ఇప్పుడు ఇంట్లో పరాయిదానిలా.... ఏ బంధువుననీ చెప్పుకోడానికి కాక. ఏపని చెయ్యాలో, ఎలా కల్పించుకోవాలో.....అలా అని ఎలా అంటిముట్టనట్టు కూర్చోవాలో అర్ధంకాక తికమక పడిపోయింది అర్చన. రామకృష్ణ, పద్మ కర్మకాండలు చేస్తున్నారు ఆడపడుచు సరళ తన అన్నగారికి అర్చనవల్ల ఘోర అన్యాయం జరిగిపోయిందన్నట్టు మొహం గండిపెట్టుకుని అర్చనతో అసలు మాట్లాడలేదు. మిగతా బంధువులు వ్యంగ్యంగా, హేళనగా చూడడం తప్ప అర్చనని పలకరించలేదు. ఆ ఇంట్లో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లయింది అర్చన పని. ఏ పదోరోజుకో వచ్చి ఒక రోజుండి పూజని తీసుకుని వెళ్ళాల్సింది ఇంత ముందుగా రాకుండా అని చాలాసార్లు అనుకుంది. నాలుగోరోజూ, ఐదో రోజూ ఒకసారి సదాశివంగారి దగ్గిర నెమ్మదిగా నేను పదో రోజూ వచ్చివుంటే బాగుండేది అనవసరంగా సెలవు వేస్టవడం, యిలా అందరి మధ్య నాకు." బిడియంగా అంది. అర్చన బాధ అర్ధంచేసికున్నారాయన. అభిమానంగా తలనిమిరి "ఇంతమంది వున్నా నీవుండడం నాకెంత ఓదార్పుగా వుందో తెలుసా అమ్మా నీ పొజిషన్ నాకు అర్ధం అవుతూంది." "నీవింక ఈ ఇంటి కోడలివికాదని, కూతురువని చెప్పానుకదమ్మా. నాకు సరళ ఎంతో నీవూ అంతే. నాకోసం ఒక్క నాలుగైదు రోజులు ఓర్చుకో.. ఈ పది రోజులు అవకుండా వెళ్ళిపోతే నేనేకాదు శకుంతల ఆత్మబాధపడుతుంది. అన్న ఆయన మాటని కాదనలేకపోయింది.
పూజకి మామ్మ చనిపోవడం, యింటినిండా బంధువులు హడావిడి మధ్య బిక్కమొహం వేసుకుతిరిగేది. మామ్మకి జబ్బుగావుందని...జబ్బుగా వున్నవాళ్ళు చచ్చిపోతారని, "చచ్చిపోవడం అంటే దేముడి దగ్గరకివెళ్ళి పోవడం అని తాతగారు చెప్పిన మాటలవల్ల తెలుసుకుంది. మామ్మ చచ్చిపోయాక యింక యిక్కడుండకుండా తల్లి దగ్గరకి వెళ్ళిపోవాలన్నది ఎందుకో నచ్చలేదు పూజకి.
"తాతయ్యా మరి మామ్మ చచ్చిపోయిందిగదా....నన్నిక్కడ ఇంక వుండనీయవా" ఒక రోజు మధ్యాహ్నం తాతగారి పక్కలో దూరి అడిగింది. ఆయన గభాలున మనవరాలిని గుండెలకదుముకున్నారు. "నా తల్లీ." అంటూ పట్టుకున్న గొంతుతో ఆర్ద్రంగా అన్నారు. "ఉండనీయక పోవడము కాదమ్మా" నీకు కావల్సినవన్నీ ఎవరు చూస్తారమ్మా స్నానం చేయించాలి. తల దువ్వాలి అన్నం పెట్టాలి. బడికి పంపాలి. యివన్నీ యింక ఎవరు చూస్తారమ్మా మామ్మలేదుగదా-"
"ఏం వంటావిడ వుందిగదా.... నాకేం నీళ్ళు పోసుకోడం రాదా, గౌనువేసుకోడంవచ్చు తాతయ్యా"- ఆశగా అంది.
"అదికాదు తల్లీ...ఆడపిల్లవి.. నీకు ఏం కావాలో చూడడానికి ఆడవాళ్ళుండాలమ్మా యింట్లో అయినా నిన్ను వదిలి పాపం మీ అమ్మ ఎన్నాళ్ళుంటుంది" పూజా.... యిన్నాళ్ళు పాపం ఏదో ఒకటి అడ్డొచ్చి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆపలేదు.... అమ్మకి నిన్నొదిలి వుండాలంటే బాధకదురా కన్నా-"
"అదేంకాదు-అమ్మకి కొత్త డాడి వున్నారు. కొత్త తమ్ముడున్నాడు. నే లేకపోయినా ఏం అవదు అమ్మ. తాతయ్యా నేను నీతోటే వుంటా తాతయ్యా!" మారాం చేస్తూ అంది పూజ.
"నా కన్నతల్లీ! నాకంతకంటే ఏం కావాలిరా నాన్నా-కానీ ఎలా అమ్మా నే హాస్పిటల్ కి వెళ్ళిపోతే యింట్లో నీవొకర్తివి ఉండాలి. అసలు మీ అమ్మ నిన్నొంటరిగా వదలదు అమ్మ ఉండగా నీకెందుకు తల్లీ యిబ్బంది పడి యిక్కడుండటం" మనవరాలి తల నిమురుతూ అన్నారు.
ఆయనకు పూజ ధోరణి కొంత ఆశ్చర్యంగానే అన్పించింది. తల్లి దగ్గరకు వెళ్ళదు-తనని అంటిపెట్టుకునే ఉంటుంది యిక్కడే వుంటానంటుంది. ఒంటరిగా వుండడానికైనా యిష్టపడుతూంది కాని వెళ్ళడానికి మొగ్గు చూపడంలేదు జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి ఇక్కడే పెరగడంవల్ల ఎటాచ్ మెంట్ పెరిగి అలా అంటుందా అనుకున్నారు అర్చన వెంట పంపకుండా తమ దగ్గర వుంచుకుని పొరపాటు చేశారేమో అన్పించింది ఆయనకి. అంతలోనే చిన్నపిల్ల నాలుగురోజులు పోతే అదే అలవాటయిపోతుంది అదే సర్దుకుంటుంది. యింకా తల్లిని పిల్లని వేరుచేయడం ధర్మం కాదు-యింట్లో ఆడ దిక్కు లేక థానే అవస్థపడాల్సిన స్థితిలో ఆడపిల్లని తనేం పెంచగలను అనుకున్నారాయన. తాతగారి గుండెల మధ్య తల వాల్చుకుని పడుకుంది పూజ యింకా ఏదో చెప్పాలని ఆ చిన్న మనసు ఆరాటపడుతోంది"యిక్కడుందా యిది ఏమిటి తాతగారి పక్కనచేరావు ఆయనని పడుకోనీయవా.....రా" అంటూ పిల్చింది.
"పిచ్చిపిల్ల దానికిక్కడ బాగా అలవాటయిందమ్మా! ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలంటే దానికి బెంగగా వున్నట్టుంది" అన్నారాయన. పూజ తలెత్తి తల్లివంక చూసింది.