Previous Page Next Page 
శుభోదయం పేజి 35


    "కుమారి రేఖతో మీ పరిచయం ఎన్నాళ్లుగా వుంది. ఆమె తండ్రిపేరు ఎన్నడూ అడగలేదా మీరు..."
    "ఒక్క మూడు రోజుల పరిచయం మాది. మొదటిసారి రౌడీలు అల్లరి పెడుతుంటే శ్యామ్ ఆ సమయానికి అటునించి వస్తూ ఆమెని తీసుకుని మా యింటికి వచ్చాడు. ఆ రోజే ఆ రౌడీల గురించి చెప్పింది ఆమె. తరువాత మర్నాడే ఆ ఘోరం జరిగింది, ముందురోజు ఆమె వున్న అరగంటలో ఆమెతండ్రి ప్రసక్తే రాలేదు."
    "ఆహా... నిన్న మీరు రోజంతా ఎక్కడ వున్నారు? ఏం చేశారు?"
    "నాల్గుగంటల వరకు కాలేజీలో క్లాసులు వున్నాయి. తరువాత యింటికి వచ్చి యింట్లోనే వున్నాను."
    "మీ అబ్బాయి శ్యామ్ కూడా యింట్లోనే వున్నాడా?"
    "ఐదుగంటలకి కాలేజీనుంచి వచ్చిందగ్గిరనించి ఇంట్లోనే వున్నాడు. టరమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయని చదువుకుంటూ కూర్చున్నాడు.
    "మీ యిద్దరూ యింట్లో వున్నారానడానికి ఏదన్నా ఎలిబీ చూపగలరా?"
    "ఎలిబీ! యిలా ఈ ప్రశ్నలకి జవాబివ్వాల్సి వస్తుందని తెలిస్తే యిరుగింటి, పొరుగింటి వాళ్ళని పిలిచి మాట్లాడేదాన్ని... యింట్లో వుండడం యిరుగు పొరుగు చూసే వుండవచ్చు. పాలవాడు ఆరున్నరకి వచ్చాడు. అప్పుడున్నానని చెప్పచ్చు వాడ్ని అడిగితే..."
    "అయితే మీకు ఈ రౌడీలకి ఏమీ సంబంధం లేదంటారా?"
    "వుందనడానికి మాధవరావు గారేమన్నా సాక్ష్యం చూపించారా సార్! లేదు అనడం తప్ప యింకేం సాక్ష్యం చూపలేను సార్, పోనీ ఆ రౌడీలనే పట్టుకుని వారు మేం చేయించామంటే అప్పుడు మమ్మల్ని శిక్షించుదురుగాని.... సార్ మాధవరావుగారు తనకి జరిగిన అవమానం నేను చూశానని. నాకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు అదే శిక్ష కూతురికి విధించి శిక్షించాడన్న సంగతి నేను చూశానన్న ఉక్రోషంకొద్దీ నామీద కసితీర్చుకోవడానికిలా యీ నేరం మామీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. ఏ ఆధారమూ లేకుండా ఎవరో ఏదో అన్నారని పరువు ప్రతిష్టలతో బతికే మమ్మల్ని ఈవిధంగా అవమానించడం ఎంతవరకు సమ్మతమో న్యాయమూర్తులు మీరే ఆలోచించండి? నన్నీవిధంగా అనవసరంగా అవమానించాడని ఆయనమీద పరువునష్టం దావా నేనూ వేయగలను సార్. ఒక ఆడదాని జీవితంతో ఆదుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడో ఇరవైఏళ్లకిందటి సంగతికిది ముడిపెట్టి మా మానాన మేం బతుకుతుంటే నన్ను. నా కొడుకుని ఈ విధంగా అవమానించిన ఆయన ఎంత పెద్దమనిషో న్యాయమూర్తులు మీరు గుర్తించాలి! ఏ ఆడపిల్లమీదనన్నా అత్యాచారం జరిగిందని వింటేనే ఆరోజంతా మనసు వికలం అవుతుందేనాకు, నా పాత అనుభవం గుర్తుతెచ్చుకుని. ఏ ఆడపిల్లకీ ఆ దుస్థితి రాకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటిది ఎప్పటి కక్షో తండ్రిమీద వుంటే అది కూతురిమీద తీర్చుకుంటానా? ఇంతకంటే యీ విషయంలో నేనేం చెప్పలేను సార్... నేను అనుమానితురాలినని మీకేధన్నా సాక్ష్యం దొరికితే తప్పకుండా నామీద కేసు పెట్టండి సార్. తప్పకుండా దోషిని శిక్షించే హక్కు మీకు వుంది."
    రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడింది. అప్పటివరకు మాట్లాడిన మాటల్లో ఒక్క పాయింట్ కూడా ఆమెని అనుమానితురాలిగా చూపకపోవడంతో మేజిస్ట్రేట్ సందిగ్ధంలో పడ్డాడు. అసలు మాధవరావు కంప్లయింట్ చేసినప్పుడే ఎవిడెన్సు లేదని, అతని ఆరోపణ కేవలం అనుమానించితప్ప, సాక్ష్యంతో బలంగా లేకపోవడంతో అరెస్ట్ వారంట్ యివ్వలేకపోయాడు. యిన స్పెక్టర్ కూడా మాధవరావు ఆరోపణలో బలంలేదన్న అభిప్రాయమే వెలిబుచ్చాడు. కాని మాధవరావు పాతసంగతులన్నీ చెప్పి, చాలా నమ్మకంగా ఆమే చేయించిందని, ఆ రౌడీలకి డబ్బిచ్చి వినియోగించి వుంటుందని, నేరం తనమీదకి రాకుండా యింకో రౌడీలగురించి చెప్పి వుండవచ్చని, ఆ రౌడీలు ఆరోజు రేఖని అల్లరిపెట్టడం చూశాక ఆ సాకుతో రేఖమీద అత్యాచారం చేయించితే ఆ నేరం తనమీదకి రాకుండా రౌడీలమీదకి వెడుతుందని, ఆ రౌడీలు ఆరోజు కిళ్ళీ కొట్టుదగ్గిరే వుండగా వాళ్ళెలా చేశారని, ఇది రాధపనే అని చాలా పట్టుదలగా వాదించడంతో ఇన్ స్పెక్టర్ కి కాస్త అనుమానంవచ్చి కేసు మేజిస్ట్రేట్ కి వెల్లడించాడు. అరెస్టు వారంటు యివ్వడానికి తగిన బలమైన సాక్ష్యం లేనందున అనుమానితులుగా ప్రశ్నించేందుకు రప్పించాడు మేజిస్ట్రేట్. ఇప్పుడు రాధాదేవి మాటలు వింటుంటే ఆ మాటల్లో ఆవేదన, నిజాయితి కన్పించింది. రాధాదేవిలాంటి చదువుకున్న స్త్రీ ఇంత నీచానికి దిగజారలేదు అన్పించింది. నిజంగా ఎవరో రౌడీలచేత ఆ పని చేయించితె ఎప్పటికన్నా ఆ నిజం బయటికి వస్తుందన్న భయం వుంటుంది. ఆ రౌడీలు బ్లాక్ మెయిల్ చేస్తారన్న భయం వుంటుంది. ఏమాత్రం జంకు ఆ మొహంలో కనపడలేదు. పిరికితనం ఆ మాటల్లో లేదు. నిబ్బరంగా మాట్లాడిన ఆమె మాటలను సందేహించలేకపోయాడు.
    మేజిస్ట్రేట్ సందేహం చూసి రాధాదేవికి ఒక ఆలోచన తట్టి "సార్...మీకు ఇంకా అనుమానంగా వుంటే ఆ ఆటోడ్రైవర్ ఎవరో అతనిగురించి వాకబుచేస్తే ఆ ఆటోలో ఎవరింటికి తీసుకెళ్ళారో తెలిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది" ధైర్యంగా సలహా యిచ్చింది.
    "ఆ ఆటోడ్రైవర్ ఎవరో వచ్చి పోలీసులకి విషయం చెప్పి సాయపడవలసిందిగా పేపరులో కోరాం. కాని యిప్పటివరకు అతను రాలేదు. అతను వచ్చి ఇన్ఫర్ మేషన్ యిస్తే పని సగం సులువవుతుంది."
    "సార్... అలాకాదు. ఈ రేప్ కేసులో అనుమానితులుగా మమ్మల్ని అనుకుంటున్నట్టు పేపరుకి వార్త యివ్వండి. నిజంగా దోషులెవరో అతనికి గుర్తువుండి వుంటుంది కనక ఓ స్త్రీ అనవసర నిందకి గురి అవుతుందని అయినా అతను బయటికి వచ్చి నిజం చెప్పవచ్చు."
    మేజిస్ట్రేట్, యిన్ స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశారు. "మీ పేరు పేపర్లోవస్తే....మీ పరువు... మీ పేరు.... మీకేం అభ్యంతరం లేదా?"
    "ఫరవాలేదు సార్... ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం రూపుమాపడం కోసం నా పరువు పణంగా పెట్టగలను. నా మీద పడిన నింద మాపుకోవడం కోసం, నా నిజాయితీ నిరూపించుకోవడం కోసం నాపేరు వీధిలోపడినా నాకిష్టమే సార్" అంది రాధాదేవి. మేజిస్ట్రేట్, యిన్ స్పెక్టర్ మొహాలు చూసుకున్నారు. ఆమెవంక అభినంధనపూర్వకంగా చూశారు. ఆమె పట్లవున్న కాస్త అనుమానమూ పోయింది వారికి.
    "వుయ్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు లొకేట్ దట్ డ్రైవర్ మేడం. ఈలోగా దయచేసి మీరు ఈ వూరువదిలి ఎక్కడికీ వెళ్ళకండి. వెడితే ముందుగా పోలీస్ స్టేషన్ పర్మిషను తీసుకుని వెళ్ళాలి. ఈకేసు తేలేవరకూ మీరు అనుమానితులలో ఒకరు గనక దయచేసి వూరువిడిచి వెళ్ళకండి. సారీ ఫర్ ట్రబుల్. వుయ్ విల్ కాంటాక్ట్ యు ఎగైన్. నౌ యూ కెన్ గో..." మేజిస్ట్రేట్ వెళ్ళడానికి పర్మిషన్ యిచ్చాడు. రాధాదేవి, శ్యాం బతుకుజీవుడా అనుకున్నట్టు నిట్టూర్పు వదిలి బయటికి వచ్చారు. బయట రాజారావు లాయర్ తో వెయిట్ చేస్తున్నాడు. లాయరు అవసరం లేకుండానే పని జరిగిందని టాక్సీలో వెడుతూ విషయం వివరించింది. లాయరు సంగతంతా "ఈ కేసులో మిమ్మల్ని నిందితులుగా చూపే పాయింటు ఒక్కటీలేదు. ఏ  చిన్న ఆధారమూ లేదు. మిమ్మల్ని అనవసరంగా యిలా పోలీసుస్టేషన్ కి తీసుకొచ్చి ప్రశ్నించే అవసరమూ లేదు. మిమ్మల్నిలా అనవసరంగా అవమానించినందుకు మీరు ఆ మాధవరావుగారిమీద పరువునష్టం దావా వెయ్యొచ్చు" అన్నాడు.

 Previous Page Next Page