Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 37

   
    దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు.

    ఆమెకి తన తప్పు తెలిసొచ్చింది. తను ఎంత పాపపుపని చేసిందో అర్ధమైంది. ప్రాయశ్చిత్తంకోసం ఆమె ఇంటికి వచ్చేవరకు తనకు తెలిసిన స్తోత్రాలను మనసులోనే వల్లె వేసుకుంది.

    ఆమె ఇంటికి చేరేసరికి ఆమె తల్లీ తండ్రి కాలు కాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు.

    ఆమె వీధిలో కనపడగానే పరుగున ఎదురెళ్ళారు.

    "ఏమైందమ్మా?" అంటూ తప్పిపోయి దొరికిన దానిలా కౌగిలించుకున్నారు.

    "కోడెదూడ తప్పించుకుంది ఆంజనేయుల గుడి దగ్గర. దాంతో ఆలస్యం" అని చెప్పింది. రవి వచ్చాడని చెప్పకుండా దాచిపెట్టింది.

    "పోనీలేమ్మా -క్షేమంగా వచ్చావు - అంతే చాలు" అని లోపలికి తీసుకెళ్ళారు.

    ఆ రాత్రి నిద్ర రాలేదు ప్రవీణకు.

    ఎద పరుపుకేసి వత్తుకున్నప్పుడంతా అతని వేళ్ళ స్పర్శ మనసులో మెదిలేది.

    తనకెంతో పాపం చేస్తున్నట్టు అనిపిస్తున్నా ఆ ఆకర్షణ నుంచి దూరం కావడం వీలుపడడం లేదామెకు.

    రెండుసార్లు చన్నీటి స్నానం చేసింది.

    ఎప్పుడో తెల్లారగట్ట మగత నిద్రలోకి జారిపోయే వరకు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూనే వుంది. ఇది జరిగాక అతనిని చూడాలని వున్నా వీలు చిక్కింది కాదు.

    వారం రోజుల తరువాత ఓ రోజు సాయంకాలం ప్రవీణ అతన్ని చూసింది.

    అతన్ని చూడడం మామూలుగా జరగలేదు. నాటకీయంగా అతను తటస్థపడడం జరిగింది.

    ఆ సాయంకాలం వేళ ఆమెకు బాగా ఆకలేసింది.

    అమ్మ దగ్గరికి వెళ్ళి "ఆకలేస్తోందే" అంది.

    ఆమె డబ్బాలన్నీ వెదికిందిగానీ తినుబండారాలు ఏమీ దొరకలేదు.

    "ఇంట్లో ఏమీలేవుగానీ - మాధవయ్య ఈ రోజు నూర్పుళ్ళు చేస్తున్నాడు. అక్కడ అంగళ్ళు పెట్టుంటారు. అక్కడికెళ్ళి ఏమైనా దొరుకుతాయేమో చూడు"  అంది ఆమె.

    ఆ ఊర్లో అలా నూర్పుళ్ళు జరుగుతూ వుంటే కొందరు గంపల్లో మురుకులు, వాంపొడిలాంటి తినుబండారాలను తీసుకొచ్చి పొలాల దగ్గర అమ్ముతుంటారు. చిన్న గ్లాసులాంటి చిట్టికి రెండు మురుకలను ఇస్తారు. రవి తల్లి మామూలుగా వచ్చే తినుబండారాలను అమ్ముతుంటారు.

    ఆ రోజు ఆమెకు నలతగా వుంటే కొడుకును పంపించింది. అతను నూర్పుళ్ళు జడుగుతున్న చోటుకి కొంచెం దూరంలోవున్న షెడ్డులో గంపను పెట్టుకుని కూర్చున్నాడు.

    నూర్పుడి పూర్తయ్యాక కూలీలకు డబ్బులకు బదులు ధాన్యం ఇస్తారు. కూలీలు వచ్చి ధాన్యం ఇచ్చి తినుబండారాలను తీసుకుంటారు. అంతవరకూ  ఖాళీ కాబట్టి షెడ్ లో కాలక్షేపం చేస్తున్నాడతను.

    ప్రవీణ ఒంటినిండా ధాన్యం పోసుకుని వచ్చింది. నూర్పుళ్ళ దగ్గరికి వచ్చి అడిగింది. "అంగడి అమ్మే వాళ్ళు ఎవరైనా వచ్చారా?"
   
    "ఆఁ - షెడ్ లో వుంది అంగడి" కూలీలు చెప్పారు.

    ఆమె షెడ్ లోకి వెళ్ళింది.

    లోపలికి వెళ్ళగానే షాక్ తగిలినట్టు చూస్తుండి పోయింది. అతనూ అదే అవస్తలో వున్నాడు.
 
    ఆ సమయంలో అక్కడ అతనుంటాడన్నది వూహకందని విషయం ఆమెకి.

    "నువ్వూ.. నువ్వూ...." అంటూ వుండిపోయింది.

    అప్పటికి అతను తేరుకున్నాడు.

    "మా అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే అంగడి నేను తెచ్చాను" అని చెప్పాడు.

    అదన్నమాట విషయం. ఇక ఇక్కణ్ణుంచి తప్పించుకుపోవడం కష్టం. ఏదో కొనుక్కుని వెళ్ళాలి అని నిర్ణయించుకుంది ఆమె.

    "మురుకులు" అంటూ పైటకొంగులో మూటకట్టుకుని తెచ్చిన ధాన్యాన్నిచూపించింది.

    "ఇలా పోయండి" అతను చాట ఎత్తుకున్నాడు.

    ఆమె అందులోకి ధాన్యం పోసింది.
   

 Previous Page Next Page