కిరణ్ కి ఆ నిమిషంలో గ్రహమ్ బెల్ కనపడితే ఫుట్ బాల్ ఆడెయ్యాలన్నంత కోపం వచ్చింది. 'మనిషికి ప్రైవసీ అనేది లేకుండా, హాయిగా ఆలోచించుకోడానికి లేకుండా, ఎప్పుడుపడితే అప్పుడు....ఏది పడితే అది.....మనుషుల చెవుల్లో దూరి అనేసే పరికరాన్ని కనిపెట్టావు కదయ్యా! నయం ఇంకా గదిలోనే మ్రోగుతోంది.....మదిలో కంతా దూరిమ్రోగకుండా!' అని టవల్ చుట్టుకుని ఫోన్ దగ్గరికి వచ్చాడు.
టేబుల్ మీద ఫోన్ వికటంగా నవ్వుతోంది. అది ఎక్కువగా అతని మేనమామ తిట్లనే అందిస్తూ వుంటుంది.
దానివైపు వీలైనంత ఏహ్యంగా చూస్తూ విసురుగా అందుకున్నాడు కిరణ్.
"హలో నేను చాయని!"
కిరణ్ కి ఒక్కసారిగా శరీరంలోని శక్తినంతా పీల్చేసి ఎవరో తేలిక చేసినట్లయింది.
"ఛాయా డార్లింగ్! ఎక్కడ్నించి?" ఉషారుగా అడిగాడు.
"కిరణ్! ఏం చేస్తున్నావు?"
"ఏం చెప్పను? నీ తలపులతో పిచ్చెక్కిపోతున్నాను. ఇంతసేపూ నిన్ను తల్చుకుంటూ ఏం చేశానో తెలుసా?" అతను ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు.
"కిరణ్! ఖాళీగా వుంటే వెంటనే నువ్వు మా హాస్టల్ బస్ స్టాప్ దగ్గరికిరా" అంది.
"ఖాలీగానా?" అతనికి వాళ్ళ అంకుల్ గాండ్రింపు ఓ లిప్తపాటు గుర్తువచ్చింది. కానీ అలాంటి గాండ్రింపులన్నీ ప్రేమముందు బలాదూర్. "ఆ....పనేం లేదు. ఖాళీగానే వున్నాను. వెంటనే వస్తాను" అన్నాడు.
"వచ్చేటప్పుడు ఓ ఐదువేలు పట్టుకురా అర్జెంట్" అంది చాయ.
"ఐదు వేలా? ఆ....ఆ! అలాగే..." వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆలశ్యం చేస్తే ఏం వినాల్సొస్తుందో అని.
"వెంటనే బయలుదేరు.....బయలుదేరుతున్నావా....?" గట్టిగా అంది.
"ఆ.....ఇదిగో.....వస్తున్నా!" వెనక్కి తిరిగి షర్ట్ అందుకుంటూ అన్నాడు. "బై.....సీయూ!" రిసీవర్ పెట్టేసి ఫోన్ ని ముద్దు పెట్టుకున్నాడు.
"ఈ రోజునించీ మనం ఫ్రెండ్స్! నిన్ను కొట్టనూ.....తిట్టనూ.....!" అన్నాడు.
ఫోన్ రాజీకి రానట్టు "ట....ర్....ర్" అంది.
భయం భయంగానే తీశాడు.
"ఏం రాచకార్యాలు వెలగపెడుతున్నావు? అవలేదా అలంకరణ? నేను పనిమీద ఢిల్లీ వెళ్తున్నాను. ఆఫీసు స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి డబ్బు బీరువాలో పెట్టాను. వచ్చేటప్పుడు తీసుకొచ్చి అందరికీ ఇవ్వు ఒక్క మాట.....నీ జీతంలో ఈ నెల రెండువేలు కట్ చేస్తున్నాను" అన్నాడు.
"ఎ....ఎందుకు?" నాలుక తడారిపోతున్నట్లు అడిగాడు కిరణ్.
"నా కారు ఆఫీసు పనికోసం కాకుండా నీ స్వంత తిరుగుళ్ళకోసం వాడినందుకు ఇలాగే కంటిన్యూ చేస్తే అసలు ఉద్యోగమే వుండకుండా పోతుంది జాగ్రత్త!" చెప్పి ఫోన్ పెట్టేసాడు భగవంతరావు.
కిరణ్ ఉస్సూరుమని ఫోన్ పెట్టేసి, బట్టలు వేసుకుని, జీతాల డబ్బుకోసం భగవంతరావు రూంలోకి వెళ్ళాడు. ఆఫీసు ఫైల్సూ, డబ్బూ వుండే బీరువా కీస్ కిరణ్ దగ్గరే వుంటాయి.
డబ్బు తీసుకుని లెక్కపెట్టి బ్యాగ్ లో పెట్టుకుంటూ, 'చేతికొచ్చేది మూడువేలు! చాయ ఐదువేలు అడిగింది ఎలా?' అనుకున్నాడు. అప్పటికే ఆమెకోసం చాహాల అప్పులు చేశాడు. చేతిలోని నోట్లు ప్రవోకింగ్ గా కన్పించాయి. తర్వాత చూసుకుందాంలే అని, అందులోంచి పదివేలు తీసుకున్నాడు.
మొదటిసరిగా అతని కాళ్ళు ఆ గదిలోంచి వస్తూ వుంటే వణికాయి!
* * *
ఖరీదైన ఆ హోటల్ లో అంతకన్నా ఖరీదైన మనుషులే వున్నారు. లోపలంతా చీకటిగా వుంది. ఒక్క టేబుల్ దగ్గర తప్ప.
"మీకేం కావాలో తినండి. ఎంత బిల్ అవుతుందోనని సందేహించకండి. ఈ రోజు ఖర్చంతా నాదే" గర్వంగా అంది స్నేహితురాళ్ళతో చాయ.
విండో దగ్గరగా వున్న ప్లేస్ లో ఆమె కూర్చుని వుంది. కర్టెన్ కొద్దిగా జరపడం వలన ఆమెమీద వెలుగురేఖ పరుచుకుని వుంది.
అనూరాధ విచిత్రంగా చూస్తూ "ఏమిటి చాయా విశేషం? ఈరోజు నీ పుట్టినరోజా?" అంది.
"హూ! పుట్టినరోజు!" చాయ అదోలా నవ్వి "అంతకన్నా గొప్ప రోజు ఓ గొప్ప నిర్ణయానికి వచ్చినరోజు. డీటైల్స్ ఇప్పుడు చెప్పను. ముందు ఏం కావాలో చూడండి. ఆ తర్వాత పిక్చర్ కి పోదాం" అంది.
చాయ బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్ సిల్క్ చీరలో మెరిసిపోతోంది. జుట్టు పొడవుగా వుండి భుజాలమీదుగా జారుతూ వుంటే, మాటిమాటికీ సర్దుకుంటూ, అదోరకంగా కళ్ళుతిప్పుతూ మాట్లాడుతూంటే....చూసినవాళ్ళు చూస్తూనే వుండిపోతున్నారు.
డీప్ 'వీ' షేప్ నెక్ వున్న బ్లౌజ్ పల్చని చీరలోంచి వూరిస్తూ కనిపిస్తోంది. మెడకి దగ్గరగా పెద్ద పెద్ద గ్రీన్ గార్లెట్స్ చైన్ వేసుకొంది. అదేరకం టాప్స్ చెవులకి పెట్టుకుంది. చెవిమీది భాగంలో తెల్లరాయి చమక్కుమని మెరుస్తోంది. జుట్టు పాపిడి తీసిన వైపునించి, ఓ పాయతీసి అపోజిట్ డైరెక్షన్ లో గ్రీన్ హైర్ క్లిప్ పెట్టి వదిలేసింది. దానివల్ల నుదుటికి వింత ఆకర్షణ వచ్చింది. గెడ్డంక్రింద పుట్టుమచ్చో పెట్టుమచ్చో తెలీకుండా చిన్న బ్యూటీ స్పాట్ దిష్టి తగలకుండా అడ్డు వస్తున్నట్లుగా వుంది.
పెద్ద పెద్ద కళ్ళకి మస్కారా వేసిందో లేక మాటి మాటికీ రెప్పలు అల్లార్చడం చేత ఆ ప్రదేశం కంది డార్క్ రెడ్ కలర్ సంతరించుకుందో గానీ, ఏ చిత్రకారుడి కుంచెకీ అందని అద్బుతంగా వుంది ఆ కలర్! పల్చని పెదాలు మూసుకున్నప్పుడు దానిమ్మ మొగ్గల్లా.....విచ్చినప్పుడు దానిమ్మ చిగురుల్లా వున్నాయి. ఆ రంగు లిప్ స్టిక్ బహుశా భూలోకంలో ఇంకా ఏ కంపెనీవాళ్ళు కనిపెట్టి వుండకపోవచ్చు! పైటకి ఈగిల్ ఆకారంలోవున్న బ్రోచర్ పెట్టుకుంది. జాకెట్టుకీ, చీరకీ మధ్యలో చాలా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసింది.
కుడిచేతికి ముదురు ఆకుపచ్చా, తెలుపుగాజులు కలగలిపి చేతినిండా వేసుకుంది.
ఎడమచేతికి బ్యాంగిల్ టైపులో వున్న గోల్డు చైన్ వాచ్ పెట్టుకుంది.
చీర కుచ్చిళ్ళకి తెల్లపూసలున్న శారీపిన్ వుంది.
నిలబడగానే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, కుడివైపు చీర కుచ్చిళ్ళ మీదుగా జారుతూ, 'యూ' షేప్ లో వెనక్కి వెళ్లి ఆమె నడుముకి అలంకరించిన బ్లాక్ సిల్వర్ మువ్వలపట్టీ పెట్టుకుంది.
కాళ్ళకి బ్లాక్ కలర్ కి గోల్డెన్ స్ట్రెప్స్ వున్న హైహీల్స్ వేసుకుంది.
ఆమె టేబిల్ దగ్గర వున్నంతసేపూ ఆ చీకటిగా వున్న ప్రదేశం వెలుగుతో నిండిపోయింది!