Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 37

 

    "అవును! డ్యూటీలో ఎఫెషియన్స్ కి గానూ నాకు గోల్డుమెడలొచ్చింది కూడా" అన్నాడు పోలీసు జబర్దస్తీగా జెయ్ చంద్ర జేబులు సోదా చేస్తూ, సూక్ష్మమయిన సైజులో వుండే సరికొత్త పది నయాపైసల కాయిన్ ఒకటి జెయ్ చంద్ర జేబులో ఓ మూల ఇరుక్కుని వుంది. అది అతనికి దొరికేదో కాదోగానీ పోలీసు మాత్రం లాఘవంగా దాన్ని పట్టేసుకున్నాడు. ఇలాంటివాటిలో అతను గొప్ప ప్రతిభాశాలి.
    
    పోలీసు పదిపైసలు తీసుకుని తన దోవన తాను కొత్త గిరాకీని వెదుక్కుంటూ వెళ్ళిపోగానే, మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు జెయ్ చంద్ర.
    
    ఈపాటికి కాలేజీలో క్లాసులు అయిపోయి వుంటాయని అతనికి తెలుసు.
    
    కానీ అతను అక్కడ చక్కబెట్టాల్సిన వ్యవహారాలు బోలెడు వున్నాయి.
    
    కాలేజీకి వెళ్ళీవెళ్ళగానే తన అనుచరులందరినీ పలకరించాడు అతను. తర్వాత అందరూ క్యాంటీన్ లో సమావేశమయ్యారు. వేగుల వాళ్ళు (అంటే సుదర్శన్, ఒబైదుల్లా) రైవల్ గ్యాంగు తాలూకు లేటెస్టు సమాచారం తెచ్చారు. డిఫెన్సు, అఫెన్సు ప్రణాళికలని కొన్నిటిని తయారు చేశారు. కొత్తగా కాలేజీలో ఓ కుర్రాడికి 'జంబులింగం' అని నిక్ నేమ్ పెట్టాలని ప్రతిపాదించాడు జెయ్ చంద్ర. హర్షధ్వానాల మధ్య అందరూ దాన్ని ఆమోదించారు. కాంటీన్ లో కాఫీ తాగుతున్న ఆ "జంబులింగం" కూడా పాపం జరుగుతున్నదేమిటో తెలీకపోయినా తను కూడా చప్పట్లు కొట్టాడు మర్యాదకొద్దీ.
    
    దాంతో ఆనాటికి సభ ముగిసింది. ఆ తర్వాత సితార జపం చేస్తూ యింటికెళ్ళి పోయాడు జెయ్ చంద్ర.
    
    ఇల్లు చేరగానే డాబా మీద సితార కనబడింది. ఆమె కళ్ళలోని మెరుపు కూడా అల్లంత దూరంలో నుండే కనబడింది అతనికి. ఒక్క క్షణంపాటు అలానే నిలబడి తర్వాత ఏం గుర్తొచ్చిందోగానీ గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది సితార.
    
    తమ వప్పందం గుర్తుకొచ్చింది జెయ్ చంద్రకి కూడా.
    
    తనూ సితారా లవర్సే.
    
    కానీ కల్సి తిరగడానికి లేదు.
    
    కల్సి మాట్లాడుకోవడానికీ లేదు.
    
    డ్యూయెట్లు పాడటానికి అసలే వీల్లేదు.
    
    కనీసం రెండేళ్ళపాటు!
    
    ఎంతటి ఘోరాతి ఘోరమయిన సిచ్చుయేషన్ యిది.
    
    ఇలాంటి సంకట స్థితిలో అలనాటి రోమియో ఏంచేసి వుండేవాడు? మజ్నూ ఏం చేసుండేవాడు? దేవదాసు ఏం చేసుండేవాడు? తనకి తెలిస్తే బావుండు.
    
    ఇంటికొచ్చి కాసేపు కదలకుండా కూర్చున్నాడు జెయ్ చంద్ర.
    
    శేషు ఎక్కడికెళ్ళాడో గానీ అతను కూడా ఇంట్లో లేడు.
    
    విరిగిపోయిన వెంటిలేటర్ లోనుంచి చంద్రుడు తినగా మిగిలిన రొట్టెలాగా కనబడుతున్నాడు. చెవిచుట్టూ దోమలు గుయ్ మని రొద చేస్తున్నాయి.
    
    అప్పుడు హఠాత్తుగా భావావేశం కలిగింది అతనికి. ఉన్నట్లుంది కవితావేశం ఉప్పొంగింది అతనిలో. వెంటనే లేచి టేప్ రికార్డర్ లో బ్లాంక్ కేసెట్ ఒకటి పెట్టేశాడు. పెద్దగా పాడటం మొదలెట్టాడు.
    
    "నీరూపం నైస్ నైస్
    
    నీనవ్వే నాకు లెహర్ స్లస్
    
    ఆంధ్రాలో జనం తినేది రైస్ రైస్
    
    ఈ రూంలో వున్నాయి ఫ్లైస్ ఫ్లైస్
    
    ఐలవ్ యూ! ఐ లవ్ యూ!"    

 

    ఆ తర్వాత యిలాంటివే యింకో ఇరవైప్రేమగీతాలు అందులో రికార్డు చేశాడు వరసపెట్టి. రికార్డయిన కాసెట్ ని రివైండ్ చేసి విన్నాడు. ఆ 'సోల్ గీతాలు' అతని చెవులకి మైకేల్ జాక్సన్. మాడొన్నా, బోస్ జోవీ, గన్స్ అండ్ రోజెస్, బీటిల్స్ వీళ్ళంతా కలిసి బృందగానం చేస్తే నేత బావుంటుందో అంత బావున్నట్లు వినబడ్డాయి.
    
    తక్షణం తన కవితా ఝరిని ఎలాగయినాసరే సితారకి వినిపించాలనిపించింది అతనికి.
    
    కానీ ఎలా? ఎలా?
    
    'మరి నేనెందెందుకు?' అన్నట్లు భౌ భౌ మన్నది అతని కుక్క. దాని పేరు సీజరు. కేవలం సీజర్ అని పెట్టడంతో తృప్తిపడి వూరుకున్నాడు జెయ్ చంద్ర. అంతేగానీ తన ఆనవాయితీ ప్రకారం దానికి వేరే నిక్ నేమ్ పెట్టలేదు.
    
    అయినా కొరతేం లేదు. సీజర్ కి యింకోపేరుంది. ఆ సంగతి జెయ్ చంద్రకి తెలియదు. ఆ కుక్క అసలు పేరు ఆదినారాయణ. అదంతా వేరే కథ. చదువుతుంటే మీకే తెలుస్తుంది. అది ఆల్సేషియన్. సీజర్ పైకి మాట్లాడలేదుగానీ దాని మనసులో చాలా భావాలు ఉన్నాయి. అన్నిటినీ ఎనలైజ్ చేసే తెలివి వుంది. సొంత నిర్ణయం తీసుకునే ప్రజ్ఞ వుంది. వాటిని అమలుచేసే తాహతు వుంది. దానికి తెలుగు బాగా వచ్చు. (కానీ మనసులోనే మాట్లాడుకుంటూ వుంటుంది.)
    
    జెయ్ చంద్ర బాధని కొన్నాళ్ళుగా గమనిస్తోంది సీజరు. తను అన్నాళ్ళుగా చూసిన దృశ్యాలన్నీ, విన్న మాటలనీ, వినబడని భావాలనీ అప్పుడు అనలైజ్ చేసుకుంది మన్స్ బెస్ట్ ఫ్రెండు ( అని అందరూ అనుకునే) ఆ శునకం.
    
    'వీడేంటి యిట్ల అయిపోయాడు?' అనుకుండి నాందీ ప్రస్తావనగా. (తన కుక్క తనని గురించి వాడూ వీడూ అని ఆలోచిస్తోందని తెలిస్తే జెయ్ చంద్ర గుండె ఢామ్మని ఆగిపోయి వుండేది)    

 

    'వీడి వరస బొత్తిగా బాగోలేదు' అని కూడా అనుకుంది సీజరు మళ్ళీ.
    
    జెయ్ చంద్ర ఈ ఘాతుకానని గ్రహించక తన ధోరణిలో తాను కొత్త పాట కంపోజ్ చేస్తున్నాడు. "నేను నీకు సీనియర్ నువు నాకు చాలా నియర్ నియర్ నువ్వేనా డియర్ డియర్ కానీ నీ షరతు చూస్తే నాకు ఫియర్ ఫియర్ ఐ లవ్ యూ! ఐ లవ్ యూ!"
    
    'తినగ తినగ వేము తియ్యనగును' అన్నట్లు విన్నకొద్దీ తన కవిత్వం ఎంతో బావుందని తనకే గట్టిగా అనిపించింది జెయ్ చంద్రకి.
    
    ఇలా ప్రతి పద్యానికీ (ఇది పద్యమా, పాటా, గీతా, శ్లోకమా, బుర్రకథా?.....అదేంటో తనకి తెలీదుగానీ) ప్రతినాలుగు లైన్లకి ఐలవ్ యూ! ఐ లవ్ యూ! అని తగిలించేస్తే చాలు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లు కవిత్వం దానికదే సెట్ అయిపోతుందని నమ్మకం కూడా కుదిరింది.
    
    కానీ పాపం అతనికి బొత్తిగా తెలీందేమిటంటే.....ఆ ఆల్సేషియన్ కుక్క సీజర్ గత జన్మలో గొప్ప రంగస్థలనటుడు. ఆయన పేరు ఆదినారాయణ. పౌరాణిక నాటకాలు కాంట్రాక్టుకి ఆడేవాడు. తనతో దమయంతికి నటించిన నటిని పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చి, నమ్మించి, పబ్బం గడచిపోగానే గుడ్ బై చెప్పేసిన పాపానికి ఇప్పుడీ జన్మ ఎత్తాడు. సీజర్ కి గతజన్మ బాగా గుర్తుంది.
    
    ఈలోగా జెయ్ చంద్ర కొత్త పాత మొదలెట్టాడు. "నువ్వే చిరునవ్వుల రాణీ సిరివెన్నెల పూబోణీ...."
    
    వినలేక చెవులు మూసుకుందామనుకుంది కుక్క. చేతులు లేవు గనక ఏమీ చెయ్యలేక మూలకెళ్ళి కూర్చుని 'జెండాపై కపిరాజు' అన్న పద్యాన్ని మనసులోనే అష్టవంకర్లు తిప్పి పెద్దగా పాడుకుంది తనివితీరా.

 Previous Page Next Page