Previous Page Next Page 
సంకల్పం పేజి 37

 

       సడన్ గా తగ్గిపోయాడు ఆ మేనేజర్-
   
    "ఇలా నేను... అనేకానేక విషయాల గురించి, ఏ రిఫరెన్సూ లేకుండా చెప్పగలను. ఎందువల్లా, అపారమైన జీవితానుభవం వల్ల" ఆగి ఎదురుగా కూర్చున్న ముగ్గురివైపూ చూశాడు.
   
    "బోరు కొడుతోందా... మంచి విషయాలు చెప్తే ఎవ్వడికయినా బోరే." మళ్ళీ ఏదో 'సబ్జెక్ట్' లోనికి వెళ్ళిపోతున్న వాడిని వెనక్కి లాక్కొచ్చాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏలుమలై.
   
    "వికాస్ కి ఏదో శుభవార్త చెప్తానని అన్నారు మీరు." అని 'మైన్ రూట్'లోకి తీసుకొచ్చాడు.
   
    "ఎస్.ఎస్.మిస్టర్ వికాస్. నీకు లోన్ సేంక్షన్ అయిందయ్యా. నీ ప్రొడక్ట్ ని మంచిగా తెచ్చుకుని, మార్కెట్లో నిలుపుకో ఈసారి దీనికి పదింతలు నీకు 'లోను' వచ్చేటట్లు చేసే పూచీ నాది... ఓ.కే." ఏదో చెప్తున్నాడు మేనేజర్.
   
    అంతసేపు కూర్చున్న బాధ ఒక్కసారి ఎగిరిపోయింది వికాస్ కి. జగన్ వేపు చూసి నవ్వాడు.
   
    జగన్ ఆనందంతో ఈల వేయబోయి ఆగిపోయాడు.
   
    "థాంక్యూ సర్. వెరీ కైండాఫ్ యూ....." అన్నాడు వికాస్.
   
    "థాంక్స్ నాకెందుకయ్యా బాబు. ఏలుమలై గారికి చెప్పు.....బ్రిటీషువాడు మనల్ని తినేసినట్టుగా తినేసాడాయన. ఏలుమలై గారి గురించి చెప్పుకోవాలంటే మీకు తెలీదు ఆయన నాకు 1957లో అనంతపురంలో పరిచయం అయ్యారు. నాతోపాటు నేనెక్కడుంటే అక్కడ వున్నారు... ఇంకా" ఆ టాపిక్ లోకి ఆయన దూరిపోయాడంటే ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం.   
   
    "నా గురించి ఎందుకులేండి." అడ్డొచ్చాడు ఏలుమలై.

    "చూడు వికాస్... మిగతా విషయాలు ఏలుమలై గారు చెప్తారు. ఆయన్తో వెళ్ళండి. చెక్కు తీసుకొండి. కొడుకు పుట్టినప్పుడు కాదు ఆనందం.... ఆ కొడుకు... పెద్దయ్ పేరు తెచ్చినప్పుడు... అవునా... నీ విజయం నా ఆనందం."
   
    మరోసారి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయటికొచ్చాడు వికాస్. ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి ఒక గంట పట్టింది.
   
    ఏలుమలై చేతుల ద్వారా అయిదు లక్షల రూపాయలకు 'చెక్' తీసుకుంటున్నప్పుడు-
   
    గాలిలో ఎగురుతున్నట్టనిపించింది వికాస్ కు-
   
    బయటికొచ్చాడు.
   
    జగన్మోహన్ బస్టాండ్ కి వెళ్ళిపోయాడు శ్రీకాకుళంలో ఒక డీలర్ ని కలవడానికి.
   
    వెంటనే ఈ వార్తని 'శివమూర్తి గారితోనూ,  మామయ్యతోనూ చెప్పాలి' అనుకుని-
   
    పబ్లిక్ టెలిఫోన్ దగ్గరకెళ్ళాడు.
   
    శివమూర్తి చాలా ఆనందించాడు.
   
    వికాస్ అంటే ఏదో అపారమయిన గౌరవం ఏర్పడుతోంది ఆయనకు.
   
    చయనులు-
   
    "నాకు తెలుసురా.... నువ్వు పట్టింది బంగార మౌతుందని- నాకు తెలుసురా. నీకు లోన్ రావాలని ఇవాళుధయాన్నే ఈశ్వరుడికి అర్చన చేయించాను.... తెల్సా.... ఒరేయ్.... రారా.... నీకు మంచి స్పెషన్ టీ చేయించి ఇస్తాను."
   
    నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు వికాస్.
   
    బ్యాంక్ కి వెళ్ళాడు.
   
    'శివానీ మోటార్స్' ఎకౌంట్లో ఆ 'చెక్' ని పడేసి, తన పర్సనల్ ఎకౌంట్లో ఉన్న ఎమౌంట్ ని చూశాడు.
   
    రెండే రెండు వందలు.
   
    ఒక వందరూపాయలు డ్రా చేసి జేబులో పెట్టుకొని- జగదంబా వేపు నడిచాడు.
   
    మల్లిఖార్జున్ దగ్గరికి వెళ్తున్నాడు వికాస్.
   
    తన ప్రాజెక్టుకి ఇంకో అయిదు లక్షలు కావాలి. రాత్రి ఫోన్లో చూచాయగా చెప్పాడు.
   
    క్లాత్ స్టోరుకి వెళ్ళేసరికి, అమయానికి మల్లిఖార్జున్ అక్కడ లేడు. ఎటో వెళ్ళాడు.
   
    ఒక అరగంట సేపు కూర్చున్నాడు.
   
    మల్లిఖార్జున్ వచ్చాడు- చేతిలో ఏదో ప్యాకెట్!
   
    "ఎంతసేపైంది వచ్చి" ప్రశ్నించాడు. రెండు కాఫీ తెమ్మని మనిషిని బయటకు పంపి-
   
    "చెప్పండి..." అన్నాడు వికాస్ వేపు చూస్తూ.
   
    ఇప్పుడున్న తన పరిస్థితిని చెప్పాడు వికాస్.
   
    ఇంకో అయిదు లక్షలు లేకపోతే ఇంత ప్రయత్నమూ బూడిదలో పోసిన పన్నీరై పోతుంది.
       
    "వచ్చేది సంక్రాంతి సీజన్. హోల్ సెల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వకపోతే...సరుకు పంపించరు. వాళ్ళందరికీ అడ్వాన్స్ లు ఇవ్వాలి... చాలా 'టైట్ టైం' ఒకటీ.... రెండూ కాదు... అయిదు లక్షలంటే....." చెప్తూ తన చేతిలోని ప్యాకెట్ విప్పుతున్నాడు మల్లిఖార్జున్.
   
    చిన్నసైజుని, పెద్ద సైజుగా చేయించిన ఫోటో అది!
   
    "బాగుందా.... మా నాన్నగారి ఫోటో.... ఎక్కడో చిన్నది దొరికితే పెద్దది చేయించాను...." చెప్పాడు మల్లిఖార్జున్.
   
    ఆ ఫోటోవేపు చూశాడు వికాస్.
   
    ఆశ్చర్యపోయాడు.
   
    "ఈ ఫోటోలోని వ్యక్తి మీ నాన్నగారా" ఆశ్చర్యంగా అడిగాడు వికాస్.
   
    "అవును...."
   
    ఆ వ్యక్తిని జీవితంలో తను మరిచిపోలేడు.
   
    ఆ వ్యక్తి పెట్టిన భిక్షే తన జీవితం...
   
    ఆ రోజు తన కారు మెకానిక్ షెడ్లోకి తీసికెళ్ళి ఒక ఆధారం చూపించిన వ్యక్తి ఆయన.
   
    "వీరయ్యగారి అబ్బాయా మీరు..."
   
    "అంటే మా నాన్నగారు మీకు తెలుసా?"
   
    వికాస్, తన మేనమామద్వారా తనని ఆదరించిన వీరయ్య గురించి చెప్పాడు.
   
    అంతా విన్నాక-
   
    "అప్పుడు నేను కాకినాడలో ఉండేవాణ్ని... మా వూరు అప్పుడప్పుడు వస్తుండేవాణ్ని... మిమ్మల్ని చూసే ఉంటాను..." నవ్వుతూ అన్నాడు మల్లిఖార్జున్.
   
    "చూసుకునే ఉంటాం. మాట్లాడుకునే ఉంటాం. మళ్ళీ ఇలా కలుసుకుంటామని ఎప్పుడూ అనుకొని మాత్రం ఉండం..... అవునా...." అన్నాడు వికాస్.
   
    నవ్వాడు మల్లిఖార్జున్.
   
    "ఏ విషయమూ రెండు రోజుల్లో మీకు చెప్తాను...." అన్నాడు మల్లిఖార్జున్.
   
    వికాస్ అక్కడ నుంచి బయటికొచ్చేశాడు.
   
    జనసమూహం మధ్య నడుస్తున్నా అతను ఒంటరి.
   
    ఒక చరిత్ర సృష్టించబోయే...
   
    ఒక సాహసి...
   
    ఒక చరిత్ర కారుడు...
   
    ఎక్కువ 'రష్' తో ఉన్న సిటీబస్ 'ఫుట్ బోర్డ్' మీద నిలబడున్నాడు.
   
                                   *    *    *    *    *
   
    మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన డీలర్స్ మీటింగ్.
   
    "ఏ కంట్రీ కొలాబరేషన్ తో మీ కారు విడుదల అవుతుంది..." ఒక డీలర్ ప్రశ్న వేశాడు.
   
    "పూర్తిగా మనదేశంలోని సంస్థలే మా కారుకి కావలసిన భాగాలన్నీ సరఫరా చేస్తున్నాయి."
   
    "మీ కారు పేరు?"
   
    "STREET RIDER"
   
    "ఎన్ని కార్లను మీరు ఉత్పత్తి చేస్తున్నారు?"
   
    "మార్కెట్ ని అంచనా వేశాక గానీ చెప్పలేం."
   
    "మొదటి విడతగా ఎన్ని కార్లను విడుదల చేస్తున్నారు?"
   
    "మీరిచ్చే ఆర్డరు బట్టే ఉంటుంది."
   
    "కనీసం మీకారు రేటెంత ఉంటుందో చెప్పగలరా?"
   
    "టేక్సులు మినహాయించి అరవై, డెబ్బై అయిదు వేల మధ్య ఉంటుంది."
   
    "మారుతీకారు మార్కెట్ ను పడగొట్టగలరని అనుకుంటున్నారా?"
   
    "కాదు... ఏ కారూ... మా కారుకి పోటీ కాదు, ఎందుకంటే... మా కారు కొనుక్కున్న వారికి పెట్రోలు బంకుల దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు."
   
    ఆగాడు డీలర్స్ రియాక్షన్ కోసం వికాస్.
   
    "ఏం... మీరే పెట్రోల్ని సరఫరా చేస్తారా?" ఓ డీలర్ అమాయకంగా అడిగాడు.
   
    "కాదు... నా కారుకి అసలు పెట్రోలుతో పనిలేదు. స్పెషల్లీ డిజైన్డ్ హైపవర్ బ్యాటరీయే నా కారుకి ఇంధనం" ఎంతో కూల్ గా అన్నాడు వికాస్.

 Previous Page Next Page