ఆమె లేచి వెళ్ళిపోతూ వుంటే వెలుగూ, జిలుగూ అంతా ఆమెతోటే వెళ్ళి పోతున్నట్లుగా తోచిందేమో.....ఒకరిద్దరు బాధగా-"ప్చ్-ప్చ్" అనుకున్నారు కూడా.
"ఇంత లేవిష్ గా ఎలా స్పెండ్ చేయగలుగుతున్నావు ఛాయా?" ఆటో ఎక్కాక స్మిత అడిగింది.
"ఇదేముంది? ముందు-ముందు చూడండి....జీవితం అంటే ఏమిటో చూపిస్తాను" స్టెయిల్ గా భుజాలెగరేస్తూ అంది చాయ.
"సంధ్య కూడా వస్తే బాగుండేది" అంది అనూరాధ.
చాయ చిరాకుగా చూసి.... "అందరికీ అనుభవించే రాత వుండదు" అంది.
"అదీ నిజమే" ఒప్పుకున్నారు ఆమె ఫ్రెండ్స్.
* * *
"మొన్న తీసుకున్న పదివేలతో కలిపి, నలభై వేలయింది! వడ్డీ కూడా ఇవ్వకుండా మొహం చాటేస్తున్నావు. అసలు ఈ లాలా నీ ఉద్దేశం ఏమిటి?" చేతిలో కర్రని గుండ్రంగా తిప్పుతూ అడిగాడు లాలా.
కిరణ్ చుట్టూ చూసాడు.
ఆఫీసులో మిగతా ఎంప్లాయిస్ అంతా ఇటే చూస్తున్నారు వినోదంగా!
"లాలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం" రిక్వెస్టింగ్ గా అన్నాడు కిరణ్.
"ఏం పరువు పోతోందా?" అతను వ్యంగ్యంగా నవ్వాడు.
"ప్లీజ్ లాలా" గొంతు తగ్గించి అన్నాడు కిరణ్.
"సర్లే.....పద!" అతను విసుగ్గా బయటికి నడిచాడు.
ఇద్దరూ పక్కనే వున్న గవర్నమెంట్ పార్కులోకి నడిచారు.
కిరణ్ జేబులోనుండి ఐదువందల రూపాయల నోటుతీసి-
"ప్రస్తుతానికి ఇది వుంచు" అని అతనికి ఇవ్వబోయాడు.
లాలా గభాల్న కిరణ్ కలర్ పట్టుకుని- "భీక్ దాల్రాక్యా? బికారీలాగా కన్పిస్తున్నానా బే?" అని అరిచాడు.
"అది కాదు...." కిరణ్ మాట పూర్తికాకుండానే-
"దీంట్లో ఏముందో తెలుసా?" అని తన చేతిలోని కర్ర పై భాగం పట్టుకుని సర్రున లాగాడు.
లోపలనుండి తళతళలాడే కత్తి బయటకొచ్చింది.
అప్పుతీసుకున్న వాడి దగ్గర షూరిటీలూ, సంతకాలూ తీసుకోకుండా వాడికి సులభంగా వడ్డీకి డబ్బిస్తే కాబూలీవాలాకి వడ్డీ సరిగ్గా ఇవ్వనివాడ్ని తన్నడం, అసలు ఎగగొట్టాలని చూసేవాడ్ని పొడిచి పారెయ్యడం పెద్దపనిగా కనిపించదు.
సాధారణంగా ఎవరూ కాబూలీవాలా దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టే సాహసం చెయ్యరు!
"లాలా! ఏవిటిది? నేను ఇవ్వను అనలేదుగా? అంకుల్ రాగానే..."
"నీ అంకుల్....పెంకుల్ మాకీ అన్నీ తెల్సు! ముందు డబ్బు కక్కు బే" అతను క్రూరంగా కిరణ్ ని ముందుకు లాగుతూ అన్నాడు.
కిరణ్ కి సహనం నశించింది.
అతన్ని ఒక్క తోపు తోసాడు.
ఊహించని పరిణామానికి అతను నివ్వెరబోయి, అంతలోనే తేరుకుని ముందుకొచ్చి కిరణ్ ని తల ఢీకొని, క్రిందపడవేసి కొట్టసాగాడు.
కిరణ్ దెబ్బలనుండి తప్పించుకోటానికి ప్రయత్నిస్తూ అతని మూతిమీద గుప్పిట బిగించి బలంగా కొట్టాడు.
ఆ దెబ్బకి అతని మూతి పగిలి రక్తం బొటబొటా కారింది.
"సైతాన్ కహీకా.....నిన్ను వదలను" అని లాలా పెడబొబ్బలు పెడుతూ కిరణ్ మీదకి లంఘించాడు.
తమాషా చూస్తున్నట్లుగా అక్కడ మూగిన జనంలోనుండి ఒకతను ముందుకొచ్చి లాలాని పట్టుకుని ఆపటానికి ప్రయత్నించాడు.
అతను ఆగలేదు.
కిరణ్ మీదకి దూకుడుగా, వెళ్లి కత్తి సర్రున పైకిలాగి కిరణ్ ని కసుక్కున పొట్టలో పొడిచాడు.
రక్తం ఫౌంటెన్ లా బయటికి విరజిమ్మింది.
చుట్టూ వున్న జనం హాహాకారాలు చేసారు.
"పోలీస్.....పోలీస్.....హత్యా" అని ఒక స్త్రీ భయవిహ్వలంగా అరిచింది.
దాంతో కొందరు కలిసి "పోలీస్? పోలీస్" అని అరుస్తూ లలాని పోనివ్వకుండా పట్టుకుని ఆపారు.
ట్రాఫిక్ పోలీస్ విజిల్ ఊదుతూ వచ్చి జనాన్ని చెల్లాచెదురు చేయసాగాడు.
ఈలోగా పోలీసులు రంగంలోకి దిగారు.
"చాయా! ఏక్సిడెంట్ అనుకుంట! ఎవరో కుర్రాడు రక్తం మడుగులో పడివున్నాడు పాపం!" స్మిత కళ్ళెత్తి చూస్తూ అంది.
సిన్మా టిక్కెట్లు దొరక్క విసుగ్గా వున్న చాయ అటు చూడటానికి ప్రయత్నించలేదు.
"ఏవంత మంచి దృశ్యం అని అలా కుతూహలంగా చూడడం? పదండి పోదాం" అంది.
"ఆగవే....బ్రతికున్నాడో లేదో" అనూరాధ ఆగిపోయి చూస్తూ అంది.
"అబ్బా......పదమన్నానా?" విసుగ్గా అంటూ చాయ కూడా అటుచూసింది.
పోలీస్ బోర్లా పడున్న అతన్ని వెల్లకిలా తిప్పుతున్నాడు.
చాయ నోరు ఒక సెకండ్ పాటు ఆశ్చర్యంతో తెరుచుకుని "కిర...." అనబోయి ఆగిపోయింది.
న్యూస్ పేపర్లు అమ్మే చిన్న కురరాడు పోలీస్ దగ్గరకొచ్చి భయం, భయంగా-
"మర్ గయా?" అనడిగాడు.
పోలీసు ముందుకి వంగి కిరణ్ ముక్కుదగ్గర వేలు పెట్టి చూసి...... "నై.....జిందా హై" అన్నాడు.
"చాయా-ఐస్ క్రీమ్ తిందామన్నావుగా?" స్మిత గుర్తు చేసింది.
రక్తం మడుగులో వున్న కిరణ్ వైపు అభావంగా చూసి చూపు మరల్చుకుంది చాయ.
"పదండి.....లేట్ అయిపోయింది" అంది ఫ్రెండ్స్ తో.
ఆస్పత్రికి వెళుతూ వుండగా మగతలో వున్న కిరణ్ పెదవులు అస్పష్టంగా-
"చా.....యా" అని ఉచ్చరించాయి.
పూర్తిగా స్పృహ తప్పేవరకూ అతని కళ్ళల్లో ఆమె రూపం, పెదవుల మీద ఆ పేరు కదులుతూనే ఉన్నాయి.
* * *
చాయ హాస్టల్ కి వెళ్ళగానే దయామణినుండి పిలుపొచ్చింది.
"రా.....చాయా" అంది దయామణి.