Previous Page Next Page 
సంకల్పం పేజి 36

   

    వికాస్ ఎస్. ఎఫ్.సి మేనేజర్ తోనూ, శివమూర్తి పాత పార్టనర్ మల్లిఖార్జున్ తోనూ మాట్లాడుతున్నాడు.
   
    లిఖిత పదినిమిషాల సేపు ట్రై చేసి ఫోన్ పెట్టేసింది.
   
    ఈ రాత్రి ఎలాగైనా వికాస్ తో ఫోన్ లో మాట్లాడాలి. అతని గొంతు వినాలి. అతను మాట్లాడుతున్నప్పుడు రెపరెపలాడే ఆ కళ్ళను ఊహించుకోవాలి.
   
    "ఐ లవ్ యూ డియర్..." అంటే ఏమంటాడు. ఫోన్ లో చెపితే బాగుంటుందా? వెళ్ళి, ఎదురుగా చెప్తే బాగుంటుందా?
   
    వెళ్ళినప్పుడు అతనికేదయినా అద్భుతమైన 'గిఫ్ట్' ప్రెజెంట్ చెయ్యాలి. ఆ 'గిఫ్ట్' లవ్లీగా వుండాలి. ఎలాంటి 'గిఫ్ట్' అయితే బాగుంటుంది? ఆలోచిస్తోంది లిఖిత.
   
                                   *    *    *    *    *
   
    ఆనంది పదినిమిషాలసేపు ట్రై చేసి ఫోన్ పెట్టేసింది.
   
    ఈ రాత్రి ఎలాగయినా వికాస్ తో ఫోన్ లో మాట్లాడాలి. అతని గొంతు వినాలి. అతను మాట్లాడుతున్నప్పుడు రెపరెపలాడే ఆ కళ్ళను ఊహించుకోవాలి.
   
    "రేపు నా బర్త్ డే... మీరు నాతో ఓ అరగంటసేపు ఏకాంతంగా గడపగలరా..." అంటే ఏమంటాడు! ఫోన్ లో చెపితే బాగుంటుందా? వెళ్ళి, ఎదురుగా చెపితే బాగుంటుందా?
       
    తన 'బర్త్ డే' సందర్భంగా అతనికేమైనా 'గిఫ్ట్' ప్రెజెంట్ చెయ్యాలి. ఆ 'గిఫ్ట్' లవ్లీగా వుండాలి. మీ 'బర్త్ డే'కి 'గిఫ్ట్' నేనివ్వాలి. మీరివ్వడం ఏమిటని ఆశ్చర్యపోతాడు.
   
    అప్పుడు తను- అతనితో ఏం మాట్లాడుతుంది.
   
    బెంగుళూరులో తన పాత జ్ఞాపకాలను చెప్తుందా... చెప్తే...
   
                                     *    *    *    *    *

   
    వికాస్ టేబిల్ మీద ఎన్నో రిఫరెన్స్ పుస్తకాలున్నాయి చిందర వందరగా... జపాన్, కొరియా, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, అమెరికన్, ఫ్రెంచ్ బుక్స్ అన్నీ కార్ల చరిత్రకు సంబంధించినవే.
   
    స్టీరింగ్ కనిపెట్టడానికి ఒక శాస్త్రజ్ఞుడు తన జీవితమంతా ధారపోశాడు. తన ఆస్తిపాస్తుల్ని వేలం వేశాడు.
   
    ఫలితం సాధించినా, దుర్భర దారిద్ర్యం.... ఆ దారిద్రంతోనే చనిపోయాడు.
   
    కర్ర సీటు వుండే రోజుల్లో-
   
    కూర్చోవడానికి ఇంకొంచెం సుఖమైన సీటుకోసం ప్రయత్నించిన వాడు ఇవాళ ఏ ఒక్కరికీ, కార్లో కూర్చొని ప్రయత్నించిన ఏ ఒక్కడికీ గుర్తుకురాడు!
   
    చీకట్లో కారు వెళ్తే, వెలుతురు వుండాలని, కారుకి లైటు వుండాలని ప్రయత్నాలు చేసినవాడు ఇంకొకడు...
   
    కారులాంటి ఒక వాహనం కనిపెట్టిన రోజుల్లో ఒక దీపాన్ని పట్టుకుని ఒక మనిషి ముందుకు నడిచేవాడు వెలుతురుకోసం అందుకోసం పనివాళ్ళను వినియోగించేవారు.
   
    ఇవాల్టి "కారు వెనక" దుఃఖభాజకమైన ఒక 'కారు చీకటి' ఉంది.
   
    ఎంతోమంది కూలీల స్వేదం కాదు- శాస్త్రజ్ఞత 'రక్తం' ఇవాల్టి కారుకి 'ఆయిల్'.
   
    'ఆయిల్ అవసరం లేని కారు అతి త్వరలో మన ముందుంటుంది' అని శాస్త్రజ్ఞులు హామీ ఇస్తున్న దశాబ్దం ఇది.
   
    ఈ దశాబ్దం, ప్రత్యేకంగా ఈ దశాబ్దం, మాత్రమే మనవమేధకు విలువనిచ్చిన దశాబ్దం! మానవమేధ ఆవిష్కరణ ఈ దశాబ్ద దర్పణం లేకపోతే-
   
    ఈ దశాబ్దంలో  సద్దాంహుస్సేన్ చేసిన యుద్ధం- యీ దశాబ్ధానికే ఎన్నో నేర్పింది- పెట్రోల్ ప్రత్యామ్నాయం పైకి ప్రపంచ ప్రజాదృష్టిని మరల్చింది.
   
    అన్నీ తెలుసుకుంటున్న వికాస్, అన్నీ నేర్చుకుంటున్న వికాస్ చుట్టూ అద్భుతమైన ప్రపంచ పుస్తక ప్రపంచం..
   
    ఒక తపన, ఒక ధ్యేయం, ఒక కృషి... ఒక మమత ఒక దుఃఖం.....ఒక క్లేశం.... ఒక ఆదర్శం.... ఒక నమ్మకం.... ఒక ఆచరణ... అతులిత ఐశ్వర్యంలాంటి ఆత్మస్థయిర్యం.
   
    అది వేదం... ఋగ్వేదం చెప్పింది ఇదే... భగవద్గీతలో శ్రీకృష్ణుడు ద్వారా వ్యాసమహర్షి చెప్పిందిదే...
   
    పాత్రా? పాత్రతా? ఏది ముఖ్యం? అని విరటుడు ప్రశ్నించినపుడు-
   
    'ఆపాత్రత' మాత్రం మన దరి చేరకూడదు... అని చెప్పినవాడు ధర్మజుడు...
   
    SUCCESS IS THE CRITERIA OF THE SUFFOCATION
   
    ఏనాడో కృష్నుడు అర్జునుడికి చెప్పాడు.
   
    ఫోన్ మ్రోగుతోంది.
   
    వికాస్ తదేక దీక్షలో తన కారు 'బ్లూ ప్రింట్' గురించి ఆలోచిస్తున్నాడు.
   
    STREET RIDER
   
    సక్సెస్ కావాలి. అదే వికాస్ ధ్యేయం.
   
                                      *    *    *    *    *
   
    మర్నాడు-
   
    ఉదయం పదిగంటల సమయంలో-
   
    ఎస్.ఎఫ్.సి. మేనేజర్ ఎదుట కూర్చున్నాడు వికాస్.... ప్రక్కన జగన్, అటు ప్రక్కన ఏలుమలై కూడా కూర్చున్నారు.
   
    "ఇన్నేళ్ళ సర్వీసులో... అనంతపురంలో నా కెరీర్ ప్రారంభమయింది. కర్నూలు, వరంగల్, ఇలా రాష్ట్రమంతటా తిరిగాను. లోన్ కావాలని వచ్చిన ప్రతి ఒక్కడికీ ఫండ్స్ లేని పరిస్థితుల్లోనైనా, నేను హెడ్డాఫీసు వాళ్ళతో పోట్లాడి మరీ లోన్ ఇప్పించిన సందర్భాలున్నాయి."
   
    ఆయనది తనని తాను సందర్భం వహ్చినప్పుడు పొగుడుకునే కేరక్టర్. తనని తాను పొగుడుకోవడం ఆయనకేమీ సిగ్గుగా అనిపించదు. లోకంలో వెధవలెవరూ మనల్ని గుర్తించనప్పుడు మన గురించి మనం చెప్పుకోవడంలో తప్పేం లేదని ఆయన వాదన.
   
    "నీ చెడు నలుగురికీ కావాలి. నీ మంచి మాత్రం ఎవడికీ అక్కర్లేదు. అలాంటప్పుడు మన మంచిని మనమే చెప్పుకోవాల్సిన అవసరం వుంది. కాదంటారా... అవునంటారా..." అని ఎదురు ప్రశ్న వేస్తాడాయన.
   
    "ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ని గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో తెల్సా? పారిశ్రామికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. సర్వతోముఖంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి.... రాష్ట్రాభివృద్దే దేశాభివృద్ది. మీరింకా చిన్నవాళ్ళు... మీకు దేశం గురించి ఏమీ తెలీదు... మనదేశంలో సంపద గురించి ఏమీ తెలీదు.... ఎంత సంపద.... ఎంత సంపద........ మనదేశంలో.... ఇవాళ మన బజారుల్లో చూస్తే కుళ్ళు వంకాయలు కనిపిస్తాయి. కుళ్ళు బెండకాయలు కనిపిస్తాయి... కానీ ఒకనాడిలా లేదే...? విఫణి వీధులన్నీ వజ్రాలతో ధగధగా మెరిసిపోయేవి....వైడూర్యాలతో అలరారుతుండేవి. ఎక్కడచూసినా పచ్చని పంటలు, గో సంపద, కరువు కాటకాల్లేని అద్భుతమైన రోజులవి.... మరీనాడు ఎందుకు మన దేశం ఇలా వుంది. ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ సర్వెంట్ గా 'ఎందుకిలా తగలడిందని' నేననగూడదు. కానీ ఈనాటి ఈ పరిస్థితికి కారణం ముఖ్యంగా విదేశీయులు.
   
    ఎంత సంపదను తరలించుకు పోయారండి... ఓడలకు ఓడలు, రత్నాలు, వజ్రాలు, ఆభరణాల్ని నింపుకొని వెళ్ళిపోయేవి.....
   
    అడ్డేవారు, ఎవరూ లేరు... ఆపేవారు ఎవరూ లేరు..." ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆయన ప్రవాహం అలా గంటల తరబడి కొనసాగుతుంది అది ఆయన అలవాటు.,
   
    కానీ జగన్ మోహన్ ఆయన ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించాడు.
   
    "ఆ బ్రిటీష్ వాళ్ళు మనకెంతో మేలు చేశారు కదండీ.... రైలు, కారు, బస్సు, విద్యుచ్చక్తి ఇవన్నీ వాళ్ళిచ్చినవే కదండీ."
   
    మళ్ళీ రెచ్చిపోయాడు మేనేజర్.
   
    "అందుకే... అందుకే.... మీకు దేశభక్తి లేదంటున్నాను.... రైలు పట్టాలేసింది మనకోసమా.... మన సంపదను అక్కడకు సులభంగా పట్టుకెళ్ళి పోవడం కోసం.... వాళ్ళ వ్యాపారాన్ని సులభంగా చేసుకోవడం కోసం ఏదైతే వాడి వ్యాపారానికి పనికొస్తుందని అనుకున్నాడో అవన్నీ చేశాడు వాడు. మన దేశమ్మీద ప్రేమతో వాడన్నీ చేశాడని మనం నమ్మాం... చాలాకాలం వరకూ బానిసల్లా పడున్నాం. ఉదాహరణకు కారుని తీసుకోండి... మీకు తెలీదు వాడి తెలివి. చాలాకాలం వరకూ మన మహారాజాలు ఇంగ్లీషు వాడికి లొంగలేదు. ఆలోచించాడు ఆలోచించాడు, మన వాళ్ళకు కొత్తదంటే అపారమయిన మోజెక్కువ. ఇండియన్స్ సైకాలజీలో అదొక భాగం. ఆ సైకాలజీలో భాగంగానే డిక్కూ, డిక్కూ మంటూ ఓ కారుని తీసుకొచ్చాడు. అది చూడగానే మనవాళ్ళు కిందపడిపోయారు.... అప్పటికది విచిత్రమయిన అద్భుత వస్తువు. తర్వాతేం జరిగింది?
   
    ఇంత మహారాజులు వాడి పాదాక్రాంతం అయిపోయారు. దేశం దొరల పాలైపోయింది... మనం దొంగల పాలైపోయాం...."చెప్పడం ఆపాడు.
   
    ఎందుకు చెప్తున్నాడో... ఏమి చెప్తున్నాడో అర్ధం కాలేదు వికాస్ కి.
   
    ఏలుమలై వేపు చూశాడు.
       
    జగన్మోహన్ మాత్రం అస్సలు కుర్చీలో కూర్చోలేక పోతున్నాడు. గుండుసూదుల మీద కూర్చున్నట్లుగా ఉంది.

 Previous Page Next Page