Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 35


    అర్చన తటపటాయింపు గుర్తించినట్టు సదాశివంగారు "నాకు తెలుసమ్మా కన్నబిడ్డకి దూరం అయి బతకడం ఎంత కష్టమో...కాని.....పూజ మా ఆవిడ ఊపిరి అయిపోయింది. ఈమె ఆఖరు కోరిక తీర్చలేనిది కాదు. నాలుగురోజులు కాస్త భరించమ్మా. బతికిన నాలుగురోజులు ఆవిడ కాస్త శాంతిగా, ఆనందంగా బతకగలిగితే నాకు కాస్త ఓదార్పు మా కోసం ఒప్పుకోమ్మా" ప్రాధేయపడుతున్నట్లు అంత మగాయన అడుగుతుంటే యింక కాదనలేకపోయింది అర్చన.
    "అలాగే వుండనీయండి. ఎటొచ్చి స్కూల్లో సీటు అది చూశాం. మధ్యలో మళ్ళీ యిబ్బంది అవుతుందని" నసిగింది అర్చన యింకేం అనలేక.
    సాయంత్రం స్కూలునించి వచ్చి పూజతల్లిని చూసింది. ఇదివరకులా "మమ్మీ" అంటూ పరిగెత్తి వచ్చి కౌగలించుకోలేదు. అలా దూరంగా నిలబడి యిటు అటు కుతూహలంగా ఏదో వెతుకుతున్నట్టు చూసింది. 'పూజా....రా అమ్మా! ఏమిటలా చూస్తుండిపోయావు' అర్చన పూజ దగ్గరికి వెళ్లి చేయిపట్టి తీసుకు వచ్చింది. 'అబ్బో....బాగా పొడుగై పోయావే ఈ ఆరునెలల్లో అవునూ.....నీకు రెండు మూడు లెటర్స్ రాశాను. జవాబు ఎందుకు రాయలేదు నువ్వు. మమ్మీ మీద కోపమా! యిక్కడొదిలేసానని కోపం వచ్చిందా!' లాలనగా జుత్తు సవరిస్తూ అంది. పూజ ఈ ప్రశ్నలకి దేనికీ జవాబివ్వకుండా 'కొత్త డాడి కూడా వచ్చారా నీతో-' అంది తల్లి వంక పట్టి పట్టి చూస్తూ.
    "లేదు.....మామ్మకి వంట్లో బాగులేదంటే నేను ఒకర్తినే వచ్చాను చూడడానికి-"
    "ఆహా.....మా డాడి వచ్చారు తెలుసా. నాకు బొమ్మలు, బోలెడు ఫ్రాకులు తెచ్చారు" అంది గర్వంగా చూస్తూ. "డాడీతో నీవు మాట్లాడవా" అంది ఆరిందాలా.
    "నీవు కొత్త డాడీని తెచ్చుకున్నావని డాడీ కూడా కొత్త మమ్మీని తెచ్చుకున్నారుట."
    "ఎవరు చెప్పారు?" అర్చన చిన్నపిల్ల ఇన్ని సంగతులు మాట్లాడుతూంటే ఆశ్చర్యమనిపించి అడిగింది. మా డాడీ అన్నారూ, "మీ మమ్మీ కొత్త డాడీని తెచ్చుకుంటే నేను కొత్త మమ్మీని తెచ్చాను ఏం నాకేం దొరకరా! నేను మగవాడిని, నాకేమిటి-ఇదిపోతే నాకోలెక్కా" అన్నారు డాడీకి నీవంటే బలేకోపం. ఔను మరి నీవెందుకు కొత్త డాడిని తీసుకురావాలి. అందుకే డాడికి నీవంటే కోపం. నువ్వు బ్యాడ్ అన్నారు డాడీ నాతో వచ్చేయి మీ మమ్మీ దగ్గరకెళ్ళొద్దు" అన్నారు కళ్ళు తిప్పుకుంటూ అంది పూజ పెద్దమాటలకి కోపం వస్తున్నా ఆ పసిపిల్లతో అవన్నీ మాట్లాడిన అతనిది తప్పని గ్రహించి శాంతంగానే - "నీవేమన్నావు, మీడాడీతో వెడతావా?" అంది అర్చన.
    జవాబు ఎం చెప్పనట్టు సందిగ్ధంగా చూసి, "మరి మామ్మ డాడీతో పంపనని కేకలేసింది. అందుకని నేనేం చెప్పలేదు."
    "అవునూ, మరి నీకు ఢిల్లీ స్కూల్లో సీటు వచ్చింది" అర్చన మాట పూర్తికాకముందే మధ్యన "నేను యిక్కడే చదువుతాను. నాకిక్కడే బాగుంది. నేను అక్కడికి రాను-" తల అడ్డంగా తిప్పుతూ గబగబ అంది పూజ.
    "అదేమిటి.....ఎన్నాళ్ళు యిక్కడ ఉండిపోతావు. ఢిల్లీ రానంటావేమిటి. మామ్మకి వంట్లో బాగులేదు. కొన్నాళ్ళువుంచమంటే సరే అన్నాను కాని ఇక్కడ నిన్నెవరు చూస్తారు ఇంక చదువు అదీ చెప్పాలి."
    "నేను పెద్దదాన్ని అయిపోయాను. నా డ్రస్సులు అవీ నేను తొడుక్కోగలను చదువు మామ్మ చూస్తుందిగా. వంటావిడ వుంది అన్నం పెడుతుంది" వాదిస్తున్నట్టు అంది.
    కూతురి మనోభావం అర్ధంకాలేదు అర్చనకి. "ఎందుకు రానంటున్నావు ఢిల్లీలో స్కూల్సు యింకా బాగుంటాయి తెలుసా యిక్కడి కంటే."
    "నాకిక్కడే బాగుంది" మొండిగా చూస్తూ అంది. పూజ మంకుతనం మాటలు చూస్తే కోపం వచ్చింది అర్చానకి సరే యిప్పుడెలాగూ తీసికెళ్ళడానికి లేదు. యిప్పుడెందుకు కేకలు వేసి దాని మనసు పాడు చెయ్యడం-అత్తగారి తర్వాత ఎలాగో తీసికెళ్ళక తప్పదు. ఆడదిక్కు లేని యింట్లో మామగారు ఏం చూడగలరు. అప్పుడింక రాక తప్పదు కదా అనుకొని అక్కడితో మాటలు పెంచకూడదని వదిలేసింది అర్చన.
    
                                           7
    
    శకుంతలాదేవి పోయి ఆ రోజుకి పది రోజులయింది. కబురు తెల్సిన వెంటనే శలవుపెట్టి అభిష్ క్ ని తీసుకొని వచ్చింది అర్చన. ఆవిడ అందరూ అనుకున్న దానికంటే ఓ రెండు నెలలు ముందుగానే అట్టే యింకా బాధపడకుండానే పోయింది ఆవిడ అంతం అందరూ ఎరిగినది, ఎదురు చూచినదే అయినా ఆవిడ పోవడం అందరికి ఒకపక్క దుఃఖం, అట్టే బాధపడకుండా పోయింది అదృష్టవంతురాలే అన్న ఆలోచన ఒక పక్క అయింది. సదాశివంగారు అంత పెద్దమనిషి అంత గంభీరంగా వుండే అయినా కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. అర్చన రాగానే చూశావా అమ్మా నన్నెలా వంటరివాడిని చేసి తనదారి చూసుకుందో అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చారు." అది పోతుందని యిక లెక్కపెట్టే రోజులేనని తెల్సినా, మనసుని ఎంత ప్రిపేరు చేసినా యీ దుఃఖం "నన్ను వశపరుచుకోక మానలేదమ్మా-" అన్నారు బేలగా, ఆవిడ పోయిన దుఃఖంకంటే ఆయనని చూసి ఎక్కువ విచలితురాలైంది అర్చన. రామకృష్ణ ఆడపడుచు సరళ అంతా అర్చన వచ్చేసరికే వచ్చారు. ఆవిడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు .... ఆయన వైపు వారు ఒక్కొక్కరూ పదిరోజుల లోపల వచ్చారు యిల్లంతా కిట కిటలాడుతూ, అర్చన అందరిమధ్య యిబ్బందిగా ఫీలయింది ఇప్పుడింక యీ ఇంట్లో తనెవరని వచ్చింది అన్నట్టు కొందరు ఆశ్చర్యంగా, కొందరు వింతగా, అనుమానంగా అర్చనని శల్యపరీక్షలు చేస్తున్నట్టు చూపులతో కాల్చేస్తున్నట్టు అన్పించింది. అదే తనీయింటి కోడలుగానే వుండివుంటే అత్తగారు పోగానే యింటి కోడలుగా ఎంతపని, ఎంత హడావిడి. కర్మ కాండలు, బంధుమర్యాదలు, ఓదార్పులు....ఎన్ని చక్కదిద్దుకోవాల్సి వచ్చేది.

 Previous Page Next Page