శ్రీరాం విసుక్కునేవాడు. "ఎవడు వీడు కాలికి అడ్డం వస్తున్నాడు? షేక్ స్పియరా?" అనేవాడు కాలికి తగిలిన పుస్తకాన్ని చిరాగ్గా చూస్తూ. "తీసెయ్! తీసి చంకనెక్కించుకో!" అనేవాడు.
నవ్వి పుస్తకాలన్నీ సర్దేది ప్రతిమ. మిల్టన్, జాన్సన్ దగ్గర్నుంచీ - విశ్వనాథ, ముళ్ళపూడి దాకా దొరికిన సాహిత్యమంతా చదివేస్తోంది. తను డాక్టరునని దాదాపు మరిచిపోయింది అసలు!
ఇంటికి ఎవరన్నా వస్తే, "మా కోడలు! డాక్టరు చరివింది!" అని అత్తగారు పరిచయం చేసినప్పుడూ, శ్రీరాంతో ఎప్పుడన్నా బయటికి వెళితే, "మై వైఫ్, షీ ఈజ్ ఎ డాక్టర్" అని అతను ఫ్రెండ్సుకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తప్ప తను కూడా వో డాక్టరునన్న సంగతి ఆమెకసలు గుర్తుకు రావడంలేదు.
చాలామంది అమ్మాయిలు బి.ఏ., బి.ఎస్.సి., చదివి పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలయిపోయినట్లే, తను ఎం.బి.బి ఎస్. చదివి పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. అంతే! అప్పుడప్పుడు మాత్రం అనిపించేది ప్రతిమకి, ఈ 'ఉద్యోగం చెయ్యరాదు' అన్న షరతు శ్రీరాం ముందరే పెట్టి ఉంటే తను అసలు పెళ్ళికి ఒప్పుకునేదా?
నెవర్! నెవర్!
అప్పట్లో చదువూ, ఉద్యోగం, ప్రాక్టీసూ గురించి మాత్రమే ఆలోచించేది తను. పెళ్ళికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు తన వూహల్లో!
కానీ ఒకటి - పెళ్ళయితే ఆ ఇంట్లోనుంచి బయటికి వచ్చెయ్యడానికి వీలుంటుందని మాత్రం ఆశ ఉండేది. అసలు పెళ్ళికీ, ఉద్యోగానికీ లంకె ఉంటుందని తను కలలో కూడా అనుకోలేదు!
అంతలోనే తనని తాను తిట్టుకునేది ప్రతిమ - అలా ఆలోచిస్తున్నందుకు.
ఇదేమిటి? తనకేమన్నా పిచ్చి పడుతోందా? పెళ్ళయిపోయాక, 'అసలు ఇతన్ని పెళ్ళి చేసుకోవడం కరెక్టా? కాదా?' అని ఆలోచిస్తోందా తను? ఎంత తప్పు! శ్రీరాంలో కూడా మంచి క్వాలిటీస్ లేకపోలేదు. చాలా విషయాల్లో ఉదారంగా ఉంటాడతను. ఉద్యోగం విషయంలోనే పేచీ! అందరూ పూర్తిగా తన ఇష్టప్రకారమే నడుచుకోవాలనుకుంటాడు. మొండితనం ఎక్కువ - చిన్నపిల్లాడి లాగా!
ప్రతిమ పెదిమల మీదికి చిరునవ్వు వచ్చింది. ఈ సంవత్సరంలో రెండుసార్లు ప్రయాణాలు చేసింది ప్రతిమ. ఒకసారి శ్రీరాం, తఃను కలిసి వూటీ, కొడైకెనాల్, కోవలం, కాశ్మీర్ లాంటి చాలా టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్ళారు. ఆ తర్వాత అత్తగారితో సహా తిరుపతి, మధుర, కంచి చూశారు. ఇప్పుడు మళ్ళీ బెనారస్ కి ప్రయాణం. కొత్త ప్రదేశం ఒక్కొక్కటీ చూసినప్పుడల్లా హర్షాతిరేకంతో పులకించి పోయింది ప్రతిమ! ఎంత చిత్రమైన, ఎంత అద్భుతమైన దేశమిది! వాతావరణంలో, శీతోష్ణస్థితులలో, ఆచార వ్యవహారాల్లో కూడా అడుగడుగునా అంతులేని వ్యత్యాసాలు! వ్యత్యాసాలు ఉన్నా కూడా కనబడని సన్నటి సిల్కుదారంతో ఈ ప్రజలనీ, ప్రదేశాలనీ బంధించేసినట్లు భిన్నత్వంలోనే అమోఘమైన ఏకత్వం!
ఒళ్ళు గడ్డకట్టుకు పోయేటట్లు చేసే గడ్డ పెరుగు లాంటి హిమాలయాల మంచూ, ఒళ్ళు మసిలిపోయేటట్లు చేసే రెంటచింతల ఎండలూ, పచ్చిక తివాచీ పరిచినట్లు కనబడే వూటీ, వందలకొద్దీ గజాల మేర అసలు మట్టి అనేది కనబడకుండా సిమెంటు చేసినట్లు అనిపించే రాయలసీమ రాతి భూములూ, రాజస్థాన్ ఎడారిలో బంగారపు ఇసుక, నేల ఈనినట్లు సిక్కింలో పూచే రంగు రంగుల పూలూ, ఓహ్! ఈ సౌందర్యం ఎన్ని రకాలు! ఈ తల్లికి ఎన్ని ముఖాలు!
నిజం! భారతదేశం మామూలు దేశం కాదు! ఇది నిజంగా ఉపఖండమే!
మధ్య ఆసియా నుంచి వచ్చిన ఆర్యులూ, వాళ్ళకు ముందే భారతదేశంలో ఉంటున్న ద్రావిడులూ, కొద్దిగా నీగ్రోయిడ్, ఆస్ట్రలాయిడ్ ఛాయలున్న తెగలూ, తూర్పు భాగాన మంగోలాయిడ్ జాతులూ - ఈ జాతుల, నాగరికతల మేళవింపులో ఒక అద్భుతమైన సంస్కృతి ఉద్భవించి వెలుగొంది పోతోంది!
కాశీలో దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత వూరంతా తిరిగి చూశారు. కాశీ అంతా ఇరుకు సందులు! కానీ అంత మాత్రాన ఆ నగరం తాలూకు ఔన్నత్యం తగ్గిపోలేదు. భారతదేశపు సంస్కృతీ, చరిత్రా ఆ నగరంలో ముడివేసుకుపోయి ఉన్నాయి. అతి పురాతనమైన పట్టణం అది!
మర్నాడు మళ్ళీ గంగా స్నానం ప్రతిమ ఘాట్ లో దిగి స్నానం చేస్తూ ఉంటే కొన్ని వేల దృక్కులు ఆమె మీద ప్రసరితమయ్యాయి. కొద్ది క్షణాలసేపు అది కాశీ అనీ, పరమ పవిత్రమైన ప్రదేశమనీ మరిచిపోయి, వోర చూపుతో ఆమెనే చూశారు భక్తులు చాలామంది. వాళ్ళ ఆ క్షణికమైన పాపం ఆ గంగాస్నానంతోనే బహుశా కొట్టుకుపోయి ఉండవచ్చేమో!
శ్రీరాం ప్రతిమతో నవ్వుతూ అన్నాడు "తా మునిగింది గంగ, తా వలచింది రంభ! అన్న కొటేషను దేన్లో నుంచి కొట్టేశానో గుర్తులేదు గానీ, ఈ క్షణంలో అది నా పట్ల పరమ కరెక్టు!" అంటూ ఒక్కసారి గంగలో మునిగి లేచాడు.
తర్వాత తనతోబాటు గుడి మెట్ల మీద కూర్చున్న ప్రతిమని ఆభిమానంగా చూసింది సరస్వతి.
"వూఁ! ఎక్కడి కెళుతున్నారే ఇవాళ?"
"అదేమిటి? మీరు రారా? 'సారనాథ్ వెళదాం' అన్నారాయన."
"నాకు ఇంక అవన్నీ తిరిగే వోపిక లేదమ్మా. విశ్వేశ్వరుణ్ణి చూసేశాను. అది చాలు ఈ జన్మకి! మీరు వెళ్ళి రండి! నేను కాస్త రెస్టుగా ఉంటాను ఇవాళ!"
"అయితే ఆయన ఒక్కరినీ వెళ్ళి చూసి రమ్మంటాను. నేను మీకు తోడుగా ఉండనా?"
ఆప్యాయంగా ప్రతిమ చేతిని తన చేతిలోకి తీసుకుంది సరస్వతి. "పిచ్చిపిల్లా! ఎందుకే నేనంటే నీకింత ఇది? బహుశా కిందటి జన్మలో నువ్వు నా కూతూరివేమో!"
"నాకూ అలాగే అనిపిస్తోంది. కిందటి జన్మలో మీరు నా అమ్మేమోనని!"
ప్రతిమ చేతిని తఃదేకంగా చూస్తూ ఉండిపోయింది సరస్వతి. పొద్దున్న రాసుకున్న పసుపుతో పచ్చగా ఉంది చెయ్యి. నెయిల్ పాలిష్ తో నిగనిగలాడుతున్నాయి గోళ్ళు. మొహానికి లేతగా పసుపు -ఒత్తుగా ఉన్న జుట్టుని పెద్ద జారుముడి వేసుకుంది. తడితడిగా ఉన్న పట్టుచీరె.
వేల సంవత్సరాల క్రితం ఆ గంగానది ఒడ్డున పూజలు చేసిన మునిపత్నులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తూంది ప్రతిమని చూస్తుంటే. స్నిగ్ధంగా, సంప్రదాయ సిద్దంగా, పవిత్రంగా, దేవాలయ ప్రతిమలా ఉంది తను. కానీ ఆమె మాట్లాడుతుంటే అప్రయత్నంగా, అలవాటుగా, అత్యంత సహజంగా, నిర్దుష్టమైన ఉచ్చారణతో దొర్లే ఇంగ్లీషు పదాలూ, ఆమె ప్రవర్తనలో కొద్దిగా పాశ్చాత్య పద్దతులూ -ఆమెని తూర్పు, పడమరలకు ఇంద్ర ధనుస్సుతో వేసిన వారధి లాగా, పాతకొత్తల మేలు కలయికలాగా చూపిస్తున్నాయి.
ఇంకో పక్కన పెద్దగా మాటలు....లెవీ జీన్స్ వేసుకున్న కుర్రాడెవరో - ఏదో పబ్లిక్ స్కూల్లో చదివి ఉంటాడని ఇంగ్లీషు యాస బట్టే అనిపిస్తూంది - తల్లిని గదమాయిస్తున్నాడు.
"ఎక్కడబడితే అక్కడ కూలబడి పోవద్దాన్నానా? అన్ సివిలైజ్డ్ బ్రూట్స్! అసలు డాడీకి బుద్ది లేదు! హాలీడేస్ అన్నీ సిమ్లాలో గడిపెయ్యక, ఈ డర్టీ ప్లేస్ కి ఎందుకొచ్చాం, మమ్మీ?" అంటున్నాడు చిరాకు పడిపోతూ. అతని నోట్లో బబుల్ గమ్ ఉంది.
వాళ్ళ 'మమ్మీ' తీవ్రంగా చూసింది ఆ కుర్రాణ్ణి.
"సుకుమార్! యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్!"
సుకుమార్ అనే ఆ కుర్రాడు నిర్లక్ష్యంగా ఆమెని చూస్తూ, "అలా శివుడిలా నన్ను చూపులతోనే దహించెయ్యాలని చూడకు! అసలు శివుడూ గివుడూ అంతా హంబగ్! మూడో కన్నుట! అది తెరుస్తాడుట! ఓహ్! బాష్! అసలు ఈయనకి మెల్లకన్ను అయినా ఉందా అని? ఉంటే తన వూర్లో ఈ మురికినంతా ఎలా చూస్తూ భరిస్తున్నాడు?" అన్నాడు.