Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 38

    సత్తిపండు, కోమలాంగీ కూడా, కిందా మీదా కూడా కలయదిరిగి-

    పిచ్చిదానిలా వెర్రిమొర్రి చూపులు చూస్తున్న సుదేష్ణాదేవి దగ్గర కొచ్చారు__

    "వాళ్ళు ముగ్గురూ కనిపించడంలేదు.....బాబు కూడా కనిపించడం లేదంటే? నాకేదో అనుమానంగా ఉందొదినా. ఉండు అన్నయ్యకు ఫోను చేస్తాను." పక్కరూమ్ లోని ఫోనువేపువెళ్తూ అన్నాడు సత్తిపండు.

    "నా తేజ ఏడీ?" ఒకే ఒక ప్రశ్న.

    సుదేష్ణాదేవి బాధగా అరిచింది.

    ఆ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన హిమకుంద ముచ్చెమట్లతో, కళ్ళ నీళ్ళతో నీటిబొమ్మలా నిలబడిపోయింది.

    "వాళ్ళు ముగ్గురూ ఏరీ?"

    ఆ ప్రశ్నక్కూడా జవాబు హిమకుంద దగ్గర లేదు.

    "నా తేజ నాక్కనిపించక పోయాడో-నీ ప్రాణాలు తోడేస్తాను." పిచ్చిదానిలా కోపంగా చూస్తూ హిమకుంద చంపను ఛేళ్ మనిపించింది సుదేష్ణాదేవి.

    సరిగా పదిహేను నిమిషాల తర్వాత__

    కాళేశ్వరప్రసాద్ తో వచ్చిన, ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవినాష్ హిమకుందని, ఎగాదిగా చూసి, ప్రశ్నించడం ప్రారంభించాడు.

    "బాబుని కిడ్నాప్ చెయ్యాలనే పథకంతోనే నువ్వీ బిల్డింగ్ లోకి అడుగుపెట్టావా?"

    "లేదు."

    "వాళ్ళు ముగ్గురూ ఏరీ?"

    "అదే నాకు అర్ధం కావడంలేదు!"

    "వాళ్ళు కూడా, నీతోపాటే ఉంటారా?"

    తల అడ్డంగా ఊపింది హిమకుంద.

    "వాళ్ళు, నీదగ్గర అసిస్టెంట్సుగా ఎన్నాళ్ళనుంచి పనిచేస్తున్నారు?"

    "ఇవాళ ఉదయం పదిగంటలనుంచి-"

    అంటే__?"

    వాళ్ళు ముగ్గురూ తన దగ్గరకు పరిచయం కోసం తదితర విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది హిమకుంద.

    ఒకపక్క కంట్రోల్ రూమ్ కి ఫోనుచేసి, పోలీసుల్ని ఎలర్టు చేసి, గంటన్నరసేపు హిమకుందను, సెక్యూరిటీ స్టాఫ్ ను ఇంటరాగేట్ చేశాక, అదేపనిగా అరుస్తున్న బ్రౌనీవేపుచూసి, దానిగొలుసును విప్పాడతను.

    బ్రౌనీ ఒక్క ఉదుటున అవుట్ హౌస్ గోడవరకూ వెళ్ళి ఆ గోడెక్కి అక్కడనుండి రోడ్డు మలుపు వరకూ వెళ్ళి అక్కడ కాసేపు తచ్చాడి వెనక్కి వచ్చేసింది.

    అక్కడ వ్యాను టైరు గుర్తుల్ని గుర్తుపట్టాడు సి.ఐ.

    తర్వాత కాళేశ్వర ప్రసాద్ దగ్గరకొచ్చి-

    అయామ్ సారీ! మిస్టర్ కాళేశ్వర ప్రసాద్. తేజను ఎవరో చాలా పకడ్బందీగా కిడ్నాప్ చేశారు."

    ఆ మాటవింటూనే సుదేష్ణాదేవి అరుస్తూ కిందపడిపోయింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయింది.
   
                               ౦    ౦    ౦

    మెథడిస్ట్ అపార్టుమెంట్ లో హిమకుంద ప్లాట్ పూర్తిగా పరిశీలించాడు సి.ఐ,

    "వాళ్ళు ముగ్గురు ఈ పెయింటింగ్స్ తీసుకునే, నిన్నరాత్రి నా దగ్గరకొచ్చి పరిచయం చేసుకున్నారు"

    ఆ పెయింటింగ్స్ వేపు చూడగానే అర్ధమైపోయింది. సి.ఐ.కి

    "వాళ్ళ పేర్లు హుసేన్, లక్ష్మారెడ్డి, రాజన్ అని అంటే నువ్వు నమ్మేశావా?"

    "అలాగే చెప్పారు వాళ్ళు."

    "కళాభవన్ లో....చోరీ చేసిన పెయింటింగ్స్ ఇవి....ఈవేళ డైలీ పేపర్ చూడలేదా నువ్వు"

    హిమకుందకు అప్పుడు జ్ఞాపకానికొచ్చింది.

    ఎమ్. ఎఫ్. హుసేన్ ఫేమస్ పెయింటింగ్సులో అదొకటని....ఆ మూడు పెయింటింగ్సుని తను కళాభవన్ లో చూసానని.....

    "నువ్వు తేజ పెయింటింగ్ వేయడం కోసం, కాళేశ్వర ప్రసాద్ ఇంటికి వెళ్తున్నావని తెలిసి వాళ్ళు ముగ్గురు ఫ్రీ ప్లాన్దుగా నీ దగ్గరకు వచ్చుంటారు" మరో ఇరవై నిమిషాలు ఇంటరాగేట్ చేశాక హిమకుంద ఇన్నోసెన్స్ ఆధారం చేసుకుని ఎవరో ప్రొఫెషనల్స్, ఫర్ ఫెక్టుకిడ్నాప్ ప్లాన్ వేసారని అర్ధం చేసుకున్న సి.ఐ.-

    ఆమెను స్టేషనుకు తీసుకెళ్ళి, జరిగిన విషయాన్ని పేపర్ మీద రాయమని సంతకం చేయించాడు.

    "మిస్ హిమకుందా.....జరిగిన కిడ్నాప్ కేసు...ఎంత సీరియస్సో నీకు తెలుసు...తేజ దొరికే వరకూ నువ్వు సిటీ లిమిట్స్ దాటి వెళ్ళకూడదు...అలాగే....ఆ ముగ్గుర్నీ ఎక్కడ, ఏ సమయంలో చూసినా.... నాకు వెంటనే ఇన్ ఫామ్ చెయ్యాలి" చెప్పాడతను.

    స్టేషలోనుంచి బయటకొస్తూ భారంగా ఊపిరి పీల్చుకొని నేరుగా అపార్టుమెంటుకు వెళ్ళిపోయింది హిమకుంద.

    ఆమె కళ్ళముందు అంచక్కని అందాల తేజ, ఆ తేజను ఎత్తుకొని మురిసిపోతున్న ఆ తల్లి మెదుల్తున్నారు....

    బాధగా కళ్ళు వత్తుకుంది హిమకుంద.
   
                                                            ౦    ౦    ౦

    అంతవరకూ స్పీడుగా వెళుతున్న వ్యాన్ ఓ పార్కు దగ్గర నిర్జన ప్రదేశంలో ఆగగానే, ముగ్గురూ ఉలిక్కిపడి తలలువంచి బయటకుచూసి ఒకరివేపు ఒకరు చూసుకొని గంభీరంగా నవ్వుకున్నారు.

    అక్కడ చెట్టుకింద ఇంకోవ్యాను వుంది. ఆ వ్యాను ముందు నిలబడిన వ్యక్తి చేతిలో గుర్తుగా గొణుగుంది.

    "మీరు సగం దార్లోకి వెళ్ళగానే, ఎవ్వరికీ అనుమానం రాకుండా రెండో వ్యానులోకి మారతారు....అది పాల సరఫరా వ్యాను కాబట్టి మిమ్మల్నేవరూ గుర్తుపట్టరు..." సత్తిపండు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది వీర్రాజుకి.

    "క్విక్...అర్జంటుగా దిగండి" ముగ్గురూ కిందకు దిగారు. అటూ ఇటూ చూసి, తేజను తీసుకుని ఆ వ్యానులోకి మారారు.

 Previous Page Next Page