కల్లు తాగిన కోతిలా అఫీసునంతా అల్లకల్లోలం చేసి పారేశాడు పానకాలు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు నిచ్చేవాడు. లేని వాళ్ళని అధపాతాళానికి నొక్కిపారేశాడు.
అతనితో విసిగిపోయిన జనం , "ననూ బ్రోవమని చెప్పవే సీతమ్మా తల్లీ" అన్నట్టు, ఝాన్సీ లక్ష్మి గారితో మొర పెట్టుకున్నారు ఇంటికెళ్ళి.
"నేను చెప్తాను లెండి" అని కొందరికి, 'నాకు తెలీదు పొమ్మని' కొందరికి సమాధానాలు చెబుతూ ఆమెకు కావలసిన విధంగా మనుషులని ఆమె ఉపయోగించుకుంటూ పరోక్షంగా ఒక అట ఆడించింది ఝాన్సీ లక్ష్మి.
ఆఫీసులో రెండు గ్రూపులు తయారయినా, ఝాన్సీ లక్ష్మి గ్రూపుకే పలుకుబడి ఎక్కువ! పానకాలు గ్రూపు వారు ఝాన్సీ లక్ష్మి గారి మనుషులంటే భయపడేవారు.
ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని ఆఫీసులో కొందరు వారివారి పర్సనల్ శత్రుత్వాన్ని పునరుద్దరించుకుని పగ సాధించుకున్నారు. పానకాలుకి పితురీలు వినడం, గప్పాలు కొట్టడం మహా సరదా! అందమైన వాళ్ళని చూసి భరించలేనట్టే, ఆడవాళ్ళను చూసి రేచ్చిపోయినట్టే పానకాలు తనకన్న, పనిలో సమర్ధులైన వారినీ , తనకన్నా తెలివితేటలు కలవాళ్ళని చూసి ఒర్వలేడు.
* * * *
విలియమ్స్ ఆఫీసులో మంచి పనిమంతుడనీ. ఏ సమస్యనైనా అవలీలగా పరిష్కరించగల సమర్ధుడని పేరు పొందాడు. పానకాలుకి ముందున్న అధికారులందరూ కూడా ఆయనకు అలాగే సర్టిఫికేట్ ఇచ్చారు. అందుకని విలియమ్స్ అంటే పానకాలుకి మంట. ఏదో ఒకరకంగా అతణ్ణి దుయ్యబట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు పానకాలు. పానకాలు పైకి పిచ్చివాడిలా కనబడినా ఒకరకమైన చురుకుదనం, పనికిరాని తెలివి తేటలూ ఉన్నాయని తెలుసుకున్న విలియమ్స్ పానకాలు తనని తిట్టే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ వొచ్చాడు. ఒకవేళ పానకాలు అనవసరంగా కోప్పడినా , జీసెస్ పేరు జపిస్తూ కోపాన్ని దిగమింగుకునేవాడు. కానీ ఒకరోజు పానకాలు పిలిచినా తరువాత అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు కనీసం అయిదు వందల తిట్లు తిట్టిన పానకాలుని చూసి భరించలేకపోయాడు విలియమ్స్. వెంటనే సెలవు చీటీ రాసి పడేసి వెళ్ళిపోయాడు. అంతేకాదు పానకాలు ఆఫీసులో ఉన్నంత వరకూ , అక్కడ కాలు పెట్టనని శపథం చేసే మరీ వెళ్ళిపోయాడు. అలా ఎందరో వెళ్ళిపోవడం, కొత్త కొత్త వాళ్ళనేవాళ్ళనో పానకాలు తెచ్చి పెట్టడం- మొత్తానికి అఫీసునంతా గందరగోళంగా తయారయింది. అస్తవ్యస్తాల నిలయమై పోయింది.
ఇది ఇలా ఉండగా ప్రతీ మొగాడినీ మాటల్లో పెట్టి, వగలు వోలకబోస్తూ , తన చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నించే స్వభావం గల శీతల్ పానకాలు వెఱ్రిబాగులవాడిని భావించి, తన వగలన్నీ అతని ముందు వొలకబోసింది. ఆడగాలంటేనే ఆమడ దూరం పారిపోయే పానకాలు కూడా 'ఆ ,,,,,ఇదెంత! దీని ఆటలు నా దగ్గర?" అనుకుంటూనే కాలక్షేపానికి కాస్సేపు పిలిచేవాడు. పాపం, శీతల్ అందరినీ బెదరించి తిట్టిపోసే పానకాలు తనని కోరి పిలిపించుకుని మాట్లాడడంతో విశ్వామిత్రుని జయించిన మేనక లాగానో, ఇంద్రుణ్ణి మురిపించే రంబ లాగానో అనుకుని మురిసిపోయింది. రాత్రి పది గంటలయినా, తను ఇంటికి వెళ్ళకుండా శీతల్ నూ వెళ్ళ నివ్వకుండా తన ఎదురుగ్గా కూర్చోబెట్టుకునేవాడు. అతను నిజంగా అందగాడైనా , రసికుడైనా శీతల్ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ కూరుపి, కర్కోటకుడు , మొరటు మనిషి అయినా పానకాలు దగ్గర గంటలు గంటలు నోరు విప్పకుండా బొమ్మలా కూర్చోవడం కష్టమే అనిపించింది. కానీ పిచ్చివాడు. అందరినీ కాదని తనకి ఏదో పెద్ద పదవిని కట్టబెడతాడని ఆశించింది.
రాత్రి దాకా కూర్చోబెట్టి , బుర్రుమని తను కారులో వెళ్ళిపోయావాడు. ఈసురోమని కాళ్ళీడ్చుకుంటూ , చలిలో వోనుక్కుంటూ, చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఇంటికి వెళ్ళేది శీతల్. ఈ సంగతి శీతల్ పానకాలుతో చెబితే పానకాలు పకపకా నవ్వేవాడు. ఆ నవ్వు అనందం వల్ల కాదు, హేళన కూడా కాదు. ఒకరకమైన కక్షతో కూడిన పైశాచిక అనందం అది!