రాజేష్ ఒక్కక్షణం అలోచించి , నిర్లక్ష్యంగా "నో థాంక్స్! నాజేబులోనూ వున్నాయ్ నోట్లకట్టలు. ఆ డబ్బు జేబులో పెట్టేసుకుని ఏం మాట్లాడాలో మాట్లాడేయ్యండి." అన్నాడు.
ముకుందరావు నవ్వాడు.
"అదే వచ్చిన ఇబ్బంది. నాపేరు నాకు తెలియదు."
పిచ్చివాడితో మాట్లాడుతున్నానని ఋజువయింది రాజేష్ కి.
అతని చూపులో భావం గ్రహించి ముకుందరావు గొంతు పెద్దది చేశాడు.
"నేను పిచ్చివాణ్ణి అనుకుంటున్నావు కదూ? నాకు పిచ్చి లేదు. ఐ యామ్ నాట్ మాడ్" అని అరిచి అంతలో తమాయించుకున్నాడు. కాని నేనెవర్నో నాకు తెలియదు. కానీ నేను పిచ్చివాణ్ణి కాను. నాకు దారి చూపించు. నీకు బోలెడు డబ్బిస్తాను. ఈ డబ్బే కాదు ఇంకా నాకు లాటరిల్లో పదిహేను లక్షల దాకా రావాలి. ఒక లక్ష నీకిస్తాను. నన్ను నమ్ము."
రాజేష్ నవ్వేశాడు. "లాటరిలో ప్రైజ్ మీకే వస్తుందని స్టాంప్ పేపర్ మీద గ్యరెంటి రాసిచ్చారేమిటి?"
"నవ్వకు. నాకు లాటరి తగిలి తీరుతుంది. నేనేది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది తెలుసా? నువ్వు బ్రాకెట్ ఆడతావా?"
రాజేష్ మొహం చిట్లించాడు.
"బ్రాకెట్ ఆడితే డబుల్ ఫోర్ మీద ఇవాళ ఆడు. ఈ రహస్యం షాపతనికి మాత్రం చెప్పాను. మంచివాడివని నీకూ చెబుతున్నాను."
"నాకు బ్రాకెట్లు వద్దులెండి. ఇవాళ గిండీ రేసుల్లో ఏ గుర్రం వస్తుందో చెప్పండి చాలు " అన్నాడు నవ్వుతూ.
"గుర్రాల పేర్లు చెప్పు. నేను చెబుతాను."
"సుందరి, డేర్ డెవిల్, అప్సర" అన్నాడు ముకుందరావు. "ఇవి రాకపొతే నన్నడుగు. ఇవి వస్తే నా మాట విని నా సంగతి పట్టించుకో."
నవ్వుతూ తల ఊపాడు రాజేష్. చిటికవేసి బెరర్ ని పిలిచాడు.
బెరర్ దగ్గరికి వచ్చాడు.
ఒక కాయితం మీద ఆ గుర్రాల పేర్లు రాసి "మేనేజర్ని ఫోన్ చేసి బెట్సు బుక్ చెయ్యమని చెప్పు' అన్నాడు.
"కాసేపు నేను పని చేసుకుంటాను. తర్వాత మాట్లాడదాం" అంటూ బ్రీఫ్ కేస్ తీసి, కవర్లు, కాయితాలు బయటికి తీశాడు. ఒక కవరు తియ్యగానే కొన్ని ఫోటోలు బయట పడ్డాయి. టేబుల్ కిందగా వాటిని తృప్తిగా చూసి లోపల పెట్టేశాడు.
"ఏం ఫోటోలు?" అన్నాడు ముకుందరావు.
"ఏవో అల్లరి ఫోటోలు. మీలాంటి పెద్దవాళ్ళు చూడాల్సినవి కావు."
"అంటే"
కన్నుగీటి నవ్వాడు రాజేష్, "బట్టలిప్పేసిన అందమైన అమ్మాయిల పంచరంగుల చిత్రాలు" అంటూ కవర్ బ్రీఫ్ కేసులో పడేశాడు.
ముకుందరావు మొహం చిట్లించాడు.
నవ్వాడు రాజేష్.
మళ్ళీ కాఫీ ఆర్డరిచ్చి "టెలిఫోన్ తీసుకురా" అన్నాడు రాజేష్ బెరర్ తో.
అతను టెలిఫోన్ ట్రేలో పట్టుకొచ్చి , ఫ్లగ్గు టేబుల్ కి ఉన్న సాకెట్లో పెట్టాడు.
రిసెప్షన్ కి రింగ్ చేసి ఒక నెంబరు చెప్పాడు.
రెండు నిమిషాల్లో ఫోన్ మోగింది.
"యస్! ఎవోచ్చాయి?"
"............"
ఓసారి ముకుందరావు వైపు చూసి "అలాగా" అంటూ ఫోన్ పెట్టేశాడు.
తర్వాత ముకుందరావు వైపు పరిశీలనగా చూస్తూ, "నిజం చెప్పండి. బుక్కిల్లో ఎవరు తెలుసు మీకు?" అన్నాడు.
"నా కెవ్వరు తెలియదు."
"మరి ఏ గుర్రాలు ముందు వస్తాయో అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు? లాలూచి లేకపోతే!"
"నాకు డబ్బు యోగం పట్టిందని చెప్పలేదు? నేనేది తాకితే అది బంగారం కావాలి."
క్షణాల మీద నిర్ణయం తీసుకున్నాడు రాజేష్.
"నాతో రండి" అని లేచాడు. నమ్మకంగా అతని వెనకే నడిచాడు ముకుందరావు.
రాజేష్ ఇరవై రూపాయల నోట్లు రెండు బెరర్ కందించి "చిల్లర ఉంచుకో" అన్నాడు.
బయట అతని టయోటా కారు ఆగి ఉంది.
ఇద్దరూ ఎక్కారు . నిమిషాల్లో కారు సావేరా హొటల్ చేరింది.
"దిన్లోనే నా మకాం" అన్నాడు రాజేష్.
అది ఒక సూట్. ముందర డ్రాయింగ్ రూం లోపల బెడ్ రూం. అందమైన ఫర్నిచర్.
"ఇప్పుడు చెప్పండి. అంతా వివరంగా చెప్పండి. మీ పేరు మీకు తెలియదా?" అన్నాడు రాజేష్.