ఓ పావుగంటకి భజన కార్యక్రమం ముగిసింది.
భక్తులంతా లేచి బయటకొచ్చారు.
చాలా మంది ఆడా మగా భక్తులు సుందరమూర్తి చుట్టూ మూగారు. సుందరమూర్తి దేవుడని కాదు, కొత్తగా పెళ్ళి చేసుకోచ్చాడని.
మాతామహేశ్వరి దర్శనానికి ఇంకా పావుగంట టైముంది. ప్రస్తుతం ఆమె పాలతో స్నానం చేస్తున్నదిట.
పాలస్నానం చేస్తే చీమలు పడతాయి. నీళ్ళలో గోమాత పాలు ఓ మిల్లిగరిటెడు కలుపుతారుట. కొందరు అత్తరు, డేటాలులాంటివి కలిపినట్టు అన్నమాట. నీళ్ళ స్నానమైనా మిల్లి గరిటెడు పాలు కలిశాయి గాబట్టి పాలస్నానం అని భక్తులు పేరు పెట్టారు..... చీమలుకూడా ఈ కిటుకు గ్రహించే వుంటాయి, అందుకే మాతామహేశ్వరి జోలికి అవేప్పుడు పోలేదు.
పాలస్నానం కాంగానే అలంకరణ. అప్పుడు భక్తులకి దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ లోపల భక్తులు భక్తీ కధలు, భక్తచింతామణి కధలు ఎవరికి తోచింది వారు చెప్పుకోవచ్చు.
"అమ్మ దర్శనానికి ఇవాళేనా రావటం" ఓ భక్తుడు సుందరముర్తిని అడిగాడు.
"కాదులెండి. అమ్మ అజ్ఞయినా ఆఫీసరు అజ్ఞ కావాలికదా! వాడు వట్టి త్రాష్టుడు, పూజాలంటే మండిపడతాడు. కాని వాడు మాత్రం ఏడాదికి రెండు సార్లు తిరుపతి వెళ్ళొస్తాడు. మళ్ళి మన్ని చూస్తే మంట. ఎప్పటిలా ఆఫీసు వదిలాక సాయంత్రపువేళలే వస్తాను. నా వైఫ్ ని తీసుకువచ్చాను. ఇవాళ అమ్మ దివ్యరూపం చూపిద్దామని" అంటూ సీత వేపు చూశాడు సుందరమూర్తి.
అడ భక్తురాళ్ళ మధ్య సీత బిక్కమొహం వేసుకు నుంచొని వుంది.
"ఈ చీర పెళ్ళికి పెట్టిందా?"
"చీర ఖరిదేంత?"
"నీ పేరేమిటి?"
"మొత్తం జుట్టేనా! సవరం పెట్టావా?" ప్రశ్నలు పూర్తయ్యాయి.
"జడబావుంది."
"కళ్ళు చాలా బావున్నాయి. అమ్మ కళ్ళు లాగానే....' పొగడ్తలు పూర్తయ్యాయి.
"ఇవాళేనా అమ్మ దర్శనానికి వచ్చింది. మంచిపని చేశాడు సుందరమూర్తి , ఈరోజే తీసుకువచ్చాడు, ఇవాళ అమ్మ అవతారం ఏమిటో తెలుసా! ఆదిశక్తి అవతారం...." నోట్లో రెండు నాలుకలున్నా ఓ వాగుడుకాయ భక్తురాలు సీతకి వివరంగా చెప్పింది. మాతామహేశ్వరి ఈ నెలలో ఓ పదిరోజుల పాటు రోజుకో అవతారం ధరిస్తుందిట. ఇది పగలు మాత్రమే, అ తరువాత మళ్ళి మాములుగానే తయారయి కూచుంటుంది.
కొంతమంది భక్తురాళ్ళు సుందరముర్తిని పలకరించి కుశల ప్రశ్నలేశారు, భక్తులు మాత్రం సీతని పలకరించే పిచ్చిపని మాత్రం చేయలేదు. కాని వాళ్ళ కళ్ళు అపుడప్పుడు సీతని పవిత్రంగా చూస్తూనే వున్నాయి. అక్కడున్న అందరూ ఒకే రకంకాదు. కొందరు భక్తులు కళ్ళుమూసుకుని మౌనంగా జపంలాంటిది చేస్తున్నారు.
లోపలనుంచి గణగణమంటూ గంట,
భక్తుల నోళ్ళు మూసుకుపోయాయి.
మరోసారి గంట మోగింది.
భక్తులు లోపలికి దారి తీశారు.
సీత సుందరమూర్తి వాళ్ళతో పాటే నడుస్తూ పెద్ద గదిలోకి వెళ్లి కూచున్నారు. కూచునే ముందు "జై మాతామహేశ్వరి! జై జై మాతా!" అని పొలోమంటూ అరిచారు.
వీళ్ళ ఎదుట పెద్ద సింహాసనం మీద ఆదిశక్తి అవతారంతో మాతామహేశ్వరి కూచుని వుంది. సింహసనంకి బంగారు పూత పుశారో బంగారందో గాని చూడటానికి బంగారందిలానే వుంది. మాతామహేశ్వరి పెద్ద పెద్ద జరిపులున్నా మిరపపండు రంగు పట్టుచీర కట్టుకుని వుంది. అదే రంగు జాకెట్టు వేసుకుంది కాసులపేరు, కంటే, వడ్డాణం జిగిని గొలుసు, రాళ్ళ గొలుసు, ఉత్తగాజులు, రాళ్లగాజులు, ముత్యాల ముక్కెర, రత్నాల కమ్మలు, లతలు, రంగు రాళ్ళ కిరీటం, వంటికి నిండుగా కంటికి పండుగగా అంతా బంగారం.....బంగారం....బంగారం.....మనిషి కూడా బంగారం రంగులో బొద్దుగా మంచి గుమ్మడి పండులా వుంది.
మాతామహేశ్వరిని చూడంగానే ఎవరికైనా కళ్ళు మిరుమిట్లు కోల్పుతాయి. వెంటనే భయం. భక్తీ కలుగుతాయి కళ్ళుమూసుకుని చెయ్యెత్తి నమస్కారం పెడతారు. ఆతర్వాత ఆదిశక్తి అమ్మవారు భక్తుల కోసం ఈ భూమ్మీదకి దిగి వచ్చారా! అనిపిస్తుంది. ఆ తర్వాత అనిపించడానికేమి మిగలదు అమ్మని నమ్మటం తప్ప.
సీతకి మాత్రం అలా అనిపించలేదు. గుళ్ళలో లక్ష్మి సరస్వతి పార్వతి కనకదుర్గ తదితర అమ్మవార్ల విగ్రహాలను చూసింది. వాళ్ళెవరిలాను మాతామహేశ్వరి లేదు. మనిషికి వేషం వేసినట్టు వుంది. మళ్ళి మాట్లాడితే తను చూసిన భక్తీ సినిమాలలో కె.ఆర్.విజయ ఎస్.వరలక్ష్మి లాగా కొద్దిగా వుంది భూలోకంలో అక్కడక్కడా ఇలాంటి అమ్మ దేవుళ్లున్నారని బొత్తిగా తెలియని అజ్ఞానురాలు సీత. అందుకే మాతామహేశ్వరిని అలా చూస్తూ వుండిపోయింది. అంటే నిలువు గుడ్లేసుకుని కాదు. అమ్మ ధరించిన కిరీటాన్ని, శరీరాన్ని అలంకరించిన సొమ్ములని ఆ పెద్ద బొట్టుని ఖరీదైనా పట్టుచిరని అక్కడ జరుగుతున్న తతంగాన్ని అన్నమాట.