అంతలోనే జెయ్ చంద్ర క్యాసెట్ ని రికార్డర్ లో నుంచి తీశాడు.
"సీజర్! సీజర్!" అని పిల్చాడు ముద్దు చేస్తున్నట్లు.
"వీడిమూతి చూడు! ఎందుకట్లా మూతి పెడతావ్ రా? సరిగ్గా పిలిచి ఏడవలేవూ! కుర్రకుంకా!" అనుకుంది సీజర్ కోపంగా.
"కమ్ హియర్! కమ్ హియర్! అన్నాడు జెయ్ చంద్ర. నిర్లక్ష్యంగా చూస్తూ పడుకునే వుండిపోయింది సీజర్.
కమ్ హియర్! కమ్ హియర్!" అన్నాడు మళ్ళీ.
'ఈ కుర్రాళ్ళకి మంచి చెడూ తెలీదు. మట్టూ మర్యాద లేదు" అని లేచి......
"అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు ఆ అజాతశత్రువే అలిగిననాడు సాగరములన్నియు ఏకము కాకపోవు....." అని ఆరున్నొక్కరాగంలో మౌనంగా పద్యం పాడుకుంటూ అతని దగ్గరకెళ్ళి నిలబడింది సీజర్.
సీజర్ మనసులో మెదులుతున్న భావాలు తెలీని అతను అతి చనువుగా దాని బుర్ర గోకి "టేక్ దిస్ క్యాసెట్ అండ్ గివ్ ఇట్ టూ దట్ గర్ల్" అన్నాడు మాటలూ, సైగలూ కలబోసి చెబుతూ.
"తెలుగులో ఏడవరాదూ?" అనుకుంది సీజర్ మంటగా. దానికి తెలుగంటే వల్లమాలిన అభిమానం! కానీ ఆ సంగతి జెయ్ చంద్రకి తెలీదుగా! కుక్కలన్నిటికీ ఇంగ్లీష్ ఇష్టమని చాలామందికిలాగే అతనికి ఓ దురభిప్రాయం వుంది.
"నా శ్రాద్ధం" అనుకుంది సీజర్.
"గోబాయ్! గో!" అన్నాడు అతను ముద్దుగా.
"నేను బాయ్ నా? నీ అంత కొడుకూ, ఆ పిల్లంత కూతురూ నాకు వుండే వాళ్ళు. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా భయం, భక్తి లేకుండా పోతున్నాయి" అనుకుంది సీజర్.
"గో! గో!" అన్నాడు అతను మళ్ళీ.
ఇక తప్పదన్నట్లు కేసెట్ ని నోట్లో కరుచుకుని బయటికి పరిగెత్తింది సీజర్. కేసెట్ ని సైడుకాలవలో పడేసి, తను పక్కవీధిలో వేస్తున్న "ఉద్యోగ విజయాలు" నాటకం దగ్గరికెళ్ళి లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చుంది. ఈ పాటని కాపీరాగంలో పాడితే బావుండేది. ఈ పద్యాన్ని మరాఠీ రాగంలో పాడితే ఒన్సుమోర్లుపడేవి అని సైలెంటుగా కామెంట్లు చేస్తూ....
ఈ దారుణం తెలీని అతను తను పంపిన కాసెట్ ని తన కుక్క విశ్వాసంగా సితారకి అందజేసి వుంటుందనీ, సితార యీ పాటికే దాన్ని వినేసి వుంటుందనీ, ఆశపడుతూ సితార రియాక్షన్ కోసం చూస్తున్నాడు.
అతను అలా చూడగా చూడగా అరగంట తర్వాత సితార డాబా అంచున ఆనుకుని నిలబడి కనబడింది.
తక్షణం ఆమె మొహంలోకి వెదుకుతూ చూశాడు అతను. నిజానికి ఆమె మొహం యిప్పుడు ఎక్స్ ట్రాగా ఏ భావమూ కనబడలేదుగానీ, మన మనసులో ఏ భావం వుంటే అదే ఎదుటివాళ్ళ మొహంలో కూడా కనబడుతున్నట్లు మనకు అనిపించడం లోకసహజం కాబట్టి ఆమె తన కవితలు విన్నదనీ, ఆమె మదిలో మెదిలేభావాలే మళ్ళీ యింకో కవిత రూపం దాల్చాయనీ అనిపించింది అతనికి. ఇదంతా తికమకగా వుంటే రచయిత తప్పు కాదు. ఆ కుర్రాడి మనసులో భావాలు అంత గజిబిజిగా వున్నాయి.
ఆమె మనసులో వున్న కవితలు కూడా తనే వూహించుకోవడానికి ప్రయత్నం చేశాడు అతను. సితార తరఫున జెయ్ చంద్ర ఆత్రేయ లెవెల్లో (అని అతని వుద్దేశ్యం) వూహించి, కాఫీరాగంలో ట్యూన్ చేసిన కవిత వైనం యిలా వుంది.
"నీ ప్రేమ పెసరట్టు
నా ప్రేమ బొబ్బట్టు
ఈ లోకం ఉల్లి అట్టు
చెయ్యొద్దు మన గుట్టురట్టు
ఐలవ్ యూ, ఐ లవ్ యూ!"
దానికి బదులుగా వెంటనే తన రిప్లయ్ కవితను ఇంకోదాన్ని పాలమీగడలాంటి పదాలతో రాసి, బేగడరాగంలో పాడుకున్నాడు అతను.
"కలానిజమా కాకరకాయ్
సాటిలేని సపోటకాయ్
మదినెంతో మామిడికాయ్...
కోరికా కొబ్బరికాయ్"
"ఆపు!" అని పెద్దగా అరిచాడు అప్పుడే అక్కడికి వచ్చిన శేషు చెవులు రెండూ గట్టిగా మూసేసుకుంటూ.
"ఏం? బావోలేదా?" అన్నాడు అతను.
"నా మొహంలా వుంది" అన్నాడు శేషు.
"అయితే బావులేదన్నమాటే! కానీ నువ్వింకా పూర్తిగా వినలేదురా! చివర్లో ఐలవ్యూ! ఐలవ్ యూ అని పెడితే అందం వస్తుంది."
"నా బొంద! నా బోలె! నా శ్రాద్ధం" అన్నాడు శేషు దుఃఖంగా.
"ఛప్! కవిత్వం అంటే నీకేం తెలుసురా!"
"ఇదే గనక కవిత్వం అయితే, శ్రీశ్రీ, నన్నయా, షేక్ స్పియరూ వాళ్ళంతా రాసింది కవిత్వం కింద లెక్క అన్నమాట"
"పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నారు. బహుశా నిన్ను చూసే కాబోలు" అన్నాడు అతను.
అంతలోనే......
పెత్తనాలకి వెళ్ళిన ఆదినారాయణగారు- అదే - సీజరు తిరిగి వచ్చింది. "బాలరసాలసాల నవపల్లవకోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి...." అన్న పద్యాన్ని అర్జెంటుగా పాడుకుంటూ.
దాన్ని చూడగానే అతని మొహం 70 ఎమ్మెమ్ దోశె సైజుకి వికసించింది. "సీజర్! సీజర్! కమాన్ బాయ్!" అన్నాడు గారాబం చేస్తూ.
ఈ జన్మలో సీజర్ అనబడే గతజన్మతాలూకు పౌరాణికాల నటుడు ఆదినారాయణ గారు మనసులోనే పంచె ఎగదోసుకుంటూ దగ్గరికి వచ్చింది.
"ఏంటో చెప్పేడు కుర్రకుంకా" అంది కుక్క భాషలోనే.
"కేసెట్ సితారకి ఇచ్చావా?" అన్నాడు జెయ్ చంద్ర.
"సైడుకాలవలో వెతుక్కో!" అంది ఆదినారాయణగారు మంటగా.
"థాంక్స్!" అన్నాడు ఆ వ్యంగ్యం అర్ధంకాని అతను.
ఆ తర్వాత అతనింక వరసబెట్టి ప్రేమగీతాల కేసెట్లు తయారు చేయడం మొదలెట్టాడు. రోజురోజుకీ ఆ పరిశ్రమ దినదినాభివృద్దిపొంది చివరికి టీ......సిరీస్ కేసెట్ల ఫ్యాక్టరీ లెవెలుకి వచ్చేసింది కూడా.
అలా తయారయిన ప్రేమగీతాలన్నిటినీ సీజరుకిచ్చి పంపేవాడు అతను సితారకి యివ్వమని.
సీజర్, ఉరఫ్ ఆదినారాయణగారేమో అమిత శ్రద్దాసక్తులతో ఆ కేసెట్లని తీసుకెళ్ళి ఓ దాన్ని సైడుకాలవలో, ఓదాన్ని పెంటకుప్పలో, ఓదాన్ని డ్రైనేజీ మాన్ హోల్లో, ఓదాన్ని పబ్లిక్ టాయ్ లెట్ లో, ఇంకోదాన్ని రోడ్డు రోలర్ కిందా....అట్లా పడేసి యధాశక్తిగా వాళ్ళ ప్రేమపురాణానికి ఫుల్ స్టాప్ పెట్టించాలని చూస్తున్నాడు.


