సీత చీరకట్టుకుని గదిలోంచి బయటికి రాంగానే "ఇప్పుడు చూడు ఎంత అందంగా వున్నవో?" అన్నాడు సుందరమూర్తి.
"మనమెళ్ళే చోట నా అందం ముఖ్యమా?" నవ్వుతూనే అంది సీత.
"ఛి.... నీకు బొత్తిగా తెలియదు. ఎప్పుడెలా మాట్లాడాలో" అని విసుక్కున్నాడు సుందరమూర్తి.
సీత ముఖం చిన్నబుచ్చుకుంది.
మాట్లాడటంకూడా ఒక కళే అన్నారు. సీత అడిగిందానికి "నీ అందంగా వున్నావని అంతా పొగుడుతుంటే నే గర్వపడదామనోయ్! అందంగా అలంకరించుకు రమ్మన్నానుగాని కురిపిగా రమ్మనలేదు కాదోయ్!" సుందరమూర్తి చిరునవ్వుతో అలా అని వుంటే సీత సిగ్గుపడేది, గర్వపడేది, అయినయిపోయేది. తెలివి గల భర్తగా మంచి మాటకరిగా మెలగటం సుందరముర్తికి రాదు.
సీత తయారయ్యాక సుందరమూర్తి రిక్షా పిల్చుకువచ్చాడు.
మరీ దూరమయితే తప్ప రిక్షాలు బస్సులు ఎక్కటం సీతకిష్టం లేదు.
ఆడది అబల అని పదిగజాల దురానికయినా ఆమె రిక్షాలాంటి వాహనం ఎక్కటం మంచిదని సుందరమూర్తి అభిప్రాయం.
ఓసారి సినిమాకి మరోసారి బజారుకి రెండుసార్లు తెలిసినవాళ్ళ ఇళ్ళకి మొత్తానికి అరడజనుసార్లు బయటకెళ్ళాల్సి వచ్చింది, అన్ని సార్లు రిక్షా మాట్లాడాడు సుందరమూర్తి. ఒక్కసారయినా నడుద్దామంది సేత ససేమిరా అలావద్దన్నాడు. అనవసరంగా డబ్బు ఖర్చంది సీత. "సంపాదిస్తున్నవాణ్ణి నేను, ఖర్చు పెడుతున్నది నేను, అనవసర విషయాలు
మాట్లాడకు" అన్నాడు సుందరమూర్తి. అక్కడితో నోరు మూసుకుంది సీత.
సీత, సుందరమూర్తి రిక్షా ఎక్కారు.
రిక్షా ముందుకి సాగింది.
21
మాతామహేశ్వరి ఆశ్రమానికి కొద్దిదూరంలో రిక్షా ఆగింది సుందరమూర్తి రిక్షా దిగాక సీత దిగింది."
"ఈ ప్రదేశంలో కాలుపెట్టగానే శరీరం గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా మనసు ప్రశాంతంగా వుంటుంది. అమ్మ మహత్యం ఇది. నీకు కూడా ఇలానే వుందికదూ" అడిగాడు సుందరమూర్తి.
"వుంది" అని చెపుదామా అంటే అలా శరీరం మనసు వున్నట్లు దాఖలా కనిపించలేదు సీతకి. "లేదు" అంటే సుందరమూర్తి తప్పు పట్టవచ్చు. అందుకని తలవూపి ఊరుకుంది సీత.
ఆశ్రమంలోంచి తళాల చప్పుడు గట్టిగా వినిపిస్తున్నది, అంత కన్నా గట్టిగా పెద్ద గొంతుకతో "అమ్మా పరమేశ్వరి, మాతామహేశ్వరి దీనుల రక్షించుమా, అమ్మా పరమేశ్వరి, మాతామహేశ్వరి పాపుల కాపాడుమా." అంటూ పాడుతున్నారు. మైక్ లోంచి జోరుగా వినిపిస్తున్నది.
"అమ్మ దర్శనం తర్వాత ముందు భజన మందిరంలోకి వెళదాం పద" అన్నాడు సుందరమూర్తి.
"మీ ఇష్టం" అంది సీత.
మాతామహేశ్వరి వున్నది పేరుకి ఆశ్రమమేగాని పెద్ద యిల్లు. ఆ యింటికి అటూ యిటుగా మందిరాలు కొత్తగా కట్టారు. ఒక్కోగది, ఒక్కోదానికి కేటాయించారు. వాకిలి ముందు చాలానే ఖాళిస్థలం ఉంది. ఓ మూల బావి వుంది. రెండు కొబ్బరిచెట్లు, కొన్ని అరటి పిలకలు తులసి మొక్కలు, పులమొక్కలకి జాగా వదిలి మిగిలిన స్థలమంతా నాపరాళ్ళు పరిచారు.
సీత సుందరమూర్తి బావివద్ద కాళ్ళు చేతులు కడుక్కుని నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించిఉమ్మేసి అక్కడనుంచే దండం పెట్టుకుంటూ నెమ్మదిగా నడిచి ఓ పక్కగా ఉన్న భజన మందిరంలోకి ప్రవేశించారు. అక్కడ ఓ యాభై మందిదాకా అడ మగ ఉన్నారు.
సుందరమూర్తి ముందే చెప్పినట్టుగా సీత ఆడాళ్ళవేపు, వాళ్ళకి వెనుకగా కూచుంది. సుందరమూర్తి మగాళ్ళలో కూచున్నాడు. అందరి చేతుల్లో తాళాలున్నాయి. తాళాలు లేనివాళ్ళు చేతులనే తాళాలుగా మర్చి మోగిస్తున్నారు. మైకుముందు ఒకామె కూచుని వుంది. ఆమె ఏదంటే అ మాటే పట్టుకుని అరుస్తున్నారు. అడ మగ భక్త బృందం. వాళ్ళు యిహలోకాన్ని మర్చిపోయినంత ఆవేశంతో పాడుతున్నారు గాని పూర్తిగా మటుకు మర్చిపోలేదు. ఎవరో కొత్త శాల్తీలు ప్రవేశించినట్టు అనుమానంరాగా తలలు తిప్పి సీత సుందరముర్తులని చూసి "ఓహో" అనుకుని మళ్ళి తలలు తిప్పెసుకున్నారు.
సీత గమనించింది.
భజనలో కూర్చున్న వాళ్ళంతా కళ్ళు మూసుకుని వున్నారు. మధ్య మధ్య చికటిలోంచి వెలుగులోకి రాకపోతే బ్రతకలేమన్నట్టు కళ్ళు తెరచి అలా చూసి ఇలా ముసేసుకుంటున్నారు.
పూర్తిగా కళ్ళు తెరచి వాళ్ళందరిని పరీక్షగా చూస్తూ కూచున్న సీత వాళ్ళ చేష్టలు గమనిస్తూనే వుంది.