి నన్ను నవ్విస్తుంటాడు."

 

    "తుషారంటే?"

 

    తుషార్ గురించి చెప్పింది నందిని.

 

    "లీ మేడమ్! ఇవాళ మనిద్దరం సినిమా కెళదామా."

 

    "నీ ఇష్టం" అంది లిపి ఆమెని మానసికంగా సంతోషపెట్టాలని.

 

    "అన్నయ్య వద్దంటాడేమో?" సందేహంగా అంది నందిని తిరిగి. ఆ విషయం నేను చూసుకుంటాను గదా! డోన్ట్ వర్రీ. ఇకనుంచి నీకేం కావాలన్నా నన్నడుగు సరేనా?"

 

    "సరే" హేపీగా తలూపుతున్న నందినిని చూస్తూ ట్రేలో ఫ్రూట్ జ్యూస్  గ్లాసులతో లోని అడుగుపెట్టాడు అభినవ్.

 

    "ఏంటీ  మా నందిని ఏదో వరాలు కోరుతున్నట్టుగా వుంది" ఒక గ్లాసుని ఆమె చేతిలో పెడుతూ అన్నాడు అభినవ్.

 

    "అవును అన్నయ్యా! నేను, మా లీ మేడమ్ కలిసి ఫస్ట్ షోకి సినిమా కెళుతున్నాం. నువ్వు కూడా వస్తున్నావు" ఆ మాట వినగానే  లిపి ముఖంలోకి చూశాడు ఆశ్చర్యంగా అభినవ్.

 

    ఏం ఫర్వాలేదు అన్నట్టుగా కళ్ళతోనే సంజ్ఞ చేసింది లిపి. ఆ భావాన్ని అర్ధం చేసుకున్నాడతను.

 

    "మీరిద్దరూ వెళ్ళండి. నేను రావడంలేదు. నేను చేసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి.

 

    రేపటినుంచి ఆ పనులు చేసుకో అన్నయ్యా!" రిక్వెస్టు చేస్తూ అడిగింది నందిని.

 

    "అలాగేలే! ఇంకా  అయిదు గంటల తర్వాత కదా!"

 

    "నాకొకసారి కిచెన్ చూపిస్తారా?" లిపి వైపు ఆశ్చర్యంగా చూసి మౌనంగా ఆ రూమ్ లోంచి బయటికొచ్చాడు అభినవ్ కిచెన్ రూమ్ ని లిపికి చూపించేందుకు.

 

 Previous Page Next Page