మాతామహేశ్వరి రెండు పాదాలను పెద్ద యిత్తడి పళ్ళెంలో వుంచింది. మాతను కొలుస్తూ పాదాలకి కుంకం పూజ చేస్తున్నారు శిష్యురాళ్ళు. పూజ చేసిన కుంకం ఆమె మోకాళ్ళదాకా వచ్చింది. మాతామహేశ్వరి మధ్య మధ్య కళ్ళు మూసుకుని తెరుస్తూ చూస్తూ వుంది. భక్తులల్లో పెరిగిన పాపాన్నో లేక భక్తులెంత మంది వచ్చారనో?
మాతామహేశ్వరి కొత్త భక్తురాలు తన దర్శనానికి రావటం గుర్తించింది. మధ్యలో భక్తురాలైనా సీతని చూస్తూనే వుంది. సీత ప్రవర్తన బొత్తిగా నచ్చలేదు మాతకి. తానెప్పుడు సీతని చూసినా తనని అదేపనిగా సీత చూడటం జరుగుతూనే వుంది. "ఈ పిల్లకి బొత్తిగా ఏం తెలియదు. తన వంటి మీద ఎన్ని కిలోల బంగారం వుందో అంచనా వేయటం లేదు కదా!" అనుకుంటూ మాత కాస్త భయపడింది. మరొకటా! మరొకటా! ఇది బంగారమాయె.
పూజ కార్యక్రమం అరగంట తర్వాత పూర్తయింది. నారింజ కాయంత హారతి కర్పూరం వెలిగించి హరతిచ్చారు. అప్పుడు పళ్ళెంలోంచి కాళ్ళు తీసింది మాతామహేశ్వరి. ఆ కుంకం పళ్ళెం కడు జాగ్రత్తగా పక్కన పెట్టారు.
ఓ శిష్యురాలు శంఖం తీసుకుని "బొయ్యి" మంటూ ఊదింది.
"భక్తులారా! దేవుడి బిడ్డలారా!" అంటూ అపుడు గట్టిగా పలికింది మాతామహేశ్వరి.
వెంటనే ఆడామగా భక్తులు చేతులని దోసిటలా పట్టి "అమ్మా! మాతామహేశ్వరి! మాతా.....మాతా....శరణం తల్లి!" అన్నారు.
పసిపిల్లల్లా భక్తులంతా "అమ్మా అమ్మా"! అన్నందుకు కుడిచేతిని గాలిలో ఆడించి అభయం ఇచ్చింది మాతామహేశ్వరి. అప్పుడు చల్లని చిరునవ్వు కూడా చిందించింది పెదవులపై.
తర్వాత భక్తీ గురించి నాలుగు నిముషాలు, భక్తులు చేయాల్సిన పనుల గురించి ఐదు నిముషాలు తన గురించి ఆరు నిముషాలు గంభీరకంఠంతో చెప్పింది మాత.
కింద సుదిపడేస్తే వినపడేంతా నిశ్యబ్ధంగా విన్నారు భక్తులు.
అక్కడితో ఆ కార్యక్రమం పూర్తయింది.
ఓ శిష్యురాలు గొంతు సవరించుకుని "మాతామహేశ్వరి ఈ రోజు అవతారం యొక్క ప్రాముఖ్యత, రేపటి రోజు ధరించబోయే అవతారం గురించి చెప్పి, ఆమె సాక్షాత్తూ ఆదిశక్తి అవతారమని, జగన్మాత అని కాశి, దుర్గ అన్ని మాతేనని ..... ఓ వేళ ఈ విషయం భక్తులకి తెలియదేమో అని పొగుడుతూ నొక్కి వక్కాణిస్తూ గొంతు చించుకు కంఠనాళాలు ఉబ్బగా మరీ మరీ చెప్పింది.
భక్తుల మట్టి బుర్రల్లో ఆమె మాటలు బాగా నాటుకున్నాయి.
తదుపరి కార్యక్రమం.....
భక్తులు వరుస వారిగా మాతామహేశ్వరి దగ్గరకెళ్ళి ఆమె పాదాల కంటిన కుంకుం తీసుకు ముఖాన పెట్టుకుని తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఆమె కాళ్ళ వద్ద వినయంగా కూచుని తమ బాధలు చెప్పుకోవాలి. బాధలు గాధలు వేనుకేం లేకపోతె నమస్కారం పెట్టి ఆశిస్సుతీసుకుని వెంటనే బయటకు వెళ్లిపోవచ్చు. గుమ్మం వద్ద ఓ శిష్యురాలు పెద్ద డేకిసాలో ప్రసాదం పెట్టుకు నుంచొని వుంటుంది. ఆ ప్రసాదం పుచ్చుకుని వెళ్ళాలి ముఖ్యంగా.
ఈ ప్రసాదంకో కధ వుంది. ఆషామాషీ ప్రసాదంకాదు రోజు అయితే కొబ్బరిముక్కలు, అరటిపండు ముక్కలు అమ్మ అవతారం ధరించేతప్పుడు స్పెషల్ ప్రసాదం. ఈ ప్రసాదం రోజుకో భక్తుడు తన డబ్బుతో చేయిస్తాడు. ప్రసాదం కర్చు భరించడానికి పూర్వజన్మ సుకృతం వుండాలట. పెట్టి పుట్టాలిట. నేతితోనే చేయించాలిట. సైజు పెద్దదిగా వుండాలిట. ఓ రోజు ప్రసాదం లడ్లయితే మర్నాడు అరిసెలు ఆ మర్నాడు జంగ్రిలు, ఆపై కజ్జికాయలు వగైరా ప్రసాదం ప్రక్కనే చిట్టిగారెలు రెండు యిస్తారు. అవి చిట్టిగా ముద్దోస్తూ వుంటాయి. ప్రసాదం ఎవరయితే చేయిస్తారో వాళ్ళదే ఈ చిట్టి గారెల ఖర్చు కూడా. ప్రసాదం పొరపాటున కూడా పుచ్చుకోకుండా పోరు భక్తులు. పొరపాటున మర్చిపోయినా పాపం చుట్టుకుంటుంది. రౌరవాది నరకాలకు పోతారు నరకం చూడాల్సివస్తుందనే భయంవల్ల భక్తులు పొరపాటునకూడా పోరపడరు.
మాత కాళ్ళకు నమస్కారం చేసి ఒక్కొక్కళ్ళు సెలవు పుచ్చుకుంటున్నారు. సీత సమేతంగా సుందరమూర్తి మాత వద్దకి వచ్చాడు. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు. "నువ్వు పెట్టుకో, అన్నట్టు సైగ చేశాడు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి ఆ నమస్కారంలోనే చేతులు చాచి మాత కాళ్ళు పట్టుకున్నాడు.
సీతకి సాష్టాంగ నమస్కారం పెట్టటం బొత్తిగా రాదు. ఎప్పుడూ ఆ అవసరం కలగలేదు. దేవుడి గుడికి చాలా సార్లు వెళ్ళింది, గాని, నమస్కారంతోనే వూరుకుంది. జీవితంలో ముందుముందు అవసరం రావోచ్చేమోనని ప్రాక్టీసు చేయలేదు. మాతామహేశ్వరి దర్శనానికి వచ్చే ముందు సుందరమూర్తి ఇక్కడ చేయాల్సిన విధానాలు పద్దతులు చెప్పాడు గాని సాష్టాంగం విషయం చెప్పలేదు. మొగుడు చెప్పినట్టే అచ్చం అన్ని అలాగే చేసింది సీత. ఇప్పుడు మొగుడు సాష్టాంగం పడ్డాడు కాబట్టి తనూ పడాలి. బోర్లాపడటానికి కూడా పద్దతుంది. లేకపోతె మూతిపళ్ళు ముందువి రెండూ రాలతాయి. పడకపోతే మొగుడు బాధపడతాడు. సీత సుక్మగ్రాహి బాధపడకుండా వుండటానికి సాష్టాంగం పడి మాతకి నమస్కారం పెట్టింది.


