Previous Page Next Page 
శుభోదయం పేజి 36


    "వదిలేయండి లాయర్ గారూ! ఎవరి పాపం వారిదే. కేసులు, కోర్టులు అంటూ తిరిగే ఓపిక నాకులేదు. అసలే ఈ గొడవ ఏమిటని బాధపడుతున్నాను. ఈ అపనింద తొలగిపోతే అంతేచాలు నాకు" రాధాదేవి విరక్తిగా అంది. "ఆ.....ఆటోడ్రైవర్ ఎవరో? ఎందుకు వచ్చి విషయం చెప్పడంలేదు" శ్యాం అన్నాడు.
    "వాళ్ళు డబ్బిచ్చి నోరు మూయించి వుండవచ్చు. లేదా వాళ్ళకి భయపడి మాకెందుకని వూరుకుని వుండవచ్చు" రాజారాం అన్నాడు.
    "ఆ ఆటోడ్రైవర్ ముందుకువస్తే సగంకేసు పరిష్కారం అయినట్టే" లాయరు అన్నాడు.
    "రాజారాం, నేను రేపు పేపరులో ఒక ప్రకటన యిద్దామనుకుంటున్నాను. ఒక ఆడపిల్లపై జరిగిన అత్యాచారంలో దోషులను పట్టుకు సహాయపడేందుకు ఆటోడ్రైవర్ మానవత్వంతో ముందుకువచ్చి సహాయపడవలెనని, ఆచూకీ తెలిపితే నూటపదహార్లు బహుమానం అని ప్రచురిస్తాను."
    "రాధా.....నీకెందుకీ గొడవ? ఇప్పటికే మాధవరావు మండిపడుతున్నాడు. నీవెందుకు తలదూర్చడం? ఇదీ నీ నిజాయితీ నిరూపించుకోవడానికి వేసిన ఎత్తనవచ్చు."
    "అననీ ఫరవాలేదు. అసలు దోషులు పట్టుపడేవరకు నాకు మనశ్శాంతి వుండదు. నామీద నింద తొలగిపోయేవరకు శాంతిగా బతకలేను. అంతేకాక... రేఖ... ఆ అమ్మాయి అంటే నాకెందుకో యిష్టం కలిగింది. ఈ కేసు పరిష్కరించడానికి నా చాతనయితే సహాయం చేస్తాను" రాధాదేవి పట్టుదలగా అంది.
    అన్నట్టుగానే మర్నాడు పేపరులో చిన్నప్రకటన యిచ్చింది. మాధవరావు అదిచూసి పళ్ళు కొరికాడు. పంతం కొద్దీ తను నిర్దోషినని నిరూపించుకుని తనకి బుద్దిచెప్పడానికి చేసిందని మండిపడ్డాడు. అసలే పోలీసురిపోర్టు యిచ్చినా వాళ్ళు ఎవిడెన్సు లేదంటూ కస్టడీలోకి తీసుకోనందుకు మంటగా వుంది. దానికితోడు ఈ ప్రకటనచూసి ఏదో అనమానం జరిగినట్టు చిందులుతొక్కాడు.
    "డాడీ! ఆంటీ మంచి ఆవిడ డాడీ! ఆవిడెందుకు చేయిస్తుంది..." రేఖ తండ్రితో వాదించింది.
    "నీకు తెలీదు. చిన్నపిల్లవి, మాట్లాడకు" అని గదమాయించాడు.
    తండ్రి ఎంత నమ్మకంగా చెప్పినా రేఖకి రాధాదేవిని అనుమానించ బుద్ది వేయలేదు. రాధాదేవి ఎవరో తల్లిద్వారా విని ఆశ్చర్యపోయింది. రాధాదేవి మీద అత్యాచారం జరిగితే తండ్రి నిర్ధాక్షిణ్యంగా ఆమెని ఎలా దూరంచేశాడో విని రాధాదేవి కూడా తనలాంటి అవమానానికి గురి అయింది కనకనే తన బాధ అర్ధంచేసుకుని ఓదార్చింది అని అర్ధంఅయ్యాక ఆమెపట్ల గౌరవం, అభిమానం యినుమడించింది. తండ్రి ఆమెమీద ఎందుకలా కత్తికట్టాడో, ఆమెనేరం ఏమిటో అర్ధంకాక తండ్రిని సమర్ధింపలేక, కాదనలేక బాధపడింది. మూడురోజులు ఆస్పత్రిలోవుండి యింటికి వచ్చాక, కాలేజీకి వెళ్ళే శక్తియింకా లేక యింటిపట్టునే వుంది రేఖ. తనేదో తప్పుపని చేసినట్లు కాలేజీకి వెళ్ళాలంటే బెరుకుగా, సిగ్గుగా వుంది రేఖకి. స్నేహితులంతా వచ్చి ఎంతో సానుభూతిగా, దయగా ప్రేమగా మాట్లాడేవారు. ఏమీ జరగనట్టే ప్రతివాళ్ళు మాట్లాడినా వారి కళ్ళలో తనపట్ల సానుభూతి రేఖకి కనబడేది. రాధాదేవి మాటలు గుర్తుతెచ్చుకుని ఏం జరగలేదని ఎంత దులిపేసుకున్నా ఆ జ్ఞాపకం రేఖని మానసికంగా క్రుంగదీయసాగింది. ఆ సమయంలో ధైర్యంచెప్పి, ప్రోత్సహించి, బుజ్జగించేందుకు ఆమెకి ఎవరూ లేకపోయారు. తల్లి అదోరకం అమాయకురాలు. ప్రపంచజ్ఞానం లేనిదని పిల్లలకీ తెలుసు. దానికితోడు చిన్నప్పటినుంచి తండ్రి తల్లి తెలివితక్కువతనం మీద విసుక్కోవడం, ఎక్కడి మొద్దువి దొరికావో నా ఖర్మానికి, వెధవ జడ్డితనం మాను. ఏమిటా వెకిలినవ్వు' అంటూ పిల్లలేదురుగానే భార్యమీద విసుక్కోవడంతో చిన్నప్పటినుంచి పిల్లలకి తల్లిపట్ల అదోరకం చులకనభావం ఏర్పడింది. తల్లిమాటలు లెక్కచెయ్యకపోవడం, ఏం కావాలన్నా తండ్రినే అడిగి తల్లిని అనామకురాలిగా చూశారు. మాధవరావు భార్యనెలా చూసినా పిల్లల్ని ప్రేమగా చూడడంతో పిల్లలకి తండ్రి గురి! ఈ సమయంలో తల్లి ముందురోజు ఏడవడం చూసి మరింత బెంబేలుపడిన రేఖ, తల్లినించి ఏమీ ఆశించేందుకు లేదేమో, రాధాదేవిలాంటి వ్యక్తి ఆదరణకోసం పరితపించింది. ఒక్కసారి, మరొక్కసారి ఆవిడవచ్చి మాట్లాడితే ఎంత బాగుండును అనిపించింది. తండ్రి ఆమెమీద అన్యాయంగా ఆరోపణ చేశాడని గుర్తించి బాధపడింది. అంతకంటే ఏమీ చెయ్యలేని ఆశక్తురాలామె.
    
                           21
    
    పేపర్లో ప్రకటన పడిన రెండోరోజున ఆ ఆటోడ్రైవర్ రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రసు వెతుక్కుని రాధాదేవి యింటికి వచ్చాడు.
    రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తబ్బిబ్బురాలయింది. అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంటపెట్టుకుని పోలీసుస్టేషన్ కి వెళ్ళింది. అతనిచ్చిన వివరాలు పోలీసు ఇన్ స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. అతను ఆరోజు రేఖను ఎవరో అతను తీసికెడ్తుంటే మామూలు పాసింజర్లనుకుని ఏమీ పట్టించుకోలేదు. ఆఖర్న ఆ యిల్లు వచ్చాక "యిదేమిటి యిక్కడికి తీసుకొచ్చారు" అంటే, అతను, 'ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేశారు. లోపలికి వెళ్ళి చూడండి' అనడం మాత్రం విన్నాడు గాని అప్పుడేం పట్టించుకోలేదట. ఆ తరువాత మర్నాడే అతను చెల్లెలి పెళ్ళికి ఊరెళ్ళి ఈ రోజే వచ్చాడు ఊరినించి. ఆటో స్టాండ్ లో తక్కిన ద్రైవర్లందరూ పేపర్లో పడిన ప్రకటనచూసి ఎవరై ఉంటారా అని చర్చించుకుంటూంటే, విని కుతూహలంగా సంగతేమిటని అడిగాడు. రేఖమీద జరిగిన అత్యాచారం అంతా చెప్పి పేపర్లో పడిన ఫోటో చూపగానే అతనికి చటుక్కున గుర్తువచ్చింది ఆరోజు ఆటోలో ఆ అమ్మాయి ఎక్కినవైనం. వివరంగా వార్తలు చదవగానే పోలీసులు రాధాదేవి అనుమానితురాలని ప్రకటించడం, రాధాదేవి పర్సనల్ గా యిచ్చిన ప్రకటన అన్నీ చదవగానే అతని అనుమానం ధృవపడింది. పోలీసులకి చెప్పేముందు రాధాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకుని ఆమె ఇంటికి వచ్చాడు. రాధాదేవి అతని సహృదయతని, ధైర్యాన్ని అభినందించి పోలీసుల దగ్గిరకి తీసికెళ్ళి ఇన్ స్పెక్టర్ కి అప్పగించింది.

 Previous Page Next Page