కానీ ఇప్పుడు తను ఉన్న స్టితి వేరు.
రష్........రష్.......రష్.....
ఏదో తెలియని ప్రమాదం వైపు ఎందుకో తెలియని పరుగులు తీస్తున్నట్లు ఫీలింగ్!
దాని ప్రభావం మరి కాస్త సేపయిన తరువాత బయట పడింది.
రూంకి వెళ్ళడానికి లిప్టు ఎక్కినప్పుడు అది చటుక్కున కదిలి పైకి పోవడం మొదలెట్టగానే ఒక్కసారి గుండె లయ తప్పినట్లయింది సౌమ్యకి. కళ్ళు తిరగడం మొదలెట్టాయి. వామిట్ అవుతుందేమోనని భయం వేసింది.
రూంలోకి వెళ్ళి వెళ్ళగానే బాత్ రూంలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది సౌమ్య.
చాలా సేపటి తరువాత ఆమె బయటికి రాగానే మాములుగా అన్నాడు శశికాంత్ 'డిన్నర్ కి కిందికి వెళదామా? బిజినెస్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు కొన్ని డీల్స్ సెటిల్ చెయ్యాలి."
అంతే తప్ప అతను ఆమె అనుభవిస్తున్న మానసిక, శారీరక అసౌకర్యాన్ని అసలు గమనించినట్లు లేదు!
దిగులుగా అనిపించింది సౌమ్యకి.
రానన్నట్లు నీరసంగా తల తిప్పింది. రేస్టుగా కాసేపు పడుకోవాలని ఉంది ఆమెకి.
"సరే! నీ ఇష్టం!" అన్నాడు శశికాంత్ క్లుప్తంగా.
తరువాత బాత్ రూంలోకి వెళ్ళి షవర్ బాత్ తీసుకున్నాడు. షేవ్ చేసుకున్నాడు. వంటినిండా టాల్క్మ్ పౌడర్ జల్లుకుని, పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. సూట్ వేసుకుని చకచక వెళ్ళిపోయాడు.
అప్పటికే బార్ లో అతని కోసం ఎదురు చూస్తోంది ఉజ్వల. బాగా లోనేక్ జాకెట్ ఉన్న నల్లటి చుడిదార్ డ్రస్ వేసుకుని వుంది తను. దాని మీద తెల్లటి బ్రోకేడ్ వర్క్.
స్టన్నింగ్ గా ఉంది ఉజ్వల.
ఓహ్! యూ ఆర్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్!" అన్నాడు శశికాంత్ మెప్పుదలగా ఆమెని చూస్తూ.
అండ్ యూ ఆర్ జస్ట్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ!" అంది ఉజ్వల.
ఇద్దరూ నవ్వుకున్నారు.
పదిమంది ఒకేసారి డిన్నర్ తీసుకోవడానికి వీలుగా అరేంజ్ చేసి వున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు. తరువాత ఒకళ్ళ తరువాత ఒకళ్లుగా కొంతమంది బిజినెస్ మెన్ వచ్చి వాళ్ళతో చేరారు.
శశికాంత్ కొత్తగా పెళ్ళయిందని వాళ్ళలో కొంతమందికి తెలుసు. కానీ వాళ్ళెవరు కూడా పెళ్ళికి రాలేదు. వచ్చేటంత పరిచయం లేదు ఇంకా.
శశికాంత్ పక్కనే కూర్చుని ఉన్న ఉజ్వలని చూసి ఆమె అతని భార్య అనుకున్నాడు పరాశర్ అనే బిజినెస్ మాన్.
"కంగ్రాట్స్! మిస్టర్ అండ్ మిసెస్ శశికాంత్! విష్ యూ ఏ బ్లిస్ పుల్ మారీడ్ లైఫ్!" అని, తను తెచ్చిన చిన్న ప్రజెంటేషన్ పాక్ అందజేశాడు.
చిరునవ్వుతో అది అందుకున్నాడు శశికాంత్. ఉజ్వల వైపు తిరిగి కన్ను గీటి, "ప్రాక్టికల్ జోక్ చేద్దాం మాట్లాడకు" అని గుసగుసగా చెప్పి, 'థాంక్యూ!' అన్నాడు పరాశర్ తో.
అది అతని దృష్టిలో ప్రాక్టికల్ జోకు!
ఆ లెవల్లో ఉంటుంది అతని సెన్స్ ఆఫ్ హ్యుమర్!
ఏదో అనబోయి మానేసింది ఉజ్వల.
చిటికే వేసి బేరర్ ని పిలిచాడు పరాశర్.
"షాంపేన్ లావ్ భయ్! ఈ కొత్త దంపతుల హెల్త్ కోసం తాగాలి నేను" అన్నాడు తమాషాగా.
వినయంగా తల పంకించి బేరర్ తిరిగి వెళ్ళిపొబోతుంటే మళ్ళీ అతన్ని పిలిచింది ఉజ్వల.
"షాంపేన్ తో బాటు ఆ పెరిటిఫ్ లు ఆర్డర్ చేసేద్దాం. ఆ తరువాత సూప్స్, స్నాక్స్....మెయిన్ కోర్సెస్.....లెట్ మీ హేండిల్ దిస్ యాంగిల్........మిస్టర్ పరాశర్! వాట్ డూ యూ లైక్ టూ హావ్ విత్ యువర్........"
చాలా ఎఫిషిఎంట్ హోస్టెస్ లాగా, ఫుడ్, లిక్కర్ ఆర్డర్ చేసే బాధ్యత తీసుకుంది ఉజ్వల. ఇవన్ని చేస్తూనే లింకు తెగిపోకుండా ఎవరితో మాట్లాడవలసిన మాటలు వారితో మాట్లాడుతోంది.
అక్కడ ఉన్న ఎంతోమంది ఎన్నో రకాల పెర్ ఫ్యుమ్స్ రాసుకుని ఉన్నారు. వాటన్నిటికన్నా కూడా, ఉజ్వల జడలోని మల్లెల సౌరభమే మత్తెక్కించేలా అనిపిస్తోంది అందరికి. ఆమె మాట్లాడుతూ ముందుకు ఒంగినప్పుడల్లా , ఆమె గుండె మధ్య కనబడుతున్న లోయ గుబులు పుట్టిస్తోంది ఆ బిజినెస్ మెన్ కి.
అది గమనించాడు శశి. అతనికి గర్వంగా వుంది.
ఇంతకుముందు తను ఏమన్నాడూ ఉజ్వలని? టూ ఇన్ వన్ అని కదూ?
టూ ఇన్ వన్ కాదు త్రీ ఇన్ వన్ ఈ ఉజ్వల.
సాటి మగాడిలా సలహాలు చెబుతుంది తనకి! అవసరమైతే అందమైన ఆడపిల్లలా కాలక్షేపం కలిగిస్తుంది! మంచి బిజినెస్ పార్టనర్ లా తన హొయలు తో పార్టీలను వశపరుచుకుంటుంది.