Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 35

 

    ధైర్యం చేసి ఒకరోజు పక్కన చేరి గట్టిగా చెంపలు కోరికేశాడు పానకాలు. ఝాన్సీ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఉలిక్కిపడి కేకలు పెడుతూ లేచిన ఝాన్సీ పట్టలేని కోపంతో అతని చెంపలు, చేతులూ కొరికేసి గోళ్ళతో రక్కేసింది. బాధ నోర్చుకున్నా మర్నాడు ఆఫీసులో అందరికీ సంజాయిషీ చెప్పుకోలేక చచ్చిపోయాడు పానకాలు. అప్పటి నుంచి ఆమంటే భయం మరీ ఎక్కువైపోయింది. ఆమె లేవకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హోటల్లో ఏదో తిని ఆఫీసులో దిగిపోయి కారు పంపిస్తున్నాడు. సాయంత్రం ఆమెకి కారు పంపి ఇంట్లో దింపించి రాత్రి కేప్పుడో ఆమె గాడ నిద్రలో ఉన్నప్పుడు ఇల్లు చేరుకుంటున్నాడు. నెల అయ్యేసరికి డబ్బు మాత్రం ఆమె చేతిలో పడేస్తున్నాడు. ఆమె విడాకులడిగి తన గౌరవాన్ని పాడు చెయ్యకుండా ఉండడానికి అదొక లంచం లాగా!
    ఇంట్లో భార్య అణగదొక్కేయడం వల్ల ఆ కోపాన్ని కక్షనీ ఆఫీసులో అందరి పైన చూపిస్తున్నాడు పానకాలు. తన ప్రవేటు సెక్రటరీ సుధామగారు చక్కటి ఇస్త్రీ పాంటూ, ఇస్త్రీ షర్టు టక్ చేసుకుని, టై కట్టుకుని నీటుగా తయారై ఒస్తే కోపం అతని మీద, టైపిస్టు సంతానం నలిగిన షర్టూ చిరిగిన బనియనూ , చెదరిన జుట్టూ తోటి ఆఫీసుకి వొస్తే అతని మీద కోపం! సుదామని చూసి "ఏమయ్యా ఆఫీసుకొచ్చావా? షికారుకని వొచ్చావా? పొద్దున్న ఎలా వొస్తావో ఆఫీసుకి, సాయంత్రం అయినా అలాగే ఉంటావు కట్టుకున్న బట్ట నలగకుండా. నీకసలు ఉద్యోగం చెయ్యాలనుందా లేదా?" అంటూ మండిపడేవాడు పానకాలు. సుదామకి అశ్చర్యం వేసేది. ఆఫీసులో కాలు పెట్టింది మొదలు , ఆఫీసు బయట కాలు పెట్టె దాకా, ఒక్క నిముషం ఊరికే కూర్చోకుండా చచ్చేటట్టు పనిచేస్తూ ఉంటే, పానకాలు ఇట్ట్టా తిట్టడం అతనికి అర్ధమయ్యేది కాదు. "టేబిల్ దగ్గర కూర్చుని పనిచేస్తే బట్టలెందుకు నలుగుతాయి? అతని బట్టల్ని చూసి  పని జేడ్జ్ చేస్తారా? పనిని చూసి అతణ్ణి జడ్జ్ చేస్తారా, ఒకసారి కోపం వొచ్చి ఈ మాటే అడిగాడు సుధామ పానకలుని. "నాకు సమాధానం చెబుతావా రాస్కెల్! నువ్వెంత? నీ తహతెంత? నిన్ను సస్పెండు చేసేస్తాను జాగ్రత్త!" అంటూ అతని మీద అరిచేసరికి , సుధామ కంగారుపడిపోయి, ఆ మర్నాటి నుంచి మంచి బట్టలు వేసుకోవడం, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం మానేశాడు. ముఖ్యంగా పానకాలు కనిపించినప్పుడల్లా, మహా అలిసిపోయిన వాదిలా ఏడుపు మొహంతో కనిపించేవాడు. "ఏమయ్యా! నీకు ఏడుపు తప్ప వేరే పనిలేదా? ఆ వెధవ మొహాన్ని కాస్త శుభ్రంగా ఉంచుకో!" అని కేకేలేసేవాడు. సంతానాన్ని చూసి, "నా మొహమే అంత సార్! నేనేం చెయ్యను?" అంటూ చెబితే "ఇడియట్! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" అని కేకలేసేవాడు. ఆ విచిత్ర మనస్తత్వాన్ని చూసి విస్తుపోయేవారు ఆఫీసు మొత్తంలో.
    సీనియర్ అసిస్టెంట్ శీరీష ఆఫీసులో అందరికన్నా అందమైన పిల్ల చెలాకీ పిల్లగా పేరు మోసింది. పానకాలుకి ఆ అమ్మాయియంటే పరమ కోపం. అందంలో కౌసల్యనీ, చలాకీతనంలో ఝాన్సీనీ గుర్తు చెయ్యడమే ఆమె చేసిన నేరం. ఆమెను చూసినప్పుడల్లా , కోరికేయ్యా'లనో, సిగరెట్టుతో కాల్చేయ్యాలనో అనిపించేది పానకాలుకి! కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అతణ్ణి పిచ్చివాణ్ణి చేసేది. అందుకే ఆమెని చూస్తే చాలు. తోకతొక్కిన తాచులా బుసలు కొడుతూ రేచ్చిపోయేవాడు. అతడు ఎందుకలా రేచ్చిపోతాడో తనను చూడగానే అర్ధం గాని శిరీష అతని కంట పడకుండా తప్పించుకు తిరిగేది.
    ఆఖరికి పానకాలుకి ఆడపిల్ల ఎవరు కనిపించినా కోపంగానే ఉండేది. సాధ్యమైనంతవరకు ఆడవాళ్ళని తన పనిలో ఉపయోగించుకునేవాడు కాదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఎవరైనా పనిచేయాల్సి వొస్తే మటుకు, వాళ్ళని నానా యాతనా పెట్టేవాడు.  టైపిస్టు రత్నకుమారి చేసే ప్రతి పనిలో ఏదో ఒక తప్పు పెట్టి , ఒక్కొక్క కాగితాన్ని ఏదో మిషతో పదిసార్లు టైప్ చేయించేవాడు. ఒకటికి పదిసార్లు ప్రతిపనీ చేసిన పనే చేసి అలిసిపోయి ఆమె బాధపడుతూ ఉంటే అతనిలోని పశు ప్రవృత్తి మేల్కొని ఎంతో ఆనందించేవాడు పానకాలు.
    అతను పని చేస్తున్న కంపెనీలో అందరికీ అతనంటే అసహ్యమూ, భయమే. కానీ ఏం చేస్తారు? నోరు మూసుకుని కిక్కురుమనకుండా మౌనంగా పడుండేవారు స్టాఫంతా కూడా. లంచ్ అవర్లో స్టాఫ్ ని భోజనాలకు పోకుండా ప్[ప్రత్యేకంగా పిలిచి పని చెప్పేవాడు పానకాలు. అతను ఆ ఆఫీసులో కాలు పెట్టిన దగ్గరి నుంచీ , ఏ ఒక్కరూ మధ్యాహ్నం కాఫీలకు సరైనా టైముకి పోలేదు. పైగా ఎవరైనా లంచ్ టైములో లేరూ అంటే వాళ్ళ మీద విరుచుకు పడేవాడు.
    "ఏమయ్యా? ఎంతసేపూ పందిలా నీకు తిండి ఝాసేనా?" అంటూ అందరిలోనూ హేళన చేస్తూ మాట్లాడేవాడు. రానురాను అతని సాధింపులు బెదిరింపులూ భరించలేని జనం తిన్నగా జగన్నాధరావు గారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారు. కానీ ఏం లాభం? జగన్నాధరావుగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పానకాలు ఎంతో భక్తీ భావంతో కృతజ్ఞతలు వెళ్ళగక్కుకోవడం వల్ల, గట్టిగా అతను కేకలేస్తే పానకాలు కన్నీళ్ళు పెట్టుకోవడం వల్లా ఇంట్లో ఆ పనీ ఈ పనీ చేస్తూ నమ్మకంగా ఉండడం వల్లా , జగన్నాధరావు గారు మెల్లగా మందలించడం తప్ప ఏమీ అనలేకపోయారు. దాంతో ఆఫీసులో అందరూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో , పరిస్థితులలో రాజీ పడడం తప్ప , ఏమీ చెయ్యలేకపోయారు.

 Previous Page Next Page