"అందుకే నిన్ను ఆప్లయ్ చెయ్యమన్నది. ఇంకో ఇంపార్టెంట్ పాయింటేమిటంటే ఇంట్లో పేషెంటును కంటికి రెప్పలా చూడాలి కాబట్టి జీతం ఎక్కువే వుంటుంది. ఓ రెండు నెలలు చెయ్యి. నచ్చకపొతే మానేయొచ్చు. థౌజెండ్ లైట్స్ ఏరియాలో ఆఫీసు కాబట్టి ఇప్పుడే నేను ఫోను చేస్తాను. రమ్మన్నారనుకో ఇవాళే తేలిపోతుంది గదా!"
"జీతం ఎక్కువే ఉంటుంది" అన్న పాయింటు దగ్గర కన్విన్స్ అయింది లిపి.
"పద.... ఫోను చేద్దాం" చీర మార్చుకుని రమణతోపాటు రోడ్డుమీద కొచ్చిందామె.
"ఈ జాబ్ నీకొస్తే నా విషయం మరిచిపోకూడదు. అండర్ స్టాండ్" నర్మగర్భంగా అన్నాడు రమణ.
"నీ విషయం అంటే?" అర్థంకాక అడిగింది లిపి.
"అదే చేతిలో చెయ్యి వేసి నాకు చేసిన ప్రామిస్!"
"అదా నీకేం కావాలంటే అది యిస్తానన్నానుగా" నవ్వుతూ అంది లిపి.
జంక్షన్ కొచ్చాక టెలిఫోన్ బూత్ వైపు అడుగువేసింది లిపి.
రమణే సృజయాడ్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు.
మూడునిమిషాల తరువాత ఫోన్ పెట్టేశాడు.
చేతివాచీ వైపు చూసుకున్నాడు.
"సరిగ్గా పన్నెండు గంటలకు నువ్వెళ్ళు."
"ఏం అయింది?" ఆతృతగా అడిగింది లిపి.
"ఎవరో లేడీ మాట్లాడారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పన్నెండు గంటలకు ఆ యాడ్ ఏజెన్సీకి రమ్మందావిడ."
"థౌజెండ్ లైట్స్ ఏరియా అంటే ఎక్కడ?" అడిగింది లిపి.
"నేను తీసుకెళ్తానులే. డోంట్ వర్రీ. నేనో గంటలో వస్తాను. నువ్వు రెడీగా వుండు ఓ.కె!" తయా చెప్పేసి వెళ్ళిపోయాడు రమణ.
రోడ్డు పక్కనుంచి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తోంది లిపి.
ఈ జాబ్ తనకొస్తే బావుండును. కొన్నాళ్ళపాటు ఇబ్బంది వుండదు. ఈ లోపల మంచి జాబ్ చూసుకోవచ్చు. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది లిపి.
పక్కనుంచి ఏదో కారు వెళుతుంటే ఉలిక్కిపడి తలెత్తింది. ఎదురుగా మలుపులో భుజానికి హేండ్ బ్యాగ్ తో అభినవ్.
చటుక్కున నవ్వొచ్చింది లిపికి.
ఈయన కూడా వుండేది యిక్కడేనా! ఇంకెన్నిసార్లు కనబడతాడో మహానుభావుడు అని అనుకుంది మనసులోనే లిపి.
తన పక్క నుంచి తన వైపు చూస్తూ వెళ్ళిపోతున్న లిపిని అకస్మాత్తుగా తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయాడు అభినవ్.
ఆమె అంచక్కటి కళ్ళ వైపు కన్నార్పకుండా ఒక్కక్షణం చూశాడు.
ఒక్కసారిగా అతనికి రైల్లో సంఘటన జ్ఞాపకానికొచ్చింది.
ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలని అన్పించింది అభినవ్ కి. అటూ ఇటూ చూశాడు.
దూరంగా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నారు. దగ్గరలో ఎవరూ మనుషులు లేకపోవడంతో లిపి వైపు ఒక అడుగు వేశాడు. అప్పటికే ఆమె మలుపు తిరిగి ముందుకు నడుస్తోంది.
"హలో! మిస్!" అన్నాడు అతను. అదే సమయంలో ఏదో లారీ హారన్ మోతతో అటుపక్క రావడంతో అభినవ్ పిలుపు లిపికి వినబడలేదు.
అప్పటికే ఆమె దూరంగా వెళ్ళిపోయింది.
వెంటనే తల తిప్పేసుకుని ముందుకు నడిచాడు అభినవ్. సరిగ్గా అదే సమయంలో....
.
రోడ్ క్రాస్ చేస్తూ లిపి వెనక్కి తిరిగి చూసింది.
ఆయన తనని ఏమైనా పిలిచాడా? ఆమె మనసులో ఏదో సందేహం.
ఏం చేస్తుంటాడాయన? అలా మౌనంగా ఎప్పుడూ రోడ్డు పక్కనుంచే అలాగ ఎక్కడకెళ్తాడాయన?
ఎందుకో ఆ వ్యక్తి రూపం ఆమె కళ్ళ ముందు కదలాడుతోంది ఒక మగవాడి గురించి అలా ఆలోచించడం లిపికి అదే మొదటిసారి.
* * *
బర్ బర్ మని ఇంటర్ కమ్ మోగడంతో ఎడంచేత్తో ఎత్తిపట్టుకుని "హల్లో కావ్య హియర్" అంది మృదువుగా.
"మేడమ్! మిమ్మల్ని కలవడానికి మిస్ లిపి వచ్చారు."
"సెండ్ హెర్ ప్లీజ్" చెప్పేసి ఫోన్ పక్కన పెట్టింది కావ్య.
కొద్ది క్షణాల తరువాత-
తన ఛాంబర్ వైపు వస్తున్న లిపిని, గ్లాస్ ప్యానెల్ లోంచే పరిశీలనగా చూసింది కావ్య.
లేత పసుపురంగు మీద సన్నటి మందారం రంగు లైన్ చీర. అదే రంగు బ్లౌజ్. ఆమె చామన ఛాయ రంగు దేహానికి అవి బాగా సరిపోయాయి.
ఆ చీరలో లిపి చూడముచ్చటగా వుంది.
గ్లాస్ డోరు తెరచుకుని లోనికొస్తూ కావ్యను చూసి విష్ చేసింది లిపి.
లిపి. చదువు. వృత్తిలో అనుభవం అన్నీ అడిగింది కావ్య.
"మీరు చూడాల్సిన పేషెంట్ పేషెంట్ గా కనిపించని పేషెంట్. ఆమెకు నరాలు ఎప్పుడు చచ్చుబడిపోతాయో ఆమెకే తెలీదు. ఆమెకు కూడా దాదాపు మీ వయసే. మీ వయసు పేషెంట్ ని చూడడానికి తగిన అర్హత మీకు వుండొచ్చేమోకానీ ఆ పేషన్స్ మీకుందా. ఇమీన్ సహనం?"
లిపిని ఆ ప్రశ్న వేసిన కావ్య ఆమె ముఖం వైపు, ఆమె కళ్ళ వైపు, కనుబొమల వైపు, చక్కని పెదవులవైపు చూస్తోంది.
లిపిని ఆ ప్రశ్న వేసిన కావ్య ఆమె ముఖం వైపు, ఆమె కళ్ళ వైపు, కనుబొమల వైపు, చక్కని పెదవులవైపు చూస్తోంది.
లిపి కనీసం ఐబ్రో పెన్సిల్ ని కూడా వాడలేదు.
"నేచురల్ బ్లాక్ బ్యూటీ" మనసులో కంప్లిమెంట్ ఇచ్చింది కావ్య.
"బాధల్ని భరించడానికి వయసుతో సంబంధం లేదు. అలాగే బాధ్యతను స్వీకరించడానికి కూడా" అంత సూటిగా లిపి జవాబు చెప్తుందని వూహించలేదు కావ్య.
లిపిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా వుంది కావ్యకు. చిరపరిచితమైన ముఖం. చిరపరిచితమైన ఎనాటమీ.
"మనం ఇద్దరం ఎక్కడైనా కలుసుకున్నామా?" ఉండబట్టలేక అడిగేసింది కావ్య.
"లేదనుకుంటా" అంది లిపి మృదువుగా.
"ఎపుడైనా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చారా?"
"లేదు. నాకు ఆర్ట్ గురించి ఏమీ తెలీదు."
"సాలరీ ఎంత ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు?" అడిగింది కావ్య.