"మమ్మీ....నేను తాతగారి దగ్గరే వుండి చదువుకుంటాను ప్లీజ్ మమ్మీ-"
"బాగుందమ్మా! ఆయనకే చూసేవారు లేరు. నీవొక్కర్తివీ ఆయనకి... బాగుంది నీ సంగతి - ఎన్నాళ్ళుండి పోతానంటావు. ఆడపిల్లవు ఆయనేం చూస్తారు నిన్ను. అయినా నేను ఎన్నాళ్ళు వదిలి ఉండాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పిచ్చి మాటలు మాట్లాడకు. అక్కడ నీ కోసం సీటు అదీ చూసి డబ్బుకూడా కట్టేశాం. మీ డాడీ యీసారి తప్పక తీసుకురమ్మన్నారు."
"ఏ డాడీ?" నిలేస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు యింకా పెద్దవి చేసి చూసింది. అర్చన కాస్త తడబడింది. "ఏ డాడీ ఏమిటి? నా దగ్గరుండే డాడి" అంది కాస్త కటువుగా. ఇంతపిల్ల అస్తమానూ నిలేస్తున్నట్టు అలా అడిగేసరికి అర్చనకి కోపం వచ్చింది.
"ఉహు....ఆ డాడి నాకొద్దు నేనిక్కడే వుంటాను" అంది మూతి బిగపట్టి పంతంగా.
"ఛా.... అలా అనకూడదమ్మా.. కొత్త డాడి నీకు వచ్చినపుదు ఆ డాడి మమ్మీల దగ్గరే వుండాలమ్మా...ఆ డాడి చాలా మంచివాడు తల్లీ." సదాశివంగారు అర్చన మొహంలోని బాధ గుర్తించి పూజకి నచ్చ చెప్పబోయారు. మా డాడి వుండగా ఆ కొత్త డాడీ దగ్గరకెందుకు వెళ్ళాలి తాతగారూ.."పూజ పెద్దదానిలా రీజనింగ్ లేవదీసింది. ఏడేళ్ళ పిల్ల అంత ఆరిందాలా మాట్లాడుతుంటే తల నెరిసిన సదాశివంగారు జవాబుకి తడుముకోవాల్సి వచ్చింది.
"అది కాదమ్మా..... మీ డాడీ మీ మమ్మీ దెబ్బలాడుకున్నారు. నీ స్కూల్లో నీవెవరైనా అమ్మాయితో పోట్లాడి వచ్చాననుకో. ఆ అమ్మాయితో మాట్లాడుతావా. ఆ అమ్మాయి పక్కన కూర్చుంటావా లేదుకదా. అలాగే మీ అమ్మ డాడి మాట్లాడుకోవడంలేదు. ఒక యింట్లో ఉండడం లేదు అందుకే మీ అమ్మ కొత్త డాడిని. మీ డాడికొత్త అమ్మని తెచ్చుకున్నారు మరి నీలాంటి చిన్నపిల్లలు అమ్మ దగ్గరుండాలికదా."
"కొత్త డాడి దగ్గిరే ఎందుకుండాలి... మా డాడి దగ్గర, కొత్త అమ్మ దగ్గర ఉండకూడదా." మళ్ళీ బాంబు వేసింది. అర్చన మొహం ఎర్రబడింది సదాశివంగారు మళ్ళీ తడబడ్డారు.
"అది కాదమ్మా. అమ్మలు పిల్లలకి కావాల్సినవన్నీ చూస్తారు కాని డాడీలు చేస్తారా. నీకు నీళ్ళుపోయాలి. తల దువ్వాలి, అన్నం పెట్టాలి. హోం వర్క్ చేయించాలి. యివన్నీ డాడీలు చెయ్యడానికి ఆఫీసుకెళ్ళాలి గదా వాళ్ళు."`
"కొత్త అమ్మ వుందిగా - ఆ యింట్లో-"
"అసలు అమ్మ వుండగా కొత్త అమ్మ ఎందుకు చేస్తుంది పూజా. తల్లీ నీవు చిన్నపిల్లవి "అమ్మ" అంటే అర్ధం తెలియదు. లోకంలో అమ్మలా ఎవరూ చూడరమ్మా పిల్లలని. కొత్త అమ్మ వుందిగాని నీకు అసలు అమ్మగాదుగదా నీకన్నీ చేయడానికి.....సదాశివంగారు చెప్పేదంతా శ్రద్దగా విన్నా ఆ జవాబు అంత తృప్తినివ్వలేదన్నట్టుగా వుంది పూజ మొహం.
అర్చన కోపంగా ఏదో అనబోతుంటే, సదాశివంగారు కళ్ళతో వారించారు, వెళ్ళమ్మా నే కాసేపు నిద్రపోతా బయటికిపోయి ఆడుకో అని పంపేశారు మనవరాలిని.
"ఏమిటి మామయ్యగారూ! ఈ పూజ యిలా మాట్లాడుతూంది. పట్టుమని ఏడేళ్ళు లేని పిల్ల దీని రీజనింగు చూస్తే నాకేదో భయంగా వుంది. రాజేష్ అంటే దీనికెందుకో యిష్టంగా వున్నట్టులేదు" కలవరంగా అంది అర్చన.
"ఈ కాలం పిల్లలు మనం చిన్నపిల్లలు అనుకుంటాంగాని, వాళ్ళకి అన్నీ తెలుసమ్మా. వాళ్ళ స్కూల్లో పిల్లలకి అమ్మా నాన్నా యిద్దరూ వుంటారుగదా.....తన కెందుకు ఈ కొత్త డాడి అనుకుంటుందేమో పూర్తిగా చెప్పినా అర్ధంకాని వయసు.....నాలుగు రోజులు పోతే అదే సర్దుకుపోతుందిలే. వుండడం ఆరంభిస్తే అదే అలవాటవుతుంది" అర్చనకి ధైర్యం చెపుతూ అన్నారు.
"ఏమిటో దాని ధోరణి యిలా వుంది. ఏదో పరిస్థితులు చక్కబడ్డాయి. నా అదృష్టంకొద్దీ రాజేష్ లాంటి వాడు దొరికాడు అనుకుంటే యిదేం కొత్త సమస్యలు సృష్టించదు కదా .... అసలు దీనికి వాళ్ళ నాన్నెవరో తెలియడం ముప్పు వచ్చింది ఈమధ్య ఆయన వస్తూ పోతూ వుండడంతో యీ ప్రాబ్లమ్ వచ్చింది. ఇక్కడ వుంచి పొరపాటు చేశాను అని అనలేక యిన్ డైరెక్టుగా అంది.
"ఇవాళ కాకపోతే రేపు కాస్త జ్ఞానం వచ్చాక అయినా సంగతులు తెలియక దాగవుగదా. నీవనవసరంగా లేనిపోనివి వూహించకమ్మా చిన్నపిల్ల నాలుగురోజుల్లో సర్దుకుపోతుంది" అభయం యిస్తున్నట్టు మాట్లాడారు సదాశివంగారు ఆయన అన్నంత తేలిగ్గా తనని తాను నమ్మించుకోలేకపోయింది అర్చన.
* * *
"వెల్ కం హోమ్ పూజా!" టాక్సీ దిగి సామాన్లతో లోపలికొచ్చిన అర్చన వెంట వున్న పూజని చూసి పలకరింపుగా నవ్వుతూ అని అర్చన చేతిలోని బాబుని అందుకుని పూజ భుజం చుట్టూ అభిమానంగా చెయ్యి వేశాడు రాజేష్. పూజ తల్లి వెంట లోపలికొచ్చి బితుకు బితుకుమనిచూసింది చుట్టూ. రాజేష్ దగ్గిరికి వచ్చి పలకరించగానే ముడుచుకుపోయి చటుక్కున రాజేష్ చెయ్యి భుజం మీదనించి తప్పించి తల్లివెనక వెళ్ళి నిలబడింది. ప్రయాణం అయి వచ్చి సామాన్లు లోపలికి చేరవేసే హడావుడిలో రాజేష్, అర్చన యిద్దరూ ఆ విషయం పట్టించుకోలేదు. పూజకి జ్ఞానం వచ్చాక తాతగారి యిల్లు వదిలి రావడం యిదే మొదలు. కొత్తచోట, కొత్త మనుష్యులు, ఆఖరికి తల్లికూడా కొత్తగా అన్పించి బెరుకుగా చూస్తూ కిటికీ దగ్గరకి వెళ్ళి నిలబడింది.
"పాలు కాచాను....కాఫీ డికాషన్ వేశాను బ్రెడ్ తెచ్చాను ఈపూట యింక టిఫిను అది పెట్టుకోకు ఆదివారమెగా పెందరాడే ఏకంగా భోజనం చేసేద్దాం" రాజేష్ అన్నాడు. "సరేసరే ముందు కాఫీ తాగనీయండి, మంచి కాఫీయే దొరకదు వెధవ రైల్లో. బాబుకి కూడా పాలుపట్టాలి" అంటూ చుట్టూచూసి కిటికీ దగ్గిర నిలబడి కొత్తగా చూస్తున్న పూజని చూసి "పూజా....ఆ బూట్లు అవి విప్పి అక్కడపెట్టు. నీ టూత్ బ్రష్ తీసుకెళ్ళి బ్రష్ చేసుకురా. పాలు తాగుదువుగాని, అదిగో అదే బాత్ రూం" అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది. తల్లి మాటలు వినికూడా అలాగే నిలబడ్డ పూజని చూసి "ఏది నీ పెట్టె, బ్రష్ అది పెట్టెలో వుందా.....పద, ఆ గదిలో పెడతాను నీ సూట్ కేస్...అర్చనా పూజ సూట్ కేస్ తాళం ఏది...."