హాలుకి ఒకపక్కన సోఫా అమర్చారు. ఆ సోఫామీద తేజను కూర్చోబెట్టారు.
రెండడుగుల దూరంలో ఈజిల్ ను, కాన్వాస్ ను అమర్చుకొంది హిమకుంద.
"హుసేను-" అంటూ తలతిప్పి చూసి, బాబుదగ్గర హుసేను పేరుగల వీర్రాజు లేకపోవడంతో మిగతా ఇద్దరివేపూ చూసి అడిగిందామె.
"హుసేను ఏడీ?" అని.
ఒక్కక్షణం తటపటాయించాడు సేతురాజు.
"వాడికి, పిల్లలంటే ఇష్టంకదా మేడమ్__ఇప్పటివరకూ బాబుని ఎత్తుకుని బాబు వాడి చొక్కాని ఖరాబు చెయ్యడంతో- బాత్...రూమ్ కెళ్ళాడు.
నవ్వింది హిమకుంద.
"వంతులువారీగా, బాబుని కదలకుండా చూస్తుండండి. లైను స్కెచ్ పూర్తయితే....అప్పుడు బాబు అవసరం ఉండదు. ఫొటోలున్నాయిగా." చెప్పి బ్రష్ ని అందుకుంది హిమకుంద.
సోఫామీద కూర్చున్న, కొడుకు దగ్గర కాసేపు నిలబడి, హిమకుంద వేస్తున్న స్కెచ్ ని చూస్తూ గడిపి, లోపలికెళ్ళింది సుదేష్ణాదేవి.
"వీడెటుళ్ళాడు?" సేతురాజు, పోతురాజు చెవిలో గొణిగాడు. పోతురాజు తలతిప్పి మెయినుగేట్ వేపు చూపించాడు.
బాత్ రూమ్ కోసమని, అవుట్ హౌస్ వరకూ వెళ్ళిన వీర్రాజు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్, వాచ్ మెన్ ని, వాతావరణాన్ని గమనించి ఆ చివర గోడవరకూ వెళ్ళి, పై కెగిరి చూశాడు.
అక్కడ కార్నర్ లొ ఒక వ్యాను సిద్దంగా ఉంది.
ఎవరికీ అనుమానం రాకుండా లోనికొచ్చేసాడు.
వీర్రాజు హాల్లోకి వచ్చేసమయానికి అక్కడ, అంతవరకూఉన్న సర్వెంట్స్ కూడా లేరు.
౦ ౦ ౦
కాన్వాస్ మీద స్కెచ్ వేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉంది హిమకుంద.
మొట్టమొదటిసారిగా కమర్షియల్ పెయింటింగ్ ను వేస్తోందామె. అందులోనూ సుదేష్ణాదేవి ఏరి కోరి తనని రప్పించి పెయింటింగ్ వేయిస్తోంది. అందుకే తేజ పెయింటింగ్ ని చాలెంజ్ గా తీసుకుందామె.
పూర్తి ఏకాగ్రతతో, దీక్షతో, సోఫామీదున్న తేజ దగ్గరకొచ్చి, కనుబొమల దగ్గర మడతల్ని గమనించి కాన్వాస్ ముందు నిల్చొని బ్రష్ ని అందుకుందామె.
సరిగ్గా ఆ సమయంలో లోనికొచ్చాడు వీర్రాజు. మిగతా ఇద్దరి వేపొకసారి చూసి కన్ను గీటారు.
పోతురాజు, తేజ చేతిలోవున్న సింగపూర్ డాల్ ని తీసి సోఫామీద పెట్టి, తేజను ఎత్తుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ఒక ఫోటోని తీసి తేజ కూర్చున్న చోట పెట్టి, దానిముందు డాల్ ని పెట్టాడు సేతురాజు.
అటూ ఇటూ చూసి హాల్లోంచి బయటికి వచ్చాడు వీర్రాజు. అతని వెనకే అడుగువేశాడు పోతురాజు.
చెట్లచాటునుంచి నడుస్తూ, అవుట్ హౌస్ కి ఆనుకునిఉన్న గోడెక్కి పోతురాజు చేతిలోవున్న తేజను అందుకుని, గోడ దూకేసాడు వీర్రాజు.
మిగతా ఇద్దరూ కూడా గోడదూకి పరుగెత్తసాగారు.
రోడ్డు మలుపులో ఉన్న వ్యాన్ దగ్గరకు వెళ్ళగానే, వ్యాన్ డోర్ తెరచుకోవటం, ముగ్గురూ బాబుతోసహా, వ్యాను ఎక్కటం, అరవై కిలోమీటర్ల వేగంతో అది ముందుకు దూసుకుపోవడం, క్షణకాలంలో జరిగింది.
సరిగ్గా అదే సమయంలో__
స్థంభానికి కట్టివేయబడిన బ్రౌనీ, కాలిగోళ్ళతో ఫ్లోర్ ని రక్కుతూ భీకరంగా అరుస్తోంది.
౦ ౦ ౦
బ్రౌనీ అరుపుకి బెడ్ రూంలోంచి బయటికొచ్చి మెట్లఅంచున నిలబడ్డ సుదేష్ణాదేవి, కాన్వాస్ ముందు నిలబడిన హిమకుందను చూసి__
నెమ్మదిగా కిందకొస్తూ__
అప్రయత్నంగా సోఫావేపు చూసి కంగారుగా ముందుకొచ్చింది.
"బాబేడీ....?" సోఫామీదున్న బాబు ఫొటోవేపు, డాల్ వేపు చూస్తూ హిమకుంద దగ్గరకొచ్చిందామె.
అప్పటిగ్గానీ తేరుకోలేదు హిమకుంద.
"సోఫా మీదున్నాడు కదా!" సోఫావేపు చూస్తూ అంది. ఆమె ఏకాగ్రత భగ్నం కావడానికి అరక్షణం పట్టింది. అంతకుముందు, ఒక్కక్షణం క్రితం సోఫావేపు, బాబు ఫొటోవేపు చూసిందామె.
కానీ అక్కడ బాబు లేడని మాత్రం గుర్తించలేకపోయింది.
"హుసేన్...లక్ష్మారెడ్డి.... రాజన్-" ముగ్గుర్నీ పిలుస్తూ ముందుకెళ్ళి
"బాబు ఏడుస్తున్నాడని...బయటికి తీసికెళ్ళారేమో..." అంటూ హాల్లోంచి బయటకెళ్ళింది హిమకుంద.
ముగ్గురూ అక్కడ కన్పించలేదు.
అవుట్ హౌస్ లొ కెళ్ళారేమో? పరుగెత్తికెళ్ళి, నలువేపులా చూసి బాణంలా రివ్వున వెనక్కి తిరిగిందామె.
బ్రౌనీ అరుపులు భయంకరంగా విన్పిస్తున్నాయి.
"తేజ....తేజా-" అంతకంతకూ సుదేష్ణాదేవి స్వరం హెచ్చుతోంది. అన్నిచోట్లా పిచ్చిదానిలా కేకలేస్తూ వెతుకుతోందామె.
"తేజ కన్పించడంలేదు-"
"బాబు కన్పించడంలేదు." క్షణకాలంలో ఆ వార్త దావానలంలా ఆ బిల్డింగులో ప్రాకిపోయింది.
"ఆర్టిస్టుతో వచ్చిన, ఆ ముగ్గురు అసిస్టెంట్లూ ఏరీ?" అప్పుడే మేడమెట్లు దిగుతున్న సత్తిపండు అడిగారు.
"వాళ్ళూ- కనిపించడం లేదు." డగ్గుత్తికతో అంది సుదేష్ణాదేవి.
సెక్యూరిటీ గార్డ్స్ నాలుగువేపులా పరుగెత్తారు. పనిమనుషులు బిల్డింగ్ లోని మూలమూలల్నీ గాలిస్తున్నారు.