Previous Page Next Page 
మొగలిబాకు పేజి 37

   

      "అంతా మన మంచికే" నవ్వుతూ అంది సంధ్య.
           
                                                                       *    *    *    *
   

    సాయంత్రం అయిదు గంటల సమయం__
   
    ద్వారకా నగర్ సెంటర్ లో వున్న పార్కులోకెళ్ళి కూర్చున్నాడు నారాయణరావ్.
   
    క్రితం రోజు సాంబమూర్తి కళా మందిర్ లో జరిగిన సంఘటన గురించి ఆరోజు పేపర్లన్నీ కవర్ చేసాయి.
   
    'అవార్డు మిస్సయిన జంట__అంతా గందరగోళం' డైలీ న్యూస్ పేపర్ కాపీలు వందకొని అందరికీ పంచి పెట్టాడు నారాయణ రావు.
   
    ఇంకా పెళ్ళికాని ప్రేమజంట నారాయణరావు, సంధ్య ఆ గందరగోళాన్ని సృస్టించారని___దాంతో ప్రోగ్రామ్ ఇన్ చార్జి మాజీ మిస్ డాబాగార్డెన్స్ అంతెత్తున లేచింది___పేపర్స్ లో.
   
    "ఆ ప్రేమ జంటే. ఈ జంటని నాకు తెలీదు.....అయ్ హేట్ లవ్....ఈ ప్రపంచంలో నిజంగా ప్రేమనేది లేదు. అందుకే వాళ్ళిద్దర్నీ నేను వ్యతిరేకిస్తున్నాను. వాళ్ళిద్దరూ ఈసారి కనబడనీ చెప్తాను...." ఉక్రోషంగా తన సహచరుల్తో అంది.
   
    మాజీ మిస్ డాబాగార్డెన్స్__ఆ మేరకు ఇచ్చిన పత్రికా ప్రకటనను కూడా పేపర్ లో సింగిల్ కాలమ్ లో కవర్ చేశారు.
   
    ఆఫీసు నుంచి యింటి కెళుతూ, కాసేపు పార్కులో కూర్చున్న మహిళామణులు కొందరు ఈ విషయమై చర్చించుకుంటుండగానే, ఆ చర్చను ఆసక్తికరంగా దూరం నుంచి వింటున్నాడు నారాయణరావు.
   
    "పెద్దలకంతా బుద్ది చెప్పాలని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నార్ట....బాగానే వుంది. అలాంటి ప్రేమల్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.....రేపు మన పిల్లలు, మనల్ని ఎదిరించి, ఈ ఉద్యమంలో చేరిపోతే మన పరువేం గానూ" ఒకావిడ సీరియస్ గా అంది.
   
    "మీకు చిన్నప్పుడు పెళ్ళయిందని మీరలా అంటున్నారు గానీ ఆంటీ- ఈ కాలంలో మనం ప్రేమను సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది" అని ఇంకొకావిడ అంది.
   
    "అలా అని లవ్ మ్యారేజ్ ని నువ్వు సపోర్ట్ చేస్తే ఎలా? ఓ పని చెయ్-మీ ఆయనకి విడాకులిచ్చేసి ఎవడ్నో ప్రేమించు-అప్పుడు నీకు తెలుస్తుంది" యింకొకావిడ గయ్ మని లేచింది.
   
    "మనం ఒక పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నాం- పర్సనల్ టాపిక్స్ మీద కాదు" మొదటావిడ ఉక్రోషంగా అంది.
   
    "ప్రేమంటే పర్సనల్ టాపిక్కే-ఏ సబ్జెక్టు గురించైనా మాట్లాడే టప్పుడు తెల్సి మాట్లాడాలి తెల్సీ తెలియకుండా వాగకూడదు. అర్ధమయిందా? ప్రేమ, ప్రేమ అని అంటారు. సినిమాల్లో మాదిరి హీరో, హీరోయిన్స్ లా ఉండాలనుకుంటున్నారు. సెల్యులాయడ్ లవ్ వేరు-రియల్ లైఫ్ లవ్ వేరు. ఎంత మంది ప్రేమ పేరుతో బలైపోతున్నారో ఒక్కసారి బొంబాయి వెళితే మీకు తెలుస్తుంది." వాళ్ళ వీధిలో మహిళా మండలి సెక్రటరీ అయిన ఒకావిడ అంది.
   
    "ఆ మధ్య నువ్వు బొంబాయి వెళ్ళావని మాకు తెలుసులే తల్లీ-ఆ పేరుతో బొంబాయి విషయాలేం నువ్వు చెప్పక్కరలేదు- మేమూ బొంబాయి ఇవాళ కాకపోతే రేపెళతాం...." యింకోకావిడ అసూయగా అంది.
   
    "నేను నా బొంబాయి ట్రిప్పుల గురించేం చెప్పడంలేదు. ఉన్న యదార్ధాన్ని చెపుతున్నాను. బొంబాయి కామాటిపురా ఏరియాలో కాల్ గర్ల్స్ స్టోరీలు వినండి- నూటికి అరవై శాతం మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో వంచింపబడుతున్నవాళ్ళే.....ఇంకానా, ఇకపై సాగదని ఎవరయినా ఒక ఉద్యమం తీస్తే ఎంతో బావుంటుంది" మొదటి ఆవిడ ఆవేశంగా అంది.
   
    "ఎవరయినా ఉద్యమంతీస్తే ఎందుకు బాగోదు__చాలా బాగుంటుంది. మనం కబుర్లు చెప్పుకోటానికి చాలా బాగుంటుంది__ న్యూస్ పేపర్ లలో వార్తలుగా చదవటానికి చాలా బాగుంటుంది__ నీ గురించి నేనేం అనడంలేదు__ జనరల్ గా చెపుతున్నాను __ మన గురించే మనం అనుకుందాం__రాత్రి ఎనిమిదయిన దగ్గర్నుంచి మన మొగుళ్ళకోసం మనం వాచిపోయినట్లుగా చూస్తాం__తొమ్మిదయ్యేసరికి తలుపులు బిడాయించేసుకుని మొగుడ్ని కావలించుకుంటాం__ అవునా.... కాదా.....? మనకు ప్రేమ గురించి మాట్లాడే హక్కుందా చెప్పు......? అలాగని నేను లవ్ మ్యారేజెస్ ని సపోర్టు చేస్తున్నాననుకోకు__ మన వ్యవహారం చెప్తున్నానంతే....."
   
    గయ్ మని లేచిందావిడ.
   
    "ఊరుకోండర్రా.....వాళ్ళెవరో ప్రేమించుకుంటే మనం ఎందుకు ఇలాగయిపోవడం" పెద్ద వయసావిడ అందరి నోళ్ళు మూయించటానికి ప్రయత్నించింది.
   
    "అది కాదు పిన్నిగారూ.....పూర్వపు రోజుల్లో ప్రేమలు నిష్కల్మషంగా ఉండేవి. దేవదాసు సినిమా చూడండి__అందులో పార్వతి అర్ధరాత్రి పూట దేవదాసు ఇంటి కెళ్ళినపుడు ఎంత దూరంగా నిలబడి మాట్లాడుకున్నారు__ఇప్పుడు సినిమాలు చూడండి__ హీరో, హీరోయిన్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కుక్కల్లా కరిచేసుకునట్లు ఉంటారే తప్ప ప్రేమికుల్లా ఉంటారా? పూర్వకాలపు హీరో నీ మనసుని గెలిచి నిన్ను ప్రేమిస్తాను అంటే, నేటి కాలపు హీరో నిన్ను రేప్ చేసి నేను పెళ్ళి చేసుకుంటాను అని అంటున్నాడు..... నేత వ్యత్యాసం వచ్చేసిందో చూడండి. అంచేత.....ఈ ప్రేమలు నిజం కావు.....మోసపూరితమయిన ఈ ప్రేమల మీద మనం ధ్వజం ఎత్తాల్సిన అవసరం వుంది....."
   
    ఆ మహిళా మాణుల ఉపన్యాసం వింటూ ఆనందం భరించలేక చప్పట్లు కొట్టాడు నారాయణరావు.
   
    తనకి ఎదురుగా నిలబడి, ఫోజుగా చప్పట్లు కొడుతున్న నారాయణరావు వేపు వింత వస్తువును చూస్తున్నట్లుగా చూశారు వాళ్ళంతా.
   
    "ఆంటీలూ.... గుడ్....మంచి డెసిషన్ కు వచ్చారు.... మీరు ప్రేమ పెళ్ళిళ్ళకు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకుని చాలా మంచి పని చేశారు....." అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నారాయణ రావు.
   
    "ఇంతకీ నువ్వు ఎవరు బాబూ....." ఒకావిడ అడిగింది.
   
    "ఏం చెప్పమంటారు....చెప్పండి.... నేనొక అమ్మాయి చేతిలో ఘోరాతి ఘోరంగా మోసపోయినవాడ్ని.....నా కధ చెప్పమంటారా....." అడిగాడు నారాయణరావు.
   
    "సింగిల్ ఎపిసోడా.....సీరియలా....." అడిగింది ఒకావిడ.
   
    "టెలీ ఫిలిమ్" చెప్పాడు నారాయణరావు.
   
    "అయితే చక చకా చెప్పేయ్ ప్రకటనలు లేకుండా" అంటూ ఒకావిడ లిప స్టిక్ అడ్డుకొనే కార్యక్రమంలో పడింది.
   
    "అనగనగా ఒకమ్మాయి..... ఆ అమ్మాయీ నేనూ వైజాగ్ బీచ్ లో కలుసుకున్నాం..... భీమిలి బీచ్ లో తిరిగాం.... కాకినాడ బీచ్ దగ్గర కాఫీలు తాగాం.... ఆ ఆమ్మాయికి సముద్ర మన్నా, బీచులన్నా చాలా యిష్టం.... కానీ మన ఆంద్రదేశంలో ఎన్ని బీచులున్నాయో చెప్పండి? వున్న బీచులన్నిటికి తిప్పాను.... ఆఖరికి మద్రాసు బీచ్ కి తీసికెళ్ళాను.....పాండిచ్చేరి బీచ్ కు తీసుకెళ్ళాను..... ఆప్పటికే నా దగ్గరున్న ఫండ్స్ అయిపోయాయి..... కానీ తను నన్ను ప్రేమిస్తుందో లేదొ చెప్పలేదు.....ఆఖరికి ఒకసారి నిలదీసి అడిగేసాను ....అప్పుడందా పిల్ల-
   
    నేన్నిన్ను ప్రేమించాలంటే, నన్ను నువ్వు ప్రపంచంలోని బీచ్ లన్నిట్నీ చూపించాలని-
   
    అప్పుడే నాకు ఆ అమ్మాయి మనసు బాగా అర్ధమైపోయింది.....నేను బాగా ఆలోచించాను....ప్రేమంటే కులాతీతంగా, మతాతీతంగా ఆర్దికాతీతంగా వుండాలి అవునా? ప్రపంచంలోని బీచులన్నిటికీ నేను తిప్పాలని ఆమె నన్ను ఎందుకడిగిందో ఆలోచించిన మీదట నేను డబ్బున్న వాడ్నో__లేదోనని ఆవిడ నన్ను టెస్ట్ చేసిందని అర్ధమైంది_అప్పుడే ఆమె డబ్బు మనిషని కూడా నా కర్ధమైంది....ఆర్ధిక విలువల కొలబద్దంగా నిలిచే ఈ ప్రేమ నాకఖ్కరలేదని.....అప్పుడే ఆమెను నేను వదిలేసి వచ్చేసాను."

 Previous Page Next Page