Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 38


    "బ్రష్ అది జిప్ బ్యాగ్ లోనే వున్నాయండి" అంది అర్చన వంటింట్లోంచి.
    రాజేష్ పెట్టెలు గదిలోపెట్టి వచ్చి జిప్ బ్యాగు తెరిచి కారియరు, ప్లేట్లు, గ్లాసులు, ఫ్లాస్కులు అన్నీ తీసి కిందపెట్టి పోచ్ లోంచి టూత్ పేస్ట్ బ్రష్ లు తీశాడు- "పూజా యిందులోనీ బ్రష్ ఏదో చూసి తీసుకో" అన్నాడు. పూజ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి రాజేష్ వంక చూడకుండానే తన బ్రష్ తీసుకుని బాత్ రూం వైపు వెళ్ళింది.
    "పూజకి అంతా కొత్తగా వున్నట్టుంది. సీరియస్ గా వుందేం" అన్నాడు వంటింట్లో కాఫీ కలుపుతున్న అర్చన దగ్గిరికి వెళ్లి, వచ్చేముందు పూజ చేసిన గొడవ, ఏడ్చిన ఏడుపు-మొండితనం అది యిప్పుడు చెప్పడానికి ఓపిక తీరిక లేక ఆ గొడవంతా చెప్పి రాజేష్ మనసుకూడా ఎందుకు పాడు చెయ్యడం అని "అంతా కొత్తగదా.....రెండురోజులు పోతే అదే సర్దుకుంటుందిలెండి" అంది పొడిగా.
    పళ్ళుతోముకుని వచ్చి డైనింగు టేబిల్ దగ్గిర తల్లి యిచ్చిన పాలగ్లాసు పెట్టుకుని కూర్చుంది. అర్చన, రాజేష్ ప్రయాణం గురించి, అక్కడ శకుంతలాదేవి మరణం గురించి మాట్లాడుకుంటుంటే మౌనంగా కూర్చుంది. "నీళ్ళు పోసుకుంటావా-పద, నీ బట్టలు తెచ్చుకో, షాంపు చేసుకుందువు గాని, ప్రయాణం చేశాం కదా మట్టి అయి వుంటుంది తల అంతా" అంటూ అర్చన డైనింగు టేబిల్ దగ్గిరనించి లేచి గదిలోకి వెళ్ళి పూజ సూట్ కేస్ తీసి బట్టలు పైకి తీయబోయింది. తల్లి తీసిన గౌనుకాకుండా తను మరొక గౌను, పేంటితీసింది పూజ. అర్చన ఒకసారి పూజవంక చూసి తనచేతిలో బట్టలు పెట్టెలో పడేసింది. ఏం అనకుండా పూజ వెంట అర్చన బాత్ రూములోకి వెళ్ళిగీజరులోంచి వేడినీళ్ళు తీసి-"రా, తల రుద్దుతాను, ఆ గౌను విప్పు తొందరగా, యింకా తమ్ముడికి కూడా నీళ్ళుపొయ్యాలి" అంది.
    "నేను పోసుకుంటాను నువ్వెళ్ళు" అంది పూజ.
    "తల రుద్దుకోడం నీకేం చాతనవుతుంది. నన్నుపోయనీ. నా దగ్గిర నీకు సిగ్గేమిటే, ముందా గౌను విప్పు" అంది అర్చన పూజ గౌను తీయపోతూ పూజ తల్లిచెయ్యి విదిలించి "నేపోసుకుంటాను. నాకు వచ్చు. నువ్వెళ్ళు బయటికి" అంది మొండిగా తన పెద్ద కళ్ళును యింకా పెద్దవి చేసి తల్లిని చూస్తూ ఆ చూపు చూస్తే, ఆ కళ్ళల్లో మొండితనం, అదోరకం తెగువ, తిరస్కారం. కనపడి అర్చన ఒక్కనిముషం అచేతనంగా నిలబడిపోయింది.
    పూజని కేకలేస్తే....రాజేష్ వింటాడేమో వచ్చిన రోజునే వాదన సీను చెయ్యడం యిష్టంలేక అర్చన కూడా కాస్త విసురుగానే చేతిలోచెంబు కింద పెట్టేసి విసురుగా బాతురూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అంత చిన్నపిల్ల తన అయిష్టతని తెగేసి చూపిస్తుంటే కన్నతల్లి ఐనా ఆక్షణంలో కూతురు పరాయిదానిలా కన్పించి ఎడాపెడా వాయించాలన్న ఆవేశాన్ని అతికష్టంమీద అదుపులో పెట్టుకోగలిగింది. యిదేమిటి ప్రతిదానికి యింత మొండితనంగా తయారయింది- అనుకోకుండా వుండలేకపోయింది.
    తల్లి భోజనానికి పిలిస్తే మౌనంగా తిని, రైల్లో కొనుక్కున్న కామిక్స్ చదువుకుంటూ అలాగే నిద్రపోయింది. సాయంత్రం లేచి పాలు తాగి మళ్ళీ పుస్తకాలలో తలదాచుకొని కూర్చుంది. "పూజా ఏమిటలా డల్ గా వున్నావు. అంతా కొత్తగా వుందా-మన పక్కఫ్లాట్ లో నీఏజ్ అమ్మాయి వుంది. 'తన్మయ' అని, నీ క్లాసే. నీవు చేరబోయే స్కూల్లోనే చదువుతూంది" రాజేష్ అన్నాడు. "పద నిన్ను తీసికెళ్ళి యింట్రడ్యూస్ చేస్తాను" అన్నాడు. పూజకి తోచకుండా ఒక్కర్తి అని-పూజ అలా ఆ యింటికి చెందనిదానిలా పరాయిదానిలా కూర్చుంటే రాజేష్ ఏదో ఎంబ్రాసింగ్ గా ఫీలయ్యాడు. పూజ లేవలేదు- "రేపు కలవచ్చులెండి- యివాళేగా వచ్చింది దానికీ టైర్ డ్ గా వుందేమో" సర్ది చెపుతూ అంది అర్చన కూతురి మొండి వైఖరి గుర్తించి.
    "భాభీజీ! ఆగయే అప్" అంటూ సునీత, మెహతా లోపలికి వచ్చారు అప్పుడే. "ఓహో.....ఏహైపూజ బేటీ. హలో పూజా.....హౌడూ యుడూ" సునీత చనువుగా పూజ దగ్గిరికి వెళ్లి భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గిరికి తీసుకుంది. "అబ్బ! నీ కూతురు ఎంత బాగుంది అర్చనా.....చిన్నప్పుడు నీవు యిలాగే వుండేదానివేమో" మెచ్చుకుంటూ అంది. అర్చన నవ్వింది గర్వంగా. పూజ మోహంలో సంతోషం ఛాయ కదిలింది. "తనూ...ఆప్ కో ఏక్ దోస్తు మిల్ గయే" కూతురిని పిలుస్తూ చూపించింది. తన్మయ సిగ్గుసిగ్గుగా నవ్వింది.
    "కూర్చోండి- కూర్చోండి భాయిసాబ్.....పూజా తన్మయని నీ గదిలోకి తీసికెళ్ళి నీ పుస్తకాలు అవీ చూపించు" అంది అర్చన. తన్మయే చనువుగా పూజ చేయి పట్టుకుని గదిలోకి తీసికెళ్ళింది.
    "పాపం పూజకి కొత్తగా ఉన్నట్టుందేం. అట్టే మాట్లాడదా" సునీత అంది.
    "చిన్నప్పటినించి మామ్మ తాత కంపెనీ అలవాటయి వాళ్ళని బాగా మిస్ అవుతూంది" అర్చన అంది.
    "వచ్చిన దగ్గిరనించి డల్ గా కూర్చుంది" రాజేష్ అన్నాడు.
    "మా యింటికి పంపించండి. పిల్లలు కలిస్తే కొత్త పోతుంది....అయినా ఏదీ వచ్చి ఇంకా రోజయినా కాలేదుగదా-" మెహతా అన్నాడు.

 Previous Page Next Page