Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 36

    "నమస్తే మేడమ్...మేం మీ శిష్యులం!" ముగ్గురూ తమ తమ పేర్లను పరిచయం చేసుకునారు.

    "నేను మిమ్మల్నెప్పుడూ చూసినట్టుగా లేదే!"

    "అవును- మీరు చూడకుండా మేమే జాగ్రత్తపడ్డాం...ఎందుకంటే ఏకలవ్య శిష్యులం అన్నమాట! మీరేసిన పెయింటింగ్స్ అన్నింటినీ రోజుల తరబడి చూసి,చూసి, సారాంశాన్ని గ్రహించి- మేం పెయింటింగ్స్ ని వేయడం నేర్చుకున్నాం!" చెప్పాడు వీర్రాజు, ఎంతో నిజాయితీ నటిస్తూ.

    "నా పెయింటింగ్స్ ని మీరెక్కడ చూశారు?"

    "జైల్లో!" టక్కున జవాబిచ్చాడు సేతురాజు.

    "ఎక్కడా?!" మళ్ళీ అడిగిందామె- ఆశ్చర్యంతో.

    "సాలార్ జంగ్ మ్యూజియంలో!"

    "నా పెయింటింగ్స్ అక్కడ లేవే- ఆర్ట్సు కాలేజీలోనూ, కళాభవన్ లోనూ వుండాలి!" చెప్పింది హిమకుంద.

    "ఆర్ట్సు కాలేజీని, సాలార్ జంగ్ మ్యూజియం అనుకొని పొరపాటు పడ్డాడు మావోడు....రెండు బిల్డింగులూ ఒకలాగే వుంటాయి కదా మేడమ్! మీ పెయింటింగ్స్ ఇన్స్పిరేషన్ తో, మేం కూడా పెయింటింగ్స్ వేశాం- చూడండి!" న్యూస్ పేపర్స్ లోంచి ఆ మూడు పెయింటింగ్స్ నీ తీసి, టీపాయ్ మీద పెట్టాడు పోతురాజు.

    ఆ పెయింటింగ్స్ వేపే తదేకంగా చేసింది హిమకుంద.

    "ఎమ్. ఎఫ్. హుసేన్- లక్ష్మారెడ్డి సంతకాలున్నాఏంటి వీటిమీద?" అనుమానంగా చూస్తూ అడిగిందామె.

    "అదా__అందులోనే మతలబుందన్నమాట! నా పేరు హుసేన్ మేడమ్ వీడి పేరు లక్ష్మారెడ్డి మేడమ్!" గబుక్కున చెప్పాడు వీర్రాజు.

    "ఆ పేర్లతో పెయింటింగ్స్ వెయ్యకూడదా మేడమ్?" ఏదో శంకించినవాడై అడిగాడు సేతురాజు.

    "ఆ పేర్ల మీద ఫేమస్ పెయింటర్స్ వున్నారు గదా- మీ పేర్లను మార్చుకోండి!" సలహా ఇచ్చిందావిడ. ఇచ్చి అసలు విషయం అడిగింది_

    "ఇంతకీ ఎందుకొచ్చారు మీరు?" అని.

    "మీరో పెయింటింగ్ వేస్తుండగా చూడాలని మా కోరిక మేడమ్! అందుకని..." నసిగాడు పోతురాజు.

    సాయంత్రం తన దగ్గరకు కాళేశ్వరప్రసాద్ పి.ఏ. రమాకాంత్ రావడం, తేజ పెయింటింగ్ వెయ్యాలని చెప్పడం, రేపు ఉదయం పదిగంటలకు తను సుదేష్ణాదేవి బంగ్లాకు వెళ్తానని చెప్పడం గుర్తుకొచ్చిందామెకు.

    ఆర్టు మీద వీళ్ళకు ఎలాగూ ఇంట్రెస్ట్ వుంది కాబట్టి, ఈ ముగ్గుర్నీ తన అసిస్టెంట్స్ గా ఉపయోగించుకోవాలనే నిర్ణయానికొచ్చిందామె.

    "అయితే ఓ పని చేయండి.....రేపు నేనొక చోటకు, ఓ పెయింటింగ్ వెయ్యడానికి వెళ్తున్నాను. నాతో వస్తారా?" అడిగిందామె.

    "ఓ! మీరు పెయింటింగ్ వేస్తుంటే కళ్ళారా చూడాలని, ఆ ఇన్స్పిరేషన్ తో మేం జీవితాంతం పెయింటింగ్స్ వేస్తూనే, ఈ భౌతిక దేహాన్ని చాలించాలని...."

    అలా మాట్లాడుతున్న పోతురాజును చూసి, వాళ్ళ అమాయకత్వానికి జాలిపడి___

    వీళ్ళను ఎంకరేజ్ చేస్తే, మంచి ఆర్టిస్టులవుతారని మనసులో అనుకొని__

    "అయితే రేపు తొమ్మిది గంటలకల్లా ఇక్కడకొచ్చేయండి!" అని చెప్పింది హిమకుంద.

    ఆ పెయింటింగ్స్ ని తీసుకొని ముగ్గురూ ఆ అపార్టుమెంట్ లోంచి బయటికెళ్ళారు ఆనందంగా.
   
                                   ౦    ౦    ౦

    ఉదయం సరిగ్గా పదిన్నరైంది.

    హిమకుందను చూడగానే సుదేష్ణాదేవి గుర్తుపట్టింది. మాటా, మంతీ అయ్యాక, పక్కనున్న ముగ్గుర్నీ చూసి "ఎవరు వీళ్ళు?" అని అడిగిందామె.

    "నా అసిస్టెంట్స్!" చెప్పింది హిమకుంద.

    "పెయింటింగ్ కి ఎన్ని రోజులు పడుతుంది?"

    "ఇవాళ స్కెచ్, రేపు కలర్స్, ఎల్లుండు ఫినిషింగ్....!" చెప్పిందామె.

    "ఎంత త్వరగా పూర్తి చేస్తావో నీ ఇష్టం-కానీ, పెయింటింగ్ పూర్తయ్యే వరకూ మీరందరూ మా గెస్టులు. అంతవరకూ మీరు మా అవుట్ హౌస్ లో వుండొచ్చు!"

    "మీకెందుకండీ- శ్రమ..." మొహమాట పడింది హిమకుంద.

    "శ్రమేంటి- ప్లజర్! మా తేజ ఫోటో కలకాలం, ఈ హాల్లో యీ పెయింటింగ్స్ తో ఎటూ ఉండిపోవాలి- ఎలా వేస్తావో...?" అదే టైమ్ లో లోన్నించి ఆయా, తేజను తీసుకొచ్చింది.

    ఎర్రటి డ్రెస్ లో తేజ, రబ్బరుబొమ్మలా మెరిసిపోతున్నాడు. బాబును దూరం నుంచి చూడగానే ఆ ముగ్గురూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

    వరండాలో వున్న ఈజిల్ ని, కలర్స్ ని బ్రష్ ల్ని తెస్తున్న ఆ ముగ్గురి దగ్గరకొచ్చి వాళ్ళవేపు ఒక్క క్షణం సూటిగాచూసి వాళ్ళచుట్టూ తిరుగుతూ అరవడం మొదలెట్టింది కుక్క బ్రౌనీ.

    "అరుపుచూస్తే కుక్కలా వుంది- ఆకారంచూస్తే గాడిదలా ఉంది. ఒరేయ్ జాగ్రత్తరోయ్" హెచ్చరించాడు వీర్రాజు.

    అదే సమయంలో బయటికొచ్చి ఆ కుక్కని బయట కట్టెయ్యమని వాచ్ మెన్ కి చెప్పి వెళ్ళింది సుదేష్ణాదేవి.

    బ్రౌనీని స్తంభానికి వాచ్ మెన్ కట్టెయ్యడంతో ముగ్గురి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.
   
                                                                              ౦    ౦    ౦

    సరిగ్గా పదకొండూ పది నిమిషాలైంది.

 Previous Page Next Page