Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 36

    
    ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు.

    ఆంజనేయులు గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మసక వెలుతురు కూడా మాయమైపోయింది.

    ఆ గుడి దగ్గర నాలుగైదు అంగళ్ళు వున్నాయి! అవేగాక దాదాపు పది కుటుంబాలు నివసిస్తున్నాయి.

    గుడి దగ్గర తమవాళ్ళున్నారేమో చూడడానికి రవి తన భుజం మీదున్న పాత్రను కింద దించిపెట్టాడు. ప్రవీణ కూడా బుట్టను దించింది. ఆమెకు అలవాటు లేకపోవడంవల్ల భుజం నొప్పిపుడుతోంది.

    "మనవాళ్ళెవరూ ఇక్కడ లేరే" అని రవి అటూ ఇటూ పరకాయించి చూస్తున్నాడు.

    అప్పుడు గుడి దగ్గరుండే ఓ స్వామివచ్చి "నువ్వేనా రవి?" అని అడిగాడు.

    "అవును స్వామీ! ఏమిటి?"

    "మీ ఊరివాళ్ళు వెళ్ళిపోయారు. చీకటి పడిపోతూవుందని బయల్దేరారు. మీరొస్తే రమ్మన్నారు" అని స్వామి వెళ్ళిపోయాడు.

    "మనవాళ్ళు వెళ్ళిపోయారట" అన్నాడు రవి.

    ప్రవీణలో ఆందోళన ప్రారంభమైంది.

    "మరెలా?"

    "వెళదాం"

    ఇద్దరూ బయల్దేరడానికి తిరిగి బుట్టలెత్తుకుంటూ వుండగా బయటున్న జనం చెల్లాచెదురై పోతున్నారు. భయంతో కేకలు పెడుతున్నారు.

    "ఏమైంది?" గుడినుంచి బయటికి పరిగెడుతున్న ఓ వ్యక్తిని అడిగాడు రవి.

    "నాయుడోళ్ళ కోడెదూడ కట్లు తప్పించుకుని వీధిలో పడిందట. అది మనిషి కనిపిస్తే కుమ్మిపారేస్తుంది.
లోపలికెళ్ళండి" అని చెప్పి ఆ వ్యక్తి ఎదురుగా వున్న టీ అంగట్లోకి వెళ్ళిపోయాడు.

    ఈ మాట విని భయంతో ప్రవీణ లోపలికి ఓ గెంతు గెంతింది. రవి కూడా బుట్టలను అలా బయటే వదిలిపెట్టి ఆమెను అనుసరించాడు.

    కోడెదూడ అరుపు గుండెల్ని చీలుస్తోంది!

    ఏదో పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయినట్లు ఆమె వణికిపోతోంది.

    "ఛీ! అలా భయపడకు" రవి సముదాయించాడు గానీ ఆమె కుదుటపడలేదు.

    ఇక లాభం లేదనుకుని గుడి వరండాకున్న తలుపుల్ని అతను మూశాడు. అప్పటికి సర్దుకుంది ఆమె.

    ఆ గుడి చాలా పెద్దది! వరండాలో వాళ్ళున్నారు.

    లోపల ఎవరూలేరు అంతా నిశ్శబ్దంగా వుంది.

    కోడెదూడ అరుపు గుడిని, ఆ పరిసర ప్రాంతాల్ని కుదిపేస్తోంది. ఆమె భయంతో అతని పక్కకి జరిగింది.

    అతను ఆమె భుజాన్ని పోదివి పట్టుకున్నాడు.

    గుడి ముందు నుంచి కోడెదూడ వెళుతోంది. నల్లగా కొండకు కొమ్ములు మొలిచినట్లుంది అది. దాన్ని చూస్తూనే భయం పుడుతోంది. అది అలా వెళ్ళి ఎదురుగా వున్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొంది. దాంతో గుడిలో కరెంట్ పోయింది.

    మసక వెలుతురు తప్ప మరేం లేదు. చీకటి శరీరంపై లేచిన బొల్లి మచ్చలా వుంది మసక వెలుతురు. ఆమె మరింతగా అతనికి అతుక్కుపోయింది. ఇప్పుడామె ఎద అతనికి తగులుతోంది.

    అతనిలో సంచలనం ప్రారంభమైంది. అతని చేయి కిందకు దిగి ఆమె ఎద నునుపుని పరీక్షిస్తోంది.

    మంత్రం వేసినట్టు మత్తు ఆవరిస్తోంది ఆమెకి.

    అతని చేతులు మరింత కిందకు దిగి బాసందు పోసిన పింగాణీ గిన్నెలా వుండే బొడ్డును తడుముతోంది. అసత్యంలా గోచరించే నడుము అతని చేతిలో చిక్కి తను వున్నానన్న సత్యాన్ని నిరూపించుకుంటోంది అంతలో ఏం జరిగిందో తెలియదుగానీ ఠక్కున లైట్లు వెలిగాయి. అతను సర్దుకున్నాడు.

    ఆమె అతని పక్కకు జరిగింది.

    "తలుపులు తెరవండి. కోడెదూడ వెళ్ళిపోయింది" ఎవరో అరుస్తున్నారు.

    అతను తలుపులు తెరిచాడు. అంతవరకు టి అంగట్లో కూర్చున్న పూజారి వచ్చాడు.

    ప్రవీణ ముందు తేరుకుని బయటపడింది.

    ఇద్దరూ బుట్టల్ని ఎత్తుకున్నారు.

 Previous Page Next Page