సత్యరాజ్ రావేశంగా బుసలు కొడుతున్నాడు.
"ఏదో తమాషాగా అంటే అంత సీరియస్ అయిపోయావేం? ఆ నవాబు ప్యాలెస్ నీ సొంతం కావాలి. అలాగే నీ కూతురికి కట్నంగా ఇవ్వటానికేనా? అయినా నీ పిచ్చిగానీ నీ కూతుర్ని భూపతి తనకొడుక్కి చేసుకుంటాడా?"
"నన్ను భూపతిరావు మీదకు ఉసిగొల్పుతున్నావా లేక నా క్షేమాన్ని ఆశించిచెబుతున్నావా?" సత్యరాజ్ అనుమానంగా చూస్తూ అడిగాడు.
"ఛా.....ఛా.......అదేంకాదు. నువ్వు నా మనిషివి."
"నువ్వు భూపతిరావుకి వియ్యంకుడివైతే, నీ ద్వారా భూపతి కూడా నా మనిషి అవుతాడా లేడా?" చాలా తెలివిగా, లౌక్యంగా సత్య రాజ్ ని దువ్వుతున్నాడు.
సత్యరాజుని చూపించి, భూపతిరావును భయపెట్టి, తన కూతుర్నే అతని కొడుక్కిచ్చి చేయాలనే బృహత్తర పథకంలో భాగ్యరాజు వున్నట్లు సత్యరాజు ఊహకే అందని విషయం.
దాన్ని త్వరలోనే జరిపేందుకు భాగ్యరాజ్ ప్లాన్ చేసుకొని- అది జరిగాక సత్యరాజ్ తనకి ఎదురు తిరుగుతాడు గనుక...... అతను తనకు ఎదురు తిరిగి చేయగల నష్టం గురించి తెలుసుకోటానికి భాగ్యరాజు చిన్న జోల్డ్ విసిరినట్లుగా సత్యరాజుకి తెలియని పథకమే.
సత్యరాజ్ నమ్మినట్లుగా కనిపించగానే భాగ్యరాజ్ మనస్సులో అనుకున్నాడు___ఈ దొంగా.....కొడుకు కార్మికుల్ని ఉద్దరిస్తాడా? వారి హక్కులకోసం పోరాడతాదా? నవాబుల ప్యాలస్ లు కోరుకునే వీడ్ని ఆ కార్మికులు నమ్మారు నమ్ముతున్నారు. యూనియన్ లీడర్స్ గా ఇలాంటి వాళ్ళని కార్మికులు గెలిపించబట్టే......శ్రమ చేసి బంగారాన్ని పండిస్తున్నా వారి బతుకులలాగే ఉన్నాయి. ఉంటాయి కూడా.
పైకి నవ్వుతూ అన్నాడు "మరో నెలలో ఆ ప్యాలస్ నీ కూతురు పేర రిజిష్టర్ అవుతుంది. నేను చెప్పినట్లు నడుచుకుంటే నాగబాబు నీ అల్లుడు.....ఓ.కే?"
సత్యరాజ్ భాగ్యరాజుని పూర్తిగా నమ్మేశాడు.
"అవునూ.....ఊరకే అడుగుతున్నాను. ఆ రవిచంద్ర చావు వెనుక ఉన్నదెవరో?" ప్రేమగా అడిగాడు భాగ్యరాజ్.
తెలిసినా భాగ్యరాజ్ చేయగలిగిందేంలేదనుకున్న సత్యరాజ్, ప్రభుత్వంలో అపారమైన పలుకుబడి వున్న ఆ అందమైన అప్పరసా? భాగ్యరాజుకి నమ్మాలనిపించలేదు.
కాని ఆ క్షణమే అనుకున్నాడు___రవిచంద్ర చావుకి సాహితికి ఉన్న సంబంధాన్ని కూపీలాగాలని.
ఒకవేళ సంబంధం ఉన్నా ఆ విషయాన్ని సత్యరాజు ఎలా తెలుసు కోగలిగాడు.
ఏది ఏమైనా త్వరలోనే తన పధకం పూర్తయ్యేలా చూసుకోగలిగితే సాహితిని, సత్యరాజుని భూపతిరావు అండతో తొక్కేయవచ్చు.
ఆలోచిస్తూనే భాగ్యరాజు కాలింగ్ బెల్ నొక్కాడు.
* * *
సోనీని తీసుకొని నాగ్ ఒడ్డుకువచ్చాడు. తడిసి నీళ్ళోడుతున్న నాగ్ వైపు చూసి చిరుమందహాసం చేసి సోనీ వైపు కాస్త కోపంగాచూసింది సాహితి.
సోనీ నాగ్ చేతుల్లోంచి దిగిపోయి సాహితి దగ్గరకు బెరుగ్గా వచ్చి "సారీ మమ్మీ.....అంకులే అలా దిగిపోయి తడిసిపోయారు...." అంది.
ఈ లోపు సాహితి బేరర్ ని కేకేసి టవల్ తెప్పించి "తుడుచుకోండి" అంది నాగ్ వైపు చూస్తూ.
నాగ్ టవల్ తో తలతుడుచుకుంటూ "మీరు ఇక్కడ ఉంటున్నారా.....?" అన్నాడు.
ఆరోజు సాహితిని అంత పరిశీలనగా చూడలేదు నాగ్. ఆమెలోని నిరాడంబరత, కట్టుబొట్టు మాటతీరు నాగ్ ని ఆకర్షించేయి.
సాహితి కోరికపై అక్కడే దగ్గరలో ఉన్న ఓ టేబుల్ ముందు కూర్చున్నారు.
"పాడయిపోయిన నా మూడ్ ని సరిచేసింది పా పాప" అన్నాడు సాహితి ఒడిలో కూర్చున్న సోనీని చూస్తూ.
ఆమె కాఫీకి ఆర్డర్ ఇచ్చి ఒక పాపకు తల్లిని మిగిల్చారు. నా లైఫ్ కో విలువ ఉందని కాని, ఓ ప్రాణాన్ని కాపాడారనిగాని కాదు.....తండ్రిలేని నాపాపకు తల్లి కూడా లేకుండా చేసే రానున్న ప్రమాదాన్ని అపారు. మీకు నేను, నా పాప జీవితాంతం రుణపడి ఉంటాం." అంది సాహితి ప్లాష్ బ్యాక్ ను గుర్తుకు తెచ్చుకుంటూ.
"భలేవారే.....అదేదో దేశాన్ని రక్షించినట్లుగా చెబుతారేం? ఆ స్థానంలో మీరున్నా అలాగే చేస్తారు. అవును..... పాపకు తండ్రి లేరా.....?"
ఆమెకు పెళ్ళయిందంటేనే ఆశ్చర్యంగా ఉంది నాగ్ కి. పైగా ఓ పాప!
"పాప తండ్రి ఐదేళ్ళ క్రితం చనిపోయారు" అంది గతాన్ని తలుచుకొని బాధపడుతూ.
"ఐయామ్ సారీ."
"ఆరోజు హాస్పటల్ కి బయలుదేరేముందు చెప్పారు. హఠాత్తుగా మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళినట్లు" ఆ వెంటనే తమ కృతజ్ఞతలు చెప్పుకోలేనందుకు ఫీలవుతున్నట్లు కాస్తతల ఒంచుకుంది.
"మీరేం చేస్తుంటారు.......? ఎక్కడుంటారు?