Previous Page Next Page 
యోధుడు పేజి 36

    ఒకమ్మాయి ఒకబ్బాయికి ప్రేమలేఖ రాసిందనుకోండి. ఆ లెటర్ చూడగానే పరిస్థితుల్లో ఆమ్మాయి ఉత్తరం రాసిందో మనం చెప్పొచ్చు. అలాగే ఒక నేరస్థుడు ఉత్తరం రాశాడనుకోండి. ఆ ఉత్తరంలోని అక్షరాల ద్వారా ఆ హంతకుడి మానసిక స్వారూపాన్ని అంచనా వేయొచ్చు."

    "అతను అంతకుపూర్వం ఎన్ని హత్యలు చేశాడో తెలుసుకోవచ్చా?" అంతవరకూ సీరియస్ గా వింటున్న రణదీఫ్ కేవల్కర్ అడిగాడు సడెన్ గా.
   
    "ఏం .... మీరేమయినా హత్యలు చేశారా ...." అంటూ ఓ జోక్ వేసింది అర్చన.

    "నేను కాదులే. జనరల్ గా అడుగుతున్నాను....." కంగారుని కప్పి పుచ్చుకుంటూ అన్నాడు రణదీఫ్.
 
    "తెలుసుకోవచ్చు. ఉత్తరం చూడగానే ఆ నేరస్తుడి గురించి ప్రాధమిక సమాచారం తెలుస్తుంది... ఆ సమాచారాన్ని జాగ్రత్తగా ఎనలైజ్ చేసి, దర్యాప్తు జరపడం ద్వారా అతడు ఎన్ని హత్యలు చేశాడో తెలుసుకో వచ్చు..." అని చెప్పింది.

    "ఆ విధంగా ఎవరినైనా పట్టుకున ఇన్సిడెంట్స్ వున్నాయా?" అడిగాడు మళ్ళీ రణదీఫ్.

    "ఎందుకులేవు... వున్నాయి."

    "ఉన్నాయా?" ఆశ్చర్యపోతూ అడిగాడతను.

    "ఒక్కసారి అమెరికాలో ఒక మర్డర్ జరిగింది_ తన భార్యను ఎవరో మర్డర్ చేశారని ఒక భర్త పోలీసులకు రిపోర్టు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు.

    అన్ని కోణాల్లోంచి పరిశోధనలు చేశారు. ఎక్కడా హంతకుడుని ఆచూకీ దొరకలేదు. పరీశోధనలింకా తీవ్రతరం చేశారు. ఎట్టకేలకు మ్రుత్యురాలి పేరుమీద వచ్చిన ఒక లెటర్ దొరికింది_ మర్డర్ జరగడానికి అయిదు నెలల ముందు మ్రుత్య్రాలికి బోయ్ ప్రెండ్ నుంచి వచ్చిన ఉత్తరం అది.

    దాని గురించి మ్రుత్యురాలిభార్తను వివరాలు అడగ్గా_ నా భార్య చాలా మంచిది_ అ వ్యక్తి మాయమాటలతో ఆమెను లోబరుచుకుని వుంటాడు_ తర్వాత జరిగిన గొడవల్లో ఆమెను అతను చంపేసి వుంటాడని మ్రుత్య్రాలి భర్త పోలీసులతో చెప్పాడు.

    సదురు బోయ్ ప్రెండ్ ఇంటికెళ్ళి పోలీసులు ప్రశ్నించారు. తను కేవలం ఆమె బోయ్ ప్రెండ్ ని మాత్రమేనని, ఆమెకు, తనకు పదేళ్ళ వయసు తేడా వుందని, తను ఆమెను ఎప్పుడూ పూజ్యభావంతోనే చూసే వాడినని, ఒక తల్లి కొడుకు దగ్గరకు వచ్చినట్లుగానే తన దగ్గరకు ఆమె వచ్చేదని అతను చెప్పాడు.

    ఫోలీసులు అతని మాటల్ని విశ్వసించారు. ఆ లెటర్ తను రాసింది కాదని కూడా అతను చెప్పాడు.

    నేరస్తుడని పట్టివ్వడానికి ఏకైక ఆధారం ఆ ఉత్తరం ఒక్కటే! వెంటనే గ్రాఫాలజీ ఎక్స్ పార్ట్ కి ఆ ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరంలోని వాక్యాల ద్వారా గ్రాఫాలజీ ఎక్స్ పార్ట్ హంతకుడిని వయస్సు, ఆ ఉత్తరం రాస్తున్నప్పుడు హంతుకుని మానసిక విశ్లేషణ, అతను వున్న్బ పరిసరాల గురించి విశ్లేషించి చెప్పాడు.

    ఆ హంతుకుడిని దాదాపు నలభైఅయిదు సంవత్సరాలుండవచ్చని, ఉత్తరం అతను చాలా కంగారుగా రాశాడని, ఆ ఉత్తరాన్ని అతను బార్లో కూర్చుని వుండగా రాసుండవచ్చని, ఆ ఉత్తరం వ్రాస్తున్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చి అతన్ని డిస్టబ్ చేసుండవచ్చని అలాంటి అరుదయిన విశేషాలన్నీ గ్రాప్ఫాలజిస్ట్ చెప్పడంతో_

    పోలీసుల దృష్టి హతురాలి భర్తమీదకెళ్ళింది. హతురాలి భర్తకు నలభై అయిదేళ్ళు. అతను తరుచూ బార్లకు  వెళుతుంటాడు అనే విషయం తెలుసుకున్న పోలీసులు అతను వెళ్ళే బార్లలో ఎంక్వయిరీ చేశారు.

    అయిదు నెలల క్రితం హతురాలి భర్త రాత్రి ఏడు, ఎనిమిది గంటల మధ్య రెగ్యులర్ గా  వెళ్ళే ఒక బార్ కి వెళ్ళినట్లు, బీరు తాగాక కౌంటర్ లో నుంచి పేపరు_ పెన్ను తీసుకున్నట్లు, ఏదో ఉత్తరం సగంవరకూ రాసినట్లు, అతని గ్లాసులోని బీరు అయిపోవడంతో ఉత్తరం వ్రాయడం ఆపి, బీరర్ ని పిలిచి ఇంకో బీర్ కి ఆర్డర్ చేసినట్లు, బీరు వచ్చాక మళ్ళీ త్రాగడం మెదలేట్టాక ఉత్తరాన్ని పూర్తీచేసి కౌంటర్ లో పెన్నుని ఇచ్చేసి, ఆ పేపర్ తో బయటికెళ్ళిపోయినట్లు పోలీసులకు తెలిసిపోయింది. వెంటనే పోలీసులు హతురాలిభర్తను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అతను నిజం ఒప్పుకున్నాడు. తను వేరే అమ్మాయి ప్రేమలో పడడంవల్ల, తన భార్యను వదిలించుకోవాలని ఆ బోయ్ ప్రెండు పేరుని వుపయోగించి, దొంగ లవ్ లెటర్స్ రాసి ఆమె పర్సనల్ బాక్స్ లో వుంచాడు. ఒకసారి  ఆమెను బయటకు తీసుకెళ్ళి, చంపేసి వచ్చేశాడు. అంతటితో కధ ముగిసిపోయినందునుకున్నాడు.

    తను హత్య చేయడానికి వుపయోగించిన కత్తిని కిలిమిలో కరిగించేసి సాక్ష్యం లేకుండా చేశానని తన తెలివితేటలకు తనే మురిసిపోయాడు కానీ... తను వ్రాసిన ఉత్తరంలోని అక్షరాలే తనని పట్టిస్తాయని అతను వూహించలేదు. ఇదొక చిన్న ఉదాహారణ మాత్రమే. గ్రాఫాలజీ ద్వారా పరిష్కరించిన యింకెన్నో అద్భుతమైన కేసులున్నాయి. తర్వాత ఎప్పుడయినా చెబుతాను" చెప్పి అంకుష్ వైపు చూసింది అర్చన.

    "దొంగ సర్టిఫికెట్స్, దొంగ ఉత్తరాలు రాస్తోంది నువ్వు.ఎవరైనా గ్రాఫాలజిస్ట్ ...సీరియస్ గా ఇన్వెస్ట్ గెట్ చేస్తే, అవన్నీ, సృష్టించింది నువ్వేనని తెల్సుకోవచ్చు... అవునా?" అడిగాడు అంకుష్.

    "అందుకే నేనిందులో ఒక టెక్నిక్ ఫాలో అయ్యాను... ఆ ఉత్తరాలు దొంగ ఉత్తరాలని ఎవరయినా కనిపెట్టినా... మన జోలికి ఎవ్వరూరాలేరు"! నిబ్బరంగా అంది అర్చన.

    "ఎలా?" అంకుష్, రణదీఫ్ లు ఒకేసారి అడిగారు విస్మయంగా.

    "తర్వాత చెప్తాను" అందామె ముక్తసరిగా.

    ప్రమాదకరమైన పరిస్థితుల్లో తనని రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా చెప్పట్టిన టెక్నిక్ గురించి చెప్పదలుచుకోలేదు అర్చన.

    "ఓ. కే. అర్చనా .....ఆ టేక్నిక్ కాదు ఇప్పుడు మనకి ముఖ్యం... ముందు కాశీచరణ్ ఒక ఉత్తరం వ్రాయి_ రేపే మనం పోస్టు చేయాలి.... అలాగే నీకు ఎలాగయినా న్యాయం చేసుకుని కోరుతూ ఆ లాయర్ నీలకంఠన్ కి కూడా ఒక ఉత్తరం రాయి..." చెప్పి ఆ రూమ్ లోంచి బయటకు వచ్చాడు రణదీఫ్ .

    అతన్ని అనుసరించాడు అంకుష్.

    వెంటనే రెండు దొంగ ఉత్తరాలను సృష్టించడంలో మునిగిపోయింది అర్చన.
   
                                *    *    *    *

 Previous Page Next Page