Previous Page Next Page 
మొగలిబాకు పేజి 36

  

      "అవును నా కెందుకు తెలీదు మేడమ్-అంచేత మీరు భారీ హృదయంతో మా కేసును పరిశీలించి, ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్టులో మేం పాల్గొనేటట్టు చేయమని నా ప్రార్ధన"......గడగడమని చెప్పేసాడు నారాయణరావు.
   
    భారీ హృదయం అనే పద ప్రయోగం విన్పించగానే సదరు మాజీ బ్యూటీరాణి తన హృదయం వేపు చూసుకొని, కించిత్తూ గర్వంగా ఫీలైంది.
   
    "ఈతి బాధలవల్ల ఇప్పుడిలా అయిపోయానుగానీ.....యిది వరలో" అని అనబోయి సిగ్గుపడిందామె.
   
    నారాయణరావుకూడా ఒకింత సిగ్గుపడ్డాడు.
   
    "స్పెషల్ కన్ఫిడరేషన్ మీద ఒప్పుకుంటున్నాను అబ్బాయ్......ఇంతకూ మీ ఇద్దరకూ పెళ్లయిందిగదా" అడిగిందామె.
   
    "ఎన్నాళ్ళయింది" మళ్ళీ అడిగిందామె.
   
    "మీ రూల్స్ ప్రకారమే....అయింది మేడమ్" సరిగ్గా అదే సమయంలో సంధ్య లోనికి ప్రవేశించింది.
   
    "ముచ్చటగా వుంది పిల్ల" అని మెచ్చుకుంది మాజీ మిస్ డాబా గార్డెన్స్.
   
    "అందుకే మేడమ్.....నేనున్నా ప్రేమించింది" అని జవాబిచ్చాడు నారాయణరావు.
   
    ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాక, ఇద్దరూ లాన్లోకెళ్ళిఊపిరి పీల్చుకున్నారు.
   
    అప్పటికే ఆడిటోరియం బయటా, లోన చాలా సందడిగా ఉంది.
   
    "మనకు పెళ్ళి కాలేదుకదా__పెళ్ళయిందని అబద్దంచెప్పామ్. ప్రాబ్లమ్ రాదుకదా" సంశయంగా అడిగింది సంధ్య.
   
    "అలాంటిదేం లేదు" జవాబిచ్చాడు నారాయణరావు.
   
    ఇంతలో ప్రోగ్రామ్ స్టార్టయింది.
   
    ప్రకటనలు, ఆర్భాటాలు, హడావుడి మధ్య ఒక్కొక్కజంట స్టేజీమీద కెళుతున్నారు. అందర్నీ తలో ప్రశ్న వేస్తున్నారు న్యాయనిర్ణేతలు.
   
    "చూడండీ.....అమితాబ్ బచ్చనూ, జయబాధురీ ఎందుకు పెళ్ళి చేసుకున్నారో చెప్పండి...." అదేం ప్రశ్నో అర్ధంగాక వెర్రిముఖాలేసారు ఆ జంట.
   
    "అవునూ....ఇదేం ప్రశ్న....." నారాయణరావుకూడా దీర్ఘంగా ఆలోచించడం మొదలెట్టాడు.
   
    "ఇంతకీ ఎందుకు చేసుకున్నారు" సంధ్యకూడా సందేహంగా అడిగింది.
   
    ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయారు.
   
    కొంతసేపటికి నారాయణరావు, సంధ్యల పేర్లు ప్రకటించగానే ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఝుమ్మని స్టేజీ ఎక్కారు.
   
    అందరూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.
   
    "చెప్పండి.....అమితాబ్___జయబాధురీ ఎందుకు పెళ్ళిచేసుకున్నారో చెప్పండి"
   
    నారాయణరావు అంతకుముందే దానికి జవాబుని ఆలోచించాడు.
   
    "వెరీ సింపుల్__రెస్పెక్టడ్ జ్యూరీమెంబర్స్....వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి"
   
    ఆ ఆన్సర్ కు హాలంతా దబదబా చప్పట్లతో మార్మోగిపోయింది.
   
    "గుడ్ ఆన్సర్!" ఒక జ్యూరీ మెంబర్ ఆనందంతో, తలమునకలయిపోతూ అన్నాడు.
   
    "నెంబర్ టు-రాజేష్ ఖన్నా-డింపుల్ కపాడియా ఎందుకు విడిపోయారు?"
   
    నారాయణరావు, సంధ్య కాసేపు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
   
    ఆ తర్వాత-
   
    "వాళ్ళిద్దరికీ ప్రేమ గురించి పూర్తిగా తెల్సిపోయింది కాబట్టి" ఆ ఆన్సర్ కి కూడా హాలంతా దద్దరిల్లిపోయింది.
   
    "గుడ్ - ఇంటెలిజంట్ ఆన్సర్."
   
    "లాస్ట్ క్వశ్చన్ విడిపోయిన బ్రిటన్ యువరాజు చార్లెస్ డయానా మళ్ళీ కల్సుకోవాలంటే ఏం చెయ్యాలి?"
   
    "ఏం చెయ్యాలి.....మనమేం చేస్తాం?" జడ్జీలనే ఎదురు ప్రస్నించాడు నారాయణరావు.
   
    "మేం మిమ్మల్ని అడుగుతున్నామయ్యా బాబూ....." న్యాయమూర్తులు చికాకు పడ్డారు.
   
    అనుకున్న గడువుకు, ఒక సెకెండ్ ముందు జవాబు చెప్పాడు.
   
    "మళ్ళీ ప్రేమించుకోవాలి.....అంతే...."
   
    "వెరీ గుడ్.... ఆన్సర్....." హాలంతా చప్పట్లతో హోరెత్తిపోయింది.
   
    అప్పుడు ప్రోగ్రామ్ ఇన్చార్జ్ మాజీ మిస్ డాబాగార్డెన్స్ వేదిక మీదకొచ్చింది.
   
    "ఈ జంటకు ఫైనల్ టెస్ట్....అదేంటంటే.....వీళ్ళిద్దరికీ పెళ్ళయినట్టుగా దృవీకరణ పత్రాన్ని చూపాలి. దృవీకరణ పత్రం వీరు సబ్ మిట్ చేయలేదు కాబట్టి, ఆ అమ్మాయి తన మంగళ సూత్రాల్ని న్యాయమూర్తులకు చూపించాలి"
   
    "మంగళ సూత్రాల్ని చూపించాలా.....ఇదెక్కడి గోల?"
   
    అన్ని జాగ్రత్తలూ తీసుకున్న నారాయణరావు ఆ జాగ్రత్త మాత్రం తీసుకోలేదు.
   
    గుండెల్లో రాయి పడినట్టుగా సంధ్య, నారాయణరావు వేపు చూసింది.
   
    "ఒక్క భర్తకే తప్ప నేను నా మాంగల్యాన్ని మరెవరికీ చూపించేది లేదు." భీష్మించుకుని కూర్చుంది సంధ్య.
   
    ఆ వాదనతో కొంత మంది ఏకీభవించారు.
   
    ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలిపోయారు.
   
    "ఈ గొడవ కూడా మన మంచికే.....రేపు పేపర్లన్నీ మన గురించే రాస్తాయి.... గొడవ పెద్దది చేసే పూచీ నాది....." అని సంధ్య చెవిలో రహస్యంగా చెప్పి, మైకు ముందు కొచ్చాడు నారాయణరావు.
   
    "మహా ప్రేక్షకులారా..... ప్రేమారాధకులారా....మగవాడికి మొలతాడు ఎంతటి పవిత్రమైందో ఆడపిల్లకు అంత పవిత్రమైనది."
   
    "మొలతాడేంటి అసహ్యంగా.....ఇంకేదైనాచెప్పు....." పక్కనుంచి అందిచ్చింది సంధ్య.
   
    "సారీ.....ప్రేక్షకులారా.....మగవాడికి జంధ్యం ఎంతటి పవిత్ర మయిందో.....ఆడపిల్లకు ఇందాక చెప్పింది అంత పవిత్రమయినది కాబట్టి....."
   
    "ఉయ్ డోంట్ ఎగ్రీ.....రూల్స్ ఫాలో కాకపోతే.....మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ జంటగా మిమ్మల్ని మేం సెలక్ట్ చేయం....." మాజీ మిస్ డాబా గార్డెన్స్ అంది అసహనంగా.
   
    ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ సెలక్ట్ చేయాలని కొంతమంది, సెలక్ట్ చేయకూడదని కొంతమంది గొడవ చేశారు__ సంఘ విద్రోహ శక్తులు ఈ లోపల కరెంట్ ఆఫ్ చేశారు. గాడ్రేజ్ కుర్చీలు పైకి లేచాయి.
   
    అంతా గందర గోళమైపోయింది.
   
    మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ కంటెస్ట్ ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
   
    అప్పటికి, ఆ ఆడిటోరియంలోంచి బయటపడ్డారు నారాయణరావు సంధ్య.
   
    "అంతా మన మంచికే__సినిమా చూసావా?" అని అడిగాడు నారాయణరావు.
   
    "అదెందుకిప్పుడూ?" అడిగింది సంధ్య.
   
    "ఇలాంటి గొడవ జరుగుతుందని నాకెప్పుడో తెలుసు.....రేపు పేపర్లన్నీ మన గురించే రాస్తాయి."

 Previous Page Next Page