Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 35

'లావణ్యతో పరిచయం వల్ల ఈ గొడవలన్నీ నా కంటుకుంటున్నాయి' అని నొచ్చుకొకండెం!
                                                                                                                మీ                        
                                                                                                                'లవ్'
ఉత్తరం జాగ్రత్తగా కవర్లో పెట్టి అతికించింది.
చీరే బాగా నలిగిపోయింది. మార్చుకునే ఓపిక కూడా లేదు. ఊరికే అద్దంలో మొహం చూసుకుని, జుట్టు వేళ్ళతో సరిచేసుకుని, కారెక్కింది. సందు మొదట్లోనే రాజు కనబడ్డాడు. నలుగురు పిల్లల్తో కలిసి గిల్లీదండా ఆడుతున్నాడు. అతన్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది లావణ్యకి. కారాపి, "ఇలారా!" అని పిలిచింది.
అట ఆపి వచ్చాడు రాజు.
తక్కిన పిల్లలు కారు వైపు వింతగా చూస్తున్నారు.
"ఈ ఉత్తరం శ్రీహర్షగారి కిచ్చెయ్, మర్చిపోకుండా ఇస్తావా?"
"ఓ!"
ఉత్తరం అతని చేతిలో పెట్టి కారు వెనక్కి తిప్పింది.
"మర్చిపోకేం"
"ఇప్పుడే ఇచ్చేస్తాను" అంటూ ఇంటివైపు దారి తీశాడు రాజు.
లావణ్య కారు ముందుకి పోనిచ్చింది. "అమ్మయ్య ఒక సమస్య తీరిపోయింది. అతనికి ఉత్తరం రాసేసి టేబుల్ మీద పెట్టేసి వద్దామనుకుంది. మళ్ళీ వాళ్ళందరి పలకరింపులు, ఏవేవో వైద్యసలహాలు, మొహమాటాలు మర్యాదలూ ఇవన్నీ చిరాగ్గా ఉంటాయి. తనకు అసలే వంట్లో బాగులేదు.
ఉత్తరం పోస్టులో వెయ్యడానికి అతని పోస్టల్ అడ్రస్ తెలియదు తనకు ఇల్లు తెలిసినా. ఎక్కడన్నా రాసి పెట్టుకోవాలి.
రాజు వీధిలోనే కనబడ్డం మంచిదయింది.
రాజు పరుగెత్తి ఇంటికి వెళ్తుంటే ఒక కుర్రాడు చొక్కా పట్టుకు ఆపాడు.
"ఉండరా! ఈ ఒక్క అట ఆడి వేల్దువుగానిలే! సగంలో వదిలేస్తే ఎలా?"
"ఇప్పుడే వచ్చేస్తా"
"అయిదు నిమిషాల్ల్లో వెళ్ళిపోదువు గానిలేవోయ్!"
రాజు మనసు కూడా అట మీదే ఉంది. వెంటనే అతను ఉత్తరం జేబులో పెట్టుకుని హుషారుగా ఆటలోకి దూకాడు.
ఆ ఉత్తరం అతని నిక్కరు జేబులోనే ఉండిపోయింది. అతను ఆ విషయమే మర్చిపోయాడు. సాయంత్రం ఆ నిక్కరు చాకలికి వెళ్ళే బట్టల్లో పడిపోయింది.
                                                  * * *
బార్ లో కూర్చున్నాడు ముకుందరావు.
ఆ బార్ లో రెస్టారెంట్ కూడా ఉంది.
తృప్తిగా నాలుగైదు డిషెస్ ఆర్డర్ ఇచ్చి, నిదానంగా కులాసాగా తింటున్నాడు.
కాసేపయిన తర్వాత గమనించాడు ఎదుట కూర్చున్న వ్యక్తిని. బద్దకంగా చూసే కళ్ళు, మొహం మీద పడే జుట్టు.
"కాస్త ఆ ఉప్పు సీసా ఇలా తోస్తారా?" అన్నాడు ముకుందరావు.
అతనికి కంపెని కావాలనిపిస్తుంది. తోటి మనుషులతో సరదాగా మాట్లాడాలనిపోస్తోంది. అందుకే ఆ వ్యక్తీతో మాటలు కలపడానికి ప్రయత్నించాడు.
ఉప్పు సీసా ముందుకు తోసి నిర్లక్ష్యంగా వెనక్కి జేరగిల బడ్డాడు అతను.
"మీ పేరు?"
"రాజేష్."
"ఈ ఉరేనా?"
"కాదు. హైదరాబాద్" అని కాఫీ తాగడంలో నిమగ్నుడయ్యాడు రాజేష్.
"హైదరాబాద్ అంటే ఎక్కడ?"
"బంజారాహిల్స్"
"అదికాదు. అసలు హైదరాబాద్ అనే ఊరు ఎక్కడా అని అడుగుతున్నాను."
బద్దకంగా కళ్ళెత్తి చూశాడు రాజేష్. ఈయన తనతో సరదాలాడుతున్నాడా? లేకపోతే పిచ్చా? మనిషి చూడ్డానికి బాగానే ఉన్నాడే! నిశితంగా చూశాడు.
ముకుందరావు ఆరాటంగా చూస్తున్నాడు.
ఒక్క క్షణం ఆగి "ఆంధ్రప్రదేశ్" లో అన్నాడు రాజేష్. ఏదో క్వీజ్ కి జవాబు చెబుతున్నట్లు ఉంది అతనికి.
ఆసక్తిగా చూశాడు ముకుందరావు.
"ఆంధ్రప్రదేశ్!......క్షమించండి.........అదెక్కడా?"
నవ్వాడు రాజేష్, లేచి నుంచున్నాడు.
ఆదుర్దాగా చూశాడు ముకుందరావు.
"ఒక్క క్షణం కూచోండి. నాతో మాట్లాడితే మీకు బోలెడంత డబ్బిస్తాను" అంటూ జేబులోంచి పదిరూపాయల కట్ట తీసి చూపించాడు.
రాజేష్ కి నవ్వూ, కోపమూ రెండూ వచ్చాయి.
డబ్బు వంక పరీక్షగా చూసి "ఎంత ఉందేమిటి?" అన్నాడు.
"పదివేలు! ఇది ఇంకో ఐదువేలు అంటూ రెండో జేబులోంచి ఇంకో కట్ట తీసి చూపించాడు.

 Previous Page Next Page