అక్కడ ఆగి, రొప్పుతూ అతనివైపు చూసింది సితార "చూశావా? వద్దు వద్దంటుంటే లాక్కొచ్చావ్. ఎంతలో ఎంత గండం గడిచిందో!"
"మీ పోలీస్ బావెవరూ?" అన్నాడు జెయ్ చంద్ర అనుమానంగా.
"సైతాన్ అని అందరూ నిక్ నేమ్ పెట్టారు అతనే."
"ఆ నిక్ నేమ్ పెట్టింది నేనే"
"నువ్వా?"
"అవున్నేనే! నువ్వు సైతాన్ కి మరదలివా?"
"అవును!"
"షోయింగా?"
"అవును!"
"హే భగవాన్!"
"ఏమిటి?"
"ఈ సృష్టిలో ప్రేమకథలెప్పుడూ తిన్నగా వుండవెందుచేత?"
"దేవుడు మంచి చెయ్యి తిరిగిన రైటరయి వుంటాడు. మలుపులు ఎన్ని పెడితే ప్రేమకథ అంత రంజుగా వుంటుందని తెలుసేమో!"
"చెయ్యితిరిగిన రచయితే కావచ్చుగానీ మరీ ఇన్ని మలుపులా? ఈ లెక్కన దేవుడి చెయ్యి అష్టవంకర్లు తిరిగి వుండాలి."
"కావచ్చు"
"పాయింటుకొద్దాం. సైతాన్ మీ బావ?"
"అవును"
"నువ్వు సైతాన్ వి మరదలుపిల్లవి"
"అవును"
"సైతాన్ నిన్ను ప్రేమిస్తున్నాడా?"
"దారుణంగా"
"నువ్వు సైతాన్ ని ప్రేమిస్తున్నావా?"
"ఎవరైనా సైతాన్ ని ప్రేమిస్తారా?"
"నీ సంగతి చెప్పు."
"నేను వేరేవాళ్ళని ప్రేమిస్తున్నాను!"
"మరి సైతాన్ రియాక్షన్ ఎలా వుంటుంది?"
"అచ్చం సైతాన్ రియాక్షన్ లాగే!"
"నీకంతా వేళాకోళంగా వుంది"
"వేళాకోళంకాదు. సీరియస్ గా ఓ విషయం చెబుతున్నాను."
"ఏమిటది?"
"మనమింక కలుసుకోబోవట్లేదు."
"ఆ?"
"మన ప్రేమకు ఇవాళ్టితో ఫుల్ స్టాప్."
"ఆ?"
"మనమింక కలుసుకోబోవట్లేదు"
"ఆ?"
"మనమింక మాట్లాడుకోబోవట్లేదు."
"అదేమిటి?"
"మన ప్రేమకు ఇవాళ్టితో ఫుల్ స్టాప్."
"ఇది అన్యాయం."
"కానీ తప్పదు! మళ్ళీ మన పెళ్ళయ్యేదాకా మనం కలుసుకోవట్లేదు. మాట్లాడుకోబోవట్లేదు" చటుక్కున తట్టినట్లు "ముద్దో!" అన్నాడు జెయ్.
"ముద్దూ ముచ్చటా అన్నీ పెళ్ళయిన తర్వాతే! అప్పటిదాకా నువ్వెవరో, నేనెవరో!"
"అమ్మాయ్! ఇది అన్యాయం"
"ఇంకదీనిమీద చర్చ అనవసరం"
"పోనీ ఫస్ట్ అండ్ ఫైనల్ కిస్"
"నథింగ్ డూయింగ్! గుర్తుంచుకో మళ్ళీ మన చదువులు పూర్తయి మనం పాసయి, మనకి వుద్యోగాలు దొరికి, మనం పెళ్ళి చేసుకునేదాకా నువ్వెవరో నాకు తెలీదు. మనమిద్దరం లవర్స్ మి అన్న సంగతి ఆ మూడో కంటివాడిక్కూడా తెలియకూడదు."
"పైకి సున్నితంగా కనబడతావుగానీ ఎంత కఠినాత్మురాలివి సితారా!"
"నువ్వేమన్నా అనుకో! మాట తప్పావంటే మటుకు మళ్ళీ మనిద్దరికి మాటలుండవు. ఇంక పర్మనెంటుగా రాంరాం! తెలిసిందా?"
"మాడుపగిలేటట్లు మూడుసార్లు చెప్పాక యింకా అర్ధం కాకుండా ఎలా వుంటుంది?"
"గుడ్ బాయ్"
"బాడ్ గర్ల్"
నవ్వి, పెదిమలు సున్నాలాచేసి, తియ్యటిముద్దునోదాన్ని గాల్లో అతని వైపుకి విసిరేసింది సితార.
తర్వాత అక్కడనుంచి వెళ్లిపోయింది.
* * *
అలా అనేసి చలాగ్గానే వెళ్ళిపోయింది సితార. ఆమె కనబడినంతమేరా కళ్ళప్పగించి చూస్తూనే వుండిపోయాడు జెయ్ చంద్ర.
"ఇంతటి మహత్తరమైన అందగత్తెను, ఇంతటి మంచిపిల్లను, ఇంతటి శీలవతిని, ఇంతటి సచ్చరితురాలిని నేనెప్పుడు కనలేదు, వినలేదు, మూర్కొనలేదు" అనుకున్నాడు జెయ్ చంద్ర పరవస్తు చిన్నయసూరి పంచతంత్రంలో కొటేషన్ ని కాపీ కొట్టేస్తూ.
అతని ఊహలని చదివేస్తున్నవాడిలా "అవును! చాలా బావుందీ అమ్మాయ్!" అన్నాడు పోలీసు నూటపదకొండు అతని పక్కనే నిలబడి.
ఉలిక్కిపడి తిరిగి చూసి "ఇంకా నువ్విక్కడే వున్నావా?" అన్నాడు అతను షాకయిపోయి.
"ఇందాక నీ రెండు జేబులు తడిమి వాటిలో వున్న చిల్లర ఇచ్చావు గానీ హిప్పాకెట్టూ, చొక్కాజేబులు వెదకలేదేం?" అన్నాడు కానిస్టేబులు ఆరోపణగా ముద్దాయిని చూసినట్లు చూస్తూ.
"అందుకని మళ్ళీ వచ్చావా?" అన్నాడు అతడు నిర్ఘాంతపోతూ.