Previous Page Next Page 
మోహిత పేజి 38


    మోకాళ్ళు, నడుం, గుండె, చేతులు, కంఠం నెమ్మదిగా ఒక్కొక్క శరీరావయవం భయంకరమయిన ఊబిలో దూసుకుపోతున్నాయి.

 

    పదినిమిషాల తర్వాత వాళ్ళ అరుపులు ఆగిపోయాయి.

 

    "వాళ్ళు ఊబిలో దిగబడిపోయారు" ఆనందంగా చెప్పింది వనలక్ష్మి.

 

    సరిగ్గా అదే సమయంలో......

 

    "వాళ్ళు చచ్చినా నేనున్నాను..... మిమ్మల్ని చంపడానికి" కొండల వెనక నుంచి దూసుకొచ్చి మీదపడ్డాడు సిద్ధరామయ్య.

 

    ఒక్కక్షణంలో ఎలర్టయి, పిడికిలి బిగించి, వాడి దవడ  మీద కొట్టాడు మైత్రేయ. ఆ దెబ్బకు అల్లంత  దూరంలో పడ్డాడతను. వాడి చేతిలో కత్తి  ఎగిరిపోయింది.

 

    ఆ కత్తిని అందుకోడానికి ముందుకురికిన మైత్రేయని వెనకనుంచి పట్టుకుని ఊబివేపు తోశాడు సిద్ధరామయ్య. పరుగు పరుగున వెళ్లి ఆ కత్తిని అందుకుని, రౌడీ సిద్ధరామయ్యకి గురిచూసి విసిరింది వనలక్ష్మి.

 

    సిద్ధరామయ్య పెద్దగా కేకవేసి, మైత్రేయని వదిలేశాడు.

 

    "బాబూ..... నువ్వు పారిపో!....." అరిచింది వనలక్ష్మి కత్తిని అందుకోడానికి ముందుకు వస్తూ.

 

    వెనక వనలక్ష్మి పరిగెత్తుకుని వస్తుందనుకున్న మైత్రేయ ముందుకు పరుగెత్తాడు.

 

    ఈతచెట్ల మధ్యనుంచి కుడివేపున్న గిరిజన తండావేపు పరిగెడుతున్నాడతను.

 

    తను అమితంగా ప్రేమించిన పట్నంబాబుని చంపాలని ప్రయత్నిస్తున్న ఆ రౌడీని చంపాలన్న కసితో, పులిలా విజృంభించింది వనలక్ష్మి.

 

    రెండుకాళ్ళతో ఎగిరి అతని గుండెలమీద తన్నింది. ఆ దెబ్బకు సిద్ధరామయ్య దూరంగా పడిపోయాడు. వెంటనే కత్తిని అందుకుని ముందుకు పరుగెత్తింది వనలక్ష్మి.

 

    సిద్ధరామయ్య ఒక్కక్షణం ఆలస్యం చేస్తే, ఆ కత్తి అతని గుండెల్లో దూసుకుపోను. తనకు ఎదురవుతున్న ప్రమాదాన్ని వూహించి, పెద్దరాతిని తీసుకుని, ఆమె ముఖానికేసి కొట్టాడు.

 

    ఆ రాయి బలంగా ఆమె నుదుటిని తాకడంవల్ల, చర్మం చిట్లి రక్తం ఎగజిమ్మింది. ఆమె చేతిలోని కత్తి జారిపోయి కింద పడిపోయింది.

 

    ఆ కత్తిని అందుకుని సిద్ధరామయ్య ఆమెకు గురిచూసి, సూటిగా విసిరాడు.

 

    ఆ కత్తి ఆమె  పొత్తికడుపుని చీల్చుకుని వెళ్ళిపోయింది.

 

    పెనుకేక పెట్టింది వనలక్ష్మి.

 

    ఆ కేకకు పరిగెడుతున్న మైత్రేయ వెనుదిరిగాడు.

 

    అతికష్టంమీద పొత్తికడుపులో గుచ్చుకున్న కత్తిని లాక్కుని తనవేపు వస్తున్నా సిద్ధరామయ్య గుండెల్లో గుచ్చింది. సిద్ధరామయ్య వెర్రిగా బాధతో కేకవేసి, కిందపడిపోయి మట్టిలో గిలగిల్లాడుతూ కొట్టుకోసాగాడు.

 

    కారుతున్న రక్తపు ధారలను లెక్కచెయ్యకుండా, సిద్ధరామయ్య గుండెల్లోని కత్తిని లాగి, మళ్ళీ మరొక పోటు పొడిచింది వనలక్ష్మి. విహ్వలంగా అరుస్తూ లేచి ముందుకు పరిగెడుతున్నాడు ప్రాణభయంతో.

 

    కేకలేస్తూ అతన్ని వెంబడిస్తోంది వనలక్ష్మి.

 

    ఆ సమయంలో సిద్ధరామయ్య వెనక, ఊబివేపు తనూ పరిగెడుతోందనే విషయం మార్చిపోయిందామె.

 

    పరుగు పరుగున వెళుతున్న సిద్ధరామయ్య ఊబిలో దిగబడిపోయాడు.

 

    అతని వెనక  వనలక్ష్మి కూడా  వూబిలో దిగబడిపోయింది.

 

    బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందామె.

 

    భయంతో ఏడుస్తోంది.....

 

    బాధతో అరుస్తోంది.....

 

    "పట్నం బాబూ! వూబిలో దిగబడిపోతున్నా! రక్షంచు...... రక్షించు" నిశీధి రాత్రిలో  ఆ అరుపులు కొండల గుండెల్లో మార్మోగుతున్నాయి.

 

    ఆ అరుపులు విని, తుఫాను వేగంతో ఊబి దగ్గరకొచ్చి నలువేపులా చీకట్లోకి చూడసాగాడు మైత్రేయ.

 

    చీకట్లో వనలక్ష్మి ఏ ప్రాంతంలో వుందో తెలియక, ఊబి నలువేపులా "వనలక్ష్మీ..... వనలక్ష్మీ...." అరుచుకుంటూ పరిగెడుతున్నాడు మైత్రేయ.

 

    "పట్నం  బాబూ..... పట్నం బాబూ...." వనలక్ష్మి కీచుగొంతు మెల్లగా... మెల్లగా.... విన్పిస్తోంది.

 

    అయిదు నిమిషాల తర్వాత ఆ గొంతు విన్పించలేదు.


    
    వనలక్ష్మి పూర్తిగా ఊబిలోనికి జారిపోయింది.

 

    నీటిబుడగలు చిట్లుతున్న చప్పుడు.....

 

    "వనలక్ష్మి......" చివరిసారిగా అరిచి, నిస్త్రాణంగా పచ్చికలో కూర్చుండి పోయాడు మైత్రేయ.

 

    ఊబిమీదుగా వస్తున్న గాలిస్పర్శ, మృత్యుస్పర్శలా వుంది.

 

    "వాళ్ళని నేను చంపి, నిన్ను రక్షిస్తాను" వనలక్ష్మి మాటలు గుర్తుకొచ్చాయి.

 

    మైత్రేయ దుఃఖంతో ఒక్కసారిగా భోరుమన్నాడు.

 

    సరిగ్గా ఆ సమయంలో-

 

    అతనికి మోహిత జ్ఞాపకానికొచ్చింది. వెంటనే లేచి వెనక్కి పరిగెత్తాడు మైత్రేయ.

 

    
                                         *    *    *

 

    దట్టమయిన చీకటి-

 

    ఎక్కడా మనుషుల అలికిడి విన్పించకపోవడంతో కొండగుహలోంచి బయటికొచ్చింది మోహిత.

 

    చీకటిని ఊపిరిగా పీల్చుకుంటున్న చెట్లు.....

 

    మైత్రేయ గురించి బాధగా వుందామెకు. ఏమయ్యాడతను?

 

    'మైత్రేయ' నెమ్మదిగా పిలుస్తూ ముందుకు వస్తున్న మోహిత-

 

    ఎదురుగా తనవేపే వస్తున్నా వ్యక్తుల్ని చూడగానే వెనక్కి పరుగెత్తింది.

 

    "అదిగో..... పట్టుకోండి....?" అరుస్తూ మొహితను వెంబడించారు వాళ్ళు.

 

    కొండల మధ్యనుంచి, గుట్టలమీద, జలపాతం వేపు పరిగెడుతోంది మోహిత.

 

    ఇరవై నిమిషాల తర్వాత....

 

    జలపాతం దగ్గర వారికి చిక్కిపోయిందామె.

 


                                         *    *    *    

 

    అర్థరాత్రి పన్నెండు గంటల సమయం.....

 

    హెడ్ కానిస్టేబుల్ ద్వారా శ్రీమహాలక్ష్మిఇంటి అడ్రస్ తెల్సుకున్న చంద్రప్ప వైన్ షాపులో రెండుగంటలసేపు కాలక్షేపం చేసి, శ్రీమహాలక్ష్మి ఇంటి ముందుకొచ్చి, అటూ ఇటూ చూశాడు.

 

    అటూ, యిటూ కాలనీ రోడ్లు, దూరంగా సాయిబాబా గుడి..... రోడ్లు నిర్జనంగా వున్నాయి.

 

    "ఇందును తను తీసుకెళ్ళాలి. లేదా చంపెయ్యాలి. తప్ప ఆమె మరెవరికీ దక్కకూడదు." నిర్ణయానికొచ్చిన చంద్రప్ప, గేటు తెరచుకుని అరుగుమీదకెళ్ళి తలుపు గొళ్ళెం తట్టాడు.

 

    ఆ చప్పుడుకి గభాలున మెలకువ వచ్చింది శ్రీమహాలక్ష్మికి.

 

    ఇంత అర్థరాత్రి ఎవరై వుంటారు?'

 

    ఆలోచిస్తోందా. అరుగుమీద లైటు వేసి, కిటికీ రెక్కలోంచి బయటికి చూసి నిర్ఘాంతపోయింది.

 

    "మహాలక్ష్మి.... నీతో మాట్లాడ్డానికొచ్చాను. భయంలేదు. తలుపు తెరు....?" చెప్పాడతను. ఇంతలో....

 

    మహాలక్ష్మి పక్కన పడుకున్న ఇందుకు మెలకువ వచ్చింది.

 

    "ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. నావల్ల ఇందుకు ఏ హాని జరగదు..." మరోసారి చెప్పాడతను.

 

    తలుపు తెరిచింది శ్రీమహాలక్ష్మి.

 

    "ఇంత అర్థరాత్రప్పుడు మాటలేంటి ఇన్ స్పెక్టర్ బాబూ! రేపు ఉదయం....." ఏదో అనబోయింది శ్రీమహాలక్ష్మి. ఆమె మాటల్ని వినిపించుకోలేదు చంద్రప్ప.

 

    "ఇందుకోసం నేను వచ్చాను. ఏ పరిస్థితుల్లో ఇందు నా దగ్గర వుందో అంతా నీకు తెలుసు. ఇందుకోసం, నా భార్యాపిల్లల్ని వదులుకున్నాను. ఇకనుంచి ఆమెకు ఏ విధమయిన కష్టం కలక్కుండా చూసుకుంటాను. గూళ్ళో పెళ్ళి చేసుకుని శాశ్వతంగా నా భార్యగా చేసుకుంటాను" నెమ్మదిగా చెప్పాడు చంద్రప్ప.

 

    అతని మాటల్ని నమ్మలేక, ఇందువేపు సందేహంగా చూసింది శ్రీమహాలక్ష్మి.

 

    "అతను నన్ను పెళ్ళిచేసుకున్నా, లేకపొయినా అతనితో నేను బతకలేను. మా బావనే నేను చేసుకుంటాను. అతను నాకు దక్కకపోతే ఉరి వేసుకుని ప్రాణాల్ని తీసుకుంటాను. ఆయన్ని వెళ్ళిపొమ్మని చెప్పు "కోపంగా చంద్రప్ప వేపు చూస్తూ చెప్పింది ఇందు.

 

    "శ్రీమహాలక్ష్మి నువ్వయినా చెప్పు? మర్యాదగా నాతో రాకపోతే బలవంతంగా తీసికెళ్ళాల్సి వస్తుంది."

 

    "ఆ పిల్లకు ఇష్టం లేకపోతే, నువ్వెలా తీసికెళతావయ్యా? రానంటుంది గదా..... వెళ్ళిపో...."

 

    "ఇందు, నాతో వస్తావా? రావా?" బిగ్గరగా అరుస్తూ అడిగాడు చంద్రప్ప.

 

    "నేను.... రాను.... రాను..... రాను....." లేచి వంటగది వేపు వెళ్తూ అంది.

 

    సరిగ్గా అదే సమయంలో.....

 

    ఒక్క ఉదుటున ముందుకెళ్ళి ఇందు జబ్బను పట్టుకుని, బయటకు ఈడ్చుకుని రాసాగాడు చంద్రప్ప.

 

    "ఏయ్.... వదలయ్యా. ఏంటిది?" మధ్యలోకెళ్ళింది శ్రీమహాలక్ష్మి.

 

    "నువ్వు తప్పుకో" అంటూ విసురుగా ఆమెను గోడకేసి తోసేసి, ఇందును గదిలోంచి బయటకు ఈడ్చుకుని వస్తున్నాడు చంద్రప్ప. ఇందు రానంటూ అరుస్తోంది. అతని చేతుల్లోంచి తప్పించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.

 

    కిందపడిపోయిన శ్రీమహాలక్ష్మి విసురుగా  పైకి లేచి, వంటగదిలోంచి కత్తిపీటను తీసుకుని, ఉగ్రంగా చూస్తూ మహాకాళిలా చంద్రప్పని ఎదురుగా వచ్చి నుంచుంది.

 

    "ఒరేయ్..... ఆ పిల్లను వదులు!"

 

    కత్తిపీటతో నిలబడిన శ్రీమహాలక్ష్మి వేపు ఒకసారి చూసి-

 

    "వదలకపొతే ఏం చేస్తావ్? పోడుస్తావా? పోడు...." అంటూ ఇందును వదిలేసి, ఆమెమీద పడ్డాడు.

 

    ఆ పెనుగులాట  సమయంలో ఇందు రోడ్డుమీదకొచ్చేసి సాయిబాబా గుడివేపు పరుగెత్తింది.

 

    బయటకు పరుగెడుతున్న  ఇందును చూసి శ్రీమహాలక్ష్మిని వదిలేసి, తనూ బైటకు పరుగెత్తాడు చంద్రప్ప.

 

    చేతిలో కత్తిపీటతో శ్రీమహాలక్ష్మి అతని వెనక  పరుగెట్టింది.

 

    సరిగ్గా సాయిబాబా గుడిముందు, చంద్రప్ప చేతులకు చిక్కిపోయింది ఇందు.

 

    నేలమీద ఈడ్చుకుంటూ ఆమెను జంక్షన్ లోకి తీసుకువెళుతున్నాడతను.

 

    కాలనీలోని ఒక్కొక్క లైటూ వెలుగుతోంది.

 

    ఆ దృశ్యాన్ని కిటికీల్లోంచి, డాబాలమీంచి చూస్తున్నారు తప్ప, ఏ ఒక్కకరూ ముందుకు రావడంలేదు.

 

    "ఒరేయ్..... ఇన్స్ పెక్టర్..... ఆగరా?" ఆడపులిలా కేకలేసి, చంద్రప్పమీద  విరుచుకుపడింది శ్రీమహాలక్ష్మి.

 

    ఆమె చేతిలోని కత్తిపీట సర్రుమని అతని భుజాలకు తాకింది. ఆ భుజాలలోంచి రక్తం ప్రవాహంలా ఎగజిమ్మింది.

 

    మరోసారి కత్తిపీట ముందుకు దూసుకువెళ్ళింది. ఆ దెబ్బ అతని గుండెల్లో నాగలిపోటులా గుచ్చుకుంది.

 

    భయంకరంగా అరుస్తూ ముందుకు పరుగెడుతున్నాడు చంద్రప్ప.

 

    మూడోసారి ఆ కత్తిపీటను బలంగా గురిచూసి విసిరింది శ్రీమహాలక్ష్మి.

 Previous Page Next Page