అమెరికాలో అతి ఖరీదయిన పెయింటింగ్ గా ఇప్పటికీ చెప్పబడుతున్న పెయింటింగ్ ఏంటో తెలుసా? జాక్సన్ పోలోక్ చిత్రించిన పెయింటింగ్ బ్లూపోల్సి ఆ పెయింటింగ్ 1973, సెప్టెంబర్ 21ని ఆస్ట్రేలియన్ నేషనల్ గ్యాలరీ వారు 2,000,000 డాలర్లకు కొన్నారు.
అంతెందుకు పాబ్లో పికాసో తను చిత్రించిన ప్రతి గీతను అమ్ముకున్నాడు. బ్రతికున్న రోజుల్లోనే ప్రపంచం చిత్రకారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తి పికాసో, ఆయన చిత్రాల్లో టు బ్రదర్స్ సీటెడ్ హార్లిక్విన్ అనే చిత్రాలు ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోయాయి. ఆ చిత్రాలు రెండూ 19,50,000 డాలర్లకు కొన్నారు.
పికాసో మొత్తం జీవితకాలంలో తన పెయింటింగ్స్ ద్వారా ఎంత డబ్బు సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం మనం.69,00,00,000 డాలర్లు. అలాగే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్టు పికాసో, తన 78ఏళ్ళ చిత్రకారుడి జీవితంలో అతను 13,500 పెయింటింగ్ లు, 1,00,00 ఎన్ గ్రేవింగ్స్ (ప్రింట్స్) 34,000 పుస్తకాల చిత్రాలు, 300 శిల్పాలు (సెరమిక్స్ ) చిత్రించాడు.
డబ్బుకోసం అమ్ముకోవడం కమర్షియలిజమని అనుకోవడం తప్పు.
సమయం వచ్చింది కాబట్టి నాకు తెల్సిన కొన్ని విషయాలు చెప్తాను విను.
ప్రపంచంలోకెల్లా పెద్ద పెయింటింగ్ పానోరమా ఆఫ్ మిసిసిప్పి. జాన్ బాన్ వార్డ్ అనే పెయింటర్ (1951-91) 1946లో 1200 మైళ్ళ పొడుగున్న మిసిసిపి నదీ తీర దృశ్యాలను 5000 అడుగుల పొడుగు, 12 అడుగుల వెడల్పు గల కాన్వాసు పై 1.3 ఎకరాల విస్తీర్ణంలో చిత్రించాడు. ఆ చిత్రకారుడు చనిపోయే కొద్ది రోజులకు ముందు న్యూయార్క్ లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బరు లోని అగ్నిప్రమాదంలో తగలబడి పాడైపోయాయి.
ప్రస్తుతం..... అంటే ఇప్పుడు ప్రపంచంలో వున్న పెద్ద పెయింటింగ్ ఏంటో తెలుసా? ది బాటిల్ ఆఫ్ గెట్టీస్ బర్గ్. ఆ పెయింటింగ్ ని ఫ్రాన్స్ కు చెందిన పాల్ ఫిలిప్పోటియాక్స్ అనే ఆర్టిస్టు రెండున్నర సంవత్సరాలపాటు 16 మంది హెల్పర్స్ సహాయంతో ఆ చిత్రాన్ని చిత్రించారు. ఆ పెయింటింగ్ పొడవు 410 అడుగులు కాగా, డెబ్భై అడుగుల ఎత్తు, 11-702 పౌనుల బరువుతో 1883 సంవత్సరంలో పూర్తయింది.
1863 జూలై 3న గెట్టిస్ బర్గ్ యుద్ధం చివరి దృశ్యాన్ని ఆ చిత్రంలో ఫిలిఫోటియాక్స్ చిత్రించాడు.
ఇంకో విషయం తెలుసా.
ఇటలీ ఆర్టిస్టు లియోనార్డో డాలిన్నీ (1452-1519) ఒక కార్టూన్ గీశాడు. ఆ కార్టూన్ పేరు ' ది వర్జిన్ అండ్ విత్ సైంట్ జాన్ ది బాప్టిస్టు అండ్ సైంట్.' ఆ కార్టూన్ 541\4x391\4 అంగుళాల సైజులో గీయబడింది. ఆ కార్టూన్ కి అప్పట్లో ఎంత ఖరీదు కట్టారో తెలుసా? 22,52,210 డాలర్లు దాన్ని 1972లో లండన్ లోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ తీసుకుంది. కానీ ఆ కార్టూన్ ని అమెరికాలోని ఆర్టుగ్యాలరీ కొనాలని నిర్ణయించుకొని 40,00,000 డాలర్లు ఆఫర్ చేసింది. అయినా లండన్ వాళ్ళు ఇవ్వలేదు.
ఆర్ట్ చరిత్రలో ఒక పెయింటింగ్ కొన్ని లక్షలమంది ప్రజల్ని ఫూల్స్ చేసిన విషయం మీకు తెలుసా?
న్యూయార్క్ లోని మోడ్రన్ ఆర్ట్ మ్యూజియంలో ఫ్రాన్స్ కి చెందిన లెబాటియు అనే పెయింటింగ్ ని వేలాడదీశారు. ఆ పెయింటింగ్ ని హెన్రీ ఎమిలీ బెనాట్ మాటిస్సి అనే ఆర్టిస్టు చిత్రించాడు. ఈ చిత్రం 1961 అక్టోబరు 18 నుంచి డిసెంబర్ 4 వరకూ తలకిందులుగా వేలాడదీయబడింది. 47 రోజులపాటు ఆ తలకిందులు తతంగాన్ని ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు. పైగా దానిని గొప్పగా పొగిడేశారు కూడా. ఆ నెలా పదిహేను రోజుల సమయంలో ఈ పెయింటింగ్ ని ఎంతమంది చూశారో తెలుసా? ఒక లక్షా పదహారువేలమంది.
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మైడియర్ అమాయకపు ఆర్టిస్టు బాసూ! మనం ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే మనలోని ప్రతిభనుగానీ కళనుగానీ అమ్ముకోవాలి. డైరెక్టుగా ఒక ప్రోడక్ట్ ని అమ్మాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో నీకు తెలీదు.
వెరైటీ లేనిదే ఎంత గొప్ప వస్తువునైనా మనం కస్టమర్ చేత కొనిపించలేం. మనం మార్కెట్లో నిలబడాలంటే సమ్ థింగ్ డిఫరెంట్ దేన్ అదర్స్! ఇదవసరం. కాదంటారా?" చెప్పి అభినవ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది కావ్య.
"మిస్ కావ్యా! నేను పికాసోనూ కాదూ, డావిన్నీనీ కాదు. కేవలం ఆర్డినరీ ఆర్టిస్టుని. నాలో అంత ప్రతిభ వుందని నేననుకోను" నెమ్మదిగా అన్నాడతను.
"మీరనుకోకపోవచ్చు. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు. ఇవాళ మీ చెల్లెలు ఆరోగ్య విషయంలో ఆమెను అమెరికాకు తీసికెళితే పూర్తిగా మామూలు మనిషైపోతుందని తెల్సినా ఎందుకు సాహసించలేక పోతున్నారు? డబ్బు...... డబ్బు...... కాదంటారా. మిమ్మల్ని నేనేం మర్డర్ చేయమనడం లేదుగా" పల్చగా నవ్వింది కావ్య.
ఎందుకో నవ్వలేకపోయాడు అభినవ్. లేచి నిలబడ్డాడతను.
"అలా కామ్ గా వెళ్ళిపోతానంటే నేనొప్పుకోను. ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ" తనూ లేచి నిలబడింది కావ్య.
"కావ్యా! నాకు ప్రస్తుతం నా పెయింటింగ్స్ కన్నా నందిని ఆరోగ్యము ముఖ్యం. ఆమె ఆరోగ్యం కొంచెం కుదుటపడితే మీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. సారీ" అని ఒక ఆడుగు వేసి-
"ఇంటర్య్వూకి వచ్చే కాండిడేట్స్ లో మంచి కేండిడేట్స్ ని సెలక్టు చేసి పంపుతారా?" అడిగాడతను.
"అలాగే శాలరీ విషయం మీతోనే మాట్లాడుకోమని చెప్తాను. సరేనా?"
"మీకు నేను ఎల్లుండి ఫోను చేస్తాను" చెప్పి అక్కడ నుండి బయటపడ్డాడతను.
అప్పుడతని మనసెంతో హాయిగా ప్రశాంతంగా వుంది.
* * *
ఆంధ్రప్రభలో వచ్చిన ప్రకటనని చూడగానే ఆ పేపర్ని పట్టుకుని లిపి యింటికి బయలుదేరాడు డాక్టర్ రమణ.
ఆ ప్రకటనను చూసి పెదవి విరిచింది లిపి.
"ఇంట్లో వున్న పేషెంట్ దగ్గర ఉండడమంటే చాలా కష్టం. వాళ్ళు ఎలాంటివారో, ఆ పేషెంటు ఎలాంటి పేషెంటో తెలీదు. ఇలాంటి వాటికి చాలామంది అప్లయ్ చేస్తారు. మనకు రాదు" అంది లిపి ఒకింత నిస్పృహగా.